కేరళ దక్షిణాదిలోనే విశిష్టమైన రాష్ట్రం. దేశంలోనే 96.2 శాతం అక్షరాస్యతతో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం. మతపరంగానూ వైవిధ్యం ఉన్న రాష్ట్రం. సగంమందికి పైగా హిందువులు- 54.73%, ముస్లింలు 26.56%, క్రిస్టియన్స్ 18.38% తో మేధోవంతమైన రాష్ట్రంగానూ పేరుంది. ఇక్కడ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు. ప్రజలు ఎక్కువమంది అక్షరాస్యులు, ఆలోచనాపరులు. వ్యక్తుల కంటే వ్యవస్థకే ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇటువంటి చోట గెలుపు అంత ఆషామాషీ కాదు. దాదాపు ఐదు దశాబ్దాల కేరళ రాజకీయాలను గమనిస్తే ఓటింగ్ సరళి, పార్టీలను ఎన్నికల్లో ఎంచుకునే విధానం అర్ధమవుతుంది.
ఐదేళ్ళకు మించి అధికారం ఉండదు
ఇక్కడ ఐదేళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీ /కూటమికి రెండవ దఫా అధికారం దక్కలేదు. తమిళనాడులో కూడా ఇంచుమించుగా ఇదే సంప్రదాయం ఉన్నప్పటికీ, కేరళ పౌరుల తీరే వేరు. ప్రస్తుతం వామపక్ష కూటమి (ఎల్ డి ఎఫ్ ) అధికారంలో ఉంది. 2016 నుంచి పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా ఎల్ డి ఎఫ్ అధికారంలోకి వచ్చి, మళ్ళీ పినరయి విజయన్ ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు చెప్పడమేకాక, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు కూడా వాటికి దగ్గరగానే ఉన్నాయి. ఈ విధంగా వరుసగా రెండవసారి కూడా ఒకే పార్టీ /కూటమిని అందలమెక్కించడం కేరళలో గడచిన యాభై ఏళ్ళల్లో ఇదే మొదటిసారిగా చరిత్రకెక్కబోతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
Also Read : గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?
నలభై నాలుగేళ్ల రికార్డు బద్దలా?
1970, 1977లో యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ఆ రికార్డు బద్దలు కాబోతుందని ప్రచారం జరుగుతోంది. కేరళ శాసనసభలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 71స్థానాలు కావాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్ డి ఎఫ్ కు 91 స్థానాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన పార్టీ సిపిఐ (ఎం)కు 58స్థానాల బలిమి వుంది. ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామి సిపిఐ. ఈ పార్టీకి 19 సీట్లు ఉన్నాయి. మిగిలినవన్నీ చిన్నాచితకా పార్టీలు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న యూ డి ఎఫ్ లో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్. దీనికి 21స్థానాలు ఉన్నాయి. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి ఐయూఎంఎల్ కు 18 సీట్లు ఉన్నాయి. మిగిలిన చిన్న పార్టీలతో కలుపుకొని యూడిఎఫ్ బలం -43 మాత్రమే.
బలంమీద ఉన్న ఎల్ డీఎఫ్
అధికారంలో ఉన్న ఎల్ డిఎఫ్ 91 స్థానాలతో రెట్టింపును మించిన బలంతో వుంది. ఈ ఐదేళ్లల్లో ప్రతిపక్ష పార్టీలు తమ బలాన్ని పెంచుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో 19 గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాకపోతే, వీటి ప్రభావం అసెంబ్లీ స్థానాలపై ఉండదన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కాంగ్రెస్ పార్టీకి బాధ్యుడుగా నియమించారు. కొన్నాళ్ల నుంచి ఆయన పార్టీలో చురుకుగా లేకపోయినా పార్టీ బాధ్యతలను అప్పచెప్పడంపై పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా యూడిఎఫ్ ఇంతవరకూ ప్రకటించలేదు.
Also Read : రాజకీయాల్లోనూ అసమానతలు
స్థానిక ఎన్నికలలో యూడీఎఫ్ పరాజయం
ప్రధాన భాగస్వామ్య పార్టీ ఐయూఎంఎల్ కు 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ కు దాదాపు సమానమైన సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి పీఠంపై ఈ పార్టీ కూడా కన్నేసింది. దీనికి తోడు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో యూడిఎఫ్ కు వచ్చిన ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి.కూటమిని ఉత్తేజ పరిచే నాయకులు, ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకత్వం లేకపోవడం వల్ల యూడిఎఫ్ వెనుకబడి పోయింది. వ్యవస్థాగతంగా ముందుకు తీసుకెళ్లే చర్యలు పెద్దగా చేపట్టలేదు.
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్
ప్రతిపక్ష కూటమి ఇలా ఉండగా, కేరళలో చొచ్చుకుపోవాలని బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి ఒక సీటు దక్కించుకొని, కేరళలో బోణీ కొట్టింది. దేశంలో మెట్రో మ్యాన్ గా ఎంతో మంచిపేరున్న శ్రీథరన్ ను పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇటీవలే ఆయన్ను పార్టీలో చేర్చుకుంది. కేరళలో బిజెపికి ఉన్న బలం అంతంత మాత్రమే. శ్రీథరన్ గొప్ప వ్యక్తే కావచ్చు. ఇంత తక్కువ కాలంలో పార్టీకి జవసత్వాలను తీసుకురాగల రాజకీయ ప్రజ్ఞ ఆయనకు ఏ మేరకు ఉందన్నది అనుమానమే.
Also Read : కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్
మలయాళీల మనస్తత్వం వేరు
ఇప్పుడు వేసే పునాదులతో భవిష్యత్తులో ఇక్కడ బిజెపి బలం పెరుగవచ్చు. హిందుత్వ ఎజెండా ఏ స్థాయిలో ఇక్కడ ప్రజలపై ప్రభావం చూపిస్తుందన్న దానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఇక్కడ హిందువులు 54శాతం ఉన్నారు. వీరందరూ బిజెపి వైపే మల్లుతారని భావించలేం. కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంక్ వుంది. ముస్లింలు, క్రిస్టియన్స్ కలిపి కేరళలో 45శాతంమంది వున్నారు. వీరు బిజెపి వైపు ఆకర్షితులవుతారా? అన్నది పెద్ద ప్రశ్న. ఇక్కడ బిజెపి సీట్లు గతంలో కంటే పెరిగే అవకాశం మాత్రం వుంది. కొత్త కూటమిని తయారుచేస్తే, కొంత మెజారిటీ వస్తుంది. ఏది ఏమైనా 2021ఎన్నికల్లో బిజెపి ఇక్కడ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం.
స్థానిక ఎన్నికలలో సత్తా చూపిన ఎల్ డీఎఫ్
అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా వచ్చే స్థానిక ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయని ఇక్కడ చరిత్ర. స్థానిక ఎన్నికల్లో ఎల్ డిఎఫ్ కు గణనీయమైన ఆధిక్యం వచ్చింది. 2016లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలనే ప్రజల నాడిగా విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో పినరయి ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. అవినీతి పెరిగిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఇవేమీ నిన్నటి స్థానిక ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపించలేక పోయాయి.
Also Read : బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు
పినరయి ప్రత్యేక కృషి
దానికి తోడు, 2016లో అధికారాన్ని చేపట్టిన నాటి నుంచే క్షేత్రస్థాయిలో కూటమిని బలోపేతం చేసే చర్యలను ముఖ్యమంత్రి పినరయి చేపట్టారని పరిశీలకులు చెబుతున్నారు. ఎల్ డి ఎఫ్ 2019లో లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందినా, అభివృద్ధి కార్యక్రమాలతో స్థానిక ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకుంది. మొత్తంమీద, కేరళలో ప్రస్తుతం ఎల్ డి ఎఫ్ కు అనుకూల పవనాలు ఘనంగా వీస్తున్నాయి. మళ్ళీ విజయన్ నే విజయం వరించనుందని కేరళ రాజకీయ వాతావరణం చెబుతోంది. నిజంగా ఇది సంభవిస్తే, చరిత్ర సృష్టించినట్లే.
Also Read : ఆ నాలుగు పత్రికల నిష్క్రమణ మిగిల్చిన ప్రశ్నలు!