ఐక్యమైనా బీజేపీని ఓడించగలవా?
ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపైన పేచీ రాదా?
నితీష్ కుమార్ ప్రయత్నాలు ఫలించేనా?
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ రాజకీయ క్షేత్రాల్లో వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు ఆశలపల్లకీలో ఊగుతున్నాయి. భావ సారూప్యత పేరుతో విపక్షాలన్నీ ఏకమవ్వడానికీ ప్రయత్నం చేస్తున్నాయి. భావ సారూప్యత అంటే ఏమీ లేదు. అధికార పక్షాన్ని గద్దె దింపడం, తాము అందలం ఎక్కడం.. అన్నమాట! ప్రతిపక్షాలను ఏకం చేసే కార్యాన్ని గతంలోనూ చాలామంది చేపట్టారు. ఈ జాబితా పెద్దదే. ఈసారి ఆ బాధ్యత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సివుంది. శరద్ పవార్, మమతా బెనర్జీ పేర్లు గతంలో అనేకసార్లు వినిపించినవే. సరే! కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఐతే ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘లోక్ సభ సభ్యత్వం’ నిలిచిపోయి వుంది. చివరకు ఏం జరుగుతుందో తేలాల్సివుంది. మొన్ననే రాహుల్ తన అధికార నివాసాన్ని ఖాళీ కూడా చేశారు. 2024 ఎన్నికల్లో భాజపాను ఢీకొనే దిశగా వీలైనన్ని ఎక్కువ పార్టీలను ఏకం చెయ్యాలన్నది వీరందరి లక్ష్యం. జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ జోష్ కాస్త పెరిగిందనే చెప్పాలి. మల్లికార్జున ఖర్గే అధ్యక్షపదవి చేపట్టాక కాంగ్రెస్ లో కొన్ని వ్యవస్థాపక నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఇంకా చేయాల్సింది చాలా వుంది.ముఖ్యంగా నితీశ్,ఖర్గే విపక్షాల ఐక్యతకు జత కట్టినట్లు తెలుస్తోంది.
Also read: తుక్కుతుక్కుగా ‘ఉక్కు’ రాజకీయం
మోదీ-షా ద్యయం నాయకత్వంలో బలోపేతమైన బీజేపీ
నరేంద్రమోదీ నాయకత్వంలో అత్యంత శక్తిమంతంగా తయారైన బిజెపిని గద్దె దింపడం అంత తేలిక కాదన్న విషయం వాళ్లకూ తెలుసు. కాకపోతే, గతంలో ఎన్నడూ లేనంతగా విపక్ష నాయకులను వేధించే పనిలో బిజెపి ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోందని వీరి ఆగ్రహం. ఈ క్రతువులో జాతీయ ఏజెన్సీలను ఎడాపెడా వాడుతున్నారని ప్రధానమైన ఆరోపణ. నరేంద్రమోదీ/ బిజెపి మళ్ళీ అధికారంలోకి వస్తే తట్టుకోవడం కష్టమనే భయం విపక్షాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. మిగిలిన విభేదాలు, ఆశలు, అనుమానాలను పక్కన బెట్టి ముందుకు సాగాలని ప్రతిపక్షనేతలు చూస్తున్నారు. బిజెపి అధికారంలోకి వచ్చి రేపు 2024కు 10ఏళ్ళు పూర్తి కానుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంతోకొంత ఉండక మానదు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా వున్నాయి. వీటన్నిటిని ఒక గొడుగు కిందకు తెస్తే తమ పని తేలికై పోతుందని కొందరు విపక్షనేతలు భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్,బీఆర్ ఎస్, డి ఎం కె, ఆప్ బలంగానే ఉన్నాయి. ఉత్తరాదిలోని కొన్ని పార్టీలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బిజెడీ, వైసిపీ ఉన్నప్పటికీ నరేంద్రమోదీకి వ్యతిరేకంగా జతకట్టడానికి సిద్ధంగా లేవు. సరే! నవీన్ పట్నాయక్ మొదటి నుంచీ చాలా వరకూ తటస్థంగానే ఉంటూ వస్తున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే బిజెపి పట్ల చాలా కోపంగా ఉన్నారనే చెప్పాలి.
Also read: ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం
చంద్రబాబునాయుడు ప్రయత్నాలు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మోదీకి వ్యతిరేకంగా చాలా పనిచేసినా, ఈసారి ఆ వాతావరణం లేదు. ఏదో ఒకటి చేసి మళ్ళీ నరేంద్రమోదీకి దగ్గరవ్వాలని బాబు చూస్తున్నారు. ఆ బాధ్యత తనకు తెలిసిన చాలామందికి కూడా అప్పజెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకొనే ప్రశ్నే ఉండదని ఎక్కువమంది అభిప్రాయం. ఉత్తరాదిలో అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు కూడా మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. శరద్ పవార్ కూడా కేంద్రంలో అధికార మార్పిడి కోరుకుంటున్నారు. విపక్షాలన్నీ ఎంత వరకూ ఏకమవుతా యన్నది ఒక ప్రశ్న. ఏకమైనా నరేంద్రమోదీని దింపేంత శక్తి ఉన్నదా? అన్నది రెండో ప్రశ్న. ఈ పన్నాగాలన్నింటినీ చూస్తూ మోదీ -అమిత్ షా ద్వయం ఊరికే ఉంటారా? అన్నది మరో ప్రశ్న. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కూడా ప్రభావం చూపించే అంశం. ప్రస్తుత అధికార పక్షం పట్ల పెద్దఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తే తప్ప అనుకున్నది సాధించలేరు. అదే సమయంలో, విపక్షాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగడం కూడా కీలకం.సార్వత్రిక ఎన్నికల కంటే ముందు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. వీటిల్లో వచ్చే ఫలితాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మొదటి నుంచీ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న మమతా బెనర్జీ ఏ మేరకు పూర్తి స్థాయిలో సహకరిస్తారన్నది చెప్పలేం. బిజెపి -కాంగ్రెస్ యేతర పక్షాలవైపే తమ నడక ఉంటుందని మొదటి నుంచీ చెబుతున్న కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారా? మారుస్తారా? కూడా చూడాలి. స్థాయిలో అతి పెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్ తన బలాన్ని, బలగాన్ని పెంచుకోవడం కూడా అంతే కీలకం. అధికార బిజెపి ఈ సంవత్సరకాలంలో మంచి పనులు చేయడంతో పాటు, చెడ్డపేరు మూటకట్టుకో కుండా ఉండడం చాలా ముఖ్యం.విపక్షాల జయాపజయాలు రేపటి తెరపై చూడాల్సిందే.
Also read: మండలి ఎన్నికల హెచ్చరికలు