డా. పి. కనకారావు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్ళయింది. మచిలీపట్నంలో ఆవిర్భావసభ అట్టహాసంగా జరిగింది. నిజమైన పండుగనే గుర్తుకు తెచ్చింది. జనసేన జీవిత కాలంలో రెండు పర్యాయాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. రెండింటిలోనూ చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో జయాపజయాల గురించి నరాలు తెగేంత ఉత్కంఠతో కూడిన ఊహాగానాలు జరుగుతున్నాయి. పవన్ సినీ ప్రస్థానం నుండి వచ్చిన స్టార్ డమ్ ఇసుమంతైనా తగ్గలేదు. అభిమాన గణం ఉత్తేజితులై ఉండనే ఉన్నారు. ఎన్నికల్లో ఏమయినా సీట్లు గెలుస్తారా అంటే అనుమానమే. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు ఖాయం అని కొందరి ఆశ. పవన్ ఉంటే టిడిపిదే గెలుపు అని ఇంకొందరి ఉద్రేకం. దమ్ముంటే జనసేన ఒక్కటే ఎన్నికల బరిలోకి దిగాలని అధికారపక్షం చాలెంజ్. పవన్ కరిష్మా ఎంత? ఎన్నికలకు పనికొస్తుందా? జనసేన గెలుస్తుందా? పవన్ సిఎం అవుతారా? అంతులేని ఊహాగానాల మోత. వీటన్నిటి గురించి ఎలా ఆలోచించాలి అనేదానికి ఒక రకమైన సమాధానం వెతికే ప్రయత్నమే ఈ చిన్న విశ్లేషణ.
రేఖామాత్ర విశ్లేషణ
సాంప్రదాయకమైన ఎన్నికల గణాంకాల విశ్లేషణకు ఇక్కడ ప్రయత్నించడం లేదు. సినిమా మాధ్యమం ద్వారా ప్రజాభిమానం పొంది ఆ పరపతి ద్వారా రాజకీయాలలో విజయం సాధించిన వారిలో తెలుగు గడ్డ మీద ఎన్టీయార్ ఉన్నారు, తమిళ నాట ఎమ్జీయార్, జయలలిత ఉన్నారు. చిరంజీవి ప్రయత్నించి పాక్షికంగా విఫలమయ్యారు. తమిళనాట మరికొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తెలుగునాట జనసేన ఆ కోవలోనిదే. సినీతారలుగా మెరిసి రాజకీయాలలో వెలగాలనుకునే వారి వ్యక్తిగత, పార్టీపరమైన ప్రభావశీలతను అంచనా వేయడానికి మరో రకమైన విశ్లేషణా పరికరాలు కావాలి. ఆ లోతులలోనికి పోకుండా రేఖామాత్రమైన విశ్లేషణకు ప్రయత్నిద్దాం. పవన్ సినీ రాజకీయ ప్రస్థానం, జనసేన ప్రభావం ఆంధ్ర రాజకీయ ముఖచిత్రంపై ఉంటుందా? పవన్ సినీ డైలాగులు, తాత్విక ఆలోచనలు, రాజకీయ పంచ్ లకు పొసగుతుందా లేక అంతరాలు పెరిగి జనసేన చతికిలపడే అవకాశముందా?
పవన్ సినీ ప్రస్థానం
పవన్ తెరమీద సినీ వ్యక్తిత్వం, చిరంజీవి సినీ వ్యక్తిత్వం విభిన్నమైనవి. రెంటిమధ్య సామ్యతల కంటే ప్రత్యేకతలే ఎక్కువ. చిరు సినిమా కథ, పాత్ర చిత్రణలో భూస్వామ్య పాత్రలు ఆవరించి ఉంటాయి. పేదగానూ, కూలిగానూ పెట్టి పుట్టినవారి అధికారాన్ని, అహంకారాన్ని హేళన చేస్తూ, బలహీన పరుస్తూ, కథానాయిక మనసును జయించి, డొల్ల అయిపోయిన ఆస్తులను పరిపుష్టం చేస్తూ విజయీభవుడయి ఉంటాడు. భూస్వామ్యవరణలో అంతర్గత మార్పును తెస్తూ బడుగు జనంతోకూడిన జనబాహుళ్యానికి నాయకుడుగా అభిమానుల మనసుల్లో గూడుకట్టుకొని ఉన్నాడు. సినిమా సమాజాన్ని మారుస్తుందా లేక సమాజం సినిమా ద్వారా మారుతుందా అన్న చర్చను పక్కనపెట్టి చూస్తే సినిమా ద్వారా సామూహిక కల్పనా ప్రపంచాన్ని ఒక జాతి ఆవిష్కరించుకుంటుంది. అలాగే సామూహిక కల్పనా ప్రపంచం జాతి తత్వావిష్కరణ కూడా.
పవన్ వెండితెర వ్యక్తిత్వం ప్రతిఫలన అతని కథల, పాత్రల ద్వారా గమనించవచ్చు. పవన్ నాయకుడుగా నటించిన సినిమాలలో భూస్వామ్య వాతావరణం కనిపించదు. భూస్వామి పాత్ర అసలుండదు. పట్టణ శివారుల్లోనో, బస్తీల్లోనో కనిపించే టీ స్టాల్ లాంటి ప్రాంతాలు అతని అడ్డా. అక్కడ నుండి నగరాన్ని కలగంటూ ఉంటాడు. పవన్ వెండితెర వ్యక్తిత్వానికి గతంలోనూ ప్రస్తుతం కూడా ఊరు లేదు. ఊళ్ళల్లో ఉండే హెచ్చు తగ్గులు ఇతన్నేమీ పీడించవు. చెప్పుకోవడానికి, గుర్తుపెట్టుకోవదానికి ఒళ్ళు ఉప్పొంగే గతమేమీ కాదు. ఎవరూ లేని, ఏమీ లేనితనం చర్మం అడుగులోంచి సూదుల్తో పొడుస్తూ ఉన్నట్లుంటుంది. అమ్మలేదు, నాన్నది రంపంకోత. డబ్బుల్లేవు జూమ్మంటూ తిరగడానికి. వస్తుందో సుకుమారి..కాంతిని కళ్ళలోనుండి ఒంపుతూ, ఒళ్ళంతా ప్రేమలో నుండి పుట్టిన శక్తితో చురకత్తుల పొడుపులకి శాంతిని కాంతిని ఇస్తూ. అది చాలదు నగరాన్ని రఫ్ ఆడించడానికి. ఇంతలోనే నాయకుడిది ఎండామావులవెంట వెంపర్లాట. జిలుగు వెలుగులకోసం ఆపుకోలేని కాల్చివేత. అది తీరే ఆరాటం కాదు. తిరస్కరణ. సుకుమారి సాంత్వన. జీవితంలో ఓ గెలుపు. ఆ గెలుపేం గతం భుజాలమీద నిలబడి సాధించిందేం కాదు. నిఖార్సయిన విల్ పవర్. బాక్సింగో మరేదో ఓ ఒంటరి ఆట. అతడొక్కడే. ఏ తోడూ లేని ఒంటరితనం సూదిలా పొడుస్తూ ఉంటే కండలు లేని కాంతి ఇచ్చిన ప్రేమతో ఒక్కడే గెలుస్తూ ఇదో కొత్త రకం ప్రేమ- ఖుషీ- అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఆ నలుగురు ఏమనుకుంటారు? అనే ప్రస్తావనే లేదు. నాయికా నాయకులమధ్య హెచ్చు తగ్గుల ప్రస్తావనే లేదు. పూర్తిగా వ్యక్తిత్వాలమధ్య ఘర్షణ అంతే. కొత్త తరం ప్రేమ. దగాపడ్డ చెల్లి కోసం కల్తీలేని ప్రతీకారం తీర్చుకునే అన్న కథ అన్నవరం. వెరసి, పవన్ వెండి తెర వ్యక్తిత్వం కొత్త తరానికి ప్రతీక. భూస్వామ్య ఆవరణం లేదు. తల్లిదండ్రులు, సంఘ భయం లేదు. వ్యక్తి అంత: శక్తిని ప్రజ్వలింపజేసి వైయక్తిక ప్రయత్నంతో సంఘ ధర్మాన్నినిలబెట్టడం, ఈవ్ టీజింగ్, రౌడీయిజం, దౌర్జన్యాన్ని వ్యతిరేకించడం పవన్ సినిమాల్లోని సాంఘిక, రాజకీయ ధర్మం.
ప్రజారంగంలో పవన్ వ్యక్తిత్వం
తెరమీద నటించిన పాత్రలకు, తెరబయట వ్యక్తిత్వానికి మధ్య కొంత సామ్యత ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నప్పుడు. పవన్ తన గురించి తనే చెప్పుకున్నట్లుగా, రాజకీయ గతం ఏమీ లేదు. ఏ రాజకీయ సంప్రదాయానికీ చెందినవాడు కాదు. కాంగ్రెస్సూ కాదు. కమ్యూనిష్టు కాదు, తెలుగుదేశమూ కాదు. పోనీ కుటుంబమూ ఏ రాజకీయాల్లో లేదు. ఏదైనా సంప్రదాయంలో భాగమైతే దానిని కొనసాగించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ది భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ల వారసత్వం. తలవంచని తిరుగుబాటు. దేనినైనా ఎదిరించి నిలబడే ధైర్యం అతనిరాజకీయ కవచం. తిరుగుబాటులో శత్రువులు ఎవరు? మిత్రులు ఎవరు? స్పష్టత లేదు. అపారమైన శక్తి నిర్దిష్టంగా వ్యక్తిలోగాని, పార్టీలో గాని, సమూహంలో గానీ ప్రవేశించి సామూహిక శక్తిగా మారి, ఉరిమే నూతనోత్సాహాన్ని పుట్టించేది కాదు. తిరుగుబాటు అంటే వ్యవస్థీకృత రాజకీయాలపై గానీ, అధికారంపై గానీ, దౌర్జన్యంపై గానీ ఉండొచ్చు. పవన్ ఉపాసిస్తున్న తిరుగుబాటుకు వాహకం తను మాత్రమే. లేదా దీక్షాపరులైన మరికొంతమంది యువకులు, వీరమహిళలు లాంటివారు. పవన్ స్థానిక రాజకీయ సంప్రదాయాల కొనసాగింపు కాదు. స్థానిక రాజకీయాలకు పూర్తిగా ఎడంగా నిలబడి, జ్ఞానం ద్వారా గ్రహింపు కలిగి ప్రశ్నించే వీరుడు. వీరోచితులకే పవన్ రాజకీయాలలో కార్యసాధన స్థానం ఉంటుంది. సామాన్యులకు ప్రేక్షక పాత్ర మాత్రమే. పవన్ రాజకీయ ప్రవచనం ప్రేక్షకులను, వీరులను వేరు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో సామాన్యుల చైతన్యం నుండే మార్పులు సాధ్యమవుతాయి. వీరులు విగతులు అవుతారు, నిస్సహాయులు అవుతారు.
స్థానికంగా పవన్ ని రగిలించిన రాజకీయ పాయలు – కమ్యూనిస్టులు, దళిత ఉద్యమాలు, ఉపకుల అస్థిత్వ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు మొదలైనవి. పవన్ కి ఈ ఉద్యమాల పుట్టుక, ప్రవాహ గతులతో సంబంధం లేదు. జ్ఞానం ద్వారా గ్రహించి, తెలుసుకొని, మంచివి అని నమ్ముతారంతే. వాటి కొనసాగింపు కాదు. వాటి అంశను ప్రధాన స్రవంతి రాజకీయాలలో ప్రవేశపెట్టాలని ప్రయత్నం. పవన్ స్థానిక రాజకీయ సంప్రదాయాల కొనసాగింపు కాదు. ఏ ట్రెండు ఫాలో అవ్వట్లేదు. కొత్తది ట్రెండు అవ్వట్లేదు. ఒరవడిగా మారట్లేదు.
జనసేన సిద్ధాంతాలు
ఏడు సిధ్ధాంతాలను ప్రస్తావించారు. 1. కులాలను కలిపే ఆలోచనా విధానం, 2. మతాల ప్రస్తావన లేని రాజకీయం, 3. భాషలను గౌరవించే సంప్రదాయం, 4. సంస్కృతులను కాపాడే సమాజం, 5. ప్రాంతీయతను విస్తరించని జాతీయ వాదం, 6. అవినీతిపై రాజీలేని పోరాటం, 7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం.
మధ్య తరగతి అందమైన కలలు కంటుంది. కలలు పూర్తిగా కల్పన కాదు. దేశం అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు? స్వచ్చంగా ఉండాలని ఎవరనుకోరు? డెబ్భైయేళ్ళ ప్రజాస్వామ్యం విస్తృతి పెరిగింది. సామాజికంగా, రాజకీయపరంగా బడుగువర్గాల క్షేమం సాధిస్తూ మార్పులు వచ్చాయి. అదే సమయంలో ప్రజాస్వామ్య అవలక్షణాలు ప్రకోపించాయి. డబ్బు, కులం, మతం, అధికారం మరింత బలపడ్డాయి. జనసేన కొత్త రాజకీయ సిద్ధాంతాలను తయారు చేసుకోవడానికి సందర్భమిది. నూతన సిధ్ధాంత పరికల్పన, ఉన్న వ్యవస్థలను, అవలక్షణాలను విమర్శిస్తూ, ప్రజాక్షేత్రంలో ఆచరణ నుండి పుట్టిన భావాలను మదింపు చేసి తయారు చేసుకోవాలి. వివిధ భావనలు ప్రజాక్షేత్రంలో పరీక్షించినపుడు, వాటి చారిత్రక సందర్భాన్ని దాటి కొత్త సంవేదనలను సృష్టించి ప్రజా సమీకరణాలను పురిగొల్పగల్గుతున్నాయా లేదా అని బేరీజు వేసుకోగలం. జనసేన సిధ్హాంతాలు ప్రజాక్షేత్రంలో పుటం పెట్టడం వలన పుట్టినవి కావు. పవన్ వ్యక్తిగత ఆత్మశోధనాక్రమంలో అందమైన, నైతికమైన రాజకీయ ఆదర్శాలను ప్రతిఫలించే సిధ్ధాంతాలు. అవి ఆదర్శాలను కోరుకుంటాయి. ఆదర్శాలను సఫలీకృతం చేసుకునే క్రమంలో పుట్టిన వికృతాలను తొలిగించాలనుకుంటాయి.
ఉదాహరణకు – కులాలను కలిపే అలోచనా విధానం- ప్రజాస్వామ్య విస్తృతీకరణలో భాగంగా కులాలు బలపడ్డాయి. కులాల ద్వారా వ్యక్తులు బలపడ్డారు. అగ్రకులాలు, బడుగు కులాలతో సహా. కుల వైషమ్యాలు కూడా పెరిగాయి. ఈ మార్పుల క్రమాన్ని ఆమోదించకుండా కులాలను కలపడం సాధ్యమెలా అవుతుంది? పవన్ ఆలోచనా క్రమం జ్ఞానం నుండి పుట్టింది. అణగారిన కులాలలో నాయకత్వం రావాలి. బలపడాలి. తను కాపు కులస్తుడు. తన బుద్ది వైశాల్యత వలన మిగతా అణగారిన కులాలు బలపడాలని కోరుకుంటాడు. కానీ తోటి కులస్తులకు ఆ విశాలత ఎలా అలవడుతుంది? సమాజం అణచివేసే కులాలు, అణచివేయబడే కులాలుగా ఉంది. అణచివేతకు అగ్రకులాలు కారణమనే భావన ఉంది సిధ్ధాంతపరంగా. అదే వాక్ప్రవాహంలో అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలని అంటారు. అణచివేసేవారిని, అణచి వేయబడినవారిని కలిపే రాజకీయం జనసేన దగ్గర ఉందా? అంతలోనే సామాన్య జనం నూతన చైతన్యం ఎందుకు సంతరించుకోవట్లేదని ప్రశ్నిస్తారు. కులాలను పట్టుకుని వేళ్ళాడుతున్నారని, కులాంతర వివాహాలను అంగీకరించలేని వెనుకబాటు తనంలో కూరుకుపోయారని వాపోతాడు. అతని సిధ్హాంతం సౌందర్యాన్వేషణలో ఊహించుకునే అందమైన ఆదర్శం. వాస్తవ ప్రపంచ వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ సృజనాత్మకంగా రూపుదిద్దుకున్న భావనలు కాదు.
అవినీతి వ్యతిరేక పోరాటం గురించి – ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు జవాబుదారీతనం ఉండాలి. తన సొంత పార్టీ ప్రతినిధికి కూడా ప్రజలు ప్రశ్నించగలగాలి అని అంటారు. కానీ ప్రజలెందుకు ప్రశ్నించరు అని వాపోతారు.
వెనుకబాటు జనం
పవన్ ఆదర్శాలు నైతిక పరంగా శిఖరప్రాయమని, సామాన్యులు అనుసరించటంలేదని నిస్పృహ. పవన్ కు చప్పట్లు కొడతారు. ఓట్లు వేయరు. పవన్ ఆదర్శాలను అర్ధం చేసుకోరు, అనుసరించరు సామాన్యులు. శిఖరప్రాయమైన నైతికత, మొక్కవోని దీక్ష, స్థైర్యం జనసైనికులకు కావాలి. ఇది కుడా తక్కువైన డిమాండ్ కాదు. జనసైనికులు చాలామంది సినీ అభిమానులు. సైధ్ధాంతికంగా వారందరినీ ఉన్నతీకరించే ప్రక్రియ లేదు. రాజకీయ పాఠశాల ట్రయినీలు కాదు, అయ్యే అవకాశంలేదు. సామాన్య ప్రజానీకం సిధ్ధాంతాలను అవగాహన చేసుకోరు. అవసరం లేదు. మరోపాయ ప్రజాస్వామ్య ప్రక్రియలో సంఖ్యాబలాన్ని అనుసరించి అక్కడక్కడా గెలవగలిగే అవకాశం ఉంటుంది. వారికి ఎన్నికల ప్రజాస్వామ్యపు చట్రం నేర్పిన రాజకీయ ఎత్తుగడలే తప్ప ప్రజాసమస్యలను సరికొత్తగా లేవనెత్తే శక్తి యుక్తులు లేనే లేవు.
పవన్ లేవనెత్తాలనుకున్న ప్రశ్నలు అతని అభిమానగణానివి కాదు. అతని అభిమానగణాన్ని సైధ్ధాంతికంగా ఉన్నతీకరించే శక్తియుక్తులు పవన్ కు లేవు. అది సాధ్యం కాదు. సామాన్య జనబాహుళ్యపు ఆవేదనలను సిధ్ధాంతీకరించి, ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నానికి చాలా వదులుకోవాలి. చాలా నేర్చుకోవాలి.