తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం సాయంత్రం కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపైన చేసిన వ్యాఖ్యలతో ఇబ్బంది లేదు. బడ్జెట్ లో మెచ్చుకోవాల్సిన అంశాలు పెద్దగా లేవు. రాష్ట్రాలు తప్పుపట్టవలసిన అంశాలు చాలా ఉన్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలపైన విమర్శలకు పరిమితమై ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కాకపోతే కేసీఆర్ ఉపయోగించిన భాష అభ్యంతరకరమైనది. ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి నేలబారు భాషని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఉదాత్తమైన భాషలోనే అభ్యంతరాలు వెలుబుచ్చితే ఒక ముఖ్యమంత్రి హోదాకు తగినట్టుగా ఉంటుంది. కానీ బడ్జెట్ కాకుండా ఇతర విషయాలను గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరం.
సమాఖ్య స్ఫూర్తిని బలపరచాలని అంటే అందరూ స్వాగతించేవారు. మోదీని వ్యతిరేకిస్తున్నవారంతా సరే పదండి ముందుకు అనేవారు. రాష్ట్రజాబితా, కేంద్ర జాబితా ఉంటే చాలు ఉమ్మడి జాబితా (కాంకరెంట్ లిస్టు) ఉండనక్కరలేదు అని ఉద్ఘాటించినా అర్థం చేసుకునేవాళ్ళం. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటినీ కేంద్రీకృతం చేయడం ఎక్కువైన మాట నిజం. అంతకు కిందట కాంగ్రెస్ కు కూడా ఆ ధోరణి ఉండేది కానీ రాష్ట్రాలు అభ్యంతరం చెబితే వెనుకంజ వేసేది. సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాలన్నా ఎవ్వరూ కాదనేవారు కాదు. కానీ రాజ్యాంగాన్నే మార్చాలనడం, అందుకోసం రాజ్యంగ నిర్మాణసభ (కాన్ స్టిట్యుయెంట్ అసెంబ్లీ)ని ఏర్పాటు చేయాలనడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. రాజ్యాంగ నిర్మాణం అంటే ఒక అంచనా ఉంటే కేసీఆర్ ఆ విధంగా మాట్లాడేవారు కాదు. రాజ్యాంగసభలో ఎవరు ఏమి మాట్లాడారో, ఉమ్మడి జాబితా విషయంలో ఎంత తర్జనభర్జన జరిగిందో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏమి చెప్పారో తెలుసుకొని ఉంటే కేసీఆర్ అంత అడ్డగోలుగా మాట్లాడేవారు కాదు. రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ అంబేడ్కర్ స్వయంగా చెప్పిన మాటలు రాజ్యాంగ స్పృహ ఉన్నవారందరికీ తెలిసిందే.
రాజ్యాంగం అన్ని రకాలా ఆధునికమైనదీ, సమగ్రమైనదీ, కానీ రాజ్యాంగాన్ని అమలు పరిచే నాయకులు పెడధోరణులు కలవారైతే రాజ్యాంగం విఫలమౌతుందని అర్థం వచ్చే రీతిలో అంబేడ్కర్ హెచ్చరించారు. రాజ్యాంగాన్ని సవరించకుండానే దాన్ని భ్రష్టుపట్టించే అవకాశాలు ఉన్నాయి. కనుక రాజ్యాంగాన్ని మార్చేవేయాలని అనడం కంటే రాజ్యాంగాన్ని అమలు చేసేవారి బుద్ధులు మారాలని అంటే సమంజసంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంబేడ్కర్ నీ, నెహ్రూనూ, పటేల్ నూ, రాజేంద్రప్రసాద్ నూ, తదితర రాజ్యాంగ నిర్మాతలనీ పూర్వపక్షం చేసినట్టే అవుతుంది. జాతీయ స్థాయిలో ఒక పాత్ర పోషించాలని కేసీఆర్ కి ఉండటం కూడా ఆక్షేపణీయం కాదు. సాధ్యమైతే కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేయవచ్చు. లేదా ఆ దిశగా ప్రయత్నించవచ్చు. దానికీ అభ్యంతరం లేదు.
మనం ఇంతవరకూ 115 విడతల రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎన్నిసార్లయినా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ కేంద్రీకరణకు పూనుకుంటున్నది. కృష్ణ, గోదావరి నదులనూ, వాటిపైన ఉన్న ప్రాజెక్టులనూ స్వాధీనం చేసుకుంటూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సమీక్షను సైతం కేసీఆర్ కోరవచ్చు. డిమాండ్ చేయవచ్చు. అటువంటి కమిషన్ ను వాజపేయి ప్రభుత్వం 2000 ఫిబ్రవరిలో జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన నియమించింది. అందులో జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ పున్నయ్య, జస్టిస్ సర్కారియా, న్యాయవేత్తలు సోలీ సొరాబ్జీ, పరాశరన్ వంటి హేమాహేమీలు సభ్యులుగా ఉన్నారు. అటువంటి కమిషన్ నే నియమించాలని అడగవచ్చు. కానీ రాజ్యాంగం మార్చడం అన్నది మింగుడుపడని విషయం. అసమంజసమైన, ప్రమాదరకరమైన ఆలోచన.
బాగుంది
బాగుంది