వోలేటి దివాకర్
ఉత్తరప్రదేశ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ముఖ్యమంత్రి , బిజె పికి చెందిన యోగి ఆధిత్యనాధ్ సర్కార్ బుల్డోజర్ పంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యుపిలోని అక్రమ నిర్మాణదారుల గుండెల్లో బుల్డోజర్లు గుబులు రేపాయి. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. ఇటీవల దేశ ఐటి రాజధాని బెంగుళూరులో కురిసిన కుంభవృష్టి వర్షాలతో బెంగుళూరు నిండా మునిగింది. దీంతో ఐటి కంపెనీలు వేల కోట్లు నష్టపోయాయి. కోట్లాది రూపాయిల విల్లాలు కొరగాకుండా పోయాయి. చెరువులు , కుంటలను పూడ్చివేసి భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లను రంగంలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది.
Also read: నేటి నుంచి దూసుకుపోనున్న రైళ్లు…గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు!
గోదావరి తీరంలోని చారిత్రాత్మక, సాంస్కృతిక, వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో కూడా అక్రమ కట్టడాలకు కొదవలేదు. గోదావరితీరానికి 50 మీటర్ల లోపు నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను తుంగలోకి తొక్కి భవనాలను నిర్మించారు. ఆమోదించిన ప్లాన్లకు విరుద్ధంగా అవినీతి అంతస్తులు నిర్మించారు. ఆయా భవనాలు, అపార్ట్ మెంట్లలో పార్కింగ్ సదుపాయాలు, అగ్నిప్రమాదాల నివారణకు కనీస ప్రమాణాలు కూడా లేవు.
Also read: అధికార పార్టీలో అంతా ఆసమర్థులేనా?
ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కలెక్టర్ గా పనిచేస్తున్న వి విజయరామరాజు కమిషనర్ గా ఉన్న సమయంలో సెల్లార్లో నిర్వహిస్తున్న ఒక హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో సెల్లార్లలోని నిర్మాణాలను కూల్చివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు వందలాది భవన యజమానులు, అపార్ట్మెంట్ బిల్డర్లకు నోటీసులు జారీ చేశారు. కొద్దిరోజుల హడావుడి తరువాత రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాల వల్ల ఈవిషయాన్ని గాలికి వదిలేశారు.
Also read: ఉండవల్లికి ఊరట…రామోజీకి చుక్కెదురు!
అయితే, కొత్తగా రాజమహేంద్రవరం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్ నిజాయితీ, నిక్కచ్చి అయిన అధికారి అని చెబుతున్నారు. ఆయన తాజాగా 2016 నుంచి ఇప్పటి వరకు నిర్మించిన అపార్ట్మెంట్లు, భవనాలకు సంబంధించిన ప్లాన్ల వివరాలు ఈనెల 17వ తేదీలోగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also read: సెల్ ఫోన్ లో డబ్బు పంపినట్టు… పితృదేవతలకు ఆహారం పంపవచ్చు!
నగరంలో సుమారు 100 మందికి పైగా ఉన్న లైసెన్సుడ్ సర్వేయర్లు సుమారు 4500 భవనాలకు ప్లాన్లు గీసినట్లు గుర్తించారు. ఈప్లాన్లను పునఃసమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషనర్ దివేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు భవన నిర్మాతలు, నిర్మాణాలకు ప్లాన్లు గీసన లైసెన్సుడ్ సర్వేయర్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అక్రమ నిర్మాణాల వల్ల ముంపు సమస్య తలెత్తడంతో పాటు, నగరపాలక సంస్థకు రావాల్సిన పన్నుల ఆదాయంలో కూడా భారీగా గండిపడుతోందని ఆయన గుర్తించారు. ఈ పాన్లను పునః సమీక్షిస్తే ఎన్నో అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో అక్రమ నిర్మాణాలకు స్థానిక కార్పొరేటర్ నుంచి ప్రజాప్రతినిధులు, టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర కూడా గణనీయంగా ఉంటుందనడంలో సందేహంలేదు. ఒకవేళ కమిషనర్ భవన నిర్మాణాల్లో అక్రమాలు గుర్తిస్తే యుపి, కర్నాటక తరహాలో బుల్డోజర్లను పంపి, కూల్చివేయిస్తారా లేక భారీ జరిమానాలతో జడిపిస్తారా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. అయితే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపించాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇలాంటి సున్నితమైన అంశాలపై సీరియస్ గా వ్యవహరిస్తే పాలకపక్షానికి ఇబ్బందులు తప్పవు. దరిమిలా కమిషనర్పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిషనర్ ఎలా వ్యవహరిస్తారన్నది వేచిచూడాల్సిందే.