Thursday, November 21, 2024

విశాఖ ఉక్కు దక్కదా?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగవంతం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రక్రియను అధికారికంగా నడిపించడానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారుల సన్నాహాలు ఊపందుకున్నాయని కథనాలు వస్తున్నాయి. అది నిజమేనని చెప్పడానికి తాజా పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అదే నిజమైతే  విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను మనం పోగొట్టుకుంటున్నట్లే భావించాలి. లావాదేవీలను జరిపించడానికి సలహాదారులను నియమించే పనిలో కేంద్ర అధికారులు నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. న్యాయ సలహాదారు, లావాదేవీల సలహాదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే,  ప్రైవేటీకరణ క్రతువు వేగం పుంజుకుంటుందని మనం అర్ధం చేసుకోవాలి.

Also read: ‘మా’లో సమష్టితత్వం

ఉక్కు మంత్రిత్వ శాఖ ఉరుకులు

 గత నెలలో దిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ అఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్ మెంట్ విభాగం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర సంబంధిత విభాగాలకు చెందిన కీలక అధికారుల భేటీ  జరిగింది. సమావేశ వివరాలు బయటక పొక్కకుండా జాగ్రత్తపడినా, ఏదో రూపంలో ఉక్కు ఉద్యోగులకు ఈ సమాచారం చేరింది. దీనితో  ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విన్నపాలు గాలికిపోయినట్లేనా? అని ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేపట్టకుండానే, లాభాల్లో నడిపించడానికి ఎన్ని దారులు ఉన్నాయో వాటన్నింటినీ వివరిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు ప్రధానమంత్రికి లేఖలు రాశారు. వైసిపి, తెలుగుదేశం పార్టీ  సభ్యులు ఉభయ సభల్లో అనేకసార్లు తమ గొంతును వినిపించారు. నిరసనలు ప్రకటించారు. ఆర్ధిక, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందు ఉంచారు. వీటన్నింటిని తుంగలో తొక్కుతూ కేంద్రం ముందుకు వెళ్లడం మంచి పరిణామం కాదు. కరోనాను, కష్టాలను లెక్కచేయకుండా విశాఖపట్నంలో పోరాటాలు నిరాఘాటంగా కొనసాగుతూనే వున్నాయి. కేంద్రం మనసు మార్చుకొని,  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందనే ఆశలో ఉన్న కార్మికులకు తాజా పరిణామాలు శోకాన్ని మిగిలిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పుడే కొత్త ఆంధ్రప్రదేశ్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజనలో కీలకమైన నీరు-నిధులు-నియామకాలు అనే అంశాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. బోడిగుండు మీద తాటికాయలు పడ్డట్టు కరోనా కల్పిత కష్టాలు జత చేరాయి. కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళయ్యింది. ప్రగతి రథ చక్రాలు ముందుకు సాగకుండా అడుగడుగునా బండరాళ్లు అడ్డుపడుతున్నాయి. కొత్త పరిశ్రమల స్థాపన ఎలా ఉన్నా, కనీసం ఉన్నవాటిని నిలబెట్టుకోవడం ముఖ్యం. కొత్త పరిశ్రమల స్థాపనకు కేంద్రం సహాయం చేయకపోగా,ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా ప్రైవేటుపరం చేసే క్రతువుకు ఆంధ్రప్రదేశ్ వంటి కొత్త రాష్ట్రాన్ని ఎంచుకోవడం అన్యాయమని  ఆంధ్రప్రదేశ్ పౌరులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రజల ఆగ్రహజ్వాలలు, ఆవేదనా నాదాలు కేంద్రానికి తాకుతున్నట్లు లేదు.

Also read: భారత్ మెడకు తాలిబాన్ ఉచ్చు

బీజేపీ ఎదగాలంటే ఉక్కు ఫ్యాక్టరీని ముట్టుకోకూడదు

తెలుగురాష్ట్రాల్లో బిజెపి ఎదగాలంటే  రాష్ట్రాలు ఎదగడానికి దోహదపడే పనులు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కేటాయించడంలో మాట తప్పినందుకు మొన్నటి ఎన్నికల్లో బిజెపి భారీ మూల్యం చెల్లించింది. నీటి ప్రాజెక్టు కష్టాలకు ముగింపు పలుకకపోవడం, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం మొదలైన చర్యలు ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరిన్ని చేదు ఫలితాలను మిగిలిస్తాయని పరిశీలకులు నమ్ముతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమై, స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకోడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టాలి. ప్రధానమంత్రిని ఒప్పించే పని చేపట్టాలి. ప్రస్తుత పరిణామాల్లో కార్మికులు, ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నడపడానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర బిజెపి నేతలు సైతం కేంద్రాన్ని ఒప్పించే యజ్ఞంలో భాగస్వామ్యులవ్వాలి. ఆ పార్టీకి తోడుగా నడుస్తున్న జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కీలకభూమిక పోషించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడంలో కృతకృత్యులైనవారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. విస్మరించినవారికి ఓటురూపంలో భరతంపడతారు. ఎన్నో ఏళ్ళ పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న ఉక్కుపరిశ్రమను కాపాడుకోవడం తెలుగువారందరి కర్తవ్యం.

Also read: దేశానికి దిశానిర్దేశం చేసిన దీపస్తంభం పీవీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles