వోలేటి దివాకర్
వచ్చే ఎన్నికల్లో జనసేన… టీడీపీ మధ్య పొత్తు కుదిరితే సీఎం అభ్యర్థి ఎవరూ అన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మోస్తారా ?….పవన్ కోసం బాబు సీఎం పదవిని త్యాగం చేస్తారా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. టీడీపీతో పొత్తును కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వ్యతిరేకించడం లేదు. పవన్ సీఎం కావాలన్నదే వారి ఆకాంక్ష. మరి పవన్ కోసం తెలుగుదేశం పార్టీ త్యాగాలు చే స్తుందా …… తెలుగు తమ్ముళ్లు తమ సీట్లు వదులుకుంటారా? అన్నది చూడాలి.
Also read: చిన్నారి చిరునవ్వు కోసం….
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని, తమ కూటమి అధికారంలోకి వస్తే తానే సిఎం పదవిని స్వీకరిస్తానని కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ ను విమానాశ్రయంలో అడ్డుకున్నప్పుడు చంద్రబాబు పరామర్శించారు. తాజాగా కుప్పంలో చంద్రబాబు నాయుడు రోడ్డుషోను అడ్డుకున్నందుకుగాను పవన్ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ పరస్పర పరామర్శలు రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుకు సంకేతం అని విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే, కాపులు ఇప్పుడు జనసేనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తమ నాయకుడు సీఎం కావాలని కోరుకుంటున్నారు. బేషరతుగా టీడీపీకి మద్దతు ఇచ్చి బాబు పల్లకీని మోస్తాను అంటే మాత్రం కాపులు జనసేనకు దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 70 ఏళ్లు దాటిన చంద్రబాబు 2029 లో సిఎం అభ్యర్థిగా పోటీలో ఉండకపోవచ్చు. పాదయాత్ర చేస్తూ ఆయన కుమారుడు లోకేష్ లైన్లో ఉన్నారు. ఈపరిస్థితుల్లో బాబు సీఎం పదవిని పవన్ కోసం త్యాగం చేస్తారా అన్నది అనుమానంమే.
Also read: బెదిరించి…తరలించి… సాధించిందేమిటీ?
పవన్ కల్యాణ్ అధికార వైసిపి ఓట్లు చీలిపోకుండా చూస్తామని పునరుద్ఘాటిస్తున్నారు. పొత్తుల విషయంలో వైసిపి చెప్పినట్లు నడుచుకోవాలా అని కూడా ఆయన నిలదీశారు. తద్వారా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
పొత్తులుంటే పవన్..ఒంటరైతే జగన్
వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు పవన్ పొత్తుల వ్యవహారం ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది . అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోతే జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యతిరేక పక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే మళ్లీ వైసిపి అధికారంలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సింహం సింగిల్ గా వస్తుంది …పవన్ 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయగలరా అంటూ పొత్తులను విచ్చిన్నం చేసేందుకు అధికార పార్టీ పవన్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది.
Also read: అమరావతి రైతులకు అరసవిల్లి వెళ్లే భాగ్యం లేదా?!
బిజెపికి పవన్ బైభై?
వైసిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న పవన్ కల్యాణ్ పిలుపు వినడానికి బాగానే ఉన్నా … ఆయన మిత్రపక్షం బిజెపి ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్నదే పెద్ద చర్చనీయాంశం. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని కుటుంబ పార్టీతో కలిసి నడవకూడదని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే తాజాగా సోము వీర్రాజు కూడా స్పందించారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బిజెపి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బిజెపి త్యాగాలు చేయదని సోము స్పష్టం చేయడం గమనార్హం. బిజెపి ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేసిందని కూడా సోము పరోక్షంగా గత పొత్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమిలో చేరేందుకు సీపీఐ సిద్ధంగా ఉన్నామని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. బీజేపీ తమ బద్ద వ్యతిరేకులైన వామపక్షాలతో కలిసి పని చేయడం కల్ల. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన మధ్య పొత్తు విచ్చన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పవన్ టిడిపితో కలిసి నడవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also read: కాంగ్రెస్ ఒంటరి పోరు!..2024 కాంగ్రెస్ దేనట!
విశ్లేషణ చాలా బాగుంది.కాపులు తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ ముఖ్యమంత్రు కావాలని కోరుకుంటున్నారు.కానీ చంద్రబాబు సి ఎం కావడానికి కాపులు అంగీకరించే పరిస్థితి ఉండదు.