• దయచేసి ఒక ‘మహిళగా’ గుర్తించండి
• ఒక ‘స్త్రీమూర్తి’ గా గౌరవించండి
జీవితంలో ఒక్కోసారి కొన్ని వార్తలు చదవడానికి, వినడానికి, మాట్లాడుకోవడానికి కూడా చాలా అసహ్యంగా, జుగుప్సగా, బాధగా ఉంటాయి… అలాంటి సందర్భం ఒకటి క్రిందటి వారంలో మనందరికీ కలిగింది…
“దుస్తులపైనుండి బాలిక ఎదను తాకితే లైంగిక వేధింపులు కాదు… అది నేరం కాదు… శరీరాన్ని నేరుగా, భౌతికంగా స్పృశిస్తేనే ‘అలా’ పరిగణించాలని పోక్సో చట్టం చెబుతోందని బొంబాయి హైకోర్ట్ స్పష్టీకరణ…”
“బాలిక ముందు ప్యాంటు జిప్పు విప్పి… బాలిక చేయి పట్టుకుంటే కూడా అది లైంగిక దాడి కాదు అని పోక్సో చట్టం చట్టానికి కొత్త నిర్వచనమిచ్చిన బొంబాయి హైకోర్ట్ నాగపూర్ బెంచ్…”
“పెనుగులాట లేకుండా రేప్ ఎలా జరుగుతుంది … పాపం ఒక్కడే బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, ఇద్దరి దుస్తులూ విప్పి ఎలాంటి పెనుగులాట లేకుండా శృంగారం చేయడం చాలా కష్టం…అభిప్రాయపడ్డ జడ్జి”
ఈ వార్తల్లోని బాధితులంతా ఐదేళ్ల నుండి పదిహేనేళ్ల మధ్య బాలికలు కావడం, ఇంతటి (అ)నిర్వచనోత్తర, ప్రవచిత తీర్పులన్నీ ఒక మహిళా జడ్జి గారి విరచితమైనవి కావడం గమనార్హం…! (ఇవే తీర్పులు, వ్యాఖ్యానాలు, కామెంట్లు పొరపాటున ఎవరైనా పురుష జడ్జి గానీ చేసుంటే ఈ పాటికి భారత దేశం మొత్తం అల్లకల్లోలం చేసి ఉండేవారు మన మహిళా సంఘాలవారూ, ఫెమినిస్టులు… అది వేరే సంగతి…!)…
ఇది చదవండి: మరచిపోతున్న ‘మహాత్ముని’ మరణం… కొన్ని వాస్తవాలు
చిన్నారులపై, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే కిరాతకులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన చట్టమే “పోక్సో” చట్టం… కేవలం కొందరు నేరస్తులను శిక్షలనుండి కాపాడడానికే ఇంతటి మహోన్నత చట్టానికి కూడా వక్రభాష్యాలు చెబుతూ ఆ చట్టం యొక్క ప్రధాన లక్ష్ట్యాన్ని, స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు న్యాయ నిపుణులు ఎంతో ఆవేదన చెందుతున్నారు… అసలు మన ఘనమైన మూలలను ఒక్కసారి అవలోకిస్తే…
“యత్ర నార్యస్తు పూజ్యంతె రమంతె తత్ర దేవతాః… యత్రైతాస్తు న పూజ్యంతె సర్వాస్తత్రఫలాః క్రియాః”…
అందరికీ తెలిసిన ‘మనుస్మృతి’ లోని ఈ శ్లోకం యొక్క అర్థం… “ఎక్కడ మహిళలు గౌరవాన్ని పొందుతారో అక్కడ దేవతలు నివాసముంటారు; పూజలందుకొంటారు… మహిళలు గౌరవింపబడని చోట ఎటువంటి శుభాలు చేకూరవు; ఎంత గొప్ప సత్కార్యాలయినా ఫలించవు”… ఇలాంటి ఆచరణలో లేని శ్లోకాలు, సూక్తులు, సిద్ధాంతాలు చెప్పి మహిళల్ని దేవతలు గా కొలిచే ఒక గొప్ప పవిత్ర దేశం మన భారతదేశం అని ఎంతో గొప్పగా మన గురించి మనం చెప్పుకొంటాం…
భారతీయులు ప్రపంచానికి అన్నీ చెబుతారు కానీ వారైతే తమకు తాము ఏదీ ఆచరించరు అని ప్రతీతి… దీన్నే ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు మనవాళ్ళు… అసలైతే, మగాడికి ఆడది లేకుంటే జీవితం గానీ అస్తిత్వం గానీ లేనే లేదు… తమ ఉనికి కోసం, తమ మనుగడ కోసం, తమ బతుకు కోసం మగవాడు ఆడదానిపై ఎంతగానో ఆధారపడ్డాడు…
దీనికోసమైనా ఆడవారిని మనమందరం కచ్చితంగా గుర్తించితీరాలి… గౌరవించి తీరాలి… చేయూతనివ్వాలి… రక్షించాలి… సంరక్షించి తీరాలి… కానీ, వాస్తవం చాలా అన్యాయం గా ఉంది… ఆడవారిపై అత్యాచారాల విషయం లో మన పవిత్ర భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకొంటూనే ఉంది…
ఇది చదవండి: రాజకీయ రణ’తంత్రం’ గా మన ప్రజా ‘గణతంత్రం’!
పుట్టుకతోనే అమ్మాయి అంటే ఒక వివక్ష… పుట్టకముందే భ్రూణ హత్యలు… అమాయక బాలికలపై అత్యాచారాలు… మహిళలపై వేధింపులు… యాసిడ్ దాడులు… లవ్-జిహాదీ హత్యలు… ప్రేమోన్మాద హత్యలు… పరువు హత్యలు… యువతుల అక్రమ రవాణా… బలవంతంగా వ్యభిచారం… అన్నింటికీ ఆడపిల్లే బలి పశువు… ఆడపిల్లను కంటే ఆమెనుకన్నతల్లిని కూడా హింసించే ప్రబుద్ధులు ఉన్నదేశం మనది…
ఎందరో నిర్భయలు… మరెందరో దిశలు… ఎన్నో చట్టాలు… మరెన్నో యాక్టులు… మహిళలకోసం ఎన్నో ప్రత్యేక సెక్షన్లు… మరెన్నో ప్రత్యేక ప్రొవిజన్లు… కానీ, వాస్తవం లో ఇప్పటికీ దిశా-దశ లేని, ఇంకా రక్షణ- సంరక్షణ లేని మహిళలు, బాలికలు… ఇలాంటి నీచమైన లింగ వివక్ష భారత జాతికే అవమానకరం…
“స్త్రీ లోని ‘స’ కారము సత్వగుణానికి, ‘త’ కారము తమోగుణాని, ‘ర’ కారము రజోగుణానికి ప్రతీకలు”… అంటే త్రిగునాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా ‘స్త్రీ’ ని మన పవిత్ర వేదాలు పేర్కొన్నాయి…
కానీ, ఇంతటి గొప్ప స్త్రీమూర్తుల విషయం లో మన భారతదేశంలో నిజాలు చాలా నగ్నంగా, పరమ నీచంగా, ఎంతో నికృష్టం గా, హేయంగా ఉంటున్నాయి… ఎనిమిది నెలల పచ్చి పసికందు నుండి ఎనభైయేళ్ల పండు ముసలమ్మవరకూ ఆడదైతే చాలు అత్యాచారానికి బరితెగిస్తున్న కొందరు మగ’మృగాలు’ పురుషజాతికే కళంకం తెస్తున్నారు… ఆశ్చర్యకరంగా, ఆడవారిపై అత్యాచారాల విషయంలో మాత్రం అన్ని మతాల మగవారూ, మతాలకతీతం గా ఒక గొప్ప జాతీయ సమైక్యత ప్రదర్శిస్స్తున్నారు…
ఇన్నాళ్లూ కొందరు కుటుంబసభ్యులు, కులపెద్దలు, స్థానిక రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు… వరకు మాత్రమే ఇలాంటి మృగాలను కాపాడుతోన్నారనే అభియోగాలు ఉండేవి… కానీ, దురదృష్టవశాత్తూ ఈ అత్యాచార మృగాలకు కొత్తగా ఎందరో పెద్దస్థాయిల్లోని సానుభూతిపరులు, ఎంతో పెద్ద పదవుల్లోఉన్న అభిమానులు, మరెందరో ఉన్నతమైన హోదాల్లోఉన్న సహాయపరులూ కూడా తోడుగా తయారయ్యారు…
వెయ్యిమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కి కూడా శిక్ష పడకూడదనే భారత శిక్షాస్మృతి లోని కొన్ని సంశయలాభాలతో వీరికి మేలుచేసే ప్రయత్నాలు కొందరు చేస్తున్నట్టు వార్తలు వింటున్నాం… ఇది ఎంతో దురదృష్టకరం… మరెంతో ఆందోళనకరం…
అసలే మన సంక్లిష్ట న్యాయ వ్యవస్థ లో న్యాయదేవతకు ఒక కత్తి, తరాజు ఇచ్చి న్యాయం కనబడకుండా కళ్ళు కట్టేసారు… కేవలం బలమైన సాక్ష్యాలు – ఆధారాలను పరిశీలించి, చట్టాల ప్రకారం, సందర్భాన్ని బట్టి, కారణాలను విశ్లేషించి, న్యాయవాదుల వాదనల, నిందితుల – సాక్ష్యులు వాంగ్మూలాల ఆధారంగా న్యాయాన్ని ఎంచి, త్రాసు లో తూచి, బేరీజు వేసి, ఒక్కోసారి కత్తి ఝళిపిస్తున్న, న్యాయం పంచుతున్నకఠినమైన న్యాయ విధానం మనది…
కొందరు కావాలనే, వ్యక్తిగత కక్షలతో కూడా చట్టాల్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది గాబట్టి పైనపేర్కొన్నఅత్యంత సంక్లిష్ట, కష్టసాధ్య న్యాయవిధానాన్ని అనుసరిస్తూ చట్టాన్ని, న్యాయాన్ని, తద్వారా ధర్మాన్ని పరిరక్షించే పవిత్ర బాధ్యత మన గౌరవనీయులైన న్యాయమూర్తులపైన, న్యాయ వ్యవస్థ పైన ఉన్నది… ఇది ఒకరకం గా జడ్జీ లకు కత్తిమీద సామే…!
వాస్తవానికి మన లాంటి పవిత్ర దేశాల్లో అత్యాచార సంఘటనల్లో 90+ శాతం పైగా కేసులు కోర్టుల దాకా కూడా రావు… దురదృష్టవశాత్తూ, అత్యాచారబాధితుల్లో ఎందరో ఆత్మహత్య చేసున్నవారున్నారు… చాలావరకూ దగ్గరవాళ్ళు, బాగా తెలుసున్నవాళ్ళు, బంధువులు, కుటుంబసభ్యులే నేరస్థులు అవటం వల్ల బాలికలు చాలావరకు కన్నతల్లితండ్రులతో కూడా చెప్పుకోని, చెప్పుకోలేని పరిస్థితి…
దానికి తోడు, ఒకవేళ చెప్పినా మన పవిత్ర దేశం లో పరువు – ప్రతిష్ట పోతుందేమో అనే సమస్య చాలామంది తల్లితండ్రులది… దానికి తోడు ఎక్కువశాతం బాధితులు ఆర్ధికంగా, సామాజికంగా బలహీనులవ్వడం వల్ల ఒకవేళ వాళ్ళ తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లయింటు ఇచ్చినా పోలీస్ వ్యవస్థ లోని కొందరు అవినీతిపరులు నేరస్థులతో కుమ్మక్కైన సందర్భాలు…
పోలీసుల సెటిల్మెంట్లు కూడా దాటి కేసు రిజిస్టర్ అయితే, అతి పెద్ద సమస్య ‘సాక్ష్యాలు’… ఇలాంటి జుగుప్సాకరమైన అత్యాచారాల్లో వీడియో సాక్ష్యం అయితే ఉండదు, దొరికే ఒకరిద్దరు సాక్షులు చివరి వరకూ నేరస్థులకు అమ్ముడుపోకుండా భాదితులకు అండగా నిలబడాలి…
పోలీసులు కేసు బలం గా పెట్టాలి… వైద్య పరీక్షలు అయితే అదో పెద్ద ప్రహసనం… శాస్త్రీయ ఆధారాలుండాలి… శరీరం పై చట్టపరమైన ఆధారాలు ఉండాలి…అత్యాచారాన్ని నిరూపించాలి… నిరూపించగలగాలి… దీనికి వారాలు, నెలలూ కాదు ఎన్నో ఏళ్ళు కూడా పట్టొచ్చు… కేసు కిందికోర్టు నుండి పై కోర్ట్ కూ, ఆపై కోర్ట్ కూ వచ్చి ఒక తీర్పు రావడానికి ఎన్నో ఏళ్ళు, దశాబ్దం వరకూ కూడా పట్టిన సందర్భాలున్నాయి…
ఇది చదవండి: ‘కులం’ చేత… ‘కులం’ కోసం… ‘కులం’ తో… సకలం ‘కులం’ గా… సం’కులం’తో వ్యా’కుల’మైపోతున్న మన ‘భారతీయం’
ఒక్కోసారి న్యాయం జరగవచ్చు… కొన్నిసార్లు అన్యాయం కూడా జరగవచ్చు… అత్యాచారాన్ని నిరూపించడం అంత సులభమేమీ కాదు…!… ఇంత కష్టసాధ్యమైన, క్లిష్టమైన పరిక్రమ లో బాధితులకు ప్రతి క్షణం అత్యంత బాధాకరం… కుటుంబానికంతటికీ నరకమే…
ఇన్ని కష్టనష్టాల మధ్య, ఇంతటి నరకాన్ని అనుభవిస్తున్న భాదితులకు, వారి తల్లితండ్రులకు, కుటుంబసభ్యులకు మన గౌరవనీయులైన మహిళా జడ్జి గారు ఇచ్చిన తీర్పు, ఆమె వ్యాఖ్యలు, చట్టం పై వ్యాఖ్యానాలు ఎంతటి మనో వేదన కలిగిస్తాయో ఊహించలేము…
తీర్పు ఇవ్వడం జడ్జి గారి విచక్షణ… చట్టప్రకారం ఆమె ఎలాగైనా తీర్పు ఇవ్వచ్చు… కానీ, గౌరవనీయమైన, అత్యున్నత స్తానం లో ఉన్న న్యాయమూర్తులు ఇచ్చే ఇలాంటి నిర్వచనాలు, వ్యాఖ్యలు చాలా ఆందోళనకరం… ఇవి సమాజం పైనా, ప్రజలపైనా ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది…!
భవిష్యత్తు లో ఇవన్నీ ఒక ప్రమాదకరమైన ఉదాహరణలుగా మారే ప్రమాదం ఎంతైనా ఉంది… ఎందరో నేరస్తులకు ప్రోత్సాహాన్ని, ఊతాన్నిచ్చేవిగా ఇవి వుండకూడదు…! మరిన్ని రాబోయే జడ్జిమెంట్లకు ఇవి మార్గదర్శనం చేయకూడదు…! న్యాయం పై ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టకూడదు…! న్యాయస్థానాల విలువ తగ్గించకూడదు…!
అత్యాచార నిందితులకు వీలైనంత తొందరగా విచారణ చేసి నేరస్తులకు చాలా కఠినమైన శిక్షలు విధించాలి… ఇప్పటికైతే మన అత్యున్నత న్యాయవ్యవస్థ అయిన సుప్రీమ్ కోర్ట్ పైన పేర్కొన్న అనిర్వచనోత్తమ వ్యాఖ్యాన ప్రవచిత తీర్పుల పై స్టే విధించింది… సుప్రీం కోర్టు కొలీజియం కూడా సదరు మహిళా జడ్జి పై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది… తద్వారా, భారత ప్రజలకు న్యాయవ్యవస్థ పై నమ్మకాన్ని, గౌరవాన్ని నిలబెట్టింది…
బాలికలపై ఘోరంగా అత్యాచారం చేసినవారెంత పెద్దవారయినా చాలా నిష్పక్షపాతంగా విచారణ చేసి నేరస్తులను శిక్షించాలి… అవెంత కఠినంగా ఉండాలంటే భవిష్యత్తులో మరెవరికీ అలాంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలి…! చట్టాలను మార్పు చేసి సాక్షులు, పోలీసు వారు ముందు ఇచ్చే స్టేట్మెంట్లు తో పాటు వారిని వెంటనే మేజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టి వారి స్టేట్ మెంట్ రికార్డు చేయించాలి… లేకపోతే, ఎవర్నీ, ఎవరూ నమ్మే పరిస్థితి లేదు…!
చట్టాలను గౌరవిస్తూ సుప్రీంకోర్టు వారు వెంటనే స్పందించారు… న్యాయస్థానం విలువ పెంచారు… సుప్రీమ్ కోర్టు, కొలీజియం తక్షణ స్పందన ఎంతో అభినందనీయం… ఇది ఆడపిల్లలకు ఎంతో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది…
చట్టాలు ఎంత గొప్పవైనా, మంచివైనా ఆచరణలో ఎదురవుతున్న ఎన్నో న్యాయ సమస్యలకు ఒక పరిష్కారాన్ని, న్యాయాన్ని తొందర్లో ప్రజలకు అందించాలి… కానీ, ఇప్పటికే ఆడపిల్లల్ని కన్న తల్లితండ్రులు తమ పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపాలంటే భయపడుతున్నారు…
మన పోలీసులు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ వారికి నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించలేకపొతే రేపటి తరాలకు భవిష్యత్తు అనేదే ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు…! ఆడపిల్లల్ని మనం సంరక్షించలేకపోతే మనల్ని ఎవరూ రక్షించలేరు…!
ఇది చదవండి: కొందరు యోగులు… ఇంకొందరు భోగులు… మరికొందరు నియంతలు… ఇంకెందరో గొప్పోళ్ళు-పెద్ద మనుషులు…
మగువల్ని తీవ్రంగా వేధిస్తున్న కొందరు మృగాళ్లను మనం కఠినంగా శిక్షించలేకపోతే మొత్తం మగాళ్లు, ముందు ముందు మనవ సమాజం కూడా మనుగడ లేకుండా పోతుంది… ఇది నిజం…🙏
(ఈ ఆర్టికల్ ఎవర్నీ ఉద్దేశించినది కాదు… ప్రత్యేకంగా ఏ జడ్జి ని గానీ, ఎవరి జడ్జిమెంట్ ని గానీ, వారికి వ్యతిరేకంగా గానీ, ప్రతికూలంగా గానీ, అసలెవర్నీ ఉద్దేశించింది అసలే కాదు… అసలెవర్నీ గానీ, న్యాయస్థానాలనూ, న్యాయమూర్తులనూ, న్యాయవ్యవస్థలనూ ఉద్దేశించినది అసలే, ఎంతమాత్రం కాదు… ఒకవేళ ఎవరి మనో భావాలు ఏమైనా, ఎంతైనా, కొంచమైనా, పొరబాటున గానీ దెబ్బతింటే దయచేసి మన్నించగలరు… క్షంతవ్యుడ్ని…🙏
జై హింద్… భారత మాతకు జై…🙏