Monday, January 6, 2025

రాజమహేంద్రవరం జిల్లా తొలి మంత్రి ఎవరు ?!

మాజీ మంత్రి తనయుడు మంత్రవుతారా ? !

త్వరలో రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గురించే జిల్లావ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు రాజా మంత్రి పదవిని అధిష్టిస్తారా? లేక ఎమ్మెల్యేగానే కొనసాగుతారా అన్నది చర్చనీయాంశమవుతోందిః. రామ్మోహనరావు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కీలకమైన ఆర్అండ్ బి , ఎక్సైజ్ శాఖలను నిర్వహించారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా  వైఎస్ అభిమానంతో జక్కంపూడిని మంత్రిగా కొనసాగించారు. తన తండ్రి తరహాలోనే తమ కుటుంబానికి విధేయుడైన జక్కంపూడి తనయుడు రాజుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవిని కల్పిస్తారని జక్కంపూడి కుటుంబాభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు .

తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాకు తొలినాళ్లలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టారు . రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజాను ఆ పదవి నుంచి తప్పించారు. ఈ సందర్భంగా త్వరలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని రాజాకు వైఎస్ జగన్ అభయం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం జిల్లా ఏర్పాటు కానుంది. ఒకవేళ రాజాకు మంత్రి పదవి లభిస్తే రాజమహేంద్రవరం జిల్లా నుంచి తొలి మంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం అవుతుంది .

పదవితో పైచేయి!

ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఎంపి మార్గాని భరత్లామ్ , రాజా వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. జక్కంపూడి రామ్మోహనరావు నాటి నుంచి ఆ కుటుంబానికి రాజమహేంద్రవరంలో ప్రత్యేక వర్గం ఉంది. దాన్ని కాపాడుకునేందుకు రాజా, ఆయన సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి కృషిచే స్తున్నారు. భరత్ రామ్ ఎంపిగా ఎన్నికైన తరువాత పోటీగా మరో వర్గాన్ని తయారుచేసుకున్నారు. అయితే రాజానగరం ఎమ్మెల్యేగా రాజాకు రాజమహేంద్రవరం రాజకీయాల్లో తలదూర్చడం విమర్శలకు తావిచ్చేదిగా ఉండటంతో రాజకీయంగా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి పదవి లభిస్తే తన తండ్రిలాగే రాజా జిల్లావ్యాప్తంగా చక్రం తిప్పవచ్చు. అలాగే ప్రత్యర్థి వర్గాన్ని దీటుగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి .

రాజమహేంద్రవరం మేయర్ రేసులో రాజా సోదరుడు గణేష్ పేరు వినిపిస్తోంది. మరోవైపు తన తల్లి విజయలక్ష్మిని చట్టసభలో చూడాలని గణేష్ శపథం పట్టారు. ఒకవేళ రాజాకు మంత్రి పదవి లభిస్తే అదే కుటుంబానికి చెందిన గణేష్ మేయర్ పదవిపై ఆశను వదిలేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తన తల్లిని చట్టసభకు పంపాలన్న శపధాన్ని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అయితే జగన్ తలిస్తే జక్కంపూడి కుటుంబంలోని ముగ్గురికీ పదవులు లభించే అవకాశాలను తోసిపుచ్చలేం.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles