- ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ
- వందల పంచాయతీల్లో రెండోస్థానంలో జనసేన
- పది పంచాయతీలను గెలవని బీజేపీ
- ఓటర్లను ఆకర్షించలేని సోము వీర్రాజు
- పంచాయతీ ఫలితాల సందేశం ఏమిటి?
అమరావతి : ఏపీ పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్ ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని బట్టి అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల పంచాయతీలను కైవసం చేసుకుంది. అదే సమయంలో ప్రధాన పంచాయతీలలో జనసేన ప్రభావం అనూహ్యంగా పెరగడంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడుతున్నారు. జనసేనతో పోల్చితే బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నష్ట పోయిందనే చెప్పాలి. బీజేపీ మూడు దశల్లో కలిపి పట్టుమని 10 పంచాయతీలను కూడా గెలవలేకపోయింది. ఇది ఏపీలో బీజేపీ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుతుందనడంలో సందేహం లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతి జిల్లాలోనే కాకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో జనసేన టీడీపీ ని భర్తీ చేసి రాష్ట్రంలో వైసీపీ కి ప్రత్యామ్నాయంగా ముందుకు రాగలదా? కూటమిలో జనసేనకు బీజేపీ నిజంగా అవసరం ఉందా లేక ఒంటరిగా పోరాడి ఎక్కువ సీట్లు దక్కించుకోగలదా ?
పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం :
పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో జనసేన అద్భుత పనితీరు కనబరుస్తోంది. ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా అప్రతిహత విజయాలతో దూసుకెళుతుండగా జనసేన ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో మరీ ముఖ్యంగా రైల్వే కోడూరులో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్థాయిలో జనసేనకు పట్టుందని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు రుజువు చేశాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 6% కన్నాతక్కువ ఓట్లు పొందిన పార్టీ పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పటికి మొదటి దశలో 18% ఓట్లు సాధించిన జనసేన మూడో దశ వచ్చేటప్పటికి 22% ఓట్లు సాధించి తన ఉనికిని బలంగా చాటుకుంది. ఓట్ల శాతం అనూహ్యంగా పెరగడం రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రత్యర్థి పార్టీలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 1500 పంచాయతీలలో జనసేన రెండవ స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన జనసేన క్షేత్ర స్థాయి నుంచి పవన్ కల్యాణ్ నెమ్మదిగా ప్రధాన పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు రేసులోకి వస్తున్నాడని ఎన్నికల వ్యూహకర్తలు అంచనావేస్తున్నారు. ఏపీ ప్రజలు ఇప్పటివరకు టీడీపీ, వైసీపీల పాలనను చూశారు. రాజధాని అమరావతి తరలింపు విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో ఆ పార్టీని ప్రజలు విశ్వసించడంలేదు. దీంతో జనసేన వైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల వరకు పవన్ వెంటే నడుస్తారా. అదే సమయంలో పవన్ కల్యాణ్ మరో మూడు సంవత్సరాలపాటు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడగలరా అనేదానిపై ఓటరు నాడి ఆధారపడి ఉంది.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ:
ఏపీ ప్రజలకు బీజేపీపై నమ్మకం లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ వైఖరి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి అంశాలు బీజేపీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. బీజేపీలోని సీనియర్ నేతలెవరూ స్టీల్ ప్లాంట్ గురించి సరైన నిజమైన ప్రకటన ఇవ్వలేకపోయారు. మరి ఓటర్లు ఎలా మద్దతిస్తారని విశాఖకు చెందిన బీజేపీ నేతలే తెరవెనుకు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. రామతీర్థం ఘటన తరువాత రథయాత్ర చేస్తామని చెప్పడం ఆతరువాత వెనక్కి తగ్గడం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వ లేమి బీజేపీ విశ్వాసం కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి వైసీపీకి మధ్య రహస్య సంబంధాలున్నాయని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ బలోపేతమయ్యేందుకు ప్రయత్నించడాన్ని పలువురు నేతలు తప్పుబడుతున్నారు. అలా చేయడం వల్ల బీజేపీకాస్తా టీడీపీ-2 అవుతుందని అలాంటపుడు మేమంతా జనసేనకు మద్దతు తెలుపుతామని కృష్ణా, గుంటూరుకు చెందిన కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రానికి రానున్న అమిత్ షా :
క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యరంగంలోకి దూకడానికి ప్రయత్నిస్తున్నారు. అమిత్ షా మార్చి 4న తిరుపతిని సందర్శిస్తారు. మార్చి 5న పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాబోయే తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే తిరుపతి లో బీజేపీ కంటే జనసేన ఎక్కువ బలంగా ఉన్నట్లు పవన్ విశ్వసిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని నిలబెడితే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న శెట్టి బలిజలు జనసేనకు మద్దతుతెలిపే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినపుడు చిరంజీవి తిరుపతి నుంచే విజయం సాధించిన విషయాన్ని జనసేన గుర్తుచేస్తోంది.
Also Read: ఔను…మా మధ్య గ్యాప్ నిజమే!
జనసేనకు బీజేపీ నిజంగా అవసరమా?
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కంటే జనసేన ఎక్కువ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీతో వెళ్లే కంటే ఒంటరిగా పోటీచేస్తే జనసేన ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చని ఎన్నికల వ్యూహకర్తలు భావిస్తున్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అనంతరం కమ్యునిస్టులు, బీజేపీతో పొత్తుపెట్టుకుంది. అయితే రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీ, బీజేపీలకు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని పొత్తులు లేకుండా పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని నెల్లూరుకు చెందిన జనసేన మద్దతుదారు వ్యాఖ్యనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి జనసేన మద్దతుతప్పనిసరి. ఎందుకంటే బీజేపీకి కనీసం ఓటర్లను ఆకర్షించే నేతలు రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. పవన్ ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్న బీజేపీ నేతలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక జనసేన అధినేత తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ఒంటరి వెళ్లి విజయం సాధిస్తారా లేక బీజేపీతో పొత్తు పెట్టుకుని నష్ట పోతారా అనేది ఆయన విజ్ఞతతో ముడిపడిఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఏకగ్రీవాలపై “పంచాయితీ”