‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి
ఖమ్మం: రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులుండరు అనేది నానుడి. ఓకే ఒరలో రెండు కత్తుల్లా..ఒకే పార్టీలో ఉంటూ నిన్న మొన్నటి దాక అంటీ ముట్టనట్టుగా ఉన్న మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనూహ్యంగా ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తి రేకిస్తున్నది. నిన్నటి దాక ఉప్పూ, నిప్పులా ఉన్న వీరి ఐక్యత ఎందాకా ఉంటుందో అన్న చర్చ ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతుంది.
అంతర్గత పోరుకు తెరబడినట్టేనా?
ఖమ్మం జిల్లా అధికార పార్టీలో అంతర్గత పోరుకు తెరపడినట్టేనా? పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వరావు మద్య సయోద్య కుదిరినట్టేనా ఇది రాజకీయంగా ఖమ్మం జిల్లాలో విస్తృతంగా చర్చకు తావిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల నాగేశ్వరావు రైతు వేదిక కార్యక్రమానికి హాజరు కావడం తో తన అనుచరులు భవిష్యత్ రాజకీయాలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత ఉప్పూ, నిప్పులా ఉంటున్న పువ్వాడ, తుమ్మల ఒకే వేదిక పంచుకోవడం వెనుక అధినేత ఆదేశాలే కారణమని కార్యకర్తలు గుసగుస లాడుకుంటున్నారు. ఈ కలయిక ఎందాకా కొనసాగుతుందో అన్నదే అసలైన ప్రశ్న.
దుబ్బాక పరాజయంతో రాయబారం?
ఏ ఉప ఎన్నికల్లో అపజయం ఎరగని టిఆర్ఎస్ దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి చెందడం అధికార పార్టీని ఉలికి పాటుకు గురిచేసింది. జిహెచ్ ఎంసీ, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అధినేత చేస్తున్న ప్రయత్నం పలితం ఇస్తుందా అన్న ప్రశ్నకు అధికార పార్టీలో మౌనమే సమాధానం.
మాజి మంత్రి తుమ్మల. మంత్రి అజయ్ కలయికపై ఉహాగానాలు జోరందుకున్నాయి. దుబ్బాక దెబ్బ నుంచి తేరుకోక మందే జిహెచ్ ఎంసీ, పట్టభద్రులు, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు ఇలా వెంటవెంటనే వస్తున్నాయి. తుమ్మల కమలాకర్షణకు లోనౌతున్నారనే వార్తలతో సఖ్యతకు తావిచ్చారనే మాట వినిపిస్తుంది. తుమ్మల అండ లేకుండా పట్టభద్రులు, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం సులువు కాదని అధినేత కేసిఆర్ బావించడంతోనే రాజకీయ రాయబారం నడిచిందనే వార్తలు వస్తున్నాయి. కలిసి పని చేయాలంటే తనకు ఇచ్చే ప్రాదాన్యంపై స్పష్టత రావాలని తుమ్మల బావిస్తున్నట్లు తెలుస్తున్నది.
తుమ్మల నివాసానికి వెళ్ళి నమస్కారం చేసిన అజయ్
హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో వచ్చిన పువ్వాడ అజయ్ కుమార్ నేరుగా తుమ్మల నివాసానికి చేరుకుని తుమ్మలకు ప్రణమిళ్లారు. ఇద్దరు మంత్రులను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సత్కారం చేశారు. అనంతరం రైతు వేదిక వద్దకు తరలి వెళ్లారు. కార్యకర్తల్లో జోష్ పెంచారు. వేదికపై తుమ్మలను శాలువాతో సత్కరించాలని పువ్వాడ అజయ్ చేసిన ప్రయత్నాన్ని తుమ్మల తిరస్కరించడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెల కొంది. దీంతో వీరిద్దరి సఖ్యత ఎందాకా సాగుతుంది అన్న ప్రశ్న రాజకీయ వర్గాలను మనస్సు తొలుస్తుంది.