• మారిన “మహిళా దినోత్సవం” తీరు
• మళ్ళీ కన్యాశుల్కం రాబోతోందా?
ఆకాశంలో సగం మహిళ ఏనాడో అయిపోయింది! పురుషాధిక్యత ప్రపంచం లో ఒకప్పటిలా చెప్పు కింద రాయిలా పడి ఉండే రోజులు ఏనాడో పోయాయి. తన భావజాలం కోసం తాను చెప్పినట్టు వినే వాడు తోడైతేనే కలసి కాపురం చేస్తున్న మహిళ, కలహాలు వచ్చాయా తనదారి తాను చూసుకోవడానికి వెనకాడడం లేదు. ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు ఆర్థిక క్రమ శిక్షణ పెంచుకున్న మహిళ కేవలం లోకం కట్టుబాట్లు కోసం రాజీ పడి బ్రతుకుతోంది. ఈ రోజు
నేటి మహిళ ముందుచూపుతో వ్యవహరిస్తోంది
ఈనాటి యువతరం పదేళ్ల ముందు జీవితాన్ని ఆలోచిస్తోంది. కుల మతాలకు అతీతంగా అడుగు వేస్తోంది. అలాగే తన జీవిత భద్రత భవిష్యత్ పై ఈ నాటి మహిళకు ముందు చూపు ఉంది. ఆధునిక మహిళ పై మనస్తత్వ వేత్తలు చేస్తున్న పరిశోధనల్లో తేలింది ఏమంటే వాళ్ల వ్యక్తిత్వ వికాసం మగవాళ్ల కంటే చాలా ముందుంది. శారీరక ఆకర్షణ, దుస్తులు, ఆస్తి పాస్తులు చూసే యువతులు కొంతమందైతే వారి తెలివితేటలు, హాస్యం, కరుణ, సంభావ్య సహచరుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిలా తనకు రక్షణ కల్పించే వారు ఉన్నారా అని దుర్భిణి వేసి చూస్తున్నారు.
Also Read: మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!
ఆకర్షణ ముసుగులో తప్పటడుగులు
ఆకర్షణ ముసుగులో ఇంటర్ , డిగ్రీ అమ్మాయిలు కొంత మంది తప్పటడుగు వేస్తున్నారు. కెరీర్ పై దృష్టి సారించిన అమ్మాయిలు మాత్రం తన లైఫ్ పార్టనర్ ఎంపికలో తప్పటడుగు వేయడం లేదు. క్యాంపస్ సెలెక్షన్ ఆయిన మరునాడే అమ్మాయి ఆర్థిక క్రమ శిక్షణ మొదలవుతుంది. మొదట అమ్మాయి అబ్బాయిలో చూసే లక్షణం తన వ్యక్తిత్వానికి గౌరవం ఇస్తాడా? తరువాత తన ఉద్యోగ బాధ్యతకు విలువ ఇస్తాడా? తాను సంపా దించే ప్రతి పైసా తన భవిష్యత్ ఆలోచనలు పుట్టింటి వారికి సహాయ కారిగా ఉంటాయా, లేదా? పుట్టబోయే బిడ్డలకు మంచి చదువు, సంస్కారం కోసం మంచి స్కూల్లో వేయడానికి తన సంపాదన ఖర్చు చేయడానికి భర్త అంగీకరిస్తాడా? ఆయన సంపాదించే డబ్బు గృహ వసతి, కారు, వారాంతంలో చేసే జల్సాలు, ఇంకా బంగారం, ఇంటి సామగ్రి కోసం ఖర్చు చేయడానికి ఒక “ఒప్పందం” తరువాతే మూడు ముళ్లకు ఈ నాటి అమ్మాయిలు రెడి అవుతున్నారు.
తేడా వస్తే తెగతెంపులే
మహిళా సాధికారిత, హక్కులు గురించి ఈ నాటి అమ్మాయిలు పెద్దగా ఆలోచించడం లేదు. భార్య భర్తలు గొడవ పడితే ఇద్దరి మధ్య బాగా గ్యాప్ వస్తే అడ్వకెట్లు తమ పని చక్క బెడతారు అనే ధోరణి వచ్చేసింది. మహిళా చట్టాలు కూడా అదే విధంగా వారికి సహకరిస్తున్నాయి. 498 -ఏ కేసును ఎక్కువగా ఉపయోగిస్తూ అమ్మాయిలు, తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భార్యాబాధితులు నెత్తీనోరూ బాదుకుంటూ కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా కోర్టుల్లో వాదోపవాదాలు చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న తగాదాలు పెద్దవై మనసు విరిగి జంటలు విడిపోవడమే సబబు అని కుటుంబ పెద్దలు అంటున్నా , వారికి పుట్టిన బిడ్డల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారవుతోంది. మహిళలను ఇప్పుడు వేధిస్తున్న సమస్య ఆరోగ్యం.
Also Read: అధికారం… అహంకారం
నలభైలలో మగతోడు అవసరం
నలభై ఏళ్లు వచ్చే వరకు ఉద్యోగమో లేక గృహ పరిశ్రమ ద్వారా ఆర్థిక స్థోమత తెచ్చుకుంటున్న మహిళ నలభై నుండి యాభై ఏళ్ళ వయసులో మగ తోడు అవసరం ఏర్పడుతుంది. పిల్లల పెంపకం, స్కూల్ బాధ్యతలు, పెళ్ళీళ్ళు ప్రతి దానికీ మగ తోడు అవసరమై తాను కోల్పోయిన జీవితంతో పాటు సమాజ చీదరింపుల వల్ల ఒంటరి అయిపోతోంది. అప్పుడు గత జీవితం గుర్తుకు వచ్చి ఎంత మదనపడ్డా తిరిగి రాని యవ్వన పొరపాట్లు ఒకొక్క సారి వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. అరిటాకు మీద ముళ్ళు పడ్డ ముళ్ళు మీద అరిటాకు పడ్డా అరిటాకుకే నష్టం అన్న చందంగా అమ్మాయి జీవితం అంధకారం అయినప్పుడు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తావించే హక్కులు అప్పుడు వారికి గుర్తుకు వస్తున్నాయి.
తల్లిదండ్రులు తలదించుకునేలా చేయవద్దు
ఇక నేటి మహిళ తప్పులు చేసినా ఒప్పులు చేసినా తల్లి దండ్రులు తల దించుకునేలా చేయవద్దు. చాలా మంది టీనేజ్ వయసులో ప్రేమ ముసుగులో పార్కుల వెంట తిరుగుతూ ఒకే సారి ఇద్దరు ముగ్గురు భాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ప్రమాదం అంచున పయనిస్తున్నారు. తనను మభ్యపెడుతోందని తెలిసిన వారు యాసిడ్ దాడులు చేస్తున్నారు. జీవితం అంటే పూలబాట కాదు. అందం ఆకర్షణ క్షణికం. పిల్లాపాపాలతో ఆదర్శ జీవితం గడిపే అవకాశం నేటి మహిళకు వచ్చింది. పూర్వపు రోజుల్లో కన్యకు బంగారు రాశులు తీసుకొని, ధనాధాన్యలు వరుడి ఉన్నాయని తెలిస్తేనే కాళ్ళు కడిగి తల్లి దండ్రులు కన్యాదానం చేసేవారు. కన్యాశుల్కం పేరిట భారీగా కానుకలు పెళ్లి కూతురుకు వచ్చేవి. ఆధునిక యుగంలో కూడా అదే తీరు కొనసాగుతోంది.
Also Read: కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశం
షరతులతో కూడిన అంగీకారం
పెళ్లి కాకముందే ఒక ప్లాట్ లేదా భూమి తమ పేరిట చేసి తమను అల్లారుముద్దుగా చూసుకుంటేనే మీ వంశాభివృద్ధికి వారధులం అవుతామని నేటి కన్యలు కరాఖండిగా చెబుతున్నారు. దానికి తోడు వరుడి ఎంపికలో ఎన్నో క్వాలిటీస్ చూస్తున్నారు. వారు పని చేస్తున్న కంపెనీ ఏస్టాబ్లిష్డ్ కంపెనీల జాబితాలో ఉందా? అభద్రతాభావం లేని ఉద్యోగమా? పిల్లవాడి వెనుక ఆస్తిపాస్తులు ఉన్నాయా? అత్తామామా ఆదరణ ఉంటుందా? ఇవన్నీ చూశాకనే అమ్మాయి అడుగు ముందుకు వేస్తోంది. ఇక పోతే సమాజంలో తప్పటడుగు వేసే విషయంలో కూడా ఆడపిల్లలే ముందుంటున్నారు.
రంగుల ప్రపంచం చూసి మోసపోవద్దు
రంగుల ప్రపంచంలో విహరిస్తూ, శరీర సౌందర్యంతో తమ వెంటపడుతున్న మగవాళ్ల వల్ల కోరి వనిత కష్టాలు తెచ్చుకుంటుంది. విద్య, వినయం మరిచి ఊహా ప్రపంచంలో, సోషల్ మీడియాలో కనిపించే రంగుల ప్రపంచం మోజులో పడి చేతులరా జీవితం పాడు చేసుకుంటోంది. జీవిత భాగస్వామి కి కార్లూ, హోదా, డబ్బు ఉండడమే అర్హత కాదు. మంచి మనసు, ఆప్యాయత చూపే భర్త, శ్రీరామచంద్రుడిలా ఏకపత్నివ్రతుడైన వరుడు దొరకడం అమ్మాయి పూర్వ జన్మ సుకృతం. కానీ నైతిక విలువలు లేని హంగుఆర్భాటాలు చూపి ఆడపిల్లను మోసం చేసి పబ్బుల వెంట క్లబ్బుల వెంట తిరిగే వాడు దోరికితే ఆ పిల్ల ఆశలు గల్లంతే అవుతాయి. తస్మాత్ జాగ్రత.
Also Read: తల్లి దండ్రుల కన్నుగప్పుతున్న అమ్మాయిలు
(మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా)