వోలేటి దివాకర్
అమరావతి రైతులకు అరసవిల్లిలోని సూర్యనారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం లేనట్టు ఉంది. పరిస్థితులు చూస్తుంటే అమరావతి అరసవిల్లి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోనే పరిసమాప్తి అయినట్టు కనిపిస్తోంది. రాజధాని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ప్రకటించిన విధంగా నవంబర్లోనే రైతుల పాదయాత్ర పునఃప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పాదయాత్ర అడుగు జాడలేవీ కనిపించడం లేదు. లేకపోతే ఈపాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతు పాదయాత్ర హడావుడి అంబరాన్ని అంటేది. జగన్ ప్రభుత్వ ఆంక్షలు, అధికార వైఎస్సార్ సిపి శ్రేణుల అడ్డగింతల మధ్య సెప్టెంబర్ 12 న అమరావతి రైతులు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. మిగిలిన రాజకీయ పార్టీలు రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించాయి. అనూహ్యంగా అక్టోబర్ 20 వ తేదీన అంబేద్కర్ కోన సీమ జిల్లా రామచంద్రపురం వద్ద పోలీసులు యాత్రను నిలువరించి గుర్తింపు కార్డులు అడగటంతో రైతుల పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. పాదయాత్రను అడ్డుకోవడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కొన్ని షరతులతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే న్యాయస్థానం షరతులు ఉద్యమనాయకులకు పెద్దగా రుచించినట్లు లేదు. అయినా నవంబర్ 28 వ తేదీ నుంచి పాదయాత్రను పునఃప్రారంభిస్తామని పరిరక్షణ సమితి నాయకులు ప్రకటించారు . కానీ ఆ అవకాశాలేవీ కనిపించడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మునపటి స్థాయిలో పాదయాత్ర ద్వారా హంగామా చేసే అవకాశాలు లేకపోవడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. అయితే ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజధాని గురించి మరోసారి ఢిల్లీ పెద్దలకు గుర్తుచేసేందుకు ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేసి , తిరిగి వచ్చేశారు. ఆతరువాతి నుంచి రాజధాని ఉద్యమం కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం మారితే తప్ప అమరావతికి పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాజధాని రైతులు కూడా ఇదే ఆశయం … ఆశతో ఉన్నారు.
Also read: కాంగ్రెస్ ఒంటరి పోరు!..2024 కాంగ్రెస్ దేనట!