- వేలసంఖ్యలో నిరసనల్లో పాల్గొన్న మహిళలు
- జాతీయ రహదారుల మూసివేత
- పలు మెట్రో సర్వీసులు రద్దు
దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నూతన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన వంద రోజులు పూర్తి చేసుకుంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు ఆందోళనలో పాల్గొని నిరసన చేపట్టారు. టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే జాతీయ రహదారులను మూసివేశారు. ఢిల్లీ నుంచి హర్యానా వెళ్లేందుకు సింఘు, టిక్రీ, మాన్యారి, సబోలి, మంగేష్ సరిహద్దులను మూసివేశారు.
Also Read: అన్నదాత ఆగ్రహించి వందరోజులు
కిసాన్ ఆందోళనలో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పక్కా వ్యూహంలో భాగంగా నిన్నటి నుంచే పంజాబ్ నుండి భారీ సంఖ్యలో టిక్రీ, హర్యానా సరిహద్దులకు మహిళా రైతులు చేరుకున్నారు. ఈ ఉదయానికి వేల సంఖ్యలో చేరుకున్న మహిళా రైతులు కుటుంబసభ్యులతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల ఆందోళనతో తొమ్మిదో నెంబర్, 24 వ నంబరు జాతీయ రహదారులపై తీవ్రంగా ట్రాఫిక్ జాం అయింది. ముందుజాగ్రత్తగా ఉత్తరప్రదేశ్ గేట్ వద్ద జాతీయ రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు.
వాహనదారుల ఇక్కట్లు:
ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి యూపీ వెళ్లే వాహనదారులను ఆనంద్ విహార్, డీఎన్డీ, లోని డీఎన్డీ, అప్సర మార్గాలలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. చిల్లా బోర్డర్ కూడా వాహనదారులు వేళ్లేందుకు అనుమతించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టిక్రీ కలాన్ నుంచి బ్రిగేడియర్ హోషియార్ సింగ్ మార్గంలోని మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు మెట్రో ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే రైతుల ఆందోళనను అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: నందిగ్రామ్ నుంచి మమత పోటీ