Thursday, November 21, 2024

కేజ్రీవాల్ లక్ష్మీ- గణేశ నినాదం అతితెలివికి నిదర్శనం

కరెన్సో నోట్లపైన గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీ, గణేశుడి బొమ్మలు కూడా ముద్రిస్తే దేశం సంపద్వంతం అవుతుందంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాయడంలో రాజకీయం ఉంది. అతి తెలివితేటలూ ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే కేజ్రీవాల్ రాజకీయ నేపథ్యం తెలుసుకోవడం అవసరం. కేజ్రీవాల్ ఐఐటీ లో ఇంజనీరింగ్ చదువుకొని కేంద్రసర్వీసులకు ఎంపికై ఉద్యోగానికి రాజీనామాచేసి అన్నాహజారే ఉద్యమంలో పాల్గొన్న ఆచరణశీలి. సమాచార హక్కు చట్టం తేవడంలో, పేదలను శక్తిమంతులను చేయడంలో తన పాత్రకు మేగ్ సెసే అవార్డును 2006లో గెలుచుకున్నహక్కుల నాయకుడు. అనంతరం 2011లో అన్నాహజారే నాయకత్వంలో అవినీతికీ, యూపీఏ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా పోరాడిన పోరాటశీలి. జన్ లోక్ పాల్ బిల్లు రూపొందించి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని సార్థకం చేశారు. అంతలో అన్నా హజారే సాంగత్యం వదిలి రాజకీయపార్టీని నెలకొల్పిన చతురుడు. ఆమ్ ఆద్మీపార్టీని బలోపేతం చేసి 2015లో జరిగిన దిల్లీ ఎన్నికలలో 70 స్థానాలలో 67 స్థానాలు గెలుచుకొని ఢంకా బజాయించి బీజేపీనీ, కాంగ్రెస్ నూ మట్టికరిపిన ఘనుడు. అంతవరకూ మూడు విడతల కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు  పని చేసిన షీలా దీక్షిత్ డీలాపడిపోయారు. అంతకు ముందు అధికారం చెలాయించిన బీజేపీ ఖురానా, సుష్మాస్వరాజ్  వంటి నాయకులు ఖర్చయిపోయారు. అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలలోనే అతివాది ప్రశాంతభూషణ్ నూ, సంస్కరణవాది యోగేంద్రయాదవ్ నూ వదిలించుకున్నారు. జమ్మూ-కశ్మీర్ లో రెఫరెండం (జనవాక్య సేకరణ) జరిపించాలని వాదించే ప్రశాంత్ భూషణ్ తో ప్రయాణం కొనసాగిస్తే ప్రధాన స్రవంతి రాజకీయాలలో రాణించడం కష్టమని అర్థం చేసుకున్నారు.  ఆప్ లో తన మాటకు ఎదురు లేకుండా చూసుకున్నారు. కాంగ్రెస్ నుంచి, జనతాపార్టీ అవశేషాల నుంచీ ఉడిగిపోయిన నాయకులను పార్టీలోకి రానీయకుండా కొత్త రక్తానికి అవకాశం ఇచ్చారు. కొన్ని తప్పులు దొర్లాయి. కొందరు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటన్నారు. తన సహనాయకుడు, ఉపముఖ్యమంత్రి శిసోడియా పైన కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎవరు ఏమైనా కేజ్రీవాల్ మాత్రం నాలుగో ఎన్నికల విజయం కోసం అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్నారు. దిల్లీలో రెండు సార్లు, పంజాబ్ లో ఒకసారి ఘనవిజయాలు సాధించిన ఆప్ గుజరాత్ లో విజయం సాధించడంపైన దృష్టి పెట్టింది. గుజరాత్ ఎన్నికల ప్రచారానికే కేజ్రీవాల్ అత్యంత ప్రధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే సంపదకు అధికప్రాధాన్యం ఇచ్చే గుజరాతీల హృదయాలను గెలుచుకునే ఉద్దేశంతోనే కరెన్సీ నోట్లపైన లక్మి, వినాయకుడి బొమ్మల ప్రస్తావన తెచ్చి ఉంటారు. తాను హిందూత్వవాదినని చెప్పుకోవడానికి కేజ్రీవాల్ ఎన్నడూ సంకోచించడం లేదు. 2020 ఎన్నికల ముందు దిల్లీలో హనుమంతుడి మందిరంలో హనుమాన్ చాలీసా చదివి తన హిందూమతాభిమానాన్ని చాటుకున్నారు. ముస్లింలను ద్వేషించకుండా హిందువులను ప్రేమించడం ఆయన విధానం. ముస్లిం మహిళలు దీర్ఘకాలం నిరసన ప్రదర్శనలు చేసిన షాహీన్ బాగ్ ను కానీ సీఏఏ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన ప్రదేశాలకు కానీ కేజ్రీవాల్ ఒక్కసారికూడా వెళ్ళలేదు. బీజేపీపైన పైచేయి సాధించేందుకే కేజ్రీవాత్ ఈ అవతారం ఎత్తారని ముస్లింలు కూడా అర్థం చేసుకున్నారు. హిందూత్వ విషయంలో బీజేపీది పైచేయి కాకుండా చూసుకుంటూ విద్యుచ్ఛక్తి ఉచిత సరఫరా, మంచినీటి సరఫరా, సర్కార్ స్కూళ్ళలో సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపైన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ప్రజల మనసులను దోచుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నం. ఇంతవరకూ సఫలమైనారు. గుజరాత్ లో ఏమి జరుగుతుందో చూడాలి.

బీజేపీ ఒక వల పన్నింది. తాము హిందువులమని చాటుకుంటూ, ముస్లింలను ద్వేషిస్తూ, తక్కిన పార్టీలకు చెందిన హిందువులపైన హిందూవ్యతిరేకులనే ముద్ర వేస్తున్నది. హిందూ వేదికను పూర్తిగా ఆక్రమించుకొని అందులో మరేపార్టీకి సందులేకుండా చేయడం బీజేపీ వ్యూహం. కాంగ్రెస్, తక్కిన ప్రతిపక్షాలు తాము హిందూవ్యతిరేకులం కాదని నిరూపించుకోవడానికి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. కానీ ముస్లింలను ద్వేషించడం లేదు కనుక ప్రతిపక్షాలు హిందూవ్యతిరేకులేనని బీజేపీ ప్రచారం చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షంవారు పాకిస్తాన్ విధేయులేనని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.  దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కేజ్రీవాల్ విన్యాసాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాను కూడా వీరహిందువునేనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింలను ద్వేషించకుండా, వారి పట్ల సానుభూతి ప్రదర్శించకుండా తటస్థంగా, మౌనంగా ఉంటూ దేవాలయాలను సందర్శించడం, హిందూమతానికి అనుకూలంగా మాట్లాడటం చేస్తున్నారు. ఇదేదో సత్ఫలితాలను ఇస్తున్నట్టే కనిపిస్తున్నది. దిల్లీలో కాంగ్రెస్ ను పూర్తిగా పూర్వపక్షం చేయగలిగారు. పంజాబ్ లో కాంగ్రెస్ ను గద్దె దింపి అధికారంలోకి వచ్చారు. గుజరాత్ లో కూడా కాంగ్రెస్ ని పూర్వపక్షం చేసే ప్రయత్నం జరుగుతోంది. పోటీ బీజేపీ, ఆప్ కి మధ్యనే ఉన్నదనే ప్రచారం జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ప్రధాన పోటీ ఇప్పటికీ బీజేపీకీ, కాంగ్రెస్ కీ మధ్యనే ఉంది. హిందూమతం తన సొత్తు అన్నట్టు బీజేపీ వ్వవహరించడాన్ని సవాలు చేయడం కేజ్రీవాల్ ఉద్దేశం. గుజరాత్ లో పాతికేళ్ళుగా ఏకఛద్రాధిపత్యం వహిస్తున్న బీజేపీని ఓడించాలంటే ఎన్నో నాటకాలు ఆడాలి. వాటిలో భాగంగా లక్మీ, గణపతి పాత్రలు వచ్చి చేరాయి. కానీ ఈ రంధిలో పడిపోతే ఆప్ కి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. దేవుడూ, దయ్యం అంటూ మతం గురించి మాట్లాడుతూ పోతే ఆప్ కు అసలు అస్త్రాలైన బిజీలీ-పానీ-పఢాయి-స్వాస్థతా (విద్యుత్తూ, నీరు, చదువు, ఆరోగ్యం)  అనే అసలుసిసలైన అజెండాని చెప్పుకునే అవకాశం తగ్గిపోతుంది. బీజేపీ బాటలో ప్రయాణం చేస్తే రెండవ స్థాయి ప్రయాణికుడి హోదాలోనే మిగిలిపోవలసి వస్తుంది. సొంత బాట, సొంత గొంతుక, సొంత అనుభవం, సొంత అజెండా మరచిపోయి, బీజేపీ దారిలో పడి కొట్టుకోవడం ఆప్ కూ, కేజ్రీవాల్ కూ నష్టదాయకం. రాజకీయాలలో తెలివితేటలు అవసరమే కానీ అతి తెలివి అనర్థదాయకం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles