దిల్లీ అధిష్ఠానవర్గం రేవంత్ రెడ్డిని ఇలా ఢిల్లీ పిలిచిందో లేదో తెలంగాణ గాంధీ భవన్ లో వేడి పుట్టింది. ఇంత చలిలో కూడా సీనియర్ సిటిజన్ వి..హనుమంతరావు (విహెచ్) చేసిన వ్యాఖ్యలతో పార్టీ వర్గాల్లో వేడి పుట్టి అధిష్టాన వర్గం ఆలోచనలకు బ్రేక్ పడింది. రేవంత్ కు గనుక పీసీసీ పీఠం అప్పగిస్తే కాంగ్రెస్ ను వీడడం ఖాయమని తేల్చేశారు. దాంతో గాంధీ భవన్ ముందు చలి మంటలు భగ్గుమన్నాయి. నిజానికి యాభై ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో పోయిన పరువును నిలబెట్టే నాయకుడే కాంగ్రెస్ లో కరువయ్యాడు. చాలా మంది వయసు ఉడిగి ఇంటికే పరిమితం కాగా కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, లాంటి వాళ్ళు వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడం తో కాంగ్రెస్ లో పార్టీ నాయకులను నడిపించే అధినాయకుడు కరువయ్యాడు.
విహెచ్ పార్టీని వీడితే పరువునష్టం
యాభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న హనుమంతరావు పార్టీని వీడితే ఇక ఆయన వెంట ఎవరు వెళ్ళినా, వెళ్లకున్నా పార్టీ ప్రతిష్ట మాత్రం మంట గలుస్తుంది. రేవంత్ రెడ్డి పై ‘ఓటుకు నోటు’ ఆరోపణలు ఉన్న దశలో కేవలం ఎంపి గా గెలిచిన రాజకీయ ప్రాముఖ్యత తో ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచించడం చూస్తే దిగజారిన పరువు ను భూతద్దం లో చూసే ప్రయత్నం చేయడమే. 31 మే 2015న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు గా అప్పుడు ఉన్న రేవంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ కు డబ్బులు ఇస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి స్టీఫెన్ ను ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
Also Read : టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై దిల్లీలో సమాలోచనలు
నగదు ఇస్తుండగా అరెస్టు
సికింద్రాబాద్ లోని లాలాగూడలో స్టీఫెన్ కు రూ. 50 లక్షలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ మచ్చ రూపుమాపక ముందే వివిధ రాజకీయ పరిమాణాలు మధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరీ నుండి ఎంపిగా ఎన్నికయ్యారు. జీ హెచ్ ఏం సి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనావస్థకు చేరుకోవడంతో ఆ పార్టీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్‌ను ఎన్నుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ రేసులో ముందున్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి వేస్తున్న తరుణంలో హనుమంతరావు రాజీనామా అస్త్రం తో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.
పార్టీలో ఉన్న సీనియర్ల సంగతి ఏమిటి?
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని కొందరు నేతలు బలంగా వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి వారికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇచ్చినా మరో వర్గం నేతలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది. అందరినీ ఒప్పించి ఈ పదవికి ఒక నాయకుడిని ఎంపిక చేయాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
రేవంత రెడ్డి ఏమి చేస్తారు?
దీంతో ఇప్పటికప్పుడు కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందా? లేక ఈ అంశాన్ని మరికొంతకాలం నాన్చుతారా ? అనే చర్చ కూడా మొదలైంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.