చాలా మంది సీనియర్ నాయకులు వారసులను రాజకీయాల్లో తెచ్చే క్రమంలో తాము చిన్నచిన్నగా తప్పుకుంటున్నారు. దానికి మరో పేరే యువ నాయకత్వానికి ప్రోత్సాహం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి ఆ ఆలోచనలోనే ఉన్నారట. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల నర్శింహయ్య మృతి కారణంగా జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ పడనంటూ మనసులోని మాట చెప్పేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేది లేదని, తన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగుతాడని తేల్చి చెప్పేశారు. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం కూడా ఆయన ఈ నిర్ణయానికి కారణం అంటున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా రఘువీర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందనే అంటున్నారు.
ఇదీ చదవండి:బీజేపీలోకి జానారెడ్డి ?
తాను పార్టీ మారుతున్నట్లు సాగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని, అంత మీడియా సృష్టేనని జానారెడ్డి అనడంతో ఆయన బయటికి వెళ్లబోరని, పార్టీకి అభ్యర్థి దొరికినట్లయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తండ్రి పోటీ చేయకపోయినా ఆయన పలుకుబడి తనయుడికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం పార్టీ చూసుకుంటుందని జానారెడ్డి చెప్పడంతో ఆయనకు దానిపట్ల ఆసక్తి లేదని ఆశావహులకు కాస్త పోటీ తగ్గినట్లయిందని అంటున్నారు.
ఇదీ చదవండి :త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్న నాగార్జునసాగర్