డాక్టర్ పద్మలతా అనుసూరి
మహిళా వైద్యులు రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థులవుతారా?!
వోలేటి దివాకర్
ఆమధ్య రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో ఒక వైద్యాధికారి కాబోయే మేయర్ కు శుభాకాంక్షలు అంటూ ఒక మహిళా వైద్యురాలిని ఉద్దేశించి ఒక సందేశం పంపారు. ఆ సందేశం వైద్యవర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది. గతంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఎంఓగా పనిచేసిన డాక్టర్ పద్మశ్రీని ఉద్దేశించి వైద్యాధికారి ఈ సందేశం పంపారు. ఆనాటి నుంచి వైద్యవర్గాల్లో రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థుల రేసులో తరుచూ పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. పద్మశ్రీ భర్త డాక్టర్ రామరాజు ప్రముఖ కార్డియాలజిస్టుగా, రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రి నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. పద్మశ్రీ సోదరి వాకా కృష్ణశ్రీ టిడిపి మాజీ కార్పొరేటర్ గా పనిచేసారు . ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా పద్మశ్రీ పేరు జోరుగా వినిపిస్తోంది . కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన పద్మశ్రీకి టిడిపిలోని ఆదిరెడ్డి అప్పారావు వర్గం మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు . బిసి సామాజిక వర్గానికి చెందిన రామరాజును, వాకా కృష్ణ శ్రీని దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కూడా పద్మశ్రీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. పద్మశ్రీ ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి అని అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం మేయర్ స్థానాన్ని జనరల్ కు కేటాయించడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన , గోరంట్లకు బంధువైన యర్రా వేణుగోపాలరాయుడు కూడా మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండటం గమనార్హం .
పద్మశ్రీకి పోటీగా పద్మలత?
మరోవైపు వైసిపి తరుపున మరో వైద్యురాలు డాక్టర్ అనసూరి పద్మలత పేరు వినిపిస్తోంది . బిసి సామాజిక వర్గానికి చెందిన పద్మలత భర్త శ్రీనివాస్ కూడా వైద్యుడే. 2007 లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలిచారు. ఆ తరువాత టిడిపి కొద్దికాలం కొనసాగి అనంతరం వైసిపిలో చేరారు. 2007 లో బిసి మహిళకు మేయర్ సీటును కేటాయించడంతో ఆ సమయంలో కూడా మేయర్ అభ్యర్థిగా పద్మలత పేరు వినిపించింది. పద్మలత తండ్రి బొక్కా సూర్యారావు రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆయన వారసత్వాన్ని అందుకుని, సామాజికంగా, రాజకీయాల్లో రాణించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. పద్మలతకు పోటీగా గత ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని ఆశించిన రుడా చైర్మన్ ఎం షర్మిలారెడ్డి కూడా మేయర్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన సతీమణి పేరు కూడా మేయర్ రేసులో వినిపిస్తోంది. ఆమె కూడా వైద్యురాలు కావడం విశేషం. పద్మలతకు ఎంపి మార్గాని భరత్ వర్గం మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి .
మహిళలు మేయర్ గా హ్యాట్రిక్ సాధిస్తారా?
కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలన్నీ మేయర్ అభ్యర్థులుగా మహిళలను బరిలో దించితే వరుసగా మూడుసార్లు మహిళలే రాజమహేంద్రవరం మేయర్ పీఠాన్ని అధిష్టించినట్టు అవుతుంది. 2007 , 2014 ఎన్నికల్లో ఆదిరెడ్డి వీరరాఘవమ్మ , పంతం రజనీశేషసాయి మేయర్ గా ఎన్నికయ్యారు . ప్రధాన పార్టీలు మహిళలనే మేయర్ అభ్యర్థులను బరిలోకి దించుతాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహిళా మేయర్లు హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు.