Thursday, November 21, 2024

పాదయాత్రలన్నీ జైత్రయాత్రలు కాగలవా?

  • గాంధీజయంతినాడు బీహార్ లో పీకే ప్రారంభించిన జన్ సూరజ్ యాత్ర
  • వినోబా తర్వాత చంద్రశేఖర్ అవిశ్రాంత పథికుడు

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ‘జన్ సూరజ్’ పేరుతో తన స్వరాష్ట్రమైన బీహార్ లో పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. దానికి మహాత్మాగాంధీ జయంతి రోజును ఎంచుకున్నాడు. అంతే కాదు, 1917లో గాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బితిహర్వాను ఎంచుకున్నాడు. సుమారు 12 నుంచి 18 నెలల కాల వ్యవధిలో 3,500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చెయ్యాలని సంకల్పం చేసుకున్నాడు. మహాత్మాగాంధీని ప్రేరణగా తీసుకోవడం అభినందనీయమే. కాకపోతే, ఈ ఇరువురి మార్గాలు, లక్ష్యాలు వేరు. దేశభక్తి పునాదులపై గాంధీ నడక ప్రారంభించారు. రాజకీయ అధికార స్వార్థంతోనే ప్రశాంత్ కిషోర్ ఈ యాత్ర చేపట్టాడని అందరికీ అర్థమవుతూనే ఉంది. బ్రిటిష్ వారి నుంచి స్వరాజ్యం పొందడం కోసం మహాత్ముడు సంకల్పం చేసుకున్నాడు. ఈయన  జన సురాజ్యం కోసం అంటున్నాడు. కలిపురుషులు ముదురుతున్న ఈ కాలంలో సురాజ్యం సాధ్యమా? అన్నది ప్రశ్న.

Also read: వీరవిధేయుడు ఖర్గేకే పార్టీ పగ్గాలు

ఆరుద్ర ఏనాడో వాపోయాడు

“గాంధి పుట్టిన దేశమా ఇది -నెహ్రు కోరిన సంఘమా ఇది – సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా… ” అంటూ ఎప్పుడో యాభైఏళ్ళ క్రితమే ఆరుద్ర వాపొయ్యాడు. ఇప్పటికీ అదే నాదం సత్యమై వినిపిస్తోంది. ఎన్నో పాదయాత్రలు చరిత్ర సృష్టించాయి. ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు, అవధూతలు వారు చేసిన, చేస్తున్న పాదయాత్రల స్వరూప స్వభావాల తీరు వేరు. భూదాన ఉద్యమంలో వినోబాభావే చేసిన పాదయాత్ర కూడా సుప్రసిద్ధం. ఇక రాజకీయ నాయకులు చేస్తున్న పాదయాత్రలు ప్రస్తుతం చర్చనీయాంశం. 1983 ప్రాంతంలో చంద్రశేఖర్ సింగ్ కన్యాకుమారి నుంచి హస్తినాపురి వరకూ 4,260 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. సుమారు 18 నెలల కాలం పట్టినట్లు ఉంది. ప్రజల  సమస్యలను అర్థం చేసుకుంటూ సాగిన ఆ యాత్ర విజయవంతమైంది. సహజంగానే ఆయన అప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాజకీయంగా ఆయనకు వెనువెంటనే అద్భుతమైన ఫలితాలు ఏమీ రాలేదు. తర్వాత ఎప్పుడో 7ఏళ్ళ తర్వాత 1990 ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఎంపికయ్యే అవకాశం వచ్చింది. కొన్ని నెలలు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు.  ఆయన చేసిన పాదయాత్రకు – ప్రధానిగా ఎంపికకు ఏ మాత్రం సంబంధం లేదు. అది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది మాత్రమే. తర్వాత చాలామంది, ముఖ్యంగా మన తెలుగు నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నీ వారిని చాలావరకూ విజయయాత్రలకు చేర్చాయి. వై ఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలు సత్ఫలితాలను ఇచ్చాయి. రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి తండ్రికొడుకుల ఇద్దరి పాదయాత్రలు చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యురాలు షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతాయో రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తాయి.

Also read: కరవుకాలం దాపురిస్తోందా?

భారత్ జోడో యాత్రలో రాహుల్

‘భారత్ జోడోయాత్ర’ పేరుతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర మొదలు పెట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్లు లక్ష్యంతో రాహుల్ యాత్ర సాగుతోంది.  ప్రజలతో మమేకమవుతూ, వారి సాధకబాధకాలను తెలుసుకుంటూ, అధికార పార్టీపై విరుచుకు పడుతూ, తన పార్టీ గళాన్ని బలంగా విప్పుతూ రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర ఎటువంటి ఫలితాలను ఇవ్వనుందో కాలంలోనే తేలాల్సివుంది. తాను పార్టీ అధ్యక్షస్థానంలో కూర్చోకపోయినా, పార్టీ చక్రాలు ‘వారి’ చేతుల్లోనే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. రాహుల్ చేస్తున్న యాత్రల వల్ల వ్యక్తిగతంగా తనకు, పార్టీకి కూడా ఎంతోకొంత ప్రయోజనకారిగా నిలుస్తుందని అంచనా వేయవచ్చు. వేలాదిమంది ప్రజలతో నేరుగా మాట్లాడడం, వినడం, వారి సమస్యలు,  ఆలోచనలు, అభిప్రాయాలు స్వయంగా తెలుసుకోవడం మంచి ప్రక్రియ. పూర్వం రాజులకాలంలో రాజులు, మంత్రులు మారువేషాలు వేసుకొని ప్రజల మధ్య సంచరిస్తూ తమ పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనేవారు. ప్రజలనాడిని పసిగట్టడానికి, తమ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని శక్తివంతంగా మలుచుకోడానికి పాదయాత్రలు అద్భుతంగా పనికొస్తాయి. తమ ప్రవర్తన,పలకరింపులు, ప్రసంగ విన్యాసాలతో జన సమూహాన్ని ఆకట్టుకొనే గొప్ప అవకాశం వస్తుంది.

Also read: ‘సుకవి’ జాషువా

చరిత్ర తెలిసిన ప్రశాంత్ కిశోర్

ఈ చరిత్ర, ప్రభావం, ఫలితాలు తెలిసిన తెలివైనవాడు ప్రశాంత్ కిషోర్. ఎందరో రాజకీయ నాయకులను, ఎన్నో పార్టీలను తన వ్యూహ ప్రతివ్యూహాలతో నడిపి విజయతీరాలకు చేర్చిన గడసరి ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తలు, సలహాదారులు మొదటి నుంచీ ఉన్నారు. కాకపోతే వారంతా అంతర్గతంగా ఉండేవారు. ఇలా ప్రత్యేకమైన వ్యవస్థ, కార్పొరేట్ తరహా నిర్మాణం ప్రశాంత్ కిషోర్ తోనే ఊపందుకుంది. ఆయన సలహాలు వైఫల్యం చెందిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఎక్కువ శాతం విజయాలు నమోదు కావడం వల్ల ఈ రంగంలో అప్రతిహతంగా వెలిగిపోయాడు. కేవలం సలహాదారుడిగానే మిగిలిపోకుండా రాజకీయ అధికారాన్ని కూడా చేపట్టి దేశంలో పాలనలో చక్రం తిప్పాలని ఆయన చూస్తున్నాడు. గతంలో తన సొంత రాష్ట్రంలో నితీష్ కుమార్ పార్టీ ‘జనతాదళ్ (యు)’ తో కొంతకాలం కాపరం చేశాడు. అతని తీరు తెన్నులు నచ్చక పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి తెచ్చుకున్నారు. మొన్నామధ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకమైన పాత్రను పోషించాలని అనుకున్నాడు. అది ముందుకు సాగలేదు. శరద్ పవార్ వంటి ఉద్దండనాయకుడితో కలిసి ‘ప్రత్యేక పక్షం’ స్థాపించే దిశగానూ కొంత ప్రయత్నం చేశారు. నరేంద్రమోదీకి వ్యతిరేకంగా / ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థను నిర్మించాలని పదే పదే చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రశాంత్ కిషోర్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

Also read: భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?

జగన్, స్టాలిన్ లను గెలిపించింది ఇతగాడే

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలుపుగుర్రం ఎక్కించిన సలహాదారుడిగా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండబోనని, సొంత పార్టీ స్థాపిస్తానని గతంలోనే ప్రకటించాడు. ప్రస్తుత పాదయాత్ర విషయానికి వస్తే, తాను స్వయంగా కొత్త పార్టీని స్థాపించబోయే ముందు చేస్తున్న ‘ట్రయల్ రన్’ గా భావించాలి. విరామం లేకుండా బీహార్ లోని ప్రతి పంచాయతీలో ‘జన్ సురాజ్’ యాత్ర సాగితీరుతుందని ప్రశాంత్ అంటున్నారు. తన యాత్రలో ప్రజల ఆలోచనలు, నిర్ణయం మేరకే తన తదుపరి అడుగులు ఉంటాయని ఆయన అంటున్నారు. రాజకీయాల్లో సంస్కరణలు, విలువలు, గౌరవాలు, దేశానికి, ప్రజలకు అచ్చంగా, స్వచ్ఛంగా జరిగే ప్రయోజనాల సంగతి అటుంచుదాం. నేటి రాజకీయాల తీరుతెన్నులు, గెలుపుఓటముల సూత్రాలు బాగా ఎరిగిన ఆధునిక మేధావి ప్రశాంత్ కిషోర్. దాదాపుగా అన్ని ముఖ్య జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సలహాదారుడిగా పనిచేసి తన రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. తెలివైన, ఉత్తమ ఫలితాలు వచ్చే విద్యార్థులకు సీట్లు ఇచ్చే విద్యాశాలల వలె, గ్యారెంటీగా గెలుస్తారని నమ్మకున్న వాతావరణంలో ఉన్న నాయకులు / పార్టీల చెంతనే సలహాదారుడుగా చేరతారనే విమర్శలు కూడా ప్రశాంత్ పై ఉన్నాయి. గెలుపు సూత్రం తప్ప వేరే సిద్ధాంతమే లేని వ్యూహాలు, విధానాల వల్ల రాజకీయాల్లో, పాలనలో కొత్త సంస్కృతి ప్రభవిస్తోందని, అది భవిష్యత్తులో అనేక రకాలుగా దేశానికి చేటు తెస్తుందని, దానికి మూలం ప్రశాంత్ కిషోర్ బృందం నిర్మిస్తున్న విధానాలే అనే విమర్శలు కూడా వున్నాయి. ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఈ పాదయాత్ర విజయయాత్ర అవుతుందా, లేదా? చూద్దాం.

Also read: మన రాజనీతి, యుద్ధనీతి మనవి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles