Thursday, November 21, 2024

లాక్ డౌన్ అవస్థలు…చులకన అవుతున్న పురుష పుంగవులు

  • కరోనా తో ఇంటి “యుద్ధాలు”
  • ప్రపంచానికి నేర్పిన కరోనా పొదుపు మంత్రం
  • అమ్మల ఆదా… అమ్మాయిల దుబారా

బండారు రాం ప్రసాద్ రావు

ఒక్కటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల నుండి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో గానీ ఇంట్లో  కంప్యూటర్, లాప్ టాప్ తో కుస్తీ పడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అటు జీతాలు సరిగా రాక… కొన్న లగ్జరీ వస్తువులకు ఈ ఎమ్ ఐ (నెలసరి వాయిదాలు) , కారు ఇంటి ముందు దుమ్ము పట్టి పోతున్నా, ఇంట్లో సోఫాసెట్లలో ఎలుకలు, బొద్దింకలు కాపురం చేస్తున్నా కంపెనీలు ఇచ్చే అరకొర జీతాలతో ఇల్లు గడిస్తే చాలు… పూటకు ఇంత భోజనం ఉంటే చాలు అనుకుంటూ… ఉసురు మంటున్నారు!! షి‘కారు’ లేని భర్త సంపాదన చూసి “ఇవ్వాళ సినిమాకు వెళదాం అండీ” అని అడిగితే వంద రూపాయలు లీటర్ పెట్రోల్ అని ఏడుపు ముఖం పెట్టే ఆయన ముఖాన్ని చూడలేక, చైనాను తిడుతున్న ఇల్లాలికి ఇప్పుడు పొదుపు మంత్రం గుర్తుకు వచ్చింది.

మొగుడి సంపాదన విలువ తెలియదు

యాభై వేల మొగుడి సంపాదన టన్చన్ గా నెలాఖరు రోజు అకౌంట్ లో పడగానే ఏటీఎం కార్డు బర్రున గీకి కొత్త నోట్లు తీసుకొని,  పదివేలు పెట్టి ఇంటి నిండా వంట సరుకులు, పదిహేను వేలు EMI లు కట్టి ఇంకా పాతిక వేలు… జల్సాగా ఇంట్లో వెజ్, నాన్ వెజ్ లు, బర్గర్లు, పిస్తాలు తింటూ, అందులో నుంచి చీరలు…సారెలకు ఖర్చు పెట్టి…ఇంకా అదనంగా రెండు గంటలు పని చేస్తే మరో పదివేలు వస్తాయని మొగుణ్ణి రాచి రంపాన పెట్టే మహిళామణులు… ఆయన కంప్యూటర్ రేడియేషన్ తాకిడికి పెళ్లయిన తరువాత ఐదు కిలోల బరువు తగ్గి పన్నెండు గంటలు డ్యూటీ, రెండు గంటలు  రాను పోను క్యాబ్ జర్నీ చేసి సంపాదించిన డబ్బు విలువ వాళ్లకు అప్పుడు తెలియలేదా? వచ్చిన డబ్బును నీళ్ళలా ఖర్చు చేసి “మీ కన్నా మా నాన్న నయం ఇంటికి వచ్చేప్పుడు  మా అమ్మకు ఇన్ని మల్లెపూలు తెచ్చే వాడని ” సతాయించే రమణిమణులు అత్తెసరు జీతాలు తెచ్చే భర్తను భరించగలరా? దానికి తోడు అస్తమానం ఇంట్లో కూర్చుని పెళ్ళానికి టీ తెమ్మని, మంచి నీళ్ళు తెమ్మని సతాయిస్తుంటే ఆమెకు చిర్రెత్తు కొచ్చి చీపురు గీరాటేసి “ఇలాగే పని చెప్తే పుట్టింటికి వెళ్తాననే” ఆలి బెదిరింపులకు బిత్తరపోయే మగాళ్ల జీవితాలు కుడితిలో పడ్డ ఎలుకల్లాగా తయారయ్యాయి. అందుకే సుమతీ శతకం లో ఒక పద్యం ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుకు తెచ్చు కోవాలి…

గడన గల మగని జూచిన

నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;

గడ నుడుగు మగని జూచిన

నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ!

 దీని భావం ఏమిటంటే:

 స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు. నిజమే. అమ్మ పొదుపు మంత్రం పాటించడం వల్ల నాన్నలు మల్లెపూలు తేగలిగారు…అమ్మ ప్రతి పైసా పొదుపు చేయడం వల్ల మీరు ఇవ్వాళ ఉన్నత శిఖరం లో ఉన్నారు…మీతో పాటు ఒక చెల్లిని తమ్ముణ్ణి కూడా వాళ్ళు ప్రయోజకులను చేశారు…ఇప్పుడు కోవిడ్- 19 మీకు నేర్పిన గుణ పాఠం అమ్మ కన్నా విలువైంది. ప్రపంచం మొత్తం కరోనా పొదుపు మంత్రం వేసింది. నిజానికి కార్పొరేట్ కంపెనీల కు ఇల్లాలి ఉసురు తగులుతుంది. ఎందుకంటే అపుడు కొన్ని పని గంటలే ఇప్పుడు అన్నీ పని గంటలే. దీనిపై నేను (రచయిత) ఒక సర్వే చేశాను. కార్పొరేట్ కంపెనీల “ఆటలు” కరోనా పేరిట ఎక్కువయ్యాయి! హైదరాబాద్ లో మిలియన్ల మంది  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇప్పుడు  కార్యాలయాల్లో కనబడడం లేదు. అందరూ ఇళ్లలో బంధించబడ్డారు.

ఇది చదవండి: కాలం మారింది! కలతలు మిగిలాయి!! సరికొత్త సంవత్సరం లో కరోనా “భ్రమ?”

పెరిగిన పనిగంటలు

‘గతంలో మేము సౌకర్యవంతమైన పని గంటలు ఎన్నయినా ఇంటి నుండి పని చేస్తామని విజ్ఞప్తి చేసినప్పుడు, మా ఉన్నతాధికారులు మమ్మల్ని హెచ్ ఆర్ రూల్ బుక్, ఆఫీస్ టైమింగ్స్, హాజరు పట్టిక అని ఆఫీసు సామ్రాజ్యంలో బంధించారు!  ప్రతిరోజూ కార్యాలయానికి హాజరుకావాలని ఒత్తిడి చేశారు!! కరోనా వల్ల అదే ఉన్నతాధికారులు ఇంట్లో నుండి పని చేయమని ఒత్తిడి చేస్తున్నారు”…అని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆక్రోశం వ్యక్తం చేశారు. 

మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాత్రం రెండు నెలలు ఇంట్లో నుండి పని అంటే నచ్చినట్టు అనిపించింది.

హడావిడి లేదు

ఆఫీస్ లో చాయ్ బ్రేక్స్,  గాసిప్ లు, అమ్మాయిలతో జోకులు ఒక కాలేజీ కి వెళ్లి నట్టు అనిపించేది! అయితే మేము ఉదయపు అలారం వేదనను,  ఆఫీసుకు సిద్ధం కావడానికి ఉదయమే తయారు అవడం, అల్పాహారం పట్టుకుని వెళ్లడం, తయారవుతుండగానే అఫిసులో ఎంట్రీ కార్డుకు లేట్ అవుతుందనే భయం.  కాఫీ తాగుతూ సగం వదిలెయ్యడం, భార్య వీడ్కోలు పలుకు తున్నప్పుడు అన్యమనస్కంగా ‘బాయ్’ చెప్పడం…ఇవన్ని ఇప్పుడు లేవు…” అని మరొక సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెప్పాడు! ‘అయ్యో రోజూ పెద్ద నరకం..ఆఫీసు కు బయలుదేరే సమయంలో అమ్మా నాన్నా ఫోన్ చేసినా ఎత్తే వాళ్ళం కాదు…ఎవరు   ఫోన్ రింగ్ అయినా పట్టించుకునే వాళ్ళం కాదు… ప్రతిరోజూ మమ్మల్ని కార్యాలయానికి తీసుకు పోయే క్యాబ్…గురించి… పీక్ అవర్ ట్రాఫిక్ బ్రేక్స్,   పార్కింగ్ స్థలంలో, లిఫ్ట్ లోని ఆత్రుత క్షణాలు నుండి బయటపడ్డాము” అన్నాడు మరొక ఉన్నత ఉద్యోగి. “ఇప్పుడు ఏకాంతం పట్టి పీడిస్తుంది..  భర్త విలువ ఇవ్వడం లేదు…ఉద్యోగ అభద్రత భావం వచ్చేసింది. మేము ఇంట్లో నుండి పని కొనసాగిస్తున్నా ఆనందంగా లేము… మాకు ఆనందం దూరమైందని భావిస్తున్నాం.  అంతం లేని పరిహాసము, రాజకీయాలు, గాసిప్‌లు, కార్యాలయ కారిడార్లలోని చెడ్డ జోకులు….అవన్నీ ఇప్పుడు లేవు…ఎప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ బోరింగ్ గా ఉంది అని ఒక అమ్మాయి ఆవేదన చెందుతోంది. కొత్త రకమైన పని ఒత్తిడి. రౌండ్-ది-క్లాక్ పర్యవేక్షణ.

రిమోట్ గా మనిషి

డిజిటల్ యుగంలో, రిమోట్ గా మనిషి మారాడు.  కోవిడ్ కొత్త అధ్యాయానికి తెరతీసింది.. కార్యాలయాలు బోసిపోయాయి. గృహ నిర్బంధం లో సరికొత్త విలువలు మొదలయ్యాయి. ఇంట్లో కొత్త కళ సంతరించుకుంది..అమ్మలు నేర్పిన పొదుపు మంత్రం అమ్మాయిలు ఇప్పుడు నేర్చుకోవాలి. COVID-19 మనపై విసిరిన అపూర్వమైన సవాళ్లకు ధన్యవాదాలు తెలపాలి.  ప్రత్యామ్నాయ విశ్వం అకస్మాత్తుగా ఉద్భవించింది. కార్యాలయాలు చీకటి, నిర్జనమైన కట్టడాలుగా మిగిలిపోతాయా? ఇక ఇంటి నుండే పనులు సాగడం వల్ల జీతాలు పెరుగుతాయా? క్యాబ్ లు డ్రైవర్ల పరిస్థితి ఏమిటీ? ఆగమ్య గోచరమేనా?  యజమానులు తమ సైన్యం గా భావించే ఉద్యోగులు ఇప్పుడు  అదృశ్యమై పోయారు. భవిష్యత్ కార్యాలయలు ఇల్లే అవుతే ఇక ట్రాఫిక్ జామ్ లు టెన్షన్ జీవితాలు ఉండవేమో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles