పెళ్లయి అత్తారింటికి వెళ్ళాక కూడా పుట్టింటి జ్ఞాపకాలు ఏ ఆడపిల్లా మరవదు! మంచినీళ్ల బావి కాడ అమ్మకు చేద సహాయం చేయడం, పప్పుదినుసులు అమ్మ ఎండకు ఆరబెడితే కాకులు రాకుండా కాపలా కాస్తుండడం “బిడ్డా ఎండకు మాడి పోయావు” అని తల్లి తన కొంగుతో చెమట ను తుడిచినప్పుడు వెచ్చని ఆమె ఒడిలో వాలి పోయిన ఆ క్షణాలు…చిక్కులు పడ్డ జడను తలకు నొప్పి కలగకుండా దువ్వెనతో సుతిమెత్తగా దువ్వి దట్టంగా కొబ్బరి నూనె రాసి రెండు జెడలు వేసి అందమైన తన కూతురు కి దిష్టి తగలవద్దు అని దిష్టి తీసి స్కూల్ కు పంపిన ఆ మధుర స్మృతులు అనునిత్యం గుర్తుకు వస్తూనే ఉంటాయి.
ఇక ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఇంటి వెనకాల ఇంతెత్తు చింత చెట్టు విరగకాయడం! నాన్నా అమ్మ కు అన్నీ అందుబాటులో ఉండేలా మామిడి, కరివేపాకు, వెలగ చెట్టు, మునగ చెట్టు ఒక్కటేమిటీ పచ్చడి పెట్టుకునే ప్రతిది నాటి వాటికీ నీళ్లు పట్టి ఏపుగా కాపు వచ్చాక, అమ్మకు తెంపి ఇస్తే చింతకాయ, మామిడి కాయ, మునక్కాయ, కరివేపాకు పొడి, వెలక్కాయ పచ్చడి ఒక్కొక్కటి పొదుపుగా పద్దతిగా చేసి కలిపి పెద్ద బౌల్ నుండి జాడీల్లో పెట్టి మిగిలిన కారాన్ని మాకు వడ్డించినప్పుడు “అబ్బా ఆ రుచే వేరు” నాలుకకు రాసుకున్న చింత కారం, మామిడి కాయ పప్పు, అమ్మ చేతి వంట గుర్తొస్తున్న వేళ శత మానం భవతి లో శ్రీమణి రాసిన బాల్యం పాట కారులో శ్రావ్యంగా వినిపిస్తుంది!
Also Read : ప్రేమతత్వం తెలిస్తే ఆకర్షణకు దూరంగా ఉంటారా?
ఎదురుగుండా నాన్న రాలేదు. కళ్లవెంట నీళ్ళు అమ్మ కూడా ఎదురు రాలేదు. ఇంటి చాకిరి చేసి చేసి ఇక నా వల్ల కాదు అని నవారు మంచం మీద అచేతనంగా పడి ఉంది. కూతురును చూడగానే ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని లేచి ఆప్యాయంగా హత్తుకుంది. ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. అమ్మ కళ్ల వెంట కూడా. ఈ లోపు మరదలు తమ్ముడు కారులో నుండి నా బ్యాగులు తెచ్చి కాళ్లకు నీళ్లిచ్చి మంచి నీళ్లు ఇవ్వగానే పుట్టింటి మమకారం ఇంకా ఉన్నందుకు ఆనంద పడుతూ అమ్మ మంచానికి అతుక్కుని పోవడం బాధగా ఉండదా?
గోడకు వేలాడదీసిన నాన్న ఫోటో వైపు చూస్తూ బెంగపడకమ్మా మేమున్నాం అత్తను అమ్మలా చూసుకో అని అప్పగింతలప్పుడు నాన్నా చిన్న పిల్లడిలా ఏడుస్తూ “మా అమ్మ నన్ను వదిలిపోతుంది” అని నన్ను ఆత్మీయంగా హత్తుకున్న ఆయన ఫొటో చూస్తే కన్నీళ్లు ఆగుతాయా? మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎక్కడి నుండో వచ్చి ఈ ఇంటి దీపం వెలిగిస్తున్న మరదలి ఆప్యాయత దొరికినందుకు ఆనంద పడుతూ కబుర్లు చిన్ననాటి ముచ్చట్లు అన్నీ అయ్యాకా మెట్టింటి అలసట తీరేలా అమ్మ మీద చెయ్యి వేసి హాయిగా నిద్రపోయే ఆడపిల్ల పుట్టింటి మమకారం ఎన్ని డబ్బులున్నా తీసుకురాలేని ఆత్మీయ సరాగం! అమ్మ స్పర్శే వెయ్యేనుగుల బలం.
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు
సాయంత్రం అమ్మ లేపగానే లేచి ముఖం కడుక్కుని పెరట్లో కి వెళ్ళగానే నాన్న పెట్టిన ప్రతి చెట్టు విరగకాసింది. తమ్ముడు, మరదలు ఆ చెట్లకు నీళ్లు పడుతున్నారు. హైద్రరాబాద్ మహానగరంలో రోళ్లు, రోకళ్ళు ఉన్నా వాటితో పచ్చళ్ళు చేసే ఆడంగులు ఉన్నారా? “ప్రియ” పచ్చళ్ళు ఇంటింటా ఉంటున్నప్పుడు నోరుకు రుచి ఎలా తెలుస్తుంది. మిషన్ పచ్చళ్ళు మాధుర్యంగా ఉంటాయా? వెలగ పండ్లు, చింతకాయలు, మామిడి కాయలు కోసుకొని మరదలు ఏమనుకుటుందో అన్న శంక తో ఒక సారి ఆ పిల్ల వైపు చూసింది.
వదిన ఇవి మామయ్యగారు నాటిన మొక్కలు తీసుకోండి అంటుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. అంతే పడి పడి అందని కాయలను ఎగిరి అందుకుంటూ ఇంకేం మధ్యాహ్నం భోజనం కాగానే చింతకాయ నానబెట్టి, మామిడి జీడీ తీసి, కరివేపాకు ఎండకు బెట్టి వరంగల్ ఎర్ర మిర్చి చూస్తేనే నోరూరేలా ఉండగా వాటి తొడిమలు తీసి ఆవాలు, జీలకర్ర, మెంతులు కలగలిపి మిక్సీలో గిర్రున తిప్పేసి ఈల పీట మీద దొర మామిడి కాయలను కోసి పనమ్మాయి తో రోలు రోకలి కడిగించి చింత రుబ్బి పచ్చళ్ల నూనె ఘుమ ఘుమలతో ఇల్లంతా నాలుక చప్పరించే రుచి వాసన.
Also Read : ఆధునిక మహిళ కోరుకుంటోంది హక్కులు కాదు, ఆప్యాయత – ఆదరణ
తెల్లారింది లేచే సరికే మరదలు చిన్న జాడీల్లో అన్ని పచ్చళ్ళు సర్ది దట్టంగా ఒక బ్యాగులో చుట్టి అత్తను కూడా ఆడబిడ్డ ఇంటికి నాలుగు రోజుల కోసం తయారు చేసి ఆత్మీయ వీడ్కోలు అందుకుని, పక్కన కన్న పేగు బంధం మరో వైపు పచ్చళ్ళు హాయిగా ఇల్లు చేరింది! ఎప్పుడు తెల్లరుతుందా? మూడు రోజులు మాగిన పచ్చళ్ళు పెనిమిటికి, పిల్లలకు పెట్టాలనే ఆరాటం! వంట గదిలో జాడీలను తీసి చక్కగా గిన్నెల్లో అమర్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్త పిల్లల కోసం వేడి వేడి అన్నం చింతచిగురు పులుసు, మామిడికాయ పప్పు ఇంకేం తీరొక్క పచ్చళ్ళు!
ఇంతలో కుటుంబ సభ్యుల తో డైనింగ్ టేబులు భర్తీ అయింది పళ్లెం నిండా అన్నీ వడ్డించి భర్త ముందు ఏ పచ్చడి కలుపుకుంటారా అని చూసింది అంతే ఏమీ తెలియనట్టు భార్య పెట్టిన ముఖం చూసిన భర్త భార్యకు ఇష్టమైన వెలక్కాయ పచ్చడి వేలుకు రాసుకొని మెల్లిగా నాలుకకు అటించుకున్న తరువాత భార్య ముఖంలోకి చూశాడు. తదేకంగా భర్తనే చూస్తుంది. ఏమిటన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు భర్త! మా నాన్న సెలెక్షన్ కరెక్టే అంది అర్థం కానట్టు చూశాడు. ఈ లోపు ఒకొక్క పచ్చడి కలుపుకుంటు పుట్టింటి మమకారాన్ని చవిచూస్తూ మధ్య మధ్యలో మరదలికి ఫోన్ చేస్తూ, జిహ్వ రుచిని వర్ణిస్తూ పుట్టింటి మమకారం రుచి చూస్తున్న ఆడ పిల్ల ఆత్మీయత, ఆప్యాయత, అనురాగం, ఆరాటం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు!
Also Read : అధికారం… అహంకారం