Sunday, December 22, 2024

కేసీఆర్ కలలు సాకారం అవుతాయా?

  • జాతీయ పార్టీ స్థాపించి నడిపించగలరా?
  • బీజేపీనీ, మోదీనీ నిలువరించగలరా?
  • ఇతర పార్టీల అధినేతలు కేసీఆర్ ని విశ్వసిస్తారా?

తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు గెలిచి, మూడో పర్యాయానికి సిద్ధమవుతున్న వేళ కెసీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. జాతీయ రాజకీయాల్లోకి కాలుమోపి, దిల్లీలో చక్రం తిప్పుతామని కెసీఆర్ అంటున్నారు. ఈ మాటలు ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చాలాసార్లు అన్నారు. దిల్లీలో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతోనే కుమార్తె కవితను ఎంపీని చేశారని రాజకీయ క్షేత్రంలో ఆ మధ్య మాట్లాడుకున్నారు. దగ్గరి బంధువు సంతోష్ ను ఎంపీగా ఎంపిక చేయడం వెనకాల కూడా అటువంటి వ్యూహం ఉందనే మాటలు ఆ మధ్య బాగానే వినపడ్డాయి. తాను దిల్లీ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా కాలుమోపే లోపు, తనకు అత్యంత విశ్వాసపాత్రులైన వారందరినీ ఎంపీలను చేసి,తమ బలాన్ని చాటుకోవాలనే వ్యూహంతోనే అవన్నీ చేసిఉంటారని కొందరు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కుమారుడు కెటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి, తాను దిల్లీలో కీలకమైన పదవిలో కూర్చోవాలనే ఉద్దేశ్యం కెసీఆర్ కు బలంగా ఉందని ఎన్నాళ్ళగానో వింటున్నాం.పోయిన ఎన్నికల సందర్భంలోనూ ఈ మాటలు గట్టిగా వినపడ్డాయి. కానీ, అవ్వేమీ ఆచరణలోకి రాలేదు.

Also read: ఉత్కృష్టమైన సాహిత్యోత్సవం ‘ఉన్మేష’

ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కెసీఆర్ కొత్తకూటమిని స్థాపిస్తారని కొంతకాలం పాటు పెద్ద చర్చ జరిగింది.మళ్ళీ ఆ అంశం అటకెక్కింది. మళ్ళీ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల్లో కెసీఆర్ పాత్రపై ఎవరి అంచనాల మేరకు వాళ్లు మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడేమో ‘భారతీయ రాష్ట్ర/రాజ్య సమితి’ ( బీ ఆర్ ఎస్) పేరుతో కెసీఆర్ అతి త్వరలో జాతీయ పార్టీని స్థాపించబోతున్నారని విరివిగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా, ఇటీవలే ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి రాజకీయ మేధావులతో కెసీఆర్ సమావేశమయ్యారు. సలహాదారుడుగా ప్రశాంత్ కిషోర్ ఎలాగూ ఉన్నారు. బహుభాషా సినిమా నటుడు ప్రకాష్ రాజ్ తో దోస్తానా కడుతున్నారు. ఆ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేను, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ ను, మరికొంతమంది జాతీయ నాయకులను కలిసి వచ్చారు. వారందరితో తాను- వారందరూ తనతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్లుగానూ  కెసీఆర్ దృశ్యాలను మన ముందు ఉంచుతున్నారు. ఇప్పుడు సరికొత్త జాతీయ పార్టీని స్థాపిస్తూ, ప్రత్యక్షంగా దిల్లీ రాజకీయాల బరిలోకి కెసీఆర్ దిగే ముహూర్తం మరికొన్ని రోజుల్లోనే ఉందని జాతీయ మీడియాలోనూ కథనాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే దిశగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు దిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. దానికి తామెవరూ హాజరు కాకూడదని కెసీఆర్ నిర్ణయించుకున్నారు.

Also read: సర్వమత సహనం, సమభావం మన జీవనాడి

బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం

బిజెపి,కాంగ్రెస్ లేని కూటమితోనే తమ ప్రయాణం ఉంటుందని కెసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ కు కూడా ఆహ్వానం అందిన నేపథ్యంలో, తాము ఈ ఆహ్వానాన్ని తోసిపుచ్చామని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. నిజానికి కాంగ్రెస్ ను కలుపుకెళ్లడం మమతా బెనర్జీకి కూడా పెద్దగా ఇష్టంలేదు. కెసీఆర్ జాతీయ పార్టీ పేరు, స్థాపన, విధివిధానాలన్నీ ఈ నెలలోనే తేలిపోతాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో ముందుగా కెసీఆర్ కున్న శక్తులేంటో చూద్దాం. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ముఖ్యంగా ఉర్దూ, హిందీ భాషల్లో ప్రసంగాలు దంచికొట్టగలరు. చమత్కార భాషణం, సామెతలు, జాతీయాలు, పిట్టకథలు గుప్పించగలరు. ఎటువంటి వారినైనా మాటలతో మంత్రం వేసే శక్తియుక్తులు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కేంద్రమంత్రిగానూ, ఎంపీగానూ అనేకమంది జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు కూడా బాగా ఏర్పరచుకొని ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమ సమయంలోనూ జాతీయ స్థాయి నాయకులు తమ వాదనకు మద్దతుగా నిలిచేలా మలుచుకున్న అనుభవం కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్ల పాలనా అనుభవం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్ధికంగా మంచి దన్నుతో ఉంది. రాజకీయపు ఎత్తుగడలు, వ్యూహప్రతివ్యూహాలు కూడా బాగా ఎరిగినవాడు. ఇవన్నీ బలాలు.

Also read: నూతన రాష్ట్రపతి ఎవరో?

బలహీనతలు, సవాళ్ళు

బలాలతో పాటు బలహీనతలు, సవాళ్లు కూడా ఉన్నాయి. కెసీఆర్ ను ఎంతవరకూ నమ్మవచ్చు  అనే అనుమానాలు చాలామంది నేతల్లో ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. సందర్భాన్ని బట్టి, అవసరాలను బట్టి కెసీఆర్ ఎటైనా మళ్ళుతారనే ప్రచారం కూడా ఉంది. ఇన్నేళ్ల రాజకీయ, ఎన్నికల ప్రస్థానంలో వివిధ పార్టీలతో కలవడం, విడిపోవటం జరిగాయని వారు గుర్తుచేస్తున్నారు. దగ్గరకు తీసుకున్న నాయకులను, దగ్గరవారనుకున్నవారిని దూరంగా తోసేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయని పలువురు పరిశీలకులు అంటున్నారు.  కెసీఆర్ తో కలిసి నడవడానికి ఏయే పార్టీలు ముందుకు వస్తాయో చెప్పలేమని మరికొందరు విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఒక్క తెలంగాణ తప్ప, మిగిలిన ఏ రాష్ట్రాలలోనూ ఒంటరిగా ప్రభావం చూపించే శక్తి కెసీఆర్ కు ఏ మాత్రం ఉందో చెప్పలేమని ఇంకొందరు అంటున్నారు. వంటరిగా ‘భారతీయ రాష్ట్ర సమితి’ చక్రం తిప్పడం చాలా వరకూ అసాధ్యమనే భావనలోనే ఎక్కువమంది ఉన్నారు. మిగిలిన ప్రతిపక్షాలు కూడా కలిసివస్తే తప్ప కెసీఆర్ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరనే మెజారిటీ వర్గాల అభిప్రాయం. కాంగ్రెస్ / బిజెపీ వంటి పెద్ద జాతీయ పార్టీలు లేకుండా ఏర్పడే కూటమి విజయం సాధించడం ఆషామాషీ కాదని జాతీయ రాజకీయాలు బాగా ఎరిగిన సీనియర్ జర్నలిస్టులు ఎక్కువమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో నరేంద్రమోదీ సారథ్యంలో ఉన్న బిజెపి/ఎన్ డి ఏ ను ఎదిరి నిలవడం అంత తేలిక కాదనే మాటలు బలంగా వినపడుతున్నాయి.

Also read: కశ్మీర్ లో ఘోరకలి

నల్లేరు మీద బండి చందం కాదు

అదే సమయంలో,కాంగ్రెస్ /యూపీఏ ను రేపటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించడం కూడా కష్టమని వినపడుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలంటే నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలి. దిల్లీపీఠంపై దక్షిణాదివారి పెత్తనాన్ని సహించే పరిస్థితిలో ఉత్తరాదివారు ఉండరన్నది చరిత్ర విదితం (ఇక్కడ పీవీ నరసింహారావు మినహాయింపు). దేవెగౌడ ప్రధానమంత్రిగా కూర్చోగలిగిన అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. తెలంగాణలో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మునుముందుగా టీ ఆర్ ఎస్ ను మూడో మారు గెలిపించుకోవడం ముందున్న ముఖ్యమైన బాధ్యత. రాష్ట్రపతి ఎన్నికల్లో  టీ ఆర్ ఎస్ పాత్ర ఎలా ఉండబోతుందో కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. భారతీయ రాష్ట్ర సమితి స్థాపన ద్వారా బీజెపీకి రేపటి ఎన్నికల్లో మేలుజరిగే అవకాశం కూడా ఉందని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బిజెపికి కెసీఆర్ ద్వారా కొంత లాభం ఉండవచ్చునని వారి ఉద్దేశ్యం. అన్నింటినీ బేరీజువేసుకొని చూస్తే, కెసీఆర్ కు దిల్లీ/జాతీయ రాజకీయాలు నల్లేరుపై బండి నడక కాదని అర్థం చేసుకోవాలి.

Also read: అఖండంగా అవధాన పరంపర

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles