Thursday, November 21, 2024

ఏ.పి. కొత్త ‘గ్రోత్ మోడల్’ తో కమ్మలు త్వరలోనే కలిసిపోతారు…

చంద్రబాబు 5 నవంబర్ 2018లో బెంగుళూరులో రాహుల్ గాంధీని

కలిశాక నేను బి.బి.సి. కి రాసిన వ్యాసం చివరి ఫంక్తులు ఇవి…

“ఒకనాటి అభివృద్ధి ఇప్పుడు ‘వృద్ది’ గా మారాక, తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి ఆశ్రయించి ఉన్న సామాజిక వర్గం ప్రయోజనాలు- ప్రాంతీయం నుంచి జాతీయమై, ఇప్పుడు అవి అంతర్జాతీయం అయ్యాయి. ఆధిపత్య కులాల విషయంలో వారికి ఒక స్థాయి దాటాక.. ‘పొలిటికల్ పవర్’ కాపాడుకోవడానికి వనరులు, కాలము ఖర్చు పెట్టడం ఒక వృధా వ్యయం. అందునా- జాతి, ప్రాంతం, బాష, కులం.. ఇవన్నీ ఒక ‘కల్ట్’ వంటివి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలకు కాల పరిమితి ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ మూడున్నర దశాబ్దాలుగా తన మీద ఆధారపడిన తన స్వీయ సామాజిక వర్గాన్ని- దాని విస్తరణ నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా చేర్చింది. అయితే రాజ్యం నుంచి తీసుకోవలసిన ప్రయోజనాల కోసం.. భవిష్యత్తులో అది కాంగ్రెస్ వంటి సనాతన భారతీయ పార్టీలో కలిసిపోవటానికి సన్నద్ధమవుతోందా అనే సందేహం కలుగుతోంది…”

రాహుల్ గాంధీని చంద్రబాబునాయుడు కలుసుకున్నప్పటి చిత్రం

 

*   *   *

ఐదేళ్ల తర్వాత…

కే సమయానికి వేర్వేరు చోట్ల వేర్వేరు సంఘటనలు జరిగి చరిత్రలో ఒక ‘డాట్’ గా అవి మౌనంగా ఉండిపోతాయి. అటువంటి ‘డాట్స్’ను మనం కలుపుకుంటూ ముందుకు వెళితే, మన కళ్ళముందు- ‘కన్ఫ్యూజన్’ అనిపిస్తున్న అస్పష్టత మంచు తెరల్లా తొలిగిపోతుంది. ఇందుకు తేలికైన పద్దతి ఉంది అది రాష్ట్రం ‘మ్యాప్’ ప్రాతిపదికగా చూడగలిగే భౌగోళిక దృష్టి.

Also read: మొదలయిన చోటే తప్పటడుగుల గుర్తులు చెరిగిపోతాయి… 

తెలంగాణ నుంచి విడిపోయాక, మనది మౌలికంగా సముద్ర తీర ఆర్ధికత (‘మెరైన్ ఎకానమీ’) అయింది. అది అర్ధం కావడానికి ఇది చూద్దాం. బందరులో పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంటే, దాన్ని సమీప నగరంలోని నేషనల్ హైవేకి, లేదా రైల్వే జంక్షన్ కు కలిపే విశాలమైన రోడ్డు కావాలి. ఆ సమీప నగరం విజయవాడ. అందుకు, విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు ‘6-లేన్ రోడ్’ కోసం, రోడ్ విస్తరణా లేక ‘ఫ్లయ్ ఓవర్’ రెండింటిలో ఏది? ఆ విషయమై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో అంచనాల పరిశీలన జరుగుతున్నది.

కానీ, యాభై ఏళ్ల క్రితం విజయవాడ కేంద్రంగా జరిగిన- ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో పోలీసు కాల్పులు జరిగాయి. అది విని కృష్ణాజిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రి శ్రీ కాకాని వెంకటరత్నం గుండెపోటుతో చనిపోతే, స్మారకంగా ఆయన కాంస్య విగ్రహం- ‘కె.సి.పి’ సౌజన్యంతో బెంజిసర్కిల్ మధ్య పెట్టడం- ‘చరిత్ర’. అయితే ఇప్పుడు ఆ పాత జ్ఞాపకం రెండు ‘ఫ్లయ్ ఓవర్ల’ మధ్య నలిగితే, ఇప్పుడది బందరు పోర్టుతో కలిసి, కొత్తగా ‘గ్రోత్’ అంశమైంది.

ఆ విగ్రహం అక్కణ్ణించి తరలిపోయాక…ఒకప్పడు విగ్రహం చుట్టూ ఉన్న మన ‘ఎమోషన్స్’ క్రమంగా ‘చరిత్ర’ అయ్యాయి. ఏదైనా ఇలాగే ఉంటుంది. మనవద్ద అందరి కంటే ముందుగా భూమిని వొద్దు అనుకున్నది- బ్రాహ్మణులు. వాళ్ళు విజ్ఞానం  వెతుక్కుంటూ స్వంత ఊర్లు విడిచి ప్రపంచంలోకి వెళ్లిపోయారు. రాజులు కూడా తమవైన కారణాలతో వారి దారినే పట్టారు. నిజమే, వాళ్ళు కొన్నాళ్లు పాటు పట్టణాల కూడలిలో విగ్రహాలుగానో, వీధులు పేర్లుగానో, లేదా గ్రంథాలయాలకు, టౌన్ హాళ్లకు పేర్లుగానో చరిత్రలో పాఠంగా ఉన్నారు.

Also read: మోడీ అంబుల పొదిలో కొత్త బాణమైన ఏ.పి. జి.ఎస్. టి. కేస్! 

కానీ ఎల్లకాలం అది సాగదు. ‘నెక్స్ట్ లెవల్’ రాజకీయాలు వచ్చి, కొత్త ‘గ్రోత్ మోడల్స్’ తప్పనిసరి అయినప్పుడు, పాత గతిస్తుంది. మనం దాన్ని ఒప్పుకుంటామా లేదా అనేది ఇక్కడ విషయం కాదు. ఇప్పుడా- ‘టర్న్’ శూద్ర కులాల్లో ముందున్న కమ్మవారిది అయింది. భూమి విషయంలో ఇంకా దాన్ని ఉంచుకోవాలా వదులుకోవాలా అని ఇప్పటికీ వారు ఊగిసలాటలోనే మిగిలారు. అయితే, వీరిలో కూడా- ‘జ్ఞానం’ వెతుక్కుంటూ ఊరు విడిచి వెళ్లిన తొలితరం ఇందుకు మినహాయింపు.  

‘కోత’ లేదా విభజన తప్పనిసరి అయిన ఇటువంటి ‘కాలసంధి’లో గుంటూరు – విజయవాడ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ అంటూ, గత యాభై ఏళ్లుగా ప్రపంచం నలుమూలల వ్యాపించిన కమ్మవారిని వెనక్కి తెచ్చి మళ్ళీ ‘భూమి’కి బంధించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. ఏనాడో ముందుకు వెళ్ళినవారు తిరిగి వెనక్కివచ్చే ఇటువంటి ‘పునరాగమనం’ (ఎక్సోడస్) జరిగితే అది, మానసికమా? భౌతికమా? అనేది మళ్ళీ అది వేరే చర్చ.

కొత్త దారి

కథలు విషయంలో ముందుకు ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియక మన తెలుగు సినిమా రచయితలు పడుతున్న పాట్లు వంటివే కమ్మవారి విషయంలోనూ ఇప్పుడు కనిపిస్తున్నవి. సినిమా వాళ్ళు అంటే వాళ్ళు దారిదొరక్క, వెనక్కి వెళ్లి ‘ఫాంటసీ’ కథ చూసుకుని మాది ‘పీరియాడిక్ మూవీ’ పైగా- ‘పాన్ ఇండియా’ అంటున్నారు. అలా రాజకీయాల్లో- ‘మా బ్లడ్ – బ్రీడ్’ అంటే కుదరదు కదా.

వర్తమాన చరిత్రలో కమ్మవారి స్థానం ఇది అని సమీక్షిస్తున్నవారు రెండు వేర్వేరు అంశాలు ముందుకు తెస్తున్నారు. మొదటిది ఎన్టీఆర్ తో మొదలయిన ఆ జాతి వైభవం. రెండవది దాంతో సంబంధం లేకుండా, 1982 నాటికే తాము సాధించిన విజయాలు. చిత్రం ఏమంటే, ఈ రెండింటినీ ఒక్కటిగా కలిపి చూసే మూడవ నమూనా విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా వీరివద్ద కనిపించడం లేదు! ఇలా వీరు తమ గతం గురించి చెబుతున్నారు తప్ప, తమవద్ద భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కోవడానికి  మా ‘లైన్’ ఇది అని- ‘క్లియర్’గా లేరు.

Also read: నవతరం రాజకీయాల్లోకి – వై.ఎస్. షర్మిల

తలుపు తట్టి

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చి సూక్ష్మస్థాయికి పరిపాలనను చేర్చారు. అయితే దాన్ని- ‘అయినా… అదేమీ ఉద్యోగం మూటలు మోసే ఉద్యోగం’ అన్నవాళ్ళు ఉంటే, మరి కొందరు- ‘వాళ్ళు గ్రామాల్లో కుటుంబాల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు, సేకరించిన సమాచారాన్ని అసాంఘిక చర్యలకు ఉపయోగిస్తున్నారు’ అన్నవారు ఉన్నారు.

సరిగ్గా ఇదే అక్టోబర్ మొదటి వారంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జనతా దళ్) ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి మరీ సేకరించిన కుల జనగణన (క్యాస్ట్ సెన్సెస్) ‘సమాచారం’ విషయంలో, దాన్ని వెల్లడి చేయడాన్ని ఆపాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లినవారికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలను కోర్టు స్పష్టం చేసింది.

దాన్ని ఆపాలంటూ ప్రభుత్వంపై కేసు వేసిన పిటీషనర్ తరపు న్యాయవాది- అపరాజిత సింగ్. ఈ తీర్పు గురించి సవివరమైన వార్తా కధనం రాసిన- ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రతినిధి షర్మిష్ఠి ఆనంద్ ఇలా అంటారు- “Singh urged the court to order a status quo so that the state government could neither act on the data from the caste survey, nor release any further statistics. The bench, however, shot down the plea. The judgment called the state’s action “perfectly valid, initiated with due competence, with the legitimate aim of providing development with justice”.

కుల స్పర్దా..?

ఈ సుప్రీం కోర్టు తీర్పులో అంటున్న- డెవలప్మెంట్ విత్ జస్టిస్దృక్పధాన్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంగా ఇక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే, అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి అవుతున్నా ఇంకా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేసేవారు, కొత్తగా రాజకీయాలను కులస్పర్ధగా చూస్తున్నారు. పేదలకు మేలుచేయడాన్ని ఇలా చూడ్డం తెలంగాణ నుంచి విడిపోయిన కొద్ది కాలానికే మొదలయినా, కొంచెం ముందు వెనుకలు తప్ప, ఏదో ఒక రోజున ఇది చూడాల్సిందే.

పెద్దవి చిన్నవాటిగా చేయబడిన ప్రతిసారి పాతవాటికి కొత్త పార్శ్వాలు బయటకు కనిపిస్తాయి. ‘డిసెక్షన్’ అనేది జీవశాస్త్రాల పదం అనుకుంటాము. కానీ అది సామాజిక శాస్త్రాల్లో కూడా ఉంటుందని అనుకోము. కానీ, కాలక్రమంలో ఆ ‘కోత’ (‘డిసెక్షన్’) అది ‘నిలువు’ అయినా లేక ‘అడ్డం’ అయినా, విధిగా లోపలి నుంచి మునుపు మనం చూడని కొత్త పార్శ్వాలు బయట పడతాయి. ఏమిటీ (డిసెక్టింగ్) కోత లేదా విభజన?

‘రాజ్యము’ అంటే, ‘ప్రాంతము’ – ‘ప్రజలు’ అయినప్పుడు; దాని లోతుల్లోకి ‘ప్రభుత్వం’ ప్రవేశించడం అనేది- ‘హైబ్రిడ్’ ప్రభుత్వ పాలన అవుతుంది.

Also read: తన పుస్తకంతో మనకు తూర్పు దారులు తెరిచిన సంజయ్ బారు 

వాస్తవానికి అది రాజకీయం కాదు. అది- ‘రాజనీతి శాస్త్రం’. పీటర్ హెడ్ స్టార్మ్ ఎనెలిటికల్ సోషియాలజీ గ్రంథం- ‘డిసెక్టింగ్ ది సోషల్’ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురణ (2005) లో వెలువడింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి రాష్ట్రం రెండు అయ్యాక దాన్ని 13 జిల్లాలు 26 గా విడగొట్టాక, పాత ‘ప్రాంతానికి’ కొత్త ‘పార్శ్వాలు’ బయట పడ్డాయి. అలాగే 56 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశాక, దాన్ని ‘ప్రజల్ని’ కులాలుగా విడగొట్టడంగా (డిసెక్టింగ్) చూడాలి, అప్పుడు ‘ప్రజల’ కొత్త పార్శ్వాలు బయటకు వస్తాయి.

సూర్యదేవర సంజీవదేవ్

వెనక్కి రావడం

గుంటూరు జిల్లా తుమ్మపూడి గ్రామం నుంచి ప్రపపంచానికి పరిచయం అయిన తత్వవేత్త, రచయిత, చిత్రకారుడు శ్రీ సూర్యదేవర సంజీవదేవ్ గురించి చదువుకున్న వారికి తెలుసు. ఓ పదిహేనేళ్ల క్రితం విజయవాడలో జరిగిన సభలో సంజీవదేవ్- ‘రసమయ’ హృదయాన్ని ఎంతో గొప్పగా ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేదికపై ఆవిష్కరించారు. అయితే, కాలక్రమంలో వారి ఆలోచనలు అక్కణ్ణించి ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళాయో తెలియదు. మరో సుప్రసిద్ధ రచయిత, తత్వవేత్త వడ్డెర చండీదాస్ (చెరుకూరి సుభ్రమణేశ్వర రావు) ది కృష్ణాజిల్లా పామర్రు వద్ద. వీరిద్దరు ఇప్పటి కమ్మవారికి కూడా చాలా మందికి తెలియదు!

వడ్డెర చండీదాస్

భంగపడతారు

 .

నిశబ్ద కులవాదులు, ఏంటి సమాజాన్ని ఇలా కులాలుగా విడగొడతారా? అంటారు. అలా అనడం తేలిక. ఈ దశలో వీళ్ళు ఏకంగా రాజకీయ పార్టీలుగా లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికలు అంటూ ‘ఎన్. జి. ఓ.’ లుగా ఏవో కొన్ని ఆదర్శ వాదనలు కొంతకాలం చెలామణిలోకి తెస్తారు. మనవద్ద అటువంటి ప్రయత్నం ఒకటి 2001లోనే మొదలై చల్లారిపోయింది. వాటిని ముందుకు తెస్తున్నవారు తాము- ‘అవుట్ డేటెడ్’ అని వారికి కూడా తెలుసు. అయినా వారు ఇలా చివరి ప్రయత్నం చేసి భంగపడతారు.

ఇటీవల రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తూ ఛత్తీస్ గఢ్  నుండి కేంద్ర సర్వీస్ నుంచి రిటైరైన ఒక మిత్రుడి ఫోన్. నాలుగు దశాబ్దాలు క్రితం వాల్తేరు ఆంధ్ర యూనివర్సిటీలో 1978 నాటి- ‘పొలిటికల్ సైన్స్’ విద్యార్థిగా అప్పటి తన క్లాస్ రూమ్ అనుభవం ఆయన చెప్పారు. “కృష్ణా మండలానికి చెందిన ప్రొ. కె. వెంకటేశ్వర్లు మాకు ‘ఇండియన్ పాలిటిక్స్’ పేపర్ చెప్పేవారు. డబ్ల్యు. హెచ్. మోరిస్ జోన్స్ -‘గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా’ గ్రంథం నుంచి ఆయన పాఠాలు చెబుతూ- ‘మా కమ్మ వారికి అన్ని సహజ వనరుల మీద ఆధిపత్యం ఉంది, లేనిదల్లా ఒక్క రాజకీయ అధికారమే…ఒకసారి మేము అది సాధిస్తే, మా నుంచి దాన్ని దూరం చేయడం దుర్లభం’ అనేవారు” అంటూ ఆ మిత్రుడు గతం గుర్తుచేసుకున్నాడు.

Also read: విభజనతో సరళమైన కమ్మతెమ్మెరలు!  

అప్పట్లో ఆ ప్రొఫెసర్ చెప్పింది అయినా, ఇప్పుడు ఆయన విద్యార్థి చెబుతున్నది అయినా, అందులో ఆక్షేపించాల్సింది పెద్దగా ఏమీ లేదు. పైగా ఆయన గురువుగారి కోరిక తీరి ఆయన ప్రాంతం నుంచే ‘తెలుగుదేశం’ పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడి నాలుగు దశాబ్దాల పాటు (1982-2023) అది జయాపజయాలను చవి చూసింది. అయినా ప్రగతిశీల దృక్పథం అంటే, కులాలు గురించి మాట్లాడకుండా ఉండడం, అనే కమ్యూనిస్టుల ‘లైన్’ కారణంగా ఎక్కువ రోజులే ఆ పార్టీ మనుగడ సాగింది.

నితీష్ కుమార్

 ‘ఫోటో ఫినిష్

కాలం ఒకేలా ఎన్నాళ్ళు ఉంటుంది? ‘మండల్’ కారణంగా బీహార్ పీఠం ఎక్కిన ‘బిసి’ లు ‘నెక్స్ట్ లెవల్ పాలిటిక్స్’ మొదలుపెట్టారు. కేంద్రం ఓబిసి కేటగిరీలు గురించి 2017లో వేసిన జస్టిస్ రోహిణి కమీషన్ నివేదిక వెలుగు చూడక ముందే బీహార్ సి.ఎం. నితీష్ కుమార్ కుల జనగణన (క్యాస్ట్ సెన్సెస్) పూర్తిచేసి, దాన్ని ఈ అక్టోబర్ 2 నుంచి వెల్లడించడం మొదలుపెట్టాడు. దాన్ని ఆపమని సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారికి కోర్టు చెప్పిందే పైన ప్రస్తావించిన విషయం.

జస్టిస్ రోహిణి కమీషన్ 12 వారాల్లో తన నివేదిక ఇవ్వాల్సి ఉండగా, గత ఆరేళ్లలో అది 13 సార్లు గడువు పొడిగించుకుంటూ ఈ జులై 31న నివేదిక ఇచ్చింది. దాన్ని మోడీ ప్రభుత్వం బయట పెడుతుందో లేదో తెలియదు. ఇంతలో నితీష్ కుమార్ దేశానికి తన- ‘ఫోటో ఫినిష్’ టచ్ ఎటువంటిదో చూపించాడు. ‘శీతాకాలం సమావేశాల్లో నివేదికను అసెంబ్లీలో ఉంచుతాను’ అంటున్నారు నితీష్ కుమార్. 

గాంధీ జయంతి రోజున నితీష్ చూపిన చొరవ చూసి, మర్నాడు మనవద్ద నిజమాబాద్ సభలో దాని మీద మోడీ సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మేము అధికారంలోకి రాగానే దేశమంతా- ‘క్యాస్ట్ సెన్సెస్’ (కుల జన గణన) చేస్తాం అంటున్నాడు. కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు, అది- మారని మనుష్యుల్ని ఇప్పటి చంద్రబాబు మాదిరిగా- ‘మార్జిన్లు’ పక్కకు నెట్టేస్తుంది. అది గ్రహించకుంటే, రేపు మోడీ అయినా అందుకు మినహాయింపు కాదు.  

సంక్షేమ కార్యక్రమాల లబ్ధి పొందిన వ్యక్తితోో మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి

జగన్ చేస్తాడా?

యాభై ఏళ్ల క్రితం క్లాసులో పాఠం చెప్పిన- ‘పొలిటికల్ సైన్స్’ ప్రొఫెసర్ కల నిజమైంది. కానీ, మారే కాలం తెచ్చే మార్పులతో పాటు ప్రవహించే నాయకత్వం ఇప్పటి అవసరం. మూడు దశాబ్దాల ఆర్ధిక సంస్కరణల తర్వాత కొత్తతరం నాయకుడుగా ముందు కొచ్చిన జగన్ మోహన్ రెడ్డి తాను చేస్తున్నది ఏ కులంతోను యుద్ధం కాదు అంటున్నాడు.

అయితే, అది నిజమని చెప్పడానికి ఆయనకు మిగిలిన ఒకే- ‘అప్షన్’ రాష్ట్రంలో- ‘క్యాస్ట్ సెన్సెస్’ ప్రకటించడం. సుప్రీంకోర్టు ఆశిస్తున్న- ‘డెవలప్మెంట్ విత్ జస్టిస్’ వల్ల

జనాభా ప్రాతిపదికగా అందరికీ సమపంపిణీ న్యాయం జరుగుతుంది. అప్పుడు, కొత్త వృద్ధి నమూనా చట్రంలో అభివృద్ధికి దూరంగా ఉన్న కమ్మవారు కూడా కలిసిపోవడం తప్ప, ఇకముందు ఏ కులానికి మిగిలిన మరో దారి లేదు.

Also read: ఆ సంస్కారం మనకు అలవడినప్పుడు…

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles