Sunday, November 24, 2024

అలసత్వానికి ట్రంప్ మూల్యం చెల్లిస్తాడా?

పెన్స్ – కమలా హ్యారీస్ సంవాదం ఈ రోజు

కరోనా కట్టడి కంటే చైనాపై ధ్వజానికే ప్రాధాన్యం

ఏ దేశాధినేతా చేయనంత అలక్ష్యం

మాశర్మ

కరోనా వచ్చినప్పటి నుండీ డోనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న అలసత్వం అంతా ఇంతా కాదు. నేటి  అలసత్వానికి రేపు నవంబర్ లో జరిగే ఎన్నికల్లో మూల్యం చెల్లించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ట్రంప్ తీరు చూసి వైట్ హౌస్ సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. అమెరికా ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. ప్రపంచ దేశాలు ముక్కుమీద వేలేసుకొని  ఆశ్చర్యంగా చూస్తున్నాయి. చైనాలో కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికన్ ఆరోగ్య అధికారులు ఫిబ్రవరిలోనే ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు.ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించకపోగా, చాలా తేలికగా కొట్టిపారేశారు.అప్పటి నుండే సరియైన చర్యలు చేపట్టివుంటే, అమెరికాకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేదికాదని అమెరికావాసులు  విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం,  76లక్షలపైన కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.మరణాలు కూడా పెద్ద సంఖ్యలో సంభవించాయి.సరియైన సమయంలో  నివారణా చర్యలు చేపట్టడం మాని, చైనాపై దుష్ప్రచారం చెయ్యడానికే ట్రంప్ సమయమంతా వెచ్చించారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. మొదటి నుండీ.. మాస్కులు ధరించడం పట్ల ట్రంప్  చిన్నచూపే చూశారు.

లాక్ డౌన్ నిబంధనలు కూడా ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. వ్యాపారం, వాణిజ్యం, రాజకీయంపై చూపించిన శ్రద్ధ ఆరోగ్య రంగంపై చూపించలేదు. కరోనా వైరస్ అతి శీఘ్రంగా వ్యాపిస్తుంది, శ్వాసకోశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే హెచ్చరికలు ప్రపంచదేశాల ప్రభుత్వాలన్నీ జారీ చేశాయి. కరోనా విషయం లో ఏ దేశాధినేత ఇంత అశ్రద్ధగా వ్యవహరించలేదని ఊరూవాడా చెప్పుకుంటున్నారు. ట్రంప్  తనకు కరోనా సోకదనే అతి విశ్వాసం చూపించారు. ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేశాడు. కరోనా సోకిన తర్వాత కూడా అతని వైఖరిలో ఏమీ మార్పు లేదు. దీనితో అటు వైట్ హౌస్ సిబ్బంది -ఇటు వ్యక్తిగత సిబ్బంది భయంతో చచ్చిపోతున్నారు. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా కొంత కట్టడి చేయవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. దీని వల్ల ఇప్పటికే సిబ్బందిలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆస్పత్రిలోనో, వైట్ హౌస్ లోనో కూర్చోకుండా బయటకు వచ్చి, చేతులు ఊపుతూ తిరుగుతూ ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

మొన్నీమధ్యనే అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి చర్చాకార్యక్రమం జరిగింది. ప్రత్యర్థి జో బైడెన్ సంధించిన  ప్రశ్నలకు డోనాల్డ్  ట్రంప్ సమాధానాలు  చెప్పలేక, ఘర్షణకు దిగాడు. తొలి సమావేశమే రసాభాసగా మారింది. కరోనాపై అడిగిన ప్రశ్నలకు హేతుబద్ధమైన సమాధానాలు రాకపోవడంతో, ప్రత్యర్థుల చేతికి ఆయుధాలు ఇచ్చినట్లయింది. ఎన్నికలను  వాయిదా వెయ్యాలనే ఉద్దేశం కూడా  ట్రంప్ కు ఉన్నట్లుగా కొందరు అనుమానిస్తున్నారు. నిజంగా,  ఎన్నికలు  వాయిదాపడతాయా? నాలుగు రోజుల్లో ఆ బండారం  కూడా బయటపడుతుంది.    ఆ అవకాశాలు ఉన్నాయా, దానికి ఉన్న పరిధులు, విధి విధానాలపై చర్చ కూడా జరుగుతున్నట్లు  సమాచారం.  ట్రంప్ ఆరోగ్యంపై భిన్న కథనాలు వస్తున్నాయి. ట్రంప్ చాలా బాగా కోలుకున్నారని మిలటరీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు సార్లు అత్యవసరంగా ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చిందని ట్రంప్ వైద్యుడు సీన్ కాన్ లీ తెలిపారు. నిజంగా కోలుకుంటే మంచిదే. ట్రంప్ త్వరలో సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావాలనే మనం కూడా కోరుకుంటున్నాం. ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని   కొందరు భారత సంతతికి చెందిన అమెరికావాసులు   పూజలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం  రూపొందుకుంటోంది.  డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఎన్నికలబరిలో ఉన్న ఉపాధ్యక్ష అభ్యర్థి -ప్రస్తుతం అధికారంలో ఉన్న ఉపాధ్యక్షుడు  మధ్య చర్చ  నేడు (బుధవారం) జరుగనుంది. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు  మైక్ పెన్స్ ముఖాముఖి తలపడతారు. ఇందులో, కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ఈ సంవాదం మొన్నటి లాగానే రసాభాసగా మారుతుందా,  అర్ధవంతంగా నడుస్తుందా అన్నది కొన్ని గంటల్లో తేలిపోతుంది. కరోనా అంశం డోనాల్డ్ ట్రంప్ ను కుదుపుతుందా? పాపం! కరోనా సోకిందనే సానుభూతి పవనాలు వీచి, రెండవ మారు కూడా అధ్యక్షపీఠంలో కూర్చోపెడుతుందా, అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. గెలుపు ఓటములు అలా ఉంచగా, బాధ్యత గల దేశాధినేత ఇంత బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడం హర్షణీయం కానే కాదు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles