Friday, January 10, 2025

ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

చాలా సంవత్సరాలు ఎన్నికల సమయంలో ఎన్ డీటీవీతో కలసి పని చేశాను, నన్ను విషయం చెప్పమని కానీ చెప్పొద్దని కానీ నిర్వాహకులు సూచించిన ఒక సన్నివేశం కూడా గుర్తులేదు. స్క్రీన్ పైన ఉన్నప్పుడూ, లేనప్పుడూ చర్చలలో ప్రణయ్ రాయ్ తో విభేదించాను. అది ఎన్నడూ సమస్య కాలేదు. మనకు తెలిసిన ఆ ఎన్ డీటీవీకి కాలం చెల్లిందన్నమాట.

వ్యాపార విషయాలూ, కార్పొరేట్ చట్టాలూ నాకంటే బాగా తెలిసినవారు నా అభిప్రాయంతో అంగీకరించకపోవచ్చు.రవీష్ కుమార్ రాజీనామా అందరూ భయపడుతున్నదాన్ని ధృవీకరించింది.

Also read: భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది

ఎన్ డీటీవీ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీనామా చేయలేదు కదా అనవచ్చు. వారు కూడా హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ల పదవుల నుంచి వైదొలిగారు. ఇప్పటికీ వారికే అత్యధిక వాటాలు కంపెనీలో ఉన్నాయి. వారికీ, ఎన్ డీటీవీకి చాలా అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కానీ నాకు రాజకీయాల గురించి కొంత తెలుసు. దేశంలోని అత్యంత సంపన్నవంతుడిని అత్యతం శక్తిమంతుడైన వ్యక్తి సమర్థిస్తున్నప్పుడు చట్టపరమైన అంశాలు ఏవీ వారి ధాటికి నిలబడజాలవు. బ్రాండ్ పేరు కొనసాగుతుంది. కంపెనీ ఇంకా వృద్ధిలోకి కూడా రావచ్చు. కానీ అది మనకు మూడు దశాబ్దాలుగా తెలిసిన ఎన్ డీటీవీ మాత్రం కాజాలదు.

అదానీ గ్రూప్ చైర్ పర్సన్ గౌతమ్ అదానీ నియమించిన కొత్త డైరెక్టర్లు స్వతంత్ర జర్నలిస్టులేనని మీడియా గురించి నాకంటే ఎక్కువగా తెలిసినవారు అంటున్నారు. సంజయ్ పుగాలియా గురించి మాత్రం అది నిజమేనని చెప్పగలను. నాకు ఆయన ఇరవై ఏళ్ళుగా తెలుసును. ఆయన మంచి జర్నలిస్టు, ఏ రకంగా చూసినా మోదీ విధేయుడు కాదు. అంటే అదానీ ఎన్ డీటీవీ- దాన్ని ఎఎన్ డీటీవీ అని పిలుద్దాం- చానల్ విధానాలను వెంటనే యూటర్న్ తిప్పకపోవచ్చునని సూచన మాత్రంగా చెప్పవచ్చు. పై నుంచి ఆదేశాలు వచ్చే వరకూ ఈ చానెల్ ప్రతిష్ఠకు తగినట్టుగా వ్యవహరించి వీక్షకులు సంఖ్య పడిపోకుండా కాపాడుకోవచ్చు. నెట్ వర్క్ 18ని ముఖేశ్ అంబానీ తీసుకున్న తర్వాత జరిగింది సరిగ్గా అదే.

Also read: ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి

ఎన్ డీటీవీ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్, రాధికారాయ్ ల రాజీనామా కంటే రవీష్ కుమార్ రాజీనామా ఎక్కువమంది ప్రజలను ఆకర్షించడం ఎన్ డీటీవీని అభినందించవలసిన విషయం. కడచిన కొన్నేళ్ళుగా సాగిన రవీష్ షోలు కొత్త చానల్ కు పతాక సదృశంగా నిలిచాయి. కేవలం హిందీ చానల్ కే కాదు. మొత్తం గ్రూప్ కే తలమానికం.  ‘‘మన కాలమాన పరిస్థితులలో సత్యం చెప్పడం ఎంతటి కష్టభూయిష్టమో రవీష్ కుమార్ పాటిస్తున్న జర్నలిజం నిరూపిస్తున్నది’’ అంటూ నేను ఇదే కాలమ్ లో కొంత కాలం కిందట రాశాను. ఆయనో శిఖరం. అట్లా అభివర్ణించడానికి సమంజసమైన కారణాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రణయ్, రాధికారాయ్ ల ఆత్మవిశ్వాసాన్ని, దూరదృష్టినీ కాదనలేము. వారు తమ యువ సహచరులకు తమంత ఎత్తు ఎదగడానికీ, తమను మించిపోవడానికీ కూడా అవకాశాలు ఇచ్చారు. మన భారత దేశంలో ఒక వ్యవస్థను నిర్మించడానికి వ్యవస్థాపకుడు తన సర్వస్వాన్నీ ధారపోస్తాడు, తర్వాత ఆ సంస్ధను తన బొటనవేలు కిందనే ఉంచుకుంటాడు. తాను నిష్క్రమించే నాటికి ఆ సంస్థను నిర్జీవంగా మార్చివేస్తాడు.  అది జాన్ -దూంగా-జాన్- లూంగా’ (ప్రాణం ఇస్తా, ప్రాణం తీస్తా) నమూనా. దీనికి రాయ్ ల వైఖరి పూర్తిగా విరుద్ధం. భిన్నంగా వ్యవహరించేందుకు ప్రణయ్, రాధికారాయ్ లు సాహసం చేశారు.  

దాతృత్వానికీ, న్యాయమైన ధోరణికీ నమూనా

1993లో ఎన్ డీటీవీకి నేను మొదటిసారి వెళ్ళిన సందర్భం నాకు స్పష్టంగా గుర్తుంది. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్)లో పని చేస్తున్న రోజులవి. ఎన్నికలపైన సెమినార్ మేగజైన్ తీసుకువస్తున్న ప్రత్యేక సంచికను ఎడిట్ చేయడానికి నన్ను ఆహ్వానించారు. ప్రణయ్ రాయ్ అశోక్ లాహిరి, డేవిడ్ బట్లర్ లతో కలిసి రాసిన పుస్తకం ‘ఎం కంపెండియమ్ ఆన్ ఇండియన్ ఎలక్షన్స్’ నన్ను ఎన్నికల తాత్త్వికత అనే ఉత్సాహభరితమైన ప్రపంచంలో అడుగుపెట్టడానికి  ప్రేరేపించింది. ఇప్పుడు సెఫాలజీ (ఎన్నికల శాస్త్రం) అని పిలుస్తున్న అంశంపైన కొన్ని వ్యాసాలు కూడా రాశాను. ఈ సెమినార్ ప్రత్యేక సంచికకోసం ప్రణయ్ రాయ్ ని ఇంటర్వ్యూ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాను. సెమినార్ సంపాదకుడు తేజ్ బీర్ సింగ్ నాకు దిల్లీలో తాజాగా తారసపడిన సిసలైన ఉదారవాద జర్నలిస్టు. తేజ్ బీర్ ఫోన్ డయల్ చేసి క్షణాలలో ప్రణయ్ రాయ్ తో అపాయంట్ మెంట్ చాలా తేలికగా ఖరారు చేయడం నాకు అమితాశ్చర్యం కలిగించింది. ఆ విధంగా గ్రేటర్ కైలాష్ లోని డబ్ల్యూ బ్లాక్ లో ఎన్ డీటీవీ కార్యాలయంలో ఉన్నాం. ఒక హీరోని కలవడానికి వచ్చిన కుర్ర అభిమానిలాగా నా ధోరణి నాకు అనిపించింది. నా లాంటి అనామకుడైన కుర్రవాడి పట్ల ప్రణయ్ రాయ్  శ్రద్ధాసక్తులు  కనపరడం, చైనీస్ టీ తాగుతావా అని అడగడం మాత్రం గుర్తుంది. అసలు చైనీస్ టీ అనేది ఉంటుందనే విషయం కూడా నాకు అప్పట్లో  తెలియదు.

Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు

అప్పటి నుంచి పెక్కు సంవత్సరాలుగా ప్రణయ్ రాయ్ ప్రేమాభిమానాలను పొందే అదృష్టం నాకు దక్కింది. 1996 లో ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరిగిన రోజును నేను ఎన్నటికీ మరచిపోజాలను. ఎక్జిట్ పోల్ పై ఆధారపడి నేను దూరదర్శన్ కు నా అంచనా నివేదికను ఇచ్చాను. ఎందుకో కానీ  ఎన్నికల అంచనాలలో ధురంధరుడైన ప్రణయ్ రాయ్ కి పోటీగా నా అంచనాలను దూరదర్శన్ లో ప్రసారం చేశారు. ఓట్ల లెక్కింపు జరిగిన నాడు కర్ణాటకలో ట్రెండ్ లు మొదటగా రావడం ప్రారంభించాయి. మా అంచనాలు తప్పాయి. బహుశా మేము తప్పిన పెద్ద రాష్ట్రం అదొక్కటే కావచ్చు. చమత్కారభరితమైన, అర్థవంతమైన ఏక వాక్య ప్రయోగంలో ప్రతిభావంతుడైన స్వర్గీయ జైపాల్ రెడ్డి ‘ఎగ్జిట్ పోల్ కీ పోల్ ఖుల్ గయా’ (ఎగ్జిట్ పోల్ బండారం బయటపడింది) అంటూ ఎద్దేవా చేశారు. నా అంచనాలను ఆటపట్టిస్తున్న జైపాల్ ను ప్రణయ్ ప్రోత్సహించవచ్చు లేదా చిరునవ్వుతో ఆమోదించవచ్చు. ఎందుకంటే ఆ డిబేట్  లో నన్ను సమర్థించుకోవడానికి అక్కడ  నేను లేను. కానీ ప్రణయ్ రాయ్ జైపాల్ రెడ్డిని నిలువరించారు. తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని చెబుతూ జైపాల్ ని అడ్డుకున్నారు. మా అంచనాలు ఎంత సవ్యంగా ఉన్నాయో ఇతర రాష్ట్రాల అంచనాలను చూస్తే తెలుస్తందని అన్నారు. మా ప్రతిష్ఠ కాపాడారు. అదీ ప్రణయ్ రాయ్ అంటే. దయకూ, ఉదారత్వానికీ, న్యాయమైన వైఖరికీ, దర్పానికీ నిదర్శనం.

ఈ వ్యక్తిగత యోగ్యతలను ప్రణయ్, రాధికారాయ్ వ్యవస్థాగత విలువలుగా మార్చివేశారు. కడచిన మూడు దశాబ్దాలుగా బయటి వ్యక్తిగా, దాదాపు లోపలి వ్యక్తిగా ఎన్ డీటీవీని చూశాను. వరల్డ్ దిస్ వీక్ రోజుల నుంచీ వార్తలూవ్యాఖ్యల  కోసం ఎన్ డీటీవీనే చూసేవాడిని. ప్రతిష్ఠాత్మకమైన ఎన్ డీటీవీ ఎన్నికల బృందంలో పని చేసే మహదవకాశం నాకు దక్కింది. ఆ లోగా నేను ఎన్ డీటీవీకి పోటీ చానళ్ళు అయిన ఆజ్ తక్ లోనూ, సీఎన్ఎన్-ఐబీఎన్ లోనూ పని చేశాను. ఈ మధ్య ఎన్ డీటీవీ వార్తలలో నేనూ కనిపిస్తున్నాను. న్యాయబద్ధమైన వైఖరి,  సంపాదక స్వేచ్ఛ ఎన్ డీటీవీ ప్రత్యేక లక్షణాలు. ఇన్నేళ్ళుగా అత్యంత సున్నితమైన రాజకీయ అంశమైన ఎన్నికలపైన చర్చాగోష్ఠులలో ఏదైనా అనమని కానీ అనవద్దని కానీ నాతో చెప్పిన లేదా సంకేత ప్రాయంగా సూచించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. తెరపైన ఉన్నప్పుడూ, తెర బయట ఉన్నప్పుడూ ప్రణయ్ రాయ్ తో నేను విభేదించాను. అది ఎన్నడూ సమస్యే కాలేదు. ఎన్ డీటీవీ 2004 ఎన్నికల ఫలితాలను ఊహించడంలో విఫలమైనప్పుడు ప్రణయ్ రాయ్ స్టుడియో నుంచి బయటకు వచ్చి సర్వేఫలితాల అధ్యయనంలో నా వాదనను అంగీకరించకపోవడం పొరపాటని అంగీకరిస్తూ న్యూస్ రూంలో అందరికీ వినిపించేలాగా బహిరంగంగా ప్రకటించారు.  ఒక యజమాని కానీ, సంపాదకుడు కానీ విద్యావేత్తగానీ ఈ విధంగా ప్రకటించడం అన్నది నేను ఊహించలేను.

Also read: చట్టసభల నుంచి రహదారి వరకూ- కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఎందుకు చేరుతున్నాయి?

ప్రజాస్వామ్య భారతావనికి సమర్థుడైన రక్షకుడు  

నేను రాధికా, ప్రణయ్ రాయ్ అంటున్నానంటే ఏదో రాధిక పట్ల మర్యాదగా అన్నట్టు అర్థం కాదు. న్యూస్ చానెల్ ముఖం, గొంతుక ప్రణయ్ రాయ్ అయితే రాధిక వ్యవస్థ వెనుక ఉన్న మెదడు, శక్తి. ఆమె గురించి తక్కువగా రాసింది ఎందుకంటే ఎన్ డీటీవీతో నాకు సంబంధం ఎక్కువగా ఎన్నికల సమయంలో ప్రణయ్ రాయ్ నాయకత్వంలోని ఎన్నికలప్రవీణుల బృందంతోనే కనుక. భారత వార్తా సంస్థలలో కనిపించని వృత్తిపరమైన విలువలు ఎన్ డీటీవీలో కనిపిస్తాయి. దానికి కారణం రాధికారాయ్ అని అందరూ అంటారు. సంపాదకీయ విధానంలోనే కాకుండా నిర్మాణదక్షతలోనూ, విలువలలోనూ (ప్రొడక్షన్ వాల్యూస్) ఎన్ డీటీవీ అగ్రగామి. దృశ్యాలూ, గ్రాఫిక్ ల విలువ తెలిసి సద్వినియోగం చేసుకునే కొద్ది భారత చానల్స్ లో ఎన్ డీటీవీ ఒకటి. ఒక్క ఎన్ డీటీవీ స్టుడియోలోనే ఫ్లోరంతా అన్నిపనులూ మహిళలు చేస్తూ కనిపిస్తారు. కెమెరా పర్సన్ నుంచి ప్రొడక్షన్ టీంలోని వారూ, బ్యాక్ రూంలో పని చేసేవాళ్ళతో సహా అందరూ మహిళలే ఉండటం విశేషం. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే భారత మీడియా సంస్థలలో ఇటువంటి మహిళా చైతన్యం సాధించడం ఒక అరుదైన ఘనకార్యమే. సంపాదకేతర సిబ్బంది పని  సంస్కృతి అన్నిటికంటే అధికంగా నన్ను ఆకట్టుకున్నఅంశం. సంస్థాపరమైన మౌలిక విలువలు పటిష్ఠంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం. మనలను గుమ్మం దగ్గరికి కారులో తీసుకొని వెళ్ళే డ్రైవర్ కానీ మనకు మద్యాద ఇస్తూనే హుందాగా వ్యవహరించే అటెండర్ కానీ ఎన్ డీటీవీ పట్టీని ఒక గౌరవప్రదమైన చిహ్నంగా ధరిస్తాడు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండే క్లీనర్ కూడా సరైన దుస్తులు ధరించి పద్ధతి ప్రకారం గౌరవప్రదంగా ఉంటారు.

అవును. ఎన్ డీటీవీ కులీనమైన ఇంగ్లీషు సంస్కృతి ఉట్టిపడే సంస్థే. భారత దేశంలో గొప్పవాళ్ళ పిల్లలు చాలామంది ఆ సంస్థలో పని చేస్తూ కనిపిస్తారు. అటువంటి నేపథ్యం లేని రవీష్ కానీ నేను కానీ ఏదో ఒక విధంగా ఈ క్లబ్ లో ప్రవేశం పొందాం. సంకోచంగా, సరదాగా అక్కడి పరిస్థితులను చూస్తూ పోయాం. కానీ అక్కడి కులీనులకు తమ ప్రతిభాపాటవాలపైన అపారమైన నమ్మకం లేదు. అందుకే వారి వైఖరిలో అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించే గుణం ఇమిడి ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మన పూర్వీకులు రాసిన రాజ్యాంగాన్ని నిలబడి సమర్థించేది ఈ కులీనులే కావడం విశేషం. ప్రజాస్వామ్య, లౌకిక భారతం అనే ఆలోచనను సమర్థించేందుకూ, కాపాడేందుకూ అవసరమైన మూల్యం చెల్లించడానికి సిద్దంగా ఉన్నది కూడా  ఆ కులీనులే. ఏఎన్ డీటీవీ ఈ వారసత్వాన్ని కొనసాగిస్తుందా? అసలు ఇటువంటి ప్రశ్న అడగడం సమంజసమా?

Also read: ‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? సుప్రీంకోర్టు నిరుపేదల తర్కానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందా?

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

1 COMMENT

  1. జర్నలిజం అంటే.. మగవారి పని. 24/7 ఉరుకులు, పరుగులు. వార్తల కవరేజీ, ఇన్వెస్టిగేషన్‌ స్టోరీల కోసం సాహసాలు చేయాల్సిన పరిస్థితులు వస్తే..! అందుకే మహిళలు ఈ ఫీల్డ్‌కు సెట్‌ కారు. వర్దమాన మీడియా యాజమాన్యాల ఆలోచనలు ఇంచుమించుగా ఇక్కడే ఉండిపోయాయి. మరి న్యూస్‌ చదివే యాంకర్లు ఉన్నారు కదా.. అంటే? కేవలం తమ ముఖారవిందంతో వీక్షకులను ఆకట్టుకుంటారు కనుకే.. ఆ అవకాశం మినహా, ఫీల్డ్‌ జర్నలిస్టులుగా మహిళలకు అవకాశం గగన కుసుమమేనే చెప్పవచ్చు. గుజరాత్‌ ఫైల్స్‌ పరిశోధన చేసిన సంచలన సంస్థ తెహల్కా జర్నలిస్ట్‌ మైథిలీ త్యాగి(రానా ఆయూబ్‌) వంటి వేళ్లపై లెక్కించగలిగే ఏ కొందరో పై గోడలను బద్దలు కొట్టి, చూపించగలిగారు. కానీ.. మగవారిని మించిన ప్రతిభా పాఠవాలు, సామర్థ్యం, స్థైర్యం, ఆసక్తి ఉన్న ఎంతమంది మహిళలను మీడియా సంస్థలు ఫీల్డ్‌కి పంపిస్తున్నాయనేదే ఇక్కడే ప్రశ్న.

    స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ జాతీయ మీడియా సంస్థ ఎన్‌డీటీవీ ప్రస్థానంపై రాసిన తన వ్యాసంలో ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. రాధికా రాయ్‌ చొరవతో ఢిల్లీలోని ఎన్‌డీటీవీ ప్రధాన కార్యాలయంలో ఓ ఫ్లోర్‌ మొత్తం జర్నలిస్టులు, సాంకేతిక సిబ్బంది, ఇతర పనివారు అంతా.. మహిళలేనంట. పురుషాధిక్య ప్రొఫెషన్‌లో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎన్నో ఆశలు, ఆంకాంక్షలతో జర్నలిజం లోకి అడుగు పెట్టే వారికి మీడియా సంస్థలు ఈమాత్రం ప్రోత్సాహం అందించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. వారంతా పంజరం నుంచి రెక్కలు విచ్చుకున్న విహంగంలా స్వేచ్ఛా, స్వాతంత్రాలతో వినువీధిన విహరిస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, జర్నలిజం లక్ష్యాలు, లక్షణాలను మరిం‍త పరిపుష్టం చేస్తారనడంలో సందేహం అక్కర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles