గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఓటర్లకు మద్యం ఎర వేయకుండా ఉండేందుకు ఈ సాయంత్రం (ఆదివారం) ఆరు గంటల నుంచి ఎల్లుండి (మంగళవారం) సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఈ సమాచారం ముందే అందిందా అన్నట్లు నగరంలో నిన్న సాయంత్రం నుంచే మద్యం ప్రియులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా ఆబ్కారీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని చెబుతున్నారు. పెద్ద ఎత్తున మద్యాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం మేరకు చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.