అలవికాని పురిటి నొప్పుల పాట్లు అనుభవించి
తననుండి మరో ప్రాణికి జన్మనిచ్చే మాతృ మూర్తి
నిద్రాహారాల కంటే బిడ్డ సేవ ముఖ్యమని భావించి
అవసరమైతే భర్తను కూడా దూరం పెట్టి
బిడ్డ ఆలన పాలన చూసే కారుణ్య స్ఫూర్తి
బిడ్డ క్షేమమే తన ప్రధమ కర్తవ్యంగా భావించి
బిడ్డ ఎదుగుదలో తన ఆనందం వెతుక్కునే తల్లి
కుటుంబంలో అందరికీ ఆప్యాయత పంచే అనురాగవల్లి
గృహలక్ష్మిగా అందరికీ అన్నీ సమకూర్చి పెట్టి
తన సౌకర్యం చివరగా చూసుకునే త్యాగమూర్తి.
అన్నిటా సరిజోడీ అయి
బతుకు బండి రెండో చక్రంగా ఉంటూనే
బయటకి అడుగు పెడితే
మగవారికి తీసిపోని సమర్ధతతో
టీచర్లుగా, నర్సులుగానే కాక
ఉద్యోగాల్లో, క్రీడల్లో, వ్యాపారాల్లో
ప్రసిద్ధ సంస్థల నిర్వాహకులుగా
సైన్యం నుండి, అంతరిక్ష యానం వరకు
అన్నిటా ముందంజ వేసి సత్తా చూపిస్తున్నారు
దేశాల్ని ఏలుతున్నారు.
వంటింటి కుందేలు అన్న మాటను
జనం మరచి పోయేలా చేశారు.
కాని ఇటీవలే పొందిన సాంఘిక స్వాతంత్ర్యంతో
కొత్తగా లభించిన ఆర్థిక స్వాతంత్ర్యంతో
అదపు తప్పి మర్యాదలను వ్యతిరేకించడం
పురి విప్పిన విప్లవ భావనలతో
బంధాలను తేలికగా భావించడం
గృహ వాతావరణాన్ని ఛిద్రం చేసుకోవడం
అక్కడక్కడా చూస్తున్నాం.
లోలకం ఈ చివర వదిలితే
అ చివరకు పోవడం సహజం
కాస్త సమయం గడిస్తే నిలకడ వస్తుంది.
అప్పుడు ఆడ, మగ సమస్యలు
ఇంటి, బయటి సమస్యలు అన్నీ సర్దుకుంటాయి
అంతా వరకు ఓపిక పట్టడం తప్పదు.
సహనానికి ప్రతిరూపమైన స్త్రీ
ఈ ప్రయాణంలో త్వరలోనే గమ్యం చేరి
అందరం ఆనందంగా ఉంటామని ఆశిద్దాం.
Also read: “యుగ సామ్రాట్ గురజాడ”
Also read: ‘‘శాంతి’’
Also read: “కర్మ భూమి”
Also read: మోహం
Also read: “తపన”