Saturday, December 21, 2024

రాహుల్ గాంధీ పాదయాత్ర జైత్రయాత్ర అవుతుందా?

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంకల్పించిన చరిత్రాత్మక పాదయాత్ర దేశాన్ని మెరుగైన స్థానంలో నిలబెడుతుందా? విచ్ఛిన్నకర రాజకీయాలకు స్వస్తి చెప్పి దేశం సమైక్యంగా నిలుస్తుందా? లేక ఇది కూడా ఒక పాదయాత్రా కార్యక్రమంలాగా ముగిసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోతుందా? 2024లో సైతం బీజేపీ గెలుస్తుందా? బీజేపీని కాంగ్రెస్ పార్టీ నిలువరిస్తుందా?

శ్రీపెరంబదూరులో రాజీవ్ స్మారకానికి ప్రార్థన

 బుధవారం ఉదయం దిల్లీ నుంచి చైన్నై విమానంలో చేరుకొని, అక్కడి నుంచి తన తండ్రి రాజీవ్ గాంధీ 21 మే 1991న లంక తమిళుల ఉగ్రవాద చర్యలో ప్రాణాలు అర్పించిన శ్రీపెరంబదూరు వెళ్ళి ఆయన స్మారకస్థలి దగ్గర ప్రార్థన చేశారు. ఆ తర్వాత ట్వీట్ లో ‘‘ద్వేషం, వేర్పాటువాదం అనే కారణాలు నా తండ్రిని బలితీసుకున్నాయి. నా దేశాన్ని ఆ విధంగా బలికానివ్వను. ద్వేషాన్ని ప్రేమ జయిస్తుంది. ఆశ భయాన్నిజయిస్తుంది. మనందరం కలిసి ద్వేషాన్నీ, భయాన్నీ అధిగమిద్దాం’’ అనే సందేశం పెట్టారు.

కన్యాకుమారి టూ కాశ్మీర్ రాహుల్ పాదయాత్ర
పాదయాత్రకు సమాయత్తమైన రాహుల్ గాంధీ

ద్వేషంతో దేశాన్ని చీల్చుతున్న బీజేపీ రాజకీయాలకు విరుగుడుగా తాను తలపెట్టటిన భారత్ జోడో యాత్ర తనకు తపస్సు వంటిదని అంతకు ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘జోడో’ అంటే కలపడం, ఏకం చేయడం అని అర్థం. ‘తోడో’ అంటే విరగకొట్టడం, చీల్చడం. బీజేపీ అనుసరిస్తున్న ‘తోడో’ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ‘జోడో’ యాత్రను సంకల్పించింది.

బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో మహాత్మాగాంధీ మండపంలో జరిగే సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొంటారు. ‘భారత్ జోడో యాత్ర’కు సమాయత్తం అవుతున్న రాహుల్ గాంధీ చేతికి భారత పతాకాన్ని స్టాలిన్ అందజేస్తారు. సాయంత్రం అయిదు గంటలకు ఒక మహాప్రదర్శనతో పాదయాత్ర సంకేత ప్రాయంగా  ప్రారంభం అవుతుంది. అసలు పాదయాత్ర గురువారం ఉదయం మొదలవుతుంది. ఉదయం  7 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకూ కాంగ్రెస్ వాదులు రెండు బృందాలుగా 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్లు నడుస్తారు. 12 రాష్ట్రాలూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా యాత్ర సాగుతుంది. తెలంగాణలో పది రోజులపాటు యాత్రికులు నడుస్తారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ కాలినడకన ప్రయాణం చేస్తారు.

ఈ యాత్ర భారత దేశ చరిత్రలో గుణాత్మకమైన మార్పు తెచ్చే అంశమనీ, కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడంలో ఇది నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందనీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ సకారాత్మకమైన రాజకీయాలను ప్రారంభిస్తున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మంగళవారంనాడు అన్నారు.

ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నాయకుడు, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ శక్తిమంతంగా ప్రచారం చేయడం వల్ల 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపైన రకరకాల ఆరోపణలు చేసి కాంగ్రెస్ ను భ్రష్టుపట్టించారు. 2-జీ స్పెక్ట్రమ్ కేసులో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కాగ్ వినోద్ రాయ్ ఆరోపణ చేశారు. దానిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ధ్రువీకరించారు. ఇది అభూతకల్పన అని తర్వాత తేలింది. దీనికి తోడు అన్నా హజారే ఉద్యమం కాంగ్రెస్ పార్టీని బజారులోకి తెచ్చింది. నరేంద్రమోదీ చుక్కలను తెంపి ప్రజల ఒడిలో వేస్తానంటూ ప్రచారం చేశారు. ప్రజలు, ముఖ్యంగా హిందీ రాష్ట్రాల ప్రజలు విశ్వసించారు. గెలిపించారు. ప్రధాని పదవిలో కుదురుకున్న తర్వాత మోదీ మళ్ళీ వెనక్కు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. 2019లో ఇనుమడించిన మెజారిటీ సాధించి  ప్రధానిగా విరాజిల్లుతున్నారు.

పరాజయం, రాజీనామా

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్షతన 2019 ఎన్నికలలో పాల్గొని దారుణంగా పరాజయం పాలయింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పూర్తికాలం పని చేసే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవ్వరూ ఎన్నిక కాలేదు. తాత్కాలికంగా  సోనియాగాంధీ కాంగ్రెస్ సంస్థను నడిపే బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఆరోగ్యం బాగా లేదు. అక్టోబర్ లో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంది. అధ్యక్ష పదవికి తాను పోటీ చేయబోనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పదవీ బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో సోనియాగాంధీ ఉన్నారని భోగట్టా. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్నకారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుం బిగించవలసిన సమయమిది.

కాంగ్రెస్ కుటుంబ పార్టీ అనీ, గాంధీ-నెహ్రూ కుటుంబానికి అంకితమైన పార్టీ అనీ విమర్శించేవారే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. బాధ్యత నుంచి పలాయనం చిత్తగించే పలాయనవాదమని దుయ్యపడుతున్నారు. రాజకీయాలను పట్టించుకోరనీ, నాన్-సీరియస్ గా ఉంటారనీ, దేశంలో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు విదేశాలకు వెడతారనీ విమర్శించేవారు అయిదు మాసాలు కాలినడకన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ నడవాలని నిర్ణయించుకున్న రాహుల్ ని మళ్ళీ తప్పుపడుతున్నారు. రాబోయే ఎన్నికలలో వ్యూహాలూ, ప్రతివ్యూహాలూ రచిస్తూ, ఎత్తులూ, పైఎత్తులూ వేయవలసిన కాంగ్రెస్ నాయకుడు పాద యాత్ర చేయడం కూడా పలాయనవాదమేనని వాదిస్తున్నవారు ఉన్నారు. రాహుల్ గాంధీని తప్పుపట్టడమే పనిగా దేశంలో కొన్ని రాజకీయ పార్టీలూ, కొందరు రాజకీయ నాయకులూ, కొన్ని మీడియా సంస్థలూ, కొందరు జర్నలిస్టులూ ఉన్నారు. దాని విషయంలో ఎవరైనా చేయగలిగింది ఏదీ లేదు. రాహుల్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. విమర్శకులను పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే.

Bharat Jodo Yatra: Rahul Gandhi scion to cover nearly 366 km in Telangana  from Oct 24 | India News – India TV
దిల్లీ ఇటీవల జరిగిన ఎన్ జీ వో ల ప్రతినిధుల సభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ

ఒక విషయాన్ని మాత్రం ఎవ్వరూ కాదనలేదు. బీజేపీ ఈ రోజున కూడా తనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీనే భావిస్తున్నది. అందుకే ఆ పార్టీని తెగ విమర్శిస్తున్నది. ఆ పార్టీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపైన నేషనల్ హెరాల్డ్ కేసులో లేనిపోని ఆరోపణలు చేసి ఎన్ పోర్స్ మెంటు డైరెక్టొరేట్ అధికారుల చేత వేధిస్తున్నది. ఈ దేశంలో బీజేపీనీ, దానికి వెన్నుదన్నుగా నిలిచే ఆర్ఎస్ఎస్ నూ నిర్విరామంగా వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ వచ్చిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. ప్రతిసందర్భంలో నరేంద్రమోదీని రాహుల్ గాంధీ సూటిగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా విమర్శిస్తూ వచ్చారు.

రాహుల్ గాంధీ ‘పప్పు’ అంటూ ఎద్దేవా  చేసిన వ్యక్తులూ, రాజకీయ నాయకులూ అతడి సకారాత్మక వైఖరిని పట్టించుకోలేదు. నరేంద్రమోదీ పట్ల విపరీతమైన మోహంతో మోదీ విమర్శకులందరినీ పనికిరానివారిగా తీసిపడేయడం కొందరికి అలవాటుగా మారింది. మోదీ సమర్థుడైన రాజకీయ నాయకుడు. మంచి వక్త. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ఆయన ముందు రాహుల్ గాంధీ తేలిపోయిన మాట వాస్తవమే. కానీ రాహుల్ ని విమర్శిస్తున్నవారిలో ఎవరైనా మోదీ ముందు తేలిపోయేవారే. ప్రతి రాజకీయవాదికీ కలిసివచ్చే కాలం అంటూ ఉంటుంది.

రాహుల్ తో కదం కలుపుతున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

ఇది మోదీ ప్రభ వెలిగే కాలం. ఆ సమయంలో మరో ప్రభ వెలగదు. కానీ మోదీ అనుసరిస్తున్న రాజకీయాలు దేశానికి ప్రమాదకరమైనవని గుర్తించినవారు రాహుల్ వెంట నడవడానికి సిద్ధపడుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆయన వెంట దేశంలోని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నడవబోతున్నారు. 2024లో కనుక మళ్ళీ బీజేపీ గెలుపొంది మోదీ ప్రధాని అయినట్లయితే దేశంలోని పరిస్థితులు పూర్తిగా మారతాయనీ, ప్రజాస్వామ్యం భ్రష్టుపడుతుందనీ, నియంతృత్వ ధోరణులు ప్రబలుతాయనీ, అధ్యక్ష తరహా పాలన రావచ్చుననీ భయపడుతున్నవారు దేశంలో అనేకమంది ఉన్నారు. ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోకుండా తమ మానాన తాము ఉద్యమాలు చేసుకుంటూ మనుగడ సాగించిన ఎన్ జీవో లు ఇప్పుడు దేశం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాహుల్ గాంధీతో కదం కలపాలని నిర్ణయించుకున్నాయి. ఇది ఒక చరిత్రాత్మకమైన మలుపు. దానికి తగినట్టుగా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రక్షాళన జరిగి దేశంకోసం ప్రాణాలు అర్పించే ధోరణి పెరగాలి. అవినీతిపరులనూ, అక్రమార్కులనూ, వితండవాదం చేసేవారినీ, కండబలంతో దబాయించేవారిని పార్టీ పరిహరించాలి. ప్రజాబలం లేకుండా రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్నవారినీ పక్కన పెట్టాలి. ఒక రకమైన నైతిక విప్లవం ఆ పార్టీలోనూ, ఇతర ప్రతిపక్షాలలోనూ రావాలి. వయోవృద్ధులకు ఉద్వాసన చెప్పి యువతకు పట్టం కట్టాలి. వారిలోనూ నైతికత ఉన్నవారికి ప్రాధాన్యం  ఇవ్వాలి.

రాహుల్ గాంధీ ప్రత్యేకత ఏమిటి? ప్రధాని పదవిపైన ఆశలు పెట్టుకున్న రాజకీయ నేతలు దేశంలో కనీసం నలుగురైదుగురు ఉన్నారు. రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్, చంద్రశేఖర్ నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధాన పదవులు నిర్వహించారు. 1996లో పీవీ నరసింహారావు ఓడిపోయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ తరఫున దేవెగౌడ ప్రధాని అయినారు. ఆ తర్వాత గుజ్రాల్ అధికారంలోకి వచ్చారు.  అనంతరం వాజపేయి, తర్వాత మన్మోహన్ సింగ్, ఆపైన నరేంద్రమోదీ ప్రధానులైనారు.

ప్రధాని కావాలని కోరుకునే నాయకుల సత్తా ఏపాటిది?

కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికలలో (2014, 2019) ఓడిపోయే సరికి, రాహుల్ గాంధీలో రాజకీయాల పట్ల ఏకాగ్రత లోపించే సరికి, తాము ప్రధానమంత్రి పదవికి అర్హులమని కొంతమంది తయారైనారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవలసిన వ్యక్తి మమతా బెనర్జీ. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడో సారి గెలిచే సరికి ఆమె జాతీయ స్థాయిలో రాజకీయాలపట్ల ఆకర్షితురాలైనారు. కాంగ్రెస్ ను తీసిపారవేస్తూ మాట్లాడారు. తానే తృతీయ కూటమికి నాయకురాలు అన్నట్టు వ్యవహరించారు. కేంద్రంపైన ధ్వజమెత్తారు. అంతలో పశ్చిమబెంగాల్ సీనియర్ మంత్రి పార్థాఛటర్జీ మిత్రురాలి నివాసాలలో యాభై కోట్ల రూపాయల విలువైన నగదు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ అధికారులకు దొరికింది. పార్థానూ, మిత్రురాలినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మమతా బెనర్జీ డార్జిలింగ్ లో నాటి గవర్నర్ నూ, అస్సాంముఖ్యమంత్రిని కలిశారు. ఎన్ డీఏ పట్ల మెత్తపడుతున్నట్టు కనిపించారు. ఆర్ఎస్ఎస్ లో అందరూ చెడ్డవాళ్ళు కారంటూ అనవసరపు వ్యాఖ్యానాలు చేశారు. మోదీకి దీటుగా జాతీయ స్థాయిలో నిలిచే శక్తి ఆమెలో లేదనీ, ఆత్మరక్షణ ధోరణికి ఆమె దిగివచ్చారనీ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రధాని పదవిపైన కన్ను వేసిన మరో నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణలో ఉన్న లోక్ సభ స్థానాలు 17 మాత్రమే. అదే పెద్ద లోపం. ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ లో 42 స్థానాలు ఉంటే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉండేవి. ఇరవై స్థానాలు కూడా లేని తెలంగాణలో ప్రాంతీయ పార్టీ నాయకుడు ప్రదాని కావాలని ఆలోచించడమే విడ్డూరం. దీనినే ఇంగ్లీషులో అడాసిటీ అంటారు. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుందని ఎవరైనా ఊహించారా అదే విధంగా ప్రధాన మంత్రి పదవి కూడా అంటూ వాదించగలరు. కేసీఆర్ మంచి వక్త. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో ధాటిగా మాట్లాడగలరు. వగ్ధాటి ఒక్కటే సరిపోదు. ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆమోదయోగ్యం కావాలి. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఒప్పుకుంటారు? రైతు నాయకులు కొన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను పొగడవచ్చు. ఇతర రాష్ట్రాలలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెక్కులు ఇస్తానంటూ కేసీఆర్ వెడితే ఆయన వెంట నిలబడటానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధపడి ఉండవచ్చు. రేపు ఉత్తరప్రదేశ్ లో రైతులు నిర్వహించే సభలో ప్రధాన వక్తగా కేసీఆర్ ను ఆహ్వానించవచ్చు. కేసీఆర్ వెళ్ళి మాట్లాడవచ్చు. దేశంలో ఈ రోజున మోదీని నిశితంగా  విమర్శిస్తున్నవారిలో ప్రథముడుగా కేసీఆర్ నిలువవచ్చు. అంతమాత్రాన ప్రధాని పదవి చేతికి అందుతుందా? కేసీఆర్ తలబెట్టిన బారత్ రాష్ట్ర సమితి పేర జాతీయ పార్టీ పుట్టడానికీ, బట్టకట్టడానికీ చాలాకాలం పడుతుంది. అంత దృశ్యం ఉన్నదా అన్నదే అనుమానం. మొదటి బీజేపీ, కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ ను నిర్మిస్తానంటూ బయలుదేరిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ ముక్త్ భారత్ అంటున్నారు. కాంగ్రెస్ యుక్త ప్రతిపక్ష కూటమికి అభ్యంతరం లేదనేగా? ఆరు మాసాల కిందటి వరకూ నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అన్ని నిర్ణయాలనూ (వ్యవసాయ బిల్లులు సహా) సమర్థించిన కేసీఆర్ ని ప్రస్తుత విధానాలు చూసి అంచనావేయడం కష్టమని రాజకీయ పరిశీలకుల అంచనా.

దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు కూడా ప్రధాని కావాలనే ఆశ లేకపోలేదు. ఆయన నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిన్న పంజాబ్ లో ఘనవిజయం సాధించిన తర్వాత ఆశలు మోసులెత్తాయి. జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమం తలకెత్తుకోవాలసి తపిస్తున్నారు. ‘మేక్ ఇండియా నంబర్ ఒన్’ అనే నినాదంతో ముందుకు పోతారట. ప్రస్తుతం గుజరాత్ లో ఆశలు పెంచుకుంటున్నారు. అక్కడ బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను తోసిరాజు అనాలనే ప్రయత్నం. దిల్లీలో, పంజాబ్ లో చేసినట్టు గుజరాత్ లో కాంగ్రెస్ పూర్వపక్షం చేయాలని ప్రణాళిక. ఒక వేళ గుజరాత్ లో కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ 2024 కల్లా దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఆప్ సిద్ధం కాగలదా? దక్షిణాదిలో అభ్యర్థులు దొరుకుతారా? ఉత్తరాదిలో సైతం ఆ పార్టీ ఎక్కడ ఉంది? ప్రతిపక్ష కూటమిగా గండి కొట్టడానికి తప్పితే కేజ్రీవాల్ పాత్ర ఎక్కువ ఉండదు. ఆశలు గుర్రాలైతే ప్రతి నాయకుడూ గుర్రమెక్కి అధికారంవైపు దౌడు తీస్తానంటాడు. కేజ్రీవాల్ విద్యాధికుడు. మంచి మాటకారి. సమయస్ఫూర్తి ఉన్నవాడు. రాజకీయ చతురుడు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం కావడానికి ఈ లక్షణాలు మాత్రమే సరిపోవు.

Congress Launches Website, Tagline of 'Bharat Jodo Yatra'
పాదయాత్ర వెనుక నాయకులు జైరాంరమేష్, దిగ్విజయ్ సింగ్

ఇక మొన్ననే ప్లేటు మార్చిన నితీశ్ కుమార్. మొన్నటి వరకూ రెండో సారి బీజేపీతో స్నేహం చేసి, అధికారం పంచుకున్న నితీశ్ కుమార్ తాజాగా బీజేపీకి జెల్లకొట్టి ఆర్జేడీని తిరిగి చంకనెత్తుకొని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2012లో బీజీపీతో, 2017లో ఆర్జేడీతో, 2020లో బీజేపీతో సహవాసం చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆర్జేడీతో భుజం కలిపినంత మాత్రాన ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రధానిప పదవిని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాయా?  01 మార్చి 1951లో పుట్టిన నితీశ్ కుమార్ కు ఇప్పటికే 71 సంవత్సరాలు నిండాయి. 2024కు 73 నిండుతాయి.

యూపీఏనే దిక్కు

వీళ్ళందరితో పోల్చి చూస్తే రాహుల్ గాంధీ నయం అనిపించదా? అతడిలో లోపాలు ఉండవచ్చు. లోపాలు లేని రాజకీయ నాయకుడు ఎవరు? దాదాపు రెండు దశాబ్దాలుగా లోక్ సభ సభ్యుడుగా ఉంటూ, జాతీయ రాజకీయాలలో కొన్నేళ్ళుగా చురుకైన పాత్ర పోషిస్తూ, మతరాజకీయాలకు వ్యతిరేకంగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను విరోధించడంలో నమ్మకంగా, మాట మార్చకుండా, మడమ తిప్పకుండా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతికి చెందిన రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కడే కాదా? అతడికి కాంగ్రెస్ లో ఎదురు లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆసేతుహిమాచల పర్యంతం కార్యకర్తలు ఉన్నారు. అత్యధిక రాష్ట్రాలలో బలహీనపడింది. కొన్ని రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా పోయింది. కానీ అన్ని రాష్ట్రాలలో ఎంతోకొంత కార్యకర్తల బలం ఉంది. యూపీఏ కూటమిని జయప్రదంగా నిర్వహించడంలో సోనియాగాంధీ సంయమనం ప్రదర్శించిన తీరు గొప్పది. ఏదైనా కూటమి పూర్తి కాలం అధికారంలో ఉండాలంటే దానికి నాయకత్వం బీజేపీ అయినా వహించాలి లేదా కాంగ్రెస్ అయినా నాయకత్వ స్థానంలో ఉండాలి. లేకపోతే ఏమవుతుందో మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్, విపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ్, ఇందర్ గుజ్రాల్ లు నిరూపించారు. అటువంటి విఫల ప్రయోగాలు మళ్ళీ చేయడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారా? లేరు. అందువల్ల బీజేపీ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ అనడంలో సందేహం అక్కరలేదు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles