Tuesday, January 28, 2025

మహిళామణులు

  • దయామయులూ, ప్రమాస్పదులు
  • సేవలు అందించి, వెలుగులు నింపేవారు

జ్ఞాన జ్యోతులు వెలిగించి అజ్ఞానపు చీకట్లను తొలిగించే గురువు మార్గదర్శకుడు. అట్లే, మనిషి జీవితంలో అనేక రూపాల్లో వెలుగును పంచే స్త్రీ ‘జీవన  జ్యోతి’. తల్లిగా, ఇల్లాలిగా, సోదరిగా, కోడలుగా, కుమార్తెగా ప్రతి పాత్రలోనూ ప్రేమను పంచి, సేవలు అందించి, సలహాలు ఇచ్చి జీవితంలో వెలుగులు పండించే మమతల మాగాణి మహిళ. ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఎలా ఉన్నా, భారతదేశంలో స్త్రీని శక్తి స్వరూపంగానే భావించి, గౌరవించే సంప్రదాయం తరతరాలుగా ఉంది. స్త్రీకి అన్నింటా సమాన హక్కులు ఉండాలనే పోరాటం ఆధునిక కాలంలోనే మొదలైంది. మన దేశపు గత చరిత్రను గమనిస్తే, స్త్రీకి మహోన్నతమైన స్థానమే ఇచ్చారు. బ్రిటిషర్స్ మొదలు ఎందరెందరో విదేశీయులు మన దేశాన్ని దురాక్రమించి, పాలించిన సందర్భంలోనే ఈ అసమానతలు, అణచివేతలు వచ్చాయి. ఆ దుష్ప్రభావాలతో సమాజంలో ధోరణులు మారాయి. వాటి దుష్ఫలితమే నేటి దుస్థితి. ప్రాచీన కాలంలో పురుషులతో సమానమైన హోదా, స్థాయి కలిగిన మహిళల స్థానం మధ్య యుగం నుంచే సన్నగిల్లడం ప్రారంభమైంది. ప్రతి దశలోనూ ఎందరో సంస్కర్తలు మహిళల వైపు నిల్చొని, పోరాడి, హక్కులను కాపాడే ప్రయత్నం చేశారు. అది నిరంతర స్రవంతిగా సాగుతూనే ఉంది. మన దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్,  ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నతమైన పదవులనూ మహిళలు అధిరోహించారు.

Also read: సంకురాతిరి

అది ఇది ఏమని అన్ని రంగముల…

నేడు న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, పైలెట్ లుగానూ రాణిస్తున్నారు. అధికారంలో స్త్రీలు ఉండడం మనకు కొత్త విషయం కానే కాదు. ప్రాచీన కాలంలో మహిళలు అక్షరాధికులు కూడా. భర్తను ఎన్నుకునే హక్కు వారికే ఉండేది. బాల్య వివాహ సంప్రదాయం 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. అటువంటి విధానం గతంలో లేదు. సతీ సహగమనం వంటివి కూడా ఇంచుమించుగా అప్పుడు వచ్చినవే. భర్త మరణిస్తే, తిరిగి పెళ్లి చేసుకోడాన్ని నిషేధించే విధానాలు కూడా మధ్యకాలంలో పరిణమించినవే. అనేక ఆంక్షలు మొదలైన కాలంలోనూ స్త్రీలు రాణించారు. ఢిల్లీని పరిపాలించిన రజియా సుల్తాన్ చక్రవర్తిగా ఖ్యాతిని గడించారు. గోండు రాణి దుర్గావతి పదిహేనళ్ళకు పైగా పాలించినట్లు చరిత్ర చెబుతోంది. జహంగీర్ భార్య నూర్జహాన్ మొఘల్ శక్తిగా కీర్తికెక్కింది. శివాజీ తల్లి జిజియాబాయి గొప్ప యోధురాలుగా, పాలకురాలుగా రాణకెక్కింది. దక్షిణాదిలో సైతం ఎంతోమంది మహిళలు గ్రామాలను, మండలాలను,పట్టణాలను పరిపాలించారు. మీరాబాయి భక్తి ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. అక్కమహాదేవి సాధువుగా, కవయిత్రిగా గణనకెక్కింది. మహిళల హక్కుల సాధన గురించి,మూఢ ఆచారాలకు వ్యతిరేకంగానూ ,మహిళల అభ్యున్నతి కోసం రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యా సాగర్, జ్యోతిరావు పూలే వంటివారు పోరాడి, మహిళా ప్రగతికి పాటుపడ్డారు. వీరంతా పురుషులే. పురుషులందరూ స్త్రీ వ్యతిరేకులు కారని చెప్పడానికి ఇటువంటివారిని ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు.

Also read: ఈ సారి కరోనా వల్ల ముప్పు తక్కువే!

అక్షరాస్యతలో  ప్రథములు

 “స్త్రీలకు స్త్రీలే శత్రువులు” అన్నదాన్ని కూడా కాదనలేం, అని మహిళామణులే చెబుతున్నారు. వరకట్నపు వేధింపులు, ఇంట్లో ఆధిపత్యం కోసం ఆరాటం మొదలైన అంశాల్లో ఈ మాటలు రుజువవుతున్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఝాన్సీరాణీని వీరనారిగా మనం పూజిస్తున్నాం. కాదంబినీ గంగూలి, ఆనంది గోపాల్ వంటి వారు డిగ్రీలు పొందిన తొలితరం భారతీయ మహిళామణులుగా చరిత్రకెక్కారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని అక్షరాస్యత వైపు మహిళలతో పాటు, పురుషులు కూడా అడుగులు వేశారు. అనిబిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్,సుచేత కృపలానీ, అరుణ అసఫ్ ఆలీ, రాజకుమారి అమృత కౌర్ వంటి వారు స్వాతంత్ర్య సమరయోధులుగా భారతదేశపు భాగ్య విధాతలుగా గౌరవపురస్కారాలు అందుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మహిళల అక్షరాస్యత కూడా మరింతగా పెరిగింది.  సమాన హక్కులు కల్పించడానికి రాజ్యంగంలో కూడా నిర్మాణం చేసుకున్నాం. అవకాశంలో సమానత్వం, సమానమైన పనికి సమాన జీతం, మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా చూసే చర్యలకు సంబంధించిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.

Also read: జమిలి ఎన్నికలు జరిగేనా?

చీకటి కోణాలు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పీనల్ కోడ్ లోనూ అనేక మార్పులు చేసుకున్నాం. మహిళా కమిషన్ లు నిర్మించుకున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించుకున్నాం. ఇట్లా మన దేశంలో స్త్రీకి ప్రతి చోటా హక్కు,స్వేచ్ఛ ఉండే విధంగా చూసుకున్నాం. నేడు మహిళల స్థానం సమున్నతంగా ఉంది. ఇంకా అనేక చోట్ల పెరగాల్సిన అవసరమూ ఉంది.  ఇంతటి ఘన చరిత్ర,ప్రగతి ఉన్న స్థానంలోనే, కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి.ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా, ఎంతటి సాంకేతిక అభివృద్ధిని సాధించుకున్నా, ఎంత అక్షరాస్యత పెరిగినా స్త్రీలపై వేధింపులు ఆగడం లేదు. హత్యలు తగ్గడం లేదు. వివక్షకు చరమగీతం వినిపించడం లేదు. వీటి నుంచి బయటపడిన నాడే మన నాగరికత పెరిగినట్లుగా భావించాలి. ఆర్ధిక స్వావలంబను కూడా ఇంకా పెరగాల్సి వుంది. స్త్రీ అంటే ప్రేమమూర్తి, త్యాగమూర్తి, సేవాపరాయణి.”క్షమయా ధరిత్రి” అని కూడా అన్నారు. భూమికి ఎంత సహనం ఉంటుందో స్త్రీకి కూడా అంతే సహనం ఉంటుందని దాని సారాంశం. కష్టాలు, అవమానాలు పడుతున్నా సహనంగా ఉంటోందని స్త్రీని చిన్నచూపు చూడరాదు. మనల్ని కనిపెంచింది తల్లి. మనల్ని కనిపెట్టుకొని ఉండేది ఇల్లాలు. మన కళ్ళల్లో నీళ్ళు రాకుండా చూసుకునే వ్యక్తి సోదరి. మన శ్రేయోభిలాషి మన స్నేహితురాలు. ఇంతటి మహిళలకు  ప్రగతి, స్వేచ్ఛ, అధికారం, గౌరవం ఇంకా పెరగాలి. మహిళామణులకు కృతజ్ఞతలు చెప్పుకుందాం.

Also read: లక్షద్వీప్ వైపు లక్షలమంది చూపు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles