బిహార్ ఎన్నికలు ముంచుకొని వస్తున్నా, పోలింగ్ తేదీలు వెలువడినా రాంవిలాస్ పశ్వాన్ కుటుంబం నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) ఊగిసలాటలోనే ఉంది. రాంవిలాస్ పశ్వాన్ దిల్లీలో వైద్యం చేయించుకుంటూ అక్కడే ఉన్నారు. కుమారుడు చిరాగ్ చక్రం తిప్పుతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా చిరాగ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పైన ధ్వజమెత్తారు. అదే పనిగా అన్ని అంశాలపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తూ పెద్దాయనను చిరాకు పెడుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా చిరాగ్ పాశ్వాన్ చేతిలోనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ తిరిగి ఎన్ డీ ఏ కూటమిలో చేరినప్పటి నుంచీ పాశ్వాన్ లలో అశాంతి పెరిగింది. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా జేడీ-యూనీ, ముఖ్యమంత్రిని తూర్పారపడుతున్నారు తండ్రీకొడుకులు. మరో దళిత నాయకుడిని అధికార కూటమిలోకి తీసుకురావడం వెనుక నతీశ్ కుమార్ చాణక్యం ఉన్నదనీ, తమను బలహీనపరిచే ఉద్దేశంతోనే మాంఝీకి స్వాగతం చెప్పారని రాంవిలాస్, చిరాగ్ ల నిశ్చితాభిప్రాయం. See Also: నితీష్, తేజశ్వి మధ్యనే పోటీ
నితీశ్ పై ధ్వజం
అందుకే, బీజేపీని వదిలి జేడీ-యూ, తదితర పార్టీలూ పోటీ చేయబోయే 143 స్థానాలకూ (ఈ అంకెలు మారవచ్చు) ఎల్ జేపీ అభ్యర్థులను నిలబెడుతుందని చిరాగ్ ప్రకటించారు. ఇదే బెదిరింపును చిరాగ్ అమలు చేసినట్లయితే బిహార్ లో మూడో ఫ్రంట్ తయారవుతుంది. ఇప్పటి వరకూ పాలక కూటమి అయిన ఎన్ డీఏ, ప్రతిపక్ష కూటమి అయిన మహాకూటమి (గ్రాండ్ అలయెన్స్) పోటీపోటీగా రాజకీయాలు నడిపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్ సభలో జమునీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిరాగ్ అసెంబ్లీ బరిలో అభ్యర్థిగా దిగవచ్చుననీ, అసెంబ్లీ ఎన్నికలను జూనియర్ పాశ్వాన్ బాగా పట్టించుకుంటున్నాడని, నితీశ్ తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చేయవలసింది అంతా చేయాలని అనుకుంటున్నారనీ వినికిడి. ‘నేనో, నితీశ్ కామారో’ తేల్చుకోవాలని అనే విధంగా చిరాగ్ పోటీకి కాలుదువ్వుతున్నారని అంటున్నారు.
See Also: అధికార, ప్రతిపక్ష కూటమల సమాయత్తం
కనీస ఉమ్మడి కార్యక్రమం
‘‘కనీస ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేస్తేనే, అందులో ఎల్ జేపీకి నిర్దిష్టమైన పాత్ర ఉంటేనే ఎన్ డీ ఏ కూటమిలో కొనసాగుతామని గత నవంబర్ నుంచీ చెబుతూనే వస్తున్నాం. ఉన్నత పదవులలో, నిర్ణాయక పాత్రలో ఉన్నవారు మాతో సంపర్కంలో ఉండాలనీ, మేము చెప్పేది ఆలకించాలనీ కోరుకుంటున్నాం,’ అని చిరాగ్ ఇటీవల స్పష్టం చేశారు. పోరాడే శక్తి, యుక్తి తనకు తండ్రి నుంచి సంక్రమించాయనీ, పోరాడుతూనే రాజకీయాలను నడిపించాలన్నది తమ అభిమతమనీ చిరాగ్ చెప్పారు. ఎన్ డీ ఏ నుంచి వైదొలగాలా, లేదా, వైదొలిగితే ప్రతిపక్ష ఆర్ జేడీ నాయకత్వంలోని మహాకూటమిలో చేరాలా లేక స్వతంత్రంగా రంగంలో నిలబడాలా అన్నది చిరాగ్ ముందున్న ప్రశ్నలు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచే గుర్రం ఏదో తెలివిగా ముందే గ్రహించి ఆ పార్టీతో అనుబంధం పెట్టుకోవడం, గెలిచే కూటమిలో చేరడం అన్నది రాంవిలాస్ పాశ్వాన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇంత పోరాటం చేసిన తర్వాత కూడా ఎన్ డీ ఏకి విజయావకాశాలు ఉంటాయని నమ్మకం కుదిరితే పాశ్వాన్ లు సర్దుకొని పోతారనీ, ఎన్ డీఏ లోనే నిక్షేపంగా కొనసాగుతారనీ బిహార్ రాజకీయాలను పరిశీలిస్తున్న సీనియర్ పాత్రికేయులు అంటున్నారు.