జోడించేందుకూ, మార్చేందుకూ, రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా రద్దు చేసేందుకూ పార్లమెంటుకు సంపూర్ణాధికారాలు ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎందుకు కోరారు? మరో సారి రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయవలసిన అవసరం లేకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి పునర్ నిర్మాణం చేసే అధికారాలను పార్లమెంటుకు ఇవ్వాలన్నంత దూరం వెళ్ళాడు.
రాజ్యాంగాన్ని తగులబెడతానని అంబేడ్కర్ ఒకానొక సందర్భంలో అన్నారు. తాను తయారు చేసిన చైతన్యవంతమైన రాజ్యాంగం పట్ల ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది? రాజ్యాంగ ప్రథమ సవరణ ప్రాథమిక హక్కుల పరిధిని తగ్గించినప్పటికీ అంబేడ్కర్ కి అంతగా ఆగ్రహం కలిగించలేదు. కానీ నాలుగో సవరణ కట్టలు తెంచుకునే కోపం తెప్పించింది. నాలుగో సవరణ బిల్లుపైన 19 మార్చి 1954న భీకరమైన చర్చ నడుస్తోంది. రాజ్యాంగం అనే మందిరంలో దేవుడిని ప్రతిష్ఠించే ముందు దయ్యం తిష్ఠ వేయకుండా చూడాలి కనుక నాలుగో సవరణతో కూడిన రాజ్యాంగాన్ని తగులబెడతానని అంబేడ్కర్ అన్నారు.
రెండు సందర్భాలలో అంబేడ్కర్ ఆగ్రహించి రాజ్యాంగాన్ని తగులబెడతానంటూ బెదిరించారు. 02 సెప్టెంబర్ 1953న రాజ్యసభలో భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, అల్పసంఖ్యాకవర్గాల రక్షణకోసం విజ్ఞప్తి చేస్తూ ఆగ్రహంతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ బిల్లు చర్చకు వచ్చినప్పడు ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం కారణంగా భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేయడాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించారు. కులదురహంకారం, అణచివేతల నుంచి దళితులకూ, ఇతర భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలకూ రక్షణ కల్పించేందుకు రాజ్యాంగంలో ఏర్పాటు జరగకపోవడం పట్ల కూడా ఆయన కోపోద్రిక్తుడైనారు. మైనారిటీలను రక్షించేందుకు గవర్నర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలంటూ ఆయన వాదించారు. మంత్రివర్గం సలహాసంప్రతింపులతోనే గవర్నర్ వ్యవహరించాలనే సూత్రానికి అంబేడ్కర్ వాదన విరుద్ధమైనది.
భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాల రక్షణకు ప్రత్యేక ఏర్పాటు ఉండాలని వాదిస్తూ కెనడా రాజ్యాంగం నుంచీ, బ్రిటిష్ రాజ్యాంగం ఆచరణ నుంచీ అంబేడ్కర్ ఉదాహరణలు ఇచ్చారు. కెనడాలో గవర్నర్ జనరల్ కు రాజ్యాంగాధికారాలు ఇచ్చినట్టు ఇండియాలో గవర్నర్లకు కూడా ఇస్తే రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ అపకారం ఏమీ జరగబోదని రాజ్యసభ అధ్యక్షుడి సమక్షంలో అంబేడ్కర్ వాదించారు ((Ambedkar, 2019f, p. 861).
అంబేడ్కర్ ఇలా అన్నారు:
అధిక సంఖ్యాకులు అన్యాయాలూ, అక్రమాలూ చేస్తారని భయపడుతున్న భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ పార్లమెంటు పని చేస్తుంది. సర్, నేను రాజ్యాంగాన్ని నిర్మించాలనని నా మిత్రులు అంటున్నారు. కానీ దాన్ని (రాజ్యాంగాన్ని)తగులబెట్టేవారిలో నేను ప్రథముడిగా ఉండటానికి సంసిద్ధంగా ఉన్నాను. నాకు ఇది అక్కరలేదు. ఇది ఎవ్వరికీ అనుకూలంగా లేదు. అదేమైనప్పటికీ, మన వాళ్ళు ఈ రాజ్యాంగంతోనే కొనసాగాలనుకుంటే దేశంలో అధికసంఖ్యాకవర్గాలూ, అల్పసంఖ్యాకవర్గాలూ ఉన్నాయనే సంగతి విస్మరించరాదు. ‘‘అలా కుదరదు. మిమ్మల్ని ప్రత్యేకవర్గంగా గుర్తిస్తే ప్రజాస్వామ్యానికి అపకారం జరగుతుంది’’ అంటూ అల్పసంఖ్యాకుల హక్కులను తోసిరాజనకూడదు. మైనారిటీలకు గాయం అయినట్లయితే అది ప్రజాస్వామ్యానికి అత్యధికంగా అపకారం చేస్తుందని చెప్పదలుచుకున్నాను.’’
దేశంలో గవర్నర్ కు ఇతోధిక అధికారాలు ఇవ్వడం గురించి ఆ రోజున అంబేడ్కర్ వాదించారు. రాజ్యాంగాన్ని సవరించడానికి అనుకూలంగా అంబేడ్కర్ చాలా గట్టిగా వాదించారు. ‘మన రాజ్యాంగాన్ని సవరించినంత మాత్రాన మన ప్రజాస్వామ్యానికి కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగానికి కానీ ఎటువంటి అపకారం జరగదని విన్నవించుకుంటున్నాను’’ అని ఉద్ఘాటించారు.
రెండేళ్ళ తర్వాత అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తగులబెడతానని మళ్ళీ హెచ్చరించారు. 19 మార్చి 1955న నాలుగో సవరణపైన చర్చజరుగుతున్న సమయంలో పంజాబ్ కు చెందిన సభ్యుడు డాక్టర్ అనూప్ సింగ్ అంబేడ్కర్ లోగడ అన్న మాటలను గుర్తు చేశారు. అంతకు ముందు అంబేడ్కర్ ప్రాథమిక హక్కుల ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ రాజ్యాంగంపైన తన స్థూలమైన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పారు:
‘‘ఈ దేశానికి ప్రదానం చేసిన రాజ్యాంగం అద్భుతమైన పత్రమని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ మాటలు అన్నది నేను కాదు. చాలామంది అన్నారు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేసినవారు కూడా చాలామంది అన్నారు. ఇది సరళమైనది, సులభగ్రాహ్యమైనది. రాజ్యాంగంపైన వ్యాఖ్యానం రాస్తే పారితోషికం బాగా చెల్లిస్తామంటూ చాలామంది ప్రచురణకర్తలు నన్ను అడిగారు. రాజ్యాంగంపైన వ్యాఖ్యానం రాయడం అంటే రాజ్యాంగం బాగులేదనీ, అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నదనీ అంగీకరించడమే అవుతుంది. కానీ అది నిజం కాదు. ఇంగ్లీషు భాష తెలిసినవారు ఎవరైనా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలరు. వ్యాఖ్యానం అక్కరలేదు.’’
అంబేడ్కర్ ఈ మాట అన్న తర్వాత లోగడ ఆయన అన్న మాటలను డాక్టర్ అనూప్ సింగ్ గుర్తు చేశారు. ‘ఇదివరకు మీరు మాట్లాడినప్పుడు రాజ్యాంగాన్ని తగులబెడతానని అన్నారు’ అని గుర్తు చేశారు.
డాక్టర్ అంబేడ్కర్ ఆగ్రహోదగ్రుడైనారు.
‘‘దానికి నా సమాధానం కోరుకుంటున్నారా? ఇక్కడే ఇప్పుడే సమాధానం ఇస్తాను. లోగడ మాట్లాడినప్పుడు రాజ్యాంగాన్ని తగులబెడతానని అన్నట్టు మా మిత్రుడు అంటున్నారు. అవును. తొందరపాటు కారణంగా నేను అప్పుడు కారణం చెప్పలేదు. ఇప్పుడు నాకు నా మిత్రుడు అవకాశం ఇచ్చాడు కనుక ఎందుకు రాజ్యాంగాన్ని తగులబెట్టాలని అన్నానో వివరిస్తాను. దేవుడు వచ్చి ఉండటానికి వీలుగా ఒక మందిరాన్ని నిర్మించుకున్నాం. కానీ దేవుడు రాకముందే మందిరాన్ని దయ్యం ఆక్రమించిందనుకోండి. అప్పుడు మందిరాన్ని ధ్వంసం చేయకపోతే మరేమి చేస్తాం? అసురులు వచ్చి మందిరాన్ని ఆక్రమించుకోవాలని మనం కోరుకోవడం లేదు. దేవేతలు మందిరాన్ని ఆక్రమించుకోవాలని మనం కోరుకుంటున్నాం. అందుకే అవసరమైతే రాజ్యాంగాన్ని తగులబెడతానని అన్నాను.’’
అప్పుడు బీకేపీ సిన్హా ఒక వ్యాఖ్య చేశారు. ‘‘మందిరాన్ని కాకుండా దయ్యాన్ని ధ్వంసం చేయడి’’ అన్నారు. దానికి అంబేడ్కర్ సమాధానం: ‘‘బ్రాహ్మణా, శతాపథబ్రాహ్మణాలు చదివితే అసురుల చేతిలో దేవతలు ఓడిపోయారని తెలుస్తుంది, అమృతం అసురుల చేతిలో ఉంటే దాన్ని యుద్ధంలో గెలుపొందేందుకు దేవతలు తీసుకున్నారు.’’
అంతకు మునుపు అంబేడ్కర్ మనుస్మృతిని తగులబెట్టారు. కానీ మనుస్మృతిని తగులబెట్టడానికీ, రాజ్యాంగంపైన ఆయన వ్యాఖ్యాలకూ పోలిక లేదు. మనుస్మృతి దళితులకు హక్కులు నిరాకరించింది. అదే రాజ్యాంగం వారికి పరిపాలనలో అందరితో సమానమైన హక్కులు మంజూరు చేసింది. (Dhananjay Keer, Dr. Ambedkar: Life and Mission. Bombay: Popular Prakashan, 1971, Ch. XXIV, pp. 449-450.)
‘రీ ఇన్వెంటింగ్ రివల్యూషన్: న్యూ సోషల్ మూవ్ మెంట్స్ అండ్ ద సోషలిస్ట్ ట్రెడిషన్ ఇన్ ఇండియా’’ అనే టైటిల్ తో గెయిల్ ఓండెడ్ట్ రాసిన పుస్తకంలో ఇలా ఉంటుంది: ‘‘రిపబ్లిక్ దినోత్సవాలు జరుపుకోవడాన్ని ప్రస్తావిస్తూ 26 జనవరి 1950న అంబేడ్కర్ ‘మనం పరస్పర విరుద్ధమైన జీవితంలో అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాలలో మనకు సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక, ఆర్థిక రంగాలలో అసమానత్వం ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని మనం సాధ్యమైనంత తొందరగా తొలగించాలి. లేకపోతే బాధపడేవారు మనం ఇంత కష్టపడి నిర్మించుకున్న రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను పేల్చివేస్తారు’ అంటూ హెచ్చరించారు.
‘‘అస్మృశ్యులపైన అత్యాచారాలు ఆగకపోతే నేనే స్వయంగా రాజ్యాంగాన్ని తగులబెడతాను’’ అని మరో సందర్భంలోఅణచివేతకు గురి అవుతున్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉరుములా గర్జించారు.
అంబేడ్కర్ వంటి గొప్ప నాయకుడిని సందర్భశుద్ధి లేకుండా ఉటంకించి వ్యతిరేకమైన అభిప్రాయానికి రావడం మంచిది కాదు. అంబేడ్కర్ చురుకుగా ఉన్న రోజులో రాజ్యసభలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆవేశంలో రాజ్యాంగాన్ని తగులబెడతానంటూ హెచ్చరించారు. అంతేకానీ నిజంగా రాజ్యాంగాన్ని తగులబెట్టడం ఆయన ఉద్దేశం కానేకాదు. నాలుగో సవరణ రాజ్యాంగానికి వ్యతిరేకమైనదని గట్టిగా చెప్పదలచుకున్నారు. అప్పుడే రాజ్యాంగాన్ని తగులబెడతానంటూ హెచ్చరించారు. అస్పృశ్యత అంతం కావాలనీ, అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకులను రక్షించాలనీ వాదించడమే ఆయన అభిమతం. రాజ్యాంగం కఠినంగా ఉండకూడదనీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని అన్నారు. రాజ్యాంగాన్ని సవరించడం సులభతరం కావాలనీ, ప్రభుత్వాలు పొరబాట్లు చేసినప్పుడు వాటిని వారించేందుకూ, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించవలసిందిగా కట్టడి చేసేందుకూ గవర్నర్లకు విశేషాధికారాలు ఉండాలని ఆయన పట్టుబట్టారు.
రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు అపరిమితమైన అధికారాలు ఉండాలని ఆయన వాదన. నాలుగో సవరణను ఆయన వ్యతిరేకించింది రాజ్యాంగ సవరణ ఇష్టం లేక కాదు. ఆ సవరణ రాజ్యాంగ స్వభావానికి తగినట్టుగా లేదనే కారణంచేతనే.
(డిసెంబర్ 6 అంబేడ్కర్ వర్థంతి)