Thursday, December 26, 2024

ప్రపంచ నాస్తిక సభలు జరిపిన – గోరా

దేవుడు అబద్ధం. మనిషిలో నీతి పెరగాలంటే అతని మనసులో దైవభావన పోవాలి. ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరుగుతూ ఉంది. దానితో విద్వేషాలు పెరుగుతున్నాయి. దేవుడు కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా స్వచ్ఛమైన నీతిమంతుడైన మానవుడిగా మిగులుతాడు. ప్రజల మధ్య అడ్డుగొడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చినప్పుడు సోదరభావం దానంతట అదే వెల్లివిరిస్తుంది. ప్రేమ,ఆప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతాయి! –అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా)ఆలోచనలు.

గాంధీతో గోరా

ఎవరీ గోరా? తెలుగుప్రజలకు ఎందుకు ప్రియతముడయ్యాడూ? ఒరిస్సాలో పుట్టి, తమిళనాడులో చదివి, శ్రీలంకలో ఉద్యోగం చేసి, ఇటు క్విట్ ఇండియా ఉద్యమంలోన, అటు సర్వోదయ ఉద్యమంలోనూ పని చేస్తూ జాతీయ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా ఢిల్లీ, అలహాబాద్లలో తిరిగిన తెలుగువాడు-గోరా. కృష్ణా జిల్లా విజయవాడను నాస్తిక కేంద్రంగా మలిచిన మొనగాడు-గోరా. ప్రపంచ నాస్తిక సభల్ని తెలుగునాట నిర్వహించిన ఒకే ఒక్కడు-గోరా. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు –గోరా. పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు. ప్రపంచ దేశాలు పర్యటిస్తూ అంతర్జాతీయ నాస్తికోద్యమానికి ఊపిరినిచ్చిన గోరా, ఒకేసారి అనేక ఉద్యమాలకు కేంద్రబిందువయ్యారు. ఒక వైపు మనువాదులు అలవాటు చేసిన అంధవిశ్వాసాలకు ప్రజలు బలై గిలగిల కొట్టుకుంటూ ఉన్నప్పుడు – మరో వైపు పరాయి పాలనలో దేశం దాస్యశృంఖలాలలో మగ్గిపోతున్నప్పుడు- ఈ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కుని పోరాడడం ఎలాగో నేర్పించిన ధీరోదాత్తుడు – గోరా! స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించినవారు చాలా మంది ఉన్నారు. కానీ వారు బతుకుల్ని నిర్వీర్యం చేసిన బ్రాహ్మణిజంపై పోరాడలేదు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్షశాస్త్ర అథ్యాపకుడుగా సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స – ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు అంటూ పిడికిళ్ళు బిగించిన వారు ఎవరూ దేవుణ్ణి, దయ్యాన్నీ పక్కన పెట్టి అసలైన మనిషిని వెతికి పట్టుకోలేదు. అందుకే చెప్పేది, మనిషిని గుర్తించిన వారందరూ మహనీయులే అయ్యారు. అవుతారు కూడా.

సరస్వతీగోరా, గోరా

మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్న ఈ దైవకేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి జీవితాంతం కృషి చేసిన మహోన్నతుడు గోపరాజు రామచంద్రరావు (గోరా). వృక్షశాస్త్ర అధ్యాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధీజీ అనుచరుడు, జాతీయ స్థాయి కాంగ్రెస్ నిర్వాహకుడు, అస్పృశ్యతా నివారణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే – ప్రజలలో కులమత తత్వనిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త.  సమష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాలవైపు నడిపించిన కార్యశీలి. దేశంలో ఉన్నత విద్య, సులభంగా అందుబాటులో లేని రోజుల్లో దాని కోసం తపించి, శ్రమించి స్నాతకోత్తర పట్టా సాధించిన వైజ్ఞానిక విద్యార్థి. ఉన్నత విద్యావంతుడై కూడా తన సుఖం తాను చూసుకోకుండా జనంకోసం జనంమధ్యలో తిరుగుతూ వారిలో వివేకాన్ని పెంచిన బాధ్యతగల పౌరుడు. గోరా వనయువకుడిగా ఉన్నప్పటి నుండే – అంటే దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండే, సామాజిక కార్యాచరణకు పూనుకున్నారు.  అనతి కాలంలోనే ఆయన చేపట్టిన సానుకూల నాస్తికత్వ (POSITIVE ATHEISM) ప్రచారం అనేక మందిని ఆకర్షించింది. స్వచ్ఛందంగా అనేకమంది ముందుకొచ్చి ఆయన కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. క్రమంగా వాళ్ళే  వాలంటీర్లయి ఆయనకు తోడు నిలిచారు.

ప్రపంచ నాస్తిక సభల నిర్వహణ

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చత్రపురంలో గోరా 15 నవంబర్ 1902న జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, వెంకటసుబ్బారు. పుట్టింది ఉన్నత వర్గంలోనైనా ఆయన దానికి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. పైగా కులమతాల అడ్డుగోడలు తొలగించడానికే ఉద్యమించారు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్య, పిఠాపురం రాజా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసి, మద్రాసు (తమిళనాడు) ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థిదశలోనే విజయనగరానికి చెందిన సరస్వతిని పెండ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు పదేళ్ళు మాత్రమే. గోరా అనేక చోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధురలోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కొలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడయ్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. స్వతంత్ర భావాలు గల గోరా ఎక్కడా ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేక పోయేవారు. నాస్తికుడుగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించుకుని, భార్యాపిల్లలతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశారు. స్వంతంత్ర జీవనం ప్రారంభించారు.

గోరా శతజయంతి సందర్భంగా పోస్టల్ స్టాంప్

సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని గోరా అనుకున్నారు. ఆ ఆలోచనను ఆయన భార్య సరస్వతీగోరా బలపరిచారు. సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కలమతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవనశైలిని రూపొందించడానికి 1940లో కృష్ణాజిల్లా ముదురులో ‘నాస్తికకేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్ గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. స్వాతంత్ర్య సమర యోధునిగా  పని చేస్తూనే సామాజిక, ఆర్థిక సమానత్వానికి, వయోజన విద్యావ్యాప్తికి, కులమతాల నిర్మూలనకు, అస్పృశ్యతా నిర్మూలనకు, దళితుల ఆలయ ప్రవేశానికి, కులాంతర-మతాంతర వివాహాలు జరిపించడానికి నిరంతరం కృషి చేశారు – గోరా. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృతపరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్రబిందువయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో  నిర్వహించిన ఘనత గోరాగారిదే! అప్పుడాయన వయసు 70 సంవత్సరాలు.

Also read: దేశాన్ని నగ్నంగా నడిపించినవారు మన పాలకులా?

భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పు తేవాలి? అనే అంశంపై ఉపన్యసిస్తూనే 26 జులై 1975న గోరా తుది శ్వాస విడిచారు. 2002లో గోరా శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలాబిళ్ళ విడుదల చేసింది. గోరా మరణానంతరం ఆయన శ్రీమతి సరస్వతీగోరా – నేతృత్వంలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్వహించారు. 2006లో సరస్వతీ గోరా మరణం తర్వాత 2020లో నాస్తిక కేంద్రం ఎనభై సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంది.

ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్బిణులు బయట తిరిగితే ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణంమొర్రి రాలేదు. జనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి! రాహు-కేతువులు ఎక్కడో లేరు. సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతిగోరా తరచూ చెపుతూ ఉండేవారు.

Also read: వాస్తవిక సృజనకారుడు మున్షీ ప్రేమ్ చంద్

గోరా దంపతులు తమ పిల్లలకు పెట్టిన పేర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన కొడుక్కి ‘లవణం’ అని, భారతీయులు చట్టసభల్లో గెలిచినప్పుడు పుట్టిన కొడుక్కి ‘విజయం’ అని, రెండో ప్రపంచ యుద్ధసమయంలో పుట్టిన కొడుకులకు ‘సమరం’, ‘నియంత’ అనీ తమ తొమ్మిదో సంతానానికి ‘నవ్’ (నౌ-9)అని, గాంధీ-ఇర్విన్ ఒడంబడిక జరిగిన సందర్భంలో పుట్టిన కూతురికి ‘మైత్రి’ అని, మరో అమ్మాయికి ‘మనోరమ’ అని పేరు పెట్టారు. దేవుళ్ళ పేర్లు పెట్టుకునే జాడ్యం నుంచి తెలుగువారిని కాపాడాలన్న ఉద్దేశంతో తన సంతానానికి ఇలా ప్రత్యేకమైన పేర్లు పెట్టి చూపించారు. వీరి ప్రభావంతో చాలామంది దంపతులు వారికి పుట్టిన పిల్లలకు దేవుడిపేర్లు పెట్టుకోవడం మానేశారు. అందుకే చూడండి ఆధునికుల పేర్లు మానవ్, కౌశల్, వాత్సల్య, ప్రేమ, కారుణ్యలాంటివి కనిపిస్తున్నాయి.

గోరా మరణం, చంద్రబాబు నివాళి

సరస్వతీగోరా పూర్తిగా భర్తను అనుసరించి సంఘసేవికగా మారారు. చిన్న వయసులోనే వివాహమైనా, అనతి కాలంలోనే ఆమె, గోరా ఆలోచనల్ని అందుకుని ముందుకు నడిచారు. గోరా శ్రీలంకలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈమె అక్కడ నిప్పుల మీద నడిచి చూపించారు. అందులో దైవమహిమలేవీ లేవని నిరూపించారు. అంతే కాదు, దేవదాసీ వ్యవస్థ నుంచి మహిళల్ని బయటికి లాగి, సరస్వతీగోరా వారికి వివాహాలు జరిపించారు. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కొన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జీవితాంతం బొట్టు, కాటుక, మంగళసూత్రాల వంటివి ధరించకుండా మనువాది నియమాల్ని తిరస్కరించారు. గోరా మరణించినప్పుడు కూడా మతానికి సంబంధించిన కార్యక్రమాలేవీ లేకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దాంపత్య జీవితాన్ని,కుటుంబజీవితాన్నిఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రేమ, ఆప్యాయత, నైతికత మాత్రమే మానవత్వ లక్షణాలని గోరా దంపతులు చాటిచెప్పారు.

Also read: దేవనూరు మహదేవ: దేశంలో ఒక  సంచలనం!

నిరంతరం కార్యరంగంలో శ్రమిస్తూనే, ఉపన్యసిస్తూనే గోరా నాస్తికత్వంమీద పత్రికలు-పుస్తకాలు ప్రకటించారు. స్వాతంత్ర్యం లభించిన తొలినాళ్ళలో ‘సంఘం’ పేరుతో ఒక పత్రిక వెలువరించారు. 1968లో ‘ద ఎథీస్ట్’ అనే ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభించి అంతర్జాతీయంగా ప్రపంచ నాస్తికుల ప్రశంసలు పొందారు. ఆయన రచించిన పదహారు పుస్తకాలలో సగం ఇంగ్లీషువి ఉన్నాయి. AN ATHEIST WITH GANDHI (1951), POSITIVE ATHEIST (1972), THE NEED OF ATHEISM (1982) వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. ‘నాస్తికత్వం’(1941), దేవుని పుట్టుపూర్వోత్తరాలు (1951), నేను నాస్తికుణ్ణి (1976), సృష్టి రహస్యం(1976). ఆర్థిక సమానత్వం (1980), నాస్తికత్వం-ప్రశ్నోత్తరాలు వంటివి కూడా బహుళ జనాదరణ పొందిన రచనలు. ప్రతి ఒక్కరూ గోరా రచనలు చదవాలి. చదివించాలి. వాస్తవాలు చెప్పేవారు లేక ఈ తరం యువతీయువకులు దారి తప్పి పోతున్నారు. పైగా, అబద్ధాలు ప్రచారం చేసే ప్రభుత్వాలే అధికారం వెలగబెడుతున్నాయి. గనుక, బాధ్యతగల పౌరులు చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంది. వచ్చే తరాలకు సరైన దిశానిర్దేశం చేయాల్సి ఉంది!

Also read: మ్యాన్ వర్సెస్ వైల్డ్

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles