Sunday, December 22, 2024

కాంగ్రెస్ లో కార్చిచ్చు

గాంధీత్రయం: ప్రియాంక, రాహుల్, సోనియా

సాహసోపేత చర్యలా, ఆత్మాహుతివైపు అడుగులా?

చింతన్ బైఠక్ లు లేవు, సంస్థాగత ఎన్నికలు లేవు

దక్షత కలిగిన నాయకులు దూరం అవుతున్నారు

అధిష్ఠానం నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి

కార్యవర్గ సమావేశం నిర్వహించాలని జీ-23 డిమాండ్

అస్తవ్యస్తంగా గాంధీల నిర్వాకం

దశాబ్దాల చరిత్ర కలిగి, మహామహులు ఎందరో సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ సరికొత్తరూపు ఎత్తుకోడానికి, కొత్త నీరు నింపుకోడానికి,  సాహసోపేతంగా ముందుకు వెళ్తోంది. సోనియాగాంధీ కుటుంబమే ఆన్నీ తానై వ్యవహారిస్తోంది. ముఖ్యనేత రాహుల్ గాంధీ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అవి స్వయంగా ఆయనకే వచ్చిన ఆలోచనలా, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పథక రచనా? తెలియడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది. ఈలోపు మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా భావి ఫలితాలే నిర్వచిస్తాయి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క సీనియర్ నేత పార్టీని వీడుతున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ గందరగోళ వాతావరణం నెలకొని వుంది. జరిగే పరిణామాలు సంచలన వార్తలకు కేంద్రాలుగా మారుతున్నాయి. కపిల్ సిబల్ వంటి సీనియర్ నేతలు తలపట్టుకొని కూర్చుంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీ డబ్ల్యూ సీ ) సమావేశం ఏర్పాటుచేయమని ఒత్తిడి తెస్తున్నారు. జి -23 గా చెప్పుకొనే ఆ నాయకబృందమంతా తాడోపేడో తేల్చుకోవాలనే చూస్తున్నారు. ఒకప్పటి వలె పార్టీపై తమకు పట్టుకావాలనీ, కాంగ్రెస్ కు పూర్వవైభవం రావాలనీ కోరుకుంటున్నారు.

Also read: జపాన్ లో కరోనాకు ప్రధాని పదవి బలి

అధ్యక్ష స్థానంలో ఎవ్వరూ లేరు

ఇంతవరకూ సంస్థాగత ఎన్నికలే జరుగలేదు. పార్టీ కంటూ అధ్యక్షుడు లేడు. పార్టీలోని మంచిచెడును విశ్లేషించుకుంటూ ముందుకు సాగడానికి, నవనిర్మాణం జరపడానికి దేశమంతా ‘‘చింతన్ భైటక్’’ లు నిర్వహిస్తామని చెప్పి కూడా చాలాకాలమైంది. అది ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదు. అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలలోనూ కొత్త కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. వచ్చే సంవత్సరంలో విడతల వారీగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సమాయిత్తం కావాల్సి వుంది. ప్రజాబలం, క్యాడర్ లో విశ్వాసం ప్రోది చేసుకోకపోతే మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. పంజాబ్ లో పరిణామాలు చాలు ఏ రీతిన పార్టీని నడుపుతున్నారో అర్ధం చేసుకోడానికి అంటూ వచ్చే విమర్శలకు సహేతుకమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తో, ఇందిరాగాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం కలిగివున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ఉద్వాసన పలికిన తీరు, సమయం వివేకవంతమైనది కాదని మెజారిటీ రాజకీయ పండిత వర్గం అంటోంది.

నవజోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్

అదే సమయంలో కొత్తనీరును స్వాగతించే క్రమంలో,నవ్ జోత్ సింగ్ సిద్ధూ వంటి ఆవేశపరుడు, చంచలస్వభావుడిని అందలమెక్కించడం అంత తెలివైన చర్య కాదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర నాయకుల మొదలు అధిష్టానాన్ని కూడా అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గత ఎన్నికలకు కాస్త ముందుగా బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరాడు. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయనంగా సరికొత్తగా స్వీకరించిన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామ చేశాడు.  ఆ మధ్య అప్ లో చేరతానంటూ హడావిడి చేశాడు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ ధోరణులే. పంజాబ్ కు మొట్టమొదటిసారిగా దళితనేతను ముఖ్యమంత్రిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగిస్తామని భరోసా ఇస్తూ, దళితులను,వెనుకబడి వర్గాలను అధికార పీఠాలపై కూర్చోబెడతామనే స్లోగన్ వినిపిస్తే, దేశ రాజకీయలు కొత్త మలుపు తీసుకుంటాయి.ఆ పని చేస్తారా లేదా చూడాలి.

Also read: మోదీ అమెరికా పర్యటనలో మోదం

కొత్తపాతల మేలు కలయిక అవసరం

పార్టీకి కొత్తరక్తం ఎక్కించి, కొత్తనీరుకు ద్వారాలు తెరిచే క్రమంలో, పాతపాళీలను కూడా మరువరాదు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో మేలైన పాతకొత్తల మేళవింపు అవసరమని భావించాలి. అధికార బిజెపి చాలా బలంగా ఉంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అంతే బలంగా ఉన్నాయి. నరేంద్రమోదీ ప్రభంజనం ఇంకా మసకబారలేదు. గ్రాఫ్ కొంత తగ్గిఉండవచ్చునేమో కానీ, ఆయన నాయకత్వ పటిమ, పార్టీ సౌష్టవం రెండూ బలంగానే ఉన్నాయి. పంజాబ్ లో రాజకీయాలు రోజుకొక్క తీరున రాజుకుంటున్నాయి. కెప్టెన్ అమరీందర్ రేపోమాపో కొత్తదారి వెతుక్కుంటారు. ఆయన ఏ పార్టీలో చేరినా, రేపటి ఎన్నికల్లో పార్టీకి ఎంతోకొంత నష్టం జరుగుతుంది. సిద్ధూతో రాజీ కుదిరినా, అటువంటి వ్యక్తిని నమ్ముకొని పార్టీ ప్రశాంతంగా మనజాలదనే భావించాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా తన ఆజ్ఞ మేరకే ప్రతిదీ నడవాలనే ధోరణిలో సిద్ధూ ఉన్నారు. దళితులు 32శాతం ఉన్నారు. సిద్ధూకు దళిత వ్యతిరేకనే ప్రచారం ఉంది. ఇటువంటి వాతావరణం నడుమ, పార్టీ పట్ల దళితుల్లో విశ్వాసం పెంచడం అంత తేలికైన పనికాదు. సునీల్ జాఖడ్ వంటి సీనియర్లను కాదని చన్నీని ముఖ్యమంత్రిగా చెయ్యడం కూడా మరో సాహసం. ఈ చర్యతో పార్టీలో వర్గపోరు మరింత పెరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగిలిన ఛత్తిస్ గడ్, రాజస్థాన్ లోనూ అసమ్మతులు రగులుతూనే వున్నాయి. వీటన్నిటిని తట్టుకుంటూ పార్టీని నడపడం, విజయతీరాలకు చేర్చడం సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక త్రయానికి అతిపెద్ద సవాల్.

Also read: ఉత్తరకుమారుల విన్యాసం, ఉత్తరాంధ్ర విషాదం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles