వోలేటి దివాకర్
మొన్న పార్టీ ఆఫీసు …. త్వరలో గ్రేటర్ కమిటీ ద్వారా మళ్లీ నగర పార్టీలో పట్టు కోసం గోరంట్ల అడుగులు వేస్తున్నారు . అదిరెడ్డి అప్పారావు కోడలు భవానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత పార్టీలోని అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యుడు , సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని బలవంతంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గానికే పరిమితం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ అధిష్టానంపై అలిగిన గోరంట ఒకదశలో పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించారు. ఆ తరువాత వ్యూహాత్మకంగా నగర పార్టీపై పట్టుసాధించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రత్యర్థి వర్గానికి మింగుడుపడటం లేదు.
Also read: రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహా మహా కాళేశ్వరాలయం
నగర రాజకీయాలకు ఆయనను దూరంగా ఉంచాలని ప్రత్యర్థి వర్గం ఎంతగా ప్రయత్నిస్తోందో అంతే స్థాయిలో గోరంట్ల తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో తిప్పికొడుతున్నారు. దీనిలో భాగంగా గత కొంతకాలంగా మూసి ఉంచిన టిడిపి కార్యాలయాన్ని మొన్న తెరిపించిన గోరంట్ల అక్కడి నుంచి నగర రాజకీయాలను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గం తన నివాసం వద్ద పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. తాజాగా త్వరలో గ్రేటర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి, ప్రత్యర్థి వర్గంపై పరోక్షంగా ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
Also read: ఎపికి అన్యాయం జరిగి ఎనిమిదేళ్లు… చారిత్రాత్మక తప్పిదంలో బిజెపికీ వాటా!
సమన్యాయం అంటే ….
రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం జరిగేలా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు గోరంట్ల పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే నగరంలోని గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాలకు చెందిన అభ్యర్థులకు కార్పొరేషన్ ఎన్నికల్లో సమానంగా టిక్కెట్లు లభిస్తాయని విశ్లేషిస్తున్నారు. పార్టీలోని అంతర్గత లోటుపాట్లను సవరించుకుని, అందరి భాగస్వామ్యంతో టిడిపి గ్రేటర్ కమిటీని నియమిస్తారని, అలాగే ఇన్చార్జిని కూడా నియమించనున్నట్లు గోరంట్ల వెల్లడించడం గమనార్హం. ఈనేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపికలో కూడా గోరంట్ల తన మాటను నెగ్గించుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో టిడిపిలో మరోసారి ఆధిపత్యపోరు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Also read: డాక్టర్ వర్సెస్ డాక్టర్!