- బీజేపీ దేశాన్ని అమ్మేస్తోందంటూ మమత ఆరోపణ
- ఫిరాయింపులతో అధికారం దక్కదని హితవు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్ లో తొలిసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మమతా బెనర్జీ కూడా మూడో సారి అధికారం చేపట్టి బీజేపీకి చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు పరస్పర విమర్శలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఇందులో భాగంగా మమతా బెనర్జీ మోదీ ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలు విక్రయించి ప్రైవేటు పరం చేయడాన్ని మమత తీవ్రంగా తప్పుబడుతున్నారు. దేశాన్ని నాశనం చేసి బెంగాల్ ను బంగారు మయం చేస్తామంటు బూటకపు వాగ్దానాలు చెబుతున్నారంటూ బీజేపీపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
Also Read: తృణమూల్ ను ప్రజలు తృణీకరిస్తారా?
ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయంపై ధ్వజం:
మరోవైపు గత పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పై బీజేపీ అంతేస్థాయిలో విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఆరోపిస్తోంది. రెండు నెలల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనను బీజేపీ అణిచివేస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ లో అమ్మకానికి పెట్టిందని మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి రహిత పాలనను అందిస్తోందని రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని మమత విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అధికారం దక్కదని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.
Also Read: నేతాజీ వారసత్వం కోసం మోదీ, దీదీ బలప్రదర్శన
పరివర్తన్ రథయాత్రకు అనుమతి:
మరోవైపు బీజేపీ చేపట్టిన పరివర్తన్ రథయాత్రకు అనుమతినివ్వలేదని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలను మమతా బెనర్జీ ఖండించారు. బెంగాల్ ప్రభుత్వం అటువంటి అనైతిక చర్యలకు పూనుకోదని స్పష్టం చేశారు. ఎటువంటి యాత్రకైనా మమత ప్రభుత్వం అనుమతిస్తుందని బీజేపీ చేస్తున్న అసత్య ఆరోపణలకు సాక్ష్యం చూపాలని డిమాండ్ చేశారు.