వోలేటి దివాకర్
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అసలు విషయం అవినీతి అంశం పక్కదారిపట్టి… సాంకేతిక అంశాలపై విచారణలు, చర్చలు జరగడం విస్మయానికి గురిచేస్తోంది. ఈకేసు మొత్తం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చుట్టూ తిరుగుతోంది. ఈ సెక్షన్ ప్రకారం 2018 తరువాత ప్రజాప్రతినిధుల పై నమోదైన అవినీతి కేసుల్లో వారిని అరెస్టు చేయాలంటే వారితో ప్రమాణం చేయించిన గవర్నర్ అనుమతి తప్పనసరిగా ఉండాలి. ఈ సెక్షన్ ప్రకారం ఒక మాజీ ముఖ్యమంత్రిని గవర్నర్ అనుమతి లేకుండా అవినీతి కేసుల్లో అరెస్టు చెల్లదని, ఈ కేసును కొట్టివేయాలని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటూ… సుమారు నెలరోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంటున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తరుపున ఉద్దండులైన ముగ్గురు న్యాయవాదులు తీవ్రంగా వాదిస్తున్నారు. కేసులో ప్రధానాంశమైన అవినీతి జరిగిందా లేదా అన్న వాదనను పక్కన పెట్టి, గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నది వారి వాదన. చంద్రబాబునాయుడి తరుపు న్యాయవాదుల వాదన ప్రకారం చూస్తే గవర్నర్ అనుమతి ఉంటే అరెస్టు సక్రమమే అవుతుందన్న మాట. అంటే స్కిల్ కుంభకోణంలో అవినీతి జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నట్టే భావించాల్సి ఉంటుంది. ఇదే కేసులో మాజీ మంత్రి కె అచ్చెంనాయుడిని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు గవర్నర్ అనుమతి విషయం అసలు ప్రస్తావనకే రాకపోవడం గమనార్హం. ఒక వేళ ఇలాంటి కేసే తెలంగాణాలో నమోదై ఉంటే గవర్నర్ అనుమతి అంశం అసలు ప్రస్తావనకు వచ్చేదే కాదని ఒకానొక సీనియర్ పాత్రికేయుడు అభిప్రాయ పడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వంతో ఉప్పునిప్పులా ఉన్న గవర్నర్ తమిళసై అవినీతి కేసులో బిఆర్ఎస్ మంత్రి ఇరుక్కుంటే వెంటనే అనుమతి ఇచ్చేసి ఉండేవారన్నారు. అలాగే తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్ లో జగన్ ను అరెస్టు చేయాలన్నా ఈ సెక్షన్ ఆయనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో ఆయనకు అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉంటే సంబంధిత ఫైలును కొంతకాలం తొక్కి పెట్టే అవకాశాలు ఉంటాయి.
Also read: త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర!
అయితే ప్రముఖ న్యాయనిపుణులు పి అచ్యుతదేశాయ్ ఈకేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కెఎం మనోజ్ వర్సెస్ కేరళ స్టేట్ కేసులో కేరళ హైకోర్టు ఇలాంటి కేసులోనే కీలక తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అవినీతి కేసుతో పాటు, క్రిమినల్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైతే 17ఏ వర్తించదని కేరళ హైకోర్టు 2021లోనే తీర్పునిచ్చిందని దేశాయ్ వెల్లడించారు. ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం చంద్రబాబునాయుడు కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి బేలా ఎం త్రివేది ఈకేసులో తాము జోక్యం చేసుకోలేమని ట్రయల్ కోర్టుకు నివేదించాలని ఉత్తర్వులు జారీ చేశారని అచ్యుత్ దేశాయ్ వెల్లడించారు.
Also read: త్యాగులు ఎవరు ?…. తిరుగుబాటుదారులెవరు?!
ఈనేపథ్యంలో చంద్రబాబునాయుడి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే సుప్రీంకోర్టులో ఆయనకు భంగపాటు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిఐడి తరుపున న్యాయవాదులు న్యాయమూర్తి బేలా త్రివేది కేరళ కేసులో ఇచ్చిన గత ఉత్తర్వులను ప్రస్తావిస్తే కేసు నీరుగారిపోతుందని విశ్లే షిస్తున్నారు. ఒకేరకమైన కేసుల్లో ఒక న్యాయమూర్తి భిన్న ఉత్త ర్వులు ఇచ్చే అవ కాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం సుప్రీం కోర్టులో ఈకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: చంద్రబాబు అరెస్టు తరువాత….!