- మితుల్ భవిష్యవాణి కార్యరూపం దాల్చేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలలో సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచేనా అన్న చర్చ దేశమంతటా సాగుతోంది. ఈ పోటీలకు సంబంధించి ఇటీవల ఓ వ్యక్తి ట్విట్టర్లో ట్వీట్ చేసిన పోస్టు క్రికెట్ ప్రత్యేకించి హైదరాబాద్ క్రీడాభిమానులకు ఆనందోత్సాహాలకి హేతువవుతోంది. సదరు పోస్టు ప్రస్తుత విస్తృత చర్చనీయాంశం అయింది. మితుల్ అనే ఓ ట్విటర్ యూజర్ ఐపీఎల్ 2020 సీజన్‌ను ఉద్దేశించి జూలై 27న చేసిన ట్వీట్లోని అంశాలు చర్చలకు కారణ భూతాలు అవుతున్నాయి.
నిజమవుతున్న మితుల్ అంచనాలు
ఇంతకీ మితుల్ ట్వీట్ చేసింది ఏమిటంటే…ఐపీఎల్ 2020 సీజన్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శన యావరేజ్‌గా ఉంటుందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరదన్నాడు. రాజస్థాన్ రాయల్స్ అట్టడుగు స్థానంలో నిలుస్తుందన్నాడు. కింగ్స్ పంజాబ్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరదన్నాడు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ చేరుతాయని, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. టోర్నీ ప్రారంభానికి నాలుగు నెలల ముందు ఈ ట్వీట్ చేయగా ఇందులో చెప్పినట్లే ఇప్పటి వరకూ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జ్యోతిష మో, యాదృచ్ఛిక మో, ఇప్పటి వరకూ అతను చెప్పినట్టే జరగడం విశేషం.
సాదాసీదాగా కోహ్లీ
కోహ్లీ ప్రదర్శన మామూలుగా ఉంటూ, ఈ సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. మరో మూడు సార్లు 40కిపైగా రన్స్ సాధించాడు. ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో 40 యావరేజ్‌తో 460 పరుగులు చేశాడు. గత సీజన్లతో పోలిస్తే ఇది విరాట్‌కు తక్కువే. అలాగే ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో క్వాలిఫై కాలేదు. ధోనీ సేన 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ అట్టడుగు స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. కోల్‌కతా చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. చెన్నై చేతిలో ఓడిన పంజాబ్ ఇంటిదారి పట్టింది. ఇక ఆయన పేర్కొన్నట్లు ఆర్‌సీబీ, ఢిల్లీ ప్లే ఆఫ్ కు చేరాయి.
మిగిలిందొక్కటే, హైదరాబాద్ టైటిల్ గెలవడమే
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట తటపటాయించినా, చివరి మూడు మ్యాచ్ లలో రాణించి వరుస విజయాలు నమోదు చేసుకుంది. మంగళవారం నాటి ముంబై ఇండియన్స్ తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో అద్భుతంగా ప్రతిభ ప్రదర్శించి, జట్టు సమిష్టి కృషితో గెలుపు బాటలో పయనించింది. టోర్నీ టేబుల్ టాప్ లో ఉన్న ముంబై జట్టుపై అలవోకగా, అనూహ్యంగా, వికెట్ నష్ట పోకుండా, సునాయాసంగా గెలిచి, ప్లేఆఫ్ లో బెర్త్ సాధించింది. ఇదే ఊపులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుకు వెళితే విజయం సాధించడం అసాధ్యం ఏమీ కాక పోవచ్చు.
బాలాజీ హసన్ జోస్యం ఈ సారీ నిజం అవుతుందా?
గత వన్డే ప్రపంచకప్ ముందు ఓ టీవీ షోలో బాలాజీ హసన్ అనే తమిళ జ్యోతిష్యుడు ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలుస్తుందని, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవుతాడని చెప్పాడు. అప్పట్లో అతని మాటలు ఎవరూ పెద్దగా పట్టించు కోలేదు. కానీ ప్రపంచకప్ ముగిసిన అనంతరం అతడు మాట్లాడిన వీడియో దేశవ్యాప్తంగా హల్‌చల్ చేసింది. ఈ విషయ మూ ప్రస్తుతం చర్చకు వస్తున్నది.
సన్‌రైజర్స్‌కు 2016 సెంటిమెంట్
ఇక సన్‌రైజర్స్ కు 2016 సెంటిమెంట్ ఊతం అందిస్తున్నది.. ఆ సీజన్ ఫైనల్లో బెంగళూరును ఓడించి టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతం కావడంతో మరోసారి హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఆర్‌సీబీపై విజయానంతరం ఇదే చెప్పాడు. 2016లో కూడా హైదరాబాద్ కారణంగానే కోల్‌కతా వెనుదిరగ్గా.. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ కానుంది. ఇక మితుల్ జోస్యంలో కూడా ఇదే ఉండటంతో హైదరాబాద్ అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.