మహిళలే గ్రామాలకు శ్రీరామరక్ష అంటూ నినదించి రుజువులతో, అనుభవాలతో రాసిన డా నాగులపల్లి భాస్కర రావు కృష్ణా జిల్లా ముదునూరు వాసి. ఉద్యోగరీత్యా ఢిల్లీ లో ఉంటూ తన పుట్టిన ఊరిని కంటికి రెప్పగా కాపాడుకొంటున్నారు. అక్కడే ప్రపంచంలో ఎక్కడా లేని ”జీవిత చరిత్రల గ్రంధాలయం’ ‘స్థాపించారు. దాని వార్షికోత్సవానికి మమ్మల్ని పిలిచి అక్కడి మహిళలు బాలబాలికలచేత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపజేశారు. మనసులో మనిషి ఏదైనా అనుకొంటే సాధించి చూపుతాడని రుజువు చేశాడు. తాను పై శీర్షికతో రాసిన పుస్తకాన్ని నాకు అందజేయగా ఇవాళే చదివి స్పందిస్తున్నాను. ఇందులో రావుగారు తన ఉద్దేశ్యం, కలసిమెలసి ఉంటే ఏదైనా సాధ్యం, పిల్లలే ముఖ్యం, ముగ్గుల ప్రాధాన్యత, లేచింది మహిళాలోకం, మహిళా మహాత్యం చూపించినప్పుడే గదా, మహిళా సాధికారత అంటే.., ముగ్గుల ముచ్చట్లు, శుభ సూచకాలు, గ్రామాభివృద్ధి మహిళా వికాసం తోనే -అనే శీర్షికలలో విషయ వివేచనం చేసి రచించారు. వీటిలోని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచుతున్నాను.
హిమాచల్ మహిళలు ముందున్నారు
రాష్ట్రాల్లో గ్రామాల్లో చెదురుమదురుగా మాత్రమె మహిళా నాయకత్వం కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు అనే సంగతి మన మాటలలో కనబడక వినబడక పోవటం ఆశ్చర్యం. ఎన్నికలలో ఓట్లు వేసేది కూడా ఎక్కువగా స్త్రీలే. ఒకప్పుడు దేవాలయాలు పలు కార్యక్రమాలకు నిలయాలుగా ఉండేవి. రెండేళ్ల క్రితం తాను రాసిన పుస్తకం -”దిగ్రీన్ పజిల్” లో మనగాలి నీరు వాతావరణం చెడిపోవటానికి కారణం మన సంస్కృతీ, ఆచార వ్యవహారాలను మనం మర్చిపోవటమేనని రాశానని గుర్తు చేశారు. ధనుర్మాస కార్తీక మాస ఉత్సవాలు బాగా జరగటానికి ఇప్పుడు మహిళలు మొబైల్ ఫోన్ గ్రూప్ లు బాగా తోడ్పడుతున్నాయి. భగినీ హస్తభోజనం, కోటి దీపోత్సవాలు ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో బాగా జరుపుతూ కులమతాలకు అతీతంగా వ్యవహరించటం గొప్ప ముందడుగు. 1940లోనె తమ ఊరిలో అన్నికులాల వారు సహపంక్తి భోజనాలు చేయటం చారిత్రాత్మక సంఘటన అంటారు.
‘చిప్కో’ ఉద్యమం జయప్రదం చేసింది మహిళలే
సుందర లాల్ బహుగుణ ప్రారంభించిన వాతావరణ పరిరక్షణ చెట్లను నరక కుండా వాటిని కౌగిలించుకొనే ”చిప్కో ఉద్యమం’’ జయప్రదం చేసింది మహిళలే. దీనితోనే హిమాలయ ప్రాంత అరణ్యాలు కాంట్రాక్టర్ల కబంధ హస్తాలనుంచి రక్షించ బడ్డాయి.
సమాజంలో తేడాలే అన్నిటికి మూలకారణం. న్యాయ వ్యవస్థలో ఇంకా స్త్రీలకూ అధిక ప్రాధాన్యం దక్కటం లేదు. వివక్ష ఇంకా ఉంది. వివాహానికి, విడాకులకు, భరణానికి ఉన్న చట్టాల గురించి గ్రామాలలోని మహిళలకు అవగాహన కల్పించాలి. మనం నాటిందే మనకు ఫలితమిస్తుంది అనే సూక్తి నిజం. టెన్నిస్ లో సింధు, ప్రపంచంలో పెద్ద ఉద్యోగం అమెరికాలో సాధించిన ఇందిరా సూయీ వంటివారు సామాన్య కుటుంబాలనుంచి వచ్చిన వారే.
ముదునూరు ప్రగతకి మహిళలే కారణం
ముదునూరు ప్రగతిపథాన పురోగామించడానికి కారణం అక్కడి మహిళా చైతన్యమే. మహిళలకోసం ఏర్పాటైన డ్వాక్రా గ్రూపులు అన్నీ కలిసి పని చేయకపోవటం విచారకరం. అందుకే చరిత్ర లైబ్రరీ స్థాపించి జీవిత చరిత్రలు చదివిస్తూ స్పూర్తి కలిగిస్తునన్నామన్నారు. తన గమనికలో విద్యాలయాలలో బాలికలే చదువులోనూ, భావవ్యక్తీకరణలోనూ ,ప్రశ్నించటంలోనూ, లోకజ్ఞానం లోనూ ముందే ఉంటున్నారు. మహిళా సాధికారత చట్టం వచ్చినా అందులోని విషయాలు వారికి బోధ పరచే వారు తక్కువ. వారికి చక్కని అవగాహన కలిగిస్తే దాని ఫలితం, ప్రభావం గణనీయంగా ఉంటాయి.
ఇప్పుడు అంతా ముగ్గుల పోటీ పెడుతున్నారు. పత్రికలు సైతం సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవాళ వీధి వీధినా ప్రత్యక్షమై గ్రామీణ శోభ పెంచుతున్నాయి. ఇందులో స్త్రీల, బాలికల క్రమశిక్షణ కనిపిస్తుంది. ఇదే స్పూర్తి క్రిస్మస్ వగైరా పండుగలలో పాటించక పోవటం విచారకరం. ఇవి అన్నిటికి అతీతంగా జరగాలి. అప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. సుమారు 70 ఏళ్ళ క్రితం ముదునూరులో మహిళలు విశాల దృక్పధంతో తమ కుటుంబాలవారు మాత్రమే కాక అందరూ బాగుండాలి అనే తపన ఉండేవారు. తన నాయనమ్మ బాపమ్మ భర్త చనిపోయినా కుటుంబ బాధ్యత అంతా మీద వేసుకొని వ్యవసాయం విద్యలో కూడా పర్య వేక్షణ చేసి 104 వ ఏట కూడా ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తానూ చేసుకొంటూ, ఇంట్లో అందరూ ఉన్నా, సహాయం చేయగలిగి వున్నా, ఎవ్వరికీ భారం కాకూడదు అనే లక్ష్యంతో జీవించింది అని గర్వంగా చెప్పారు.
ఏ సంఘంలోనూ స్త్రీలు కనిపించడం లేదు
పాల ఉత్పత్తి దారుల సంఘంలో కూడా స్త్రీల ప్రాతినిధ్యం నామ మాత్రమే. స్కూల్ కమిటీలలోనూ వారి స్థానం తక్కువే. రాజకీయాలలో మహిళలు నష్టపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రణాలికలు అమలు చేసి ఎన్ని ప్రయోజనాలు కల్పించినా స్థానికుల ప్రమేయం లేకపోతె ఆశించిన ఫలితం ఒనగూడదు. మహిళలు ఎవరి పరిధిలో వారు ఎవరికి వారు, అందరూకలిసి ఉన్నఅవకాశాలను ఉపయోగించుకోవటమే మహిళా సాధికారత. గ్రామాలలోని అంగన్ వాడీ, బాల వాడీల విషయలో కూడా వారికి అవగాహన ఉండాలి. ప్రమేయమూ ఉండాలి. తమ గ్రామంలో ఈ సారి ముగ్గులతోపాటు పతంగులు ఎగరవేయటమూ ఉత్సాహంగా జరిపించాలనే ఆలోచనలో రావు గారున్నారు. ఆయనకు అన్నివిధాల ఆయన అర్ధాంగి సహకరిస్తూ భర్త ఆశయాల ఫలితాలు రాబట్టటంలో శక్తి వంచన లేకుండా సహకరిస్తున్నారు. సంధ్య అనే టీచర్ సహకారం అడుగడుగునా కనిప్న్చింది నాకు. మహిళా చైతన్యం లేని గ్రామాల భవిష్యత్ భయ౦కరమే అని తేలుస్తూ పుస్తకం ముగించారు.
ఎవరీ భాస్కరరావు?
ఇంతకీ ఈ పుస్తకం రాసిన భాస్కర రావు ఎవరు? ముదునూరులో పుట్టి, బాగా చదువుకొని, దిల్లీలో స్థిరబడి, ఆరు దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలకూ, జాతీయ నాయకులకూ, వివిధ మంత్రిత్వ శాఖలకూ సలహాదారులుగా ఉంటూ, సమాచార రంగంలో ప్రజానాడి – వాణి వినిపిస్తూ, ఆ రంగంలో వైతాలికులుగా ప్రసిద్ధి చెంది, ఎన్నో ఉపయోగమైన సాంఘిక చైత్నాన్ని కలిగించే పుస్తకాలు రాశారు. ముదునూరులోనే చదివి, ఇండియాలో రెండు, అమెరికాలో రెండు యూని వర్సిటీ లలో ఉన్నత విద్య నేర్చి,ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ,33 ఏళ్ళ క్రితం BREAD సంస్థ స్థాపించి ఎందరికకో విద్యనేర్పి, 1500 పైగా కళాశాలలలో ప్రత్యేక గ్రంధాలయాల స్థాపనకు కారకులు, ప్రేరకులు అయ్యారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (CMS) అనే ప్రముఖ సంస్థను స్థాపించి సమర్థంగా నడుపుతున్నారు. ప్రస్తుతం తండ్రి సీతారామయ్య గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన ఊరు ముదునూరులో సర్వజన చైతన్యం కోసం పరితపిస్తూ కృషి చేస్తున్న జ్ఞాని. అలాంటి వారు రాసిన ఈ పుస్తకం అందరికి కరదీపిక.
-గబ్బిట దుర్గా ప్రసాద్ –14-౨2-23-ఉయ్యూరు