ఆ యింటి ముందుకు రాగానే
రోడ్డు ఓ క్షణం
వినమ్రంగా ఆగి చూస్తుంది.
అక్కడున్నది
హోదాలు వెలిగించిన
సెలెబ్రిటీ అని కాదు.
ఆ ప్రదేశం
అపురూప పుష్పాల గంధకుటి అనీ కాదు.
బాల్కనీలో ఒక మూలన
ఎప్పుడూ ఆసీనుడై ఉండే అతి సామాన్యుడు.
కింద వీధిలో
వచ్చి పొయ్యే వారిని
ఆప్యాయంగా పలకరిస్తాడు.
డిసెంబర్ చలిలో కూడా
తొణకని నెగడులా జ్వలిస్తాడు.
మొన్నటి కర్ఫ్యూలో
పక్కన తొట్టిలోని తులశాకులతో
ఏం సంభాషించాడో తెలియదు.
రాత్రి పూట
ఆయన అక్కడ లేకున్నా
ఆ ఖాళీలో ఆయన రూపం
కదుల్తున్నట్టే వుంటుంది.
ఆ వీధిలో
ఏ విపరీతం జరిగినా
ఆయన దృష్టికి రాకుండా వుండదు.
పొద్దున వీధులూడ్చే వాళ్లు
సూర్య దర్శనం కోసం
బాల్కనీ వైపే చూస్తారు.
భయం భయంగా
దిక్కులు చూస్తూ నడిచే
ప్రేమికుల్ని ఆయన
ముచ్చటగానే పరికిస్తాడు
ఆశీర్వదిస్తాడనుకుంటాను.
రాత్రి పూట
తాగుబోతులు క్షేమంగా
ఇల్లు చేరాలనుకుంటాడు.
మా వీధిలో ఎవరైనా మరణిస్తే
మొదటి కన్నీటి చుక్క ఆయనదే.
ఆయనకు
ఒంటరితనమే లేదు
ఉద్యోగంలో ఉన్నప్పుడు
ఎంత గ్రహించాడో గాని
ఇప్పుడతని నిశ్చల గతి నిండా
ఒక విలక్షణ పరిణతి.
ఎంతటి చిక్కు సంగతులనైనా
గింతే అని తేల్చేసే జ్ఞాన యతి.
మన కులం కాదు స్థలం కాదు
చుట్టం కాదు పక్కం కాదు
ఎట్లా వీలయ్యిందో గాని
ఒక విముక్త మానవుని పురోగతి.
ఒక అతీతమైన ఆత్మీయతను
అందరి మనసులకూ
రుచి చూపిస్తున్న జనజీవన తాత్విక శ్రుతి.
ఎందుకో
ఇవాళ పొద్దున అటువైపు చూస్తే
అక్కడ ఆయన లేడు.
కాఫీ పొగలు లేవు
ముడుచుకున్న న్యూస్‌పేపర్
ఇంకా విప్పార లేదు.
పైన మేఘాలు
కళ్లు తుడుచుకుంటున్నాయి.
మిత్రులారా!
జీవితంలో ఇంతటి శూన్యాన్ని
నేనెప్పుడూ మొయ్య లేదు.
Also read: దస్తి
Also read: కవి సమయం
Also read: ఆల్బం
Also read: అడుగులు
Also read: వంటిల్లు