పెళ్లాయ్యాక అమ్మాయిని `ఆడ`పిల్ల అంటారు. కానీ ఈమె `ఈడ` పిల్లే అనిపించు కోవాలనుకున్నట్లుంది. చాలా మంది అమ్మాయిలు పుట్టింటి సొమ్ము ఆశిస్తారు. ఈమె అందుకు భిన్నంగా అత్తింటికే కన్నం వేసింది. కారణం తల్లికి అప్పుల తిప్పలు. ఆమె చేసిన పని త్యాగమనుకోవాలో! తెలివి తక్కువ అనుకోవాలో తెలియదు. నీతులు చెప్పాల్సిన తల్లే గోతులు తీయించి, కూతురు కాపురానికి సమాధి కట్టేలా చేసింది.
హైదరాబాద్ లోని యాప్రాల్ కు చెందిన యువతి అత్తింట్లోనే చోరీ చేసి పోలీసులకు పట్టుబడింది. నాలుగేళ్ల క్రితం రూ. 30 లక్షల ఖర్చుతో కూతురి పెళ్లి చేసిన తల్లి ఆర్థిక ఇబ్బందులు పడుతూ,ఇప్పుడు ఆ మొత్తంలో కొంతైనా అల్లుడి ఇంటి నుంచి రాబట్టుకోవాలని పథకం వేసింది. చోరీ జరిగిన ఈ నెల 23వ తేదీకి నాలుగు రోజుల ముందే ఆ యువతి పుట్టింటికి చేరింది. 23న అత్తింటి వారు ఒక శుభకార్యానికి వెళ్లడం గమనించి తల్లీకూతుళ్లు పథకం అమలుకు దిగారు. కూతురు బురఖా ధరించి, మారుతాళంతో ఇంట్లోకి వెళ్లింది. 44 తులాల బంగారం,15 తులాల వెండి, రూ.10,500 నగదు తీసుకుంది. ఇంట్లో దోపిడీ జరిగిందని నిరూపించేలా బీభత్స వాతారణం సృష్టించి ఇంటి వెనుక తలుపు నుంచి పరారైంది. కుటుంబ యజమాని ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు ఫుటేజీ పరిశీలించినప్పుడు తీగ దొరికింది. దరిమిలా డొంక కదిలింది.
ఏదో అనుకుంటే..ఏదో అయ్యింది. ఔనూ…! దీనికంటే ఆ యువతి భర్తను ప్రసన్నం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దకోవచ్చు కదా! అంటారా. అదే ఉంటే ఇంతదాకా ఎందుకు వస్తుందీ…??