- జనాభా గణన, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అనవసరమైన షరతులు
- మూడింట ఒక వంతు సీట్లు ఎట్లా ప్రత్యేకిస్తారో చట్టంలో స్పష్టత లేదు
మహిళా రిజర్వేషన్ బిల్లు – విమెన్స్ రిజర్వేషన్ బిల్ (డబ్ల్యూఆర్ బీ)- అధికారికంగా 128వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినందుకు నన్ను మిశ్రమావేశం అలముకొన్న దశలో ఏమీ లేని దాని కంటే ఏదో ఒకటి నయం కదా అని అనుకుంటున్నాను. ఆ ‘ఏదో ఒకటి’ ఏమిటో చెప్పడం చాలా కష్టం. ‘‘వో ఇంతెజార్ థా జిస్కా, యే వో షహర్ తో నహీ’ అని నాకు నేను చెప్పుకున్నాను. కానీ అది చాలా నైరాశ్యంతో కూడుకున్నది. చివరికి నేను నా మాతృభాషలోకి జారుకున్నాను: ‘‘భాగ్తే భూత్ కీ లంగోటీ హీ సహీ.’’ దీన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం ఎట్లా?
Also read: మతలబు 2019 ఎన్నికలలో ఖాయంగా జరిగింది, దాస్ పత్రం మాత్రం చేపను పట్టుకుంటుందని అనుకోవడం లేదు
స్వతంత్ర భారతంలో అత్యంత ప్రభావవంతమైన చట్టాన్ని ఇంత ఆషామాషీగా, ఆటగోడుగా, హాస్యాస్పదంగా చేయడం విశేషం. పదమూడేళ్ళ నిశ్శబ్దం తర్వాత అకస్మాత్తుగా వివరీతమైన తొందర. బిల్లు ముసాయిదాలో తప్పులు దిద్దడానికి కూడా వెసులుబాటులేనంత హడావిడి. పార్లమెంటు ప్రత్యేక సమవేశం గురించి అనవరసరమైన రహస్యం. చివరికి నియోజకవర్గాల పునర్ విభజన అంటూ కథలో అనూహ్యమైన మలుపు. నిర్జీవమైన చర్చ. తమ పార్టీ లేదా తమ నాయకుడు లేదా నాయకురాలు మహిళలకోసం ఏమేమి చేశారో చెప్పుకునే స్వోత్కర్షకు పాల్బడిన వక్తలు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ న్యాయమంత్రి బోర్లబొక్కా పడటం, దేశీయాంగమంత్రి అసలు స్పందించడానికే నిరాకరించడం ఇంకో తమాషా. రహస్యాన్ని పారదర్శకంగా చూపించే విఫలయత్నం. నేలబారుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉదారగుణం ప్రదర్శించడం. ప్రతి చారిత్రక ఘట్టంలోనూ హాస్యాస్పదమైన అంశాలు ఉంటాయి కాబోలు. ఇది అపనమ్మకంలో, నిజాయితీరాహిత్యంలో, కల్లబొల్లి వ్యవహారంలో మునిగితేలిన వివాదాంశం.
భారత రాజకీయాలపైన ఆధిపత్యం చెలాయిస్తున్న పురుషాధిక్యం ఇప్పుడాడుతున్న ఆట పేరు గత 27 సంవత్సరాలుగా ఉన్నదే: నా స్థానం (నా సీటు) ఇస్తున్నట్టు కనిపిస్తూనే ఇవ్వకుండా ఉండటం ఎట్లా? ఈ వ్యవధిలో ఈ ఆట నియమాలు సైతం మారలేదు. సదుద్దేశాన్ని ప్రకటించడమే కానీ పరిస్థితిని అంచనావేయడం కాదు. మహిళలకు ఇతోధిక ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశాన్ని ప్రకటిస్తూ వ్యవస్థలో అందుకు అనుగుణంగా మార్పులుచేర్పులు చేస్తే జరిగే పర్యవసానాల గురించి మహిళా రిజర్వేషన్లను సమర్థించేవారు కానీ వ్యతిరేకించేవారు కానీ ఆలోచించడం లేదు. చివరికి అస్పష్టమైన ఆకృతిలో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. తీరా ముఖ్యమైన ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి: ఏమి జరిగింది? రిజర్వేషన్లను ఎట్లా సాధిస్తాం? ఎప్పుడు?
Also read: మణిపూర్ సంక్షోభాన్ని హిందూత్వ-క్రైస్తవ ఘర్షణగా చూడొద్దు, అది దేశీప్రాచ్యదృష్టి అవుతుంది
ఒక రకంగా ఏమి పూచీ ఇచ్చారో మనందరికీ తెలుసు: పార్లమెంటులోనూ, రాష్ట్రాల శాసనసభలలోనూ మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు ప్రత్యేకించడం. హరీబురీగా, హడావిడిగా రూపొందించిన ఈ బిల్లులో లోపాన్ని బీజేడీ ఎంపి భతృహరి మహతాబ్ ఎత్తి చూపించారు. ఇదివరకటి బిల్లులో లాగా తుట్టతుదకు చట్టం మొత్తం స్థానాలలో మూడింట ఒక వంతు స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మహిళలను ఎన్నుకోవాలి అని చెబుతుంది. ప్రతి రాష్రంలో మూడింట ఒక వంతు కోటాను లెక్కించాలని చట్టం చెప్పదు. అప్పుడేమి జరుగుతుందో ఊహిద్దాం. ఒక రాష్ట్రంలో ఉన్న మొత్తం లోక్ సభ స్థానాలలో సగం మహిళలకు ప్రత్యేకించవచ్చు. మరొక రాష్ట్రంలో ఒక్క సీటు కూడా మహిళలకు లేకపోవచ్చు. ఈ అపసవ్యం గురించి ప్రశ్నించినప్పుడు న్యాయమంత్రి నీళ్ళు నమిలారు. ఈ సమస్యను నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ పరిష్కరిస్తుందని దేశీయాంగమంత్రి దాటవేశారు.
మూడింట ఒక వంతు రిజర్వేషన్లను ఎట్లా సాధించాలో చట్టం స్పష్టంగా చెప్పడం లేదు. ఇది కొత్త కాదు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపైన చర్చలో మొదటి నుంచీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎట్లా అనే విషయంలో స్పష్టత లేదు, నిజాయితీ లేదు. సామాజిక న్యాయం అంటే కులం ప్రాతిపదికగా రిజర్వేషన్లు అన్నట్టుగానే రాజకీయాలలో లింగసమానత్వానికి కూడా ప్రాదేశిక రిజర్వేషన్లే ప్రధానంగా ముందుకు వచ్చాయి. ప్రాదేశిక రిజర్వేషన్లపైన అడుగుతున్న ప్రశ్నలకు గత పాతిక సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా వాదించేవారు సమాధానం చెప్పలేదు. మహిళలకు కేటాయించిన స్థానాలను క్రమం తప్పకుండా మార్చుతూ పోకపోతే (రొటేషన్ చేయకపోతే) అది అన్యాయం, ఏకపక్షం అవుతుంది. రొటేషన్ చేస్తే మూడింట రెండు వంతుల స్థానాలకు ప్రాతినిధ్యం వహించేవారు తమ ఓటర్లకు జవాబుదారీగా ఉండరు. ఎన్నికైన మహిళలు రాజకీయ కుటుంబాలకు చెందినవారై జవాబుదారీగా ఉంటే అది వేరే విషయం.
Also read: స్వామి వివేకానంద సంఘపరివార్ హితైషి కాదు, ఆయనను కాజేయడానికి పరివార్ కు ఉదారవాదులు తోడ్పడ్డారు
ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. ఒక ప్రత్యామ్నాయం ఏమంటే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాష్ట్రంలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు విధిగా కేటాయించడం. దీనివల్ల ఎన్నికైనవారిలో మూడింట ఒక వంతు మహిళలు ఉంటారన్న హామీ లేదు. కానీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుంది. నేను లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్, మానుషి మధుకీష్వర్ తో కలిసి ఈ ప్రత్యామ్నాయానికి వకాల్తా తీసుకున్నాను. కానీ జనం నుంచి అంతగా ఆమోదం రాలేదు. ఆ తర్వాత చాలా తెలివైన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాను. ఇప్పటికీ ఈ ఆలోచనకు కట్టుబడి ఉన్నాను: ఒకరిని ఎన్నుకోండి ఒకటి ఉచితంగా పొందండి అనే పథకం. ప్రతి పార్టీ తాను గెలిచిన స్థానాలకు దామాషాగా మహిళా సభ్యులను నామినేట్ చేయవచ్చు. ఇది మహిళా ప్రతినిధుల సంఖ్య 33 శాతానికి చేరేవరకూ జరగాలి. (ఈ ప్రతిపాదన చిల్లరగా కనిపించవచ్చు. కానీ రాజకీయ అంశాల గురించి రెండు నిమిషాలు ఆలోచించండి. అప్పుడు ఈ ప్రతిపాదన తక్కిన ప్రతిపాదనల కంటే ఎక్కువ ఆమోదం పొందుతుందని తెలుస్తుంది. కానీ ఈ ప్రతిపాదనను వివరించడం, అర్థం అయ్యేటట్టు చెప్పడం కష్టం. సీట్ల రిజర్వేషన్లు ద్వితీయమైన సానుకూలమైన విధానం. ప్రథమం కాదు. అయినా సరే ఇదొక్కటే మనకు సవ్యంగా అర్థం అవుతుంది. అలాగే కానీయండి.
ఈ అసమగ్ర రూపానికి కూడా ఖరారైన చట్టం న్యాయం చేయదు. 2010లో రాజ్యసభ ఆమోదించిన బిల్లు పాఠం ప్రాంతీయపరంగా ప్రత్యేకించడంతోపాటు రొటేషన్ కు చక్కని విధానం రూపొందించారు. ఆ వివరాలు ఖరారు చేస్తూ పార్లమెంటు చట్టం చేస్తుందని చెప్పారు. మొదటి దఫా మహిళలకు ఏయే సీట్లు ప్రత్యేకించాలో నిర్ణయంచేందుకు మామూలు లాటరీ పద్ధతి పాటిస్తారు. ప్రస్తుత చట్టంలో మూడింట ఒక వంతు స్థానాలను ఎట్లా నిర్ణయిస్తారో లేదు. అది కాకుండా మహిళా రిజర్వేషన్లకు పదిహేనేళ్ళ కాలపరిమితి విధించారు. ఇందుకు విరుద్ధంగా రోటేషన్ ప్రతిసారీ జనాభా లెక్కల తర్వాతనే జరుగుతుందని చట్టంలో పేర్కొన్నారు. జనాభా లెక్కలు ఇప్పుడు ఇరవై, ముప్పయ్ ఏళ్ళకు ఒక సారి జరుగుతాయి. అంటే రొటేషన్ ఉండాలి కానీ రొటేషన్ ఉండదు.
Also read: రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎటైనా కావచ్చు
చివరగా, మహిళా రిజర్వేషన్లు ఎప్పుడు అమలు జరుగుతాయన్నది ఈ వ్యవహారంలో కీలకమైన మెలిక. నిజానికి మహిళల రిజర్వేషన్ల అమలును రాబోయే జనాభా లెక్కలకో, నియోజకవర్గాల పునర్ విభజనకో ముడిపెట్టవలసిన అవసరం హేతబద్ధంగానూ, న్యాయపరంగానూ లేదు. పునర్ వ్యవస్థీకరణ సంస్థ (డీలిమిటేషన్ కమిషన్) చేస్తే పారదర్శకంగా ఉంటుందని దేశీయాంగమంత్రి చెప్పడం వింతగా ఉన్నది. డీలిమిటేషన్ కమిషన్ విశ్వసనీయతపైన ఆయనకు అపారమైన నమ్మకం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప మహిళల రిజర్వేషన్లు 2029లో అమలు జరగవు. వచ్చే ప్రభుత్వం అత్యంత వేగిరంగా జనాభా లెక్కలు చేయించిన పక్షంలో కూడా ఫిబ్రవరి 2025 నాటికి రాజ్యాంగం 82వ అధికరణ నేనున్నానంటూ రంగంలో దిగి జనాభా లెక్కలు తీయడానికి అంతరాయం కలిగించవచ్చు. 2026లో సేకరించిన జనాభా లెక్కలను ప్రచురించే వరకూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను ఈ అధికరణ అనుమతించదు. అంటే 2031 నాటి జనాభా లెక్కలు ప్రాతిపదిక కావాలి. దాని అంతిమ వివరాలు 2032 వరకూ వెల్లడి కావు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ రెండేళ్ళ కంటే తక్కువ వ్యవధి తీసుకోదు. పోయినసారి అయిదున్నరేళ్ళ సమయం పట్టింది. మళ్ళీ వచ్చే ఎన్నికల లోపు ఓటర్ల జాబితాలను సవరించాలి. కనుక మనం ఏదైనా రాజ్యాంగపరంగా అసాధారణ అద్భుతం చేస్తే మినహా మహిళా రిజర్వేషన్లు అమలు జరిగే సంవత్సరం 2039 కావచ్చు.
చట్టంలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒక సారి చూద్దాం. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ పూర్తి కావాలనే షరతు అసమంజసమైనది. పాలకపక్షం ఆలోచనకు తగినట్టుగా ఉన్నది. వ్యాపారంలో భవిష్యత్తులో బేరం కుదుర్చుకోవడం వంటిది. మహిళలను మూడింట ఒక వంతు సీట్లు ప్రత్యేకిస్తాము కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు అది అమలు జరుగుతుందని చెప్పడం వంటిదే. ఈ వాగ్దానం చేసిన పురుష నేతలకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. ఈ చర్య వల్ల తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు సుదూర భవిష్యత్తు వరకూ దెబ్బతినవు. భవిష్యత్తరాలవారిపైన ఈ చర్య పరిణామాలు ఉంటాయి. పార్లమెంటులో ఏమి చెప్పినా పురుషాధిక్య సమాజానికి రాజకీయ అధికారంపైన గుప్పెట వదులు చేయడానికి సమయం పడుతుందనడానికి ఇది నిదర్శనం. అందుకే షరతులు అవసరమైనాయి.
Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు
కానీ ఈ సమస్యాత్మకమైన సందర్భంలో ఏదో ఒకటి సాధించామన్న అంశాన్ని విస్మరించరాదు. చట్టసభలలో మహిళలకు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నదన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. జనాభాలో వారి భాగస్వామ్యంతో పోల్చితే తక్కువే కాకుండా మన ఇరుగుపొరుగు దేశాల చట్టసభలతో పోల్చినా తక్కువే. తక్కిన ప్రపంచంతో పోల్చితే మరీ తక్కువ. మహిళా రిజర్వేషన్ల మీద చర్చ ప్రారంభమైన తర్వాత చట్టసభలలో వారి ప్రాతినిధ్యంలో స్వల్పమైన పెరుగుదల కనిపిస్తున్నది. కానీ 2039నాటికైనా చట్టం లేకపోతే చట్టసభలలో మహిళల భాగస్వామ్యం 33 శాతానికి పెరిగే అవకాశం లేదు. న్యాయబద్ధంగా మనలను కట్టిపడవేసే అంశం కావాల్సిందే. అటువంటి చట్టం ఒకటి మనకు ఇప్పుడున్నది. ఈ చట్టం స్పష్టంగా లేదు. ఉండవలసినంత సానుకూలంగా లేదు. అనిశ్చితి దండిగా ఉన్నది. కానీ ఇటువంటి సంస్కరణల చరిత్ర మనకు ఈ విషయం చెబుతుంది: ఒక సారి చట్టం అయితే దాన్ని తిరగదోడరు. దానికి మరింత మెరుగులు దిద్ది పటిష్ఠం చేస్తారు.
అందుకని ఇది మనం పండుగ చేసుకోవలసిన సందర్భం. ఎక్కువ మంది మహిళా ప్రతినిధులు చట్టసభలలోకి వస్తే భారత మహిళల జీవితాలు దేదీప్యమానంగా వెలిగిపోతాయని కాదు. ఈ రోజు ఉన్న రాజకీయరుగ్మతలకు, వ్యసనాలకు అతీతంగా మహిళా ఎంపీలూ, ఎంఎల్ఏలూ వ్యవహరిస్తారని కూడా కాదు. మహిళా ప్రతినిధులు పదవులలోనూ, చట్టసభలలోనూ ఉన్నట్లయితే మహిళలకు వ్యతిరేకమైన చట్టాలు రావు. ఆహారం, ఆరోగ్యం, విద్యపైన దృష్టి పెరుగుతుంది. మహిళలకు అవకాశం ఇవ్వడం వల్ల దేశంలో విశేషంగా ఉన్న ప్రతిభాసామర్థ్యాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి కనుక ఈ సందర్భాన్ని పండుగలా పరిగణించాలి. పైన చెప్పుకున్న లక్ష్యాలన్నిటినీ సాధించలేక పోయినప్పటికీ ఈ సందర్భంలో పండుగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే తక్కిన సగం సజీవంగా ఉన్నదనే స్పృహ, ఆ సగానికి తనదైన గొంతు ఉన్నదనే గుర్తింపు, దానిని వినాలనే అవగాహన పురుష ప్రపంచానికి కలుగుతాయి కనుక.
Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం