Thursday, January 2, 2025

విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంపూర్ణంగా రంగం సిద్ధమైపోయింది. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజా సంఘాలు, యావత్తు ఆంధ్రజగతి ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు. ప్రైవేటీకరణ ద్వారానే ప్రగతిరథ చక్రాలు పరుగులెత్తుతాయానే విశ్వాసంతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే చాటిచెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వపు మెడలువంచే బలం  మన పార్టీలకు లేనేలేవన్నది చేదునిజం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామనే అంశం కంటే, దీన్ని అడ్డం పెట్టుకొని సొంత ప్రాపకం పెంచుకోవడం, సొంత రాజకీయాలు చేసుకోవడం, అధికార, విపక్షపార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే సరిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

లక్ష్యం వైపు నిజాయతీగా

విద్యార్థులు,యువత, కొన్ని ప్రజాసంఘాలు,మేధావులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు లక్ష్యం వైపు నిజాయితీగానే ఉన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాయడం,తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్షకు దిగడం, గంటా శ్రీనివాస్ రాజీనామాను ప్రకటించడం, స్థానిక బిజెపి నేతలు మద్దతును ప్రకటించడం, జనసేన నేత పవన్ కళ్యాణ్  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడడం అభినందనీయమే. ఇవన్నీ ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది అనుమానమే. ప్రస్తుతం జరుగుతోన్న ఉద్యమాలను చూస్తుంటే ఒక్కొక్కరూ ఒక్కొక్క దుకాణం పెట్టుకొన్నట్టుగానే ఉంది. ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్న నాయకుల పట్ల ప్రజా విశ్వాసం అంతంత మాత్రమే. నిజాయితీని నింపుకొని, ప్రజల్లో విశ్వాసాన్ని,కేంద్ర ప్రభుత్వానికి భయాన్ని కలిగించిననాడే ఈ ఆందోళనలకు అర్ధం చేకూరుతుంది,  ప్రజా ప్రయోజనం నెరవేరుతుంది.

Also Read : విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే

తెలుగువారి ఉమ్మడి ఆస్తి

ఈ స్టీల్ ప్లాంట్ సాంకేతికంగా విశాఖపట్నంలో ఉన్నప్పటికీ, ఇది కేవలం ఉత్తరాంధ్రకే సంబంధించింది కాదు. ఇది ఆంధ్రుల ఉమ్మడి ఆస్తి. ఈ ఉక్కుపై మనందరికీ హక్కు ఉంది. అప్పుడు, తేన్నేటి విశ్వనాథం వంటి సత్ శీలురు, అమృతరావు వంటి దేశభక్తుల నాయకత్వంలో ఉద్యమం ఉప్పెనై ఎగిసింది. వీరిపై ఉండే అచంచలమైన విశ్వాసంతో ఆంధ్రప్రజ యావత్తు వీరితో కలిసి నడిచింది. ఇందిరాగాంధీ వంటి ఉక్కుమహిళ కూడా దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్, ప్రకటన, స్థాపన నాటి కేంద్ర ప్రభుత్వాలకు అనివార్యమైంది.

రాజీనామాలకు విలువున్న కాలమది

ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అప్పటి ఎంపీలు, ఎంఎల్ఎలు ఎందరో రాజీనామాలు చేశారు. ఐనప్పటికీ కేంద్రం కరుగలేదు. నిజంగా,రాజీనామాలకు ఆ కాలంలో విలువ ఉంది. ఆ నాయకుల పట్ల విశ్వాసం ఉంది. నేటికాలపు రాజీనామాలకు ఎటువంటి విలువ వుందో, ఏ మాత్రం ఫలితాలు వచ్చాయో, నిన్నటి సమైక్యాంధ్ర ఉద్యమమే పెద్ద ఉదాహరణ.

Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి: ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ

ఉప్పెనలా ఎగసిన ఉద్యమం

నాటి ఉక్కు ఉద్యమ కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తప్ప, మిగిలిన పార్టీలన్నీ ఉద్యమాన్ని హోరెత్తించాయి. ప్రజా ఆగ్రహం పోటు అంతకు మించిన స్థాయిలో ఉంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు దిగిరాక తప్పలేదు. ఆ స్ఫూర్తి నేడూ కావాలి. అంతకంటే ఇంకా ఎక్కువే కావాలి. 1966లో ఉద్యమం ప్రారంభమైతే, ప్లాంట్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యేసరికి దశాబ్దాల కాలం పట్టింది. మూడు దశాబ్దాల కాలం కూడా పూర్తిగా నిండకముందే నూరేళ్లు నిండేట్టు చేస్తున్నారు. నాటి ఉద్యమకాలంలో రాజీనామా చేసినవారిలో పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులు, గౌతు లచ్చన్న వంటి దిగ్గజాలు ఉన్నారు. అటువంటివారు నేడు దివిటీ పట్టి వెతికినా ఒక్కరూ కానరారు.

ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయం

ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. మేధావులు, నిపుణులు కూడా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లాభాలబాటలో నడపడానికి బోలెడు తోవలు ఉన్నాయి. వాటిన్నంటినీ వడిసిపట్టుకుంటే సమస్య పరిష్కారమైనట్లే అని అందరూ ఘోషిస్తున్నారు. ఈ ఘోష కేంద్రం విని తీరాలి.  కలసికట్టుగా సాగి వినేట్టు చేయాలి. “రౌతు మెత్తనైతే, గుర్రం మూడు కాళ్ళమీద నడుస్తుంది” అన్నది పాత సామెత. పార్టీలకు అతీతంగా, మన నాయకులు బలహీనులని అనేకసార్లు నిరూపించుకున్నారు. ఇటువంటి వాతావరణంలో, ఒడిస్సా నాయకులు, కేంద్రంలో పెద్దలు, పారిశ్రామిక వేత్తలు, అధికారులు, వారేమి వీరేమి? అందరూ మనమీద పెత్తనం చేస్తారు. ఈ అంశంపై రచ్చ చేయడం శుద్ధ వృధా. పర్యవసానాలు అలోచించండి ప్రభూ… అంటున్నారు ప్రజలు.

Also Read : విశాఖ ఉక్కు : ఉపాధి కోసమే కాదు….`ఆత్మాభిమానం`

కార్మిక సంఘాల ఆగ్రహం

పోస్కోతో ఎప్పుడో ఒప్పందం జరిగిందనీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలుసనే వార్తలు దుమారం రేపు తున్నాయి. పోస్కోతో ఎటువంటి ఒప్పందం జరగలేదని కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్రప్రధాన్ కార్మిక సంఘాలతో చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని వామపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. దీని వల్ల నైతిక మద్దతు, రాజకీయ సంకేతం ఇవ్వడం మినహా, ఏ మేరకు ప్రతిఫలం ఉంటుందో చెప్పలేం.

సమాఖ్యస్పూర్తికి విరుద్ధం

రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి పెద్ద నిర్ణయాలు జరగడానికి అవకాశమే లేదని కొందరు వాదిస్తున్నారు. నిజానిజాలు ప్రభుత్వానికే తెలియాలి. నిజంగా ప్రభుత్వానికి ముందే తెలిసి, దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యకపోతే అది పెద్ద తప్పే. ఈ విషయం ఇలా ఉంచగా, ఇంత పెద్ద నిర్ణయం తీసుకొనేముందు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం చాలా ఆక్షేపణీయం. ఇది  ఫెడరల్ విధానానికి పూర్తిగా భంగం కలిగించే అంశం. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పాతరేసినట్లే. దక్షిణాదిలో విస్తరించాలనే కోరికతో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్ కు ఇంత అన్యాయం చేస్తే ప్రజలు క్షమించరు. ఇన్నేళ్ల పార్టీ ప్రయాణంలో, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎదుగుదల నామమాత్రం.

Also Read : మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

పుట్టగతులు ఉండవు

ఇటువంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో పుట్టగతులు కూడా ఉండవని ఆంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం తొలి అడుగు వేసిందని వైసిపీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం కేంద్రంతో, పోస్కోతో కుమ్మక్కయిందని టిడిపి నేతలు దుమ్మెత్తుతున్నారు. ఇటువంటి మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, మీడియాలో పబ్లిసిటీ కొట్టేయడం తప్ప. ప్రస్తుతం విశాఖపట్నంకు, అక్కడక్కడా ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఉద్యమం ఢిల్లీని తాకాల్సిందే. కేంద్రం దిగి రావాల్సిందే. స్టీల్ ప్లాంట్ ను మనం కాపాడుకోలేకపోతే మనం చేవ చచ్చినవారిగానే మిగిలిపోతాం. ఉక్కు సంకల్పమే శరణ్యం.

Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles