ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న పంచాయతీ ఎన్నికలు గానీ, తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవబోతున్న, గెలిచిన మహిళా సర్పంచ్ ల పాత్ర పై విశ్లేషణ చేస్తే మహిళా సాధికారిత వారికి అందని ద్రాక్ష! పంచాయతీ వ్యవస్థ గురించి వారు తెలుసుకుంటుంది శూన్యం! ప్రతి పది మందిలో ఇద్దరు మాత్రమే సర్పంచ్ పదవికి వన్నె తెస్తున్నారని…ఎనిమిది మంది భర్త చేతుల్లో కీలుబొమ్మలని గ్రామాల్లో ప్రజలు కొడై కూస్తున్నారు! గ్రామ పంచాయతీ కారొబార్లు, పంచాయతీ సెక్రటరీలు చెప్పినట్టు నడుచుకుంటూ గ్రామాభివృద్ధి పై పట్టు సాధించే లోపే ఐదేళ్ల పదవి కాలం అయిపోతుంది! వీధిలో కుళాయిలు, దీపాలు, పారిశుధ్యం, మహిళ శిశు సంక్షేమం, జనన మరణాలు, మూగజీవాలకు నీరు…పచ్చిక బయళ్ళు ఒక్కటేమిటీ ప్రజా రక్షణ బాధ్యతగా గ్రామ సచివాలయాలు ఉండాలి. రిజర్వేషన్ల వల్ల అక్షరాస్యత లేని మహిళలు వార్డు మెంబెర్లు, సర్పంచ్ లు కావడం వల్ల గ్రామీణ వ్యవస్ధ మీద వారికి అవగాహన లోపం ఉంది! చాలా గ్రామ పంచాయతీల్లో ఒక్క గ్రామ సభలో తప్ప వారికి వ్యవస్థ పై వారి పాత్ర పోషణ లో వారి భర్తలే రాజ్యమేలుతున్నారు.
భారత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి మహిళ పాత్ర గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల పాత్ర క్రియాశీలం కావడం లేదు! మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మహిళలను వారి హక్కులు, ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధి గురించి బలంగా, అప్రమత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది! భారతదేశంలో ఆరవ పంచవర్ష ప్రణాళిక (1980-85) ‘అవగాహన పెంచడం’ మరియు ‘సమీకరణ’ కు ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారత కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. 1970 లలో “మహిళల సంక్షేమం” అనే భావన నుండి 1980 లలో “మహిళల అభివృద్ధి” కు 1990 ల నుండి “మహిళల సాధికారత” కు విధానంలో ప్రధాన మార్పు జరిగింది.
ఇదీ చదవండి: ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
భారత ప్రభుత్వం 2001 సంవత్సరాన్ని మహిళల సాధికారత సంవత్సరానికి ప్రకటించింది, అయితే ఈ దశకు చేరుకోవడానికి మహిళలు పోరాటం చేశారు భారత ప్రజాస్వామ్యానికి ఇప్పుడు 74 సంవత్సరాలు! ప్రజాస్వామ్యం యొక్క విజయం మహిళలు, ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో మహిళల రాజకీయ సమానత్వం పట్ల ఆందోళన మొదట రాజకీయ సమస్యగా ఉద్భవించింది, ఇందులో జాతీయ ఉద్యమంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు. 1932 తరువాత, భారతీయ మహిళలు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహిళలు పదవులు నిర్వహించారు. 1993 సంవత్సరంలో, పంచాయతీ రాజ్ సంస్థలను రాజ్యాంగంలో భాగం చేయడం ద్వారా భారత ప్రభుత్వం ఒక విప్లవాత్మక చర్య తీసుకుంది. ఈ విషయంలో, వికేంద్రీకృత నిర్ణయం తీసుకోవడంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అయింది.
నిరక్షరాస్యత వల్ల మహిళలు చట్ట సభల్లో ప్రాధాన్యత చూపలేకపోతున్నారా? లేక పురుషాధిక్యత సమాజం మహిళలను ముందుకు రానివ్వడం లేదా ఇంట్లో ఆడ పెత్తనం చేసే మహిళలు కూడా రాజకీయాల్లో రాణించక పోవడానికి కారణం విశ్లేషిస్తే వారంటున్న మాట ఊరికి చేసిన సేవ శవానికి చేసే సహకారం ఒకటేనని అంటున్నారు…”గ్రామానికి ఎంత సేవ చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేమని, సమిష్టి బాధ్యతగా ప్రజల్లో చైతన్యం రావాలని ఒక సర్పంచ్ మాత్రమే శుభ్రత కోసం ఆరాట పడితే లాభం లేదని అందరూ తమ ఉరు అనుకొంటే ఫలితాలు ఉంటాయని గ్రామ ప్రథమ పౌరురాలుగా కఠినంగా వ్యవహరిస్తే పోలీసు కేసులు” పెడుతున్నారని సర్పంచ్ గా పనిచేసిన ఒక విద్యాధికురాలి ఆవేదన! ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితి కాదు. సమస్త భారత దేశంలో మహిళల్లో రాజకీయ అనాశక్తికి కారణం నిర్లక్ష్యం, నిరసక్తత! మహిళలు సమాజంలో సగం భాగం, కానీ వారు రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య అవకాశాల విషయంలో ద్వితీయ శ్రేణి పొరులు! అనేక సామాజిక నియమాలు మరియు నిబంధనల కారణంగా, మహిళ ముందడుగు వేయలేక పోతుంది.
ప్రస్తుతం మహిళలు రాజ్యాంగం, చట్టపరమైన నిబంధనల ప్రకారం పురుషులతో సమాన హోదాను అనుభవిస్తున్నప్పటికీ, వారికి చాలా వెనక్కు నెట్టేసేది పురుషాధిక్యత ప్రపంచం. ఇది నిజం!! “స్త్రీలు అభివృద్ధి చెందితే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది” అని నిరూపించే రాజకీయ వ్యవస్థ లేదు!! మహిళల సాధికారత సమాజ అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ‘సాధికారత’ అంటే ‘అధికారం ఇవ్వడం’ వారి స్వంత జీవితాలపై నియంత్రణ కలిగి ఉండటానికి వారికి అధికారం ఉండాలి! సమాజంలోని అణచివేత, దోపిడీ, అన్యాయం మరియు ఇతర రుగ్మతలకు సాధికారత మాత్రమే సమర్థవంతమైన సమాధానం! సంక్షిప్తంగా, మహిళా సాధికారత అంటే మహిళలకు వారి సృజనాత్మక సామర్థ్యాలను మరియు కోరికలను నెరవేర్చడానికి మరియు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం. దీనికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కోణాలు ఎన్నో ఉన్నాయి!
ఐదేళ్ల పదవీ కాలం తరువాత తమకు పదవీ రాదనే నిరాశ వాదం, తోటి స్త్రీలు రాజకీయ విమర్శలు చేయడం, ఉన్నత విద్యా వంతులైన మహిళలను తమ విజన్ కు ప్రతిబంధకాలు సృష్టించి తమ పెత్తనం సాగాలనే అధికారులు, పార్టీ లో ఘర్షణలు, గ్రామాల్లో అలజడుల వల్ల కూడా బలవంతంగా ఐదేళ్లు పదవీలో ఉంటున్నారు.. దానికి తోడు కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, అత్త మామల ఆరోగ్యం వంట పని ఇంటి పని వల్ల గ్రామ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నట్లు చాలా మంది చెబుతున్న మాట! ఆర్థిక స్థోమత లేని వారికి ఎన్ని పదవులు ఇచ్చినా ఉపయోగం లేదని, కించ పరిచే మాటలు కూడా రాజకీయం వైపు మహిళలు చూడకపోవడానికి ప్రధాన కారణం!
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే