- విచారణ విధానమే శిక్ష
- సోనియా, రాహుల్ ని బదనాం చేయడమే లక్ష్యం
- కాంగ్రెస్ నిర్వీర్యమే పరమావధి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బుధవారంనాడు, జులై 27న, మూడో రోజు ప్రశ్నించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్- ఈడీ- నాలుగో రోజు కూడా రావాలని చెప్పలేదు. అంతవరకు నయం. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ రాహుల్ గాంధీని 56 గంటలకుపైగా ప్రశ్నించింది. అప్పుడు కోవిద్ వచ్చిన కారణంగా 75 ఏళ్ళ సోనియాగాంధీ హాజరుకాలేదు. కోవిద్ తగ్గిన తర్వాత ఈడీ కార్యాలయానికి వెళ్ళడం మొదలు పెట్టారు. మొదటి రెండు రోజులూ రోజుకు ఆరుగంటల చొప్పున ఈడీ అధికారులు ప్రశ్నించారు. మూడో రోజు మూడు గంటలు ప్రశ్నించి సోనియాను పంపించివేశారు. మూడు రోజులలోనూ ఈడీ అధికారులు ఆమెను వాస్తవంగా ప్రశ్నించింది పన్నెండు గంటలు. ఈ వ్యవధిలో సోనియాను వంద ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ప్రశ్నలకు ఆమె టకటకా జవాబులు చెప్పారు కనుక ఇన్ని ప్రశ్నలు అడగడం సాధ్యమైంది. తాను ఉపాసన యోగా చేస్తాను కనుక ప్రశ్నలు నన్ను వేధించలేకపోయానీ, అది చూసి ఈడీ అధికారులు బిత్తరపోయారనీ రాహుల్ గాంధీ చెప్పారు. సోనియాకు ఉపాసన రాదు. ఆమె గుండె దిటవుపైనే ఆధారపడి తోచిన సమాధానాలు వెంటవెంటనే చెప్పేశారు. ఈ సంగతి ఈడీ అధికారులే అన్నారు. రాహుల్ గాంధీని అయిదు రోజులలో 150 ప్రశ్నలు అడిగారు. ఇద్దరినీ నేషనల్ హెరాల్డ్ గురించీ, యంగ్ ఇండియన్ అనే కంపెనీ గురించీ అడిగారు. ఇద్దరు చెప్పిన సమాధానాలను బేరీజు వేసుకుంటారు.
భారతీయ జనతా పార్టీ అసంతృప్త మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యస్వామి 2012లో నేషనల్ హెరాల్డ్ యాజమాన్యంపైన కేసు పెట్టారు. కాంగ్రెస్ ను వేధించడమే పనిగా పెట్టుకున్న స్వామి బోడి గుండుకూ, మోకాలికీ ముడిపెట్టి కేసు దాఖలు చేశారు. అది న్యాయస్థానాలలో నడుస్తూ ఉంది.
అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ తరఫున లక్నో నుంచి నేషనల్ హెరాల్డ్ ను జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించారు. కొన్నేళ్ళ తర్వాత అది మూతబడింది. తిరిగి పత్రికను ప్రారంభించాలన్న ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వంహయాంలో యంగ్ ఇండియన్ అనే కంపెనీని ప్రారంభించారు. అసోసియేట్ జర్నల్స్ కంపెనీ పేరు మీద లక్నో లో, దిల్లీలో, ముంబయ్ లో గల ఆస్తులని యంగ్ ఇండియన్ కు బదలాయించారు. యంగ్ ఇండియన్ వాటాలు అత్యదికంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేరు మీద ఉన్నాయి. ఇక్కడే ఒక మతలబు ఉన్నది. యంగ్ ఇండియన్ అనే కంపెనీ సెక్షన్ 25 కింద తెరిచిన కంపెనీ. లాభార్జన దీని ధ్యేయం కాదు. ఇది ఒక ట్రస్టు లాంటిది. ఇందులో నుంచి ఎవ్వరూ ఒక నయాపైసా తీసుకోవడానికి వీలులేదు. నేషనల్ హెరాల్డ్ లావాదేవీలు ఏమైనప్పటికీ సోనియాగాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ పైసా తీసుకునే అవకాశం లేదు. అందుకే వారు మనీ లేనప్పుడు మనీలాండరింగ్ ఎట్లా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పేవాదనంతా అరణ్యరోదనం అవుతోంది. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య సంస్థలు అన్నీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాయి. మీడియా అంతా మోదీ, అమిత్ షా ల చేతుల్లోనే ఉంది. చట్టసభలు వారివే. అధికారయంత్రాంగం వారిదే. న్యాయవ్యవస్థ కూడా అధికారపార్టీని ధిక్కరించే పరిస్థితులు లేవు. ప్రతిపక్షానికి చెందిన సోనియానూ, రాహుల్ నూ ఈడి ప్రశ్నలతో బెదరకొడితే వారు పారిపోతారనీ, కాంగ్రెస్ అనాథ అవుతుందని ఏలినవారి ఆలోచన కావచ్చు. నిజానికి ఈ విషయంలో ఈడే జోక్యం చేసుకోవడానికి అవకాశమే లేదు. ప్రొసీడ్స్ ఆప్ ప్రాఫిట్ అంటే డబ్బు వచ్చే అవకాశం లేనప్పుడు ఈడీ కల్పించుకునే అవకాశమే లేదు. ‘వైర్’ పోర్టల్ కి కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ శిబ్బల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఈడీ జోక్యానికి అవకాశమే లేదని అన్నారు. ఉదాహరణ చెబుతూ ఎవరినైనా హత్య చేస్తానని ఒకడు సుపారీ కింద డబ్బు తీసుకుంటే అప్పుడు ఈడీ జోక్యం చేసుకోవచ్చు, అతడిని అరెస్టు చేయవచ్చు, ప్రశ్నించవచ్చు. నేషనల్ హెరాల్డ్ విషయంలో సోనియాగాంధీకి కానీ రాహుల్ గాందీకి కానీ నయాపైసా రాలేదు. రాదు. వారిని కేసులో ఇరికించడం అన్యాయం అని ఆ న్యాయవాది అన్నారు.
సోనియాగాంధీనీ, రాహుల్ గాంధీని బదనాం చేయడానికి ఈడీ ఈ తంతు నిర్వహిస్తున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలూ, నాయకులూ వీధులలోకి వచ్చారు. దిల్లీలో, ఉత్తరాదిలో నిరసన ప్రదర్శనలు జోరుగా సాగాయి. రాహుల్ గాంధీని, ఇతర అగ్రనాయకులనూ పోలీసులు అరెస్టు చేసి తర్వాత వదిలేశారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంటే నిరసర ప్రదర్శనలు ఎందుకంటూ బీజేపీ నాయకులూ, కార్యకర్తలూ ప్రశ్నిస్తున్నారు. అదే అనుమానాన్ని సాధారణ పౌరులు కూడా వెలిబుచ్చుతున్నారు. అసలు విషయం ఏమంటే లేని కేసును పట్టుకొని ఈడీ ప్రమేయంలేని విషయంలో ఈడీ చేత అదే పనిగా గంటల తరబడి ప్రశ్నలు అడిగిస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఈడీ పిలిపించడం, ప్రశ్నించడం, వాటి గురించి లీకులు ఇవ్వడం ద్వారా త్రివిధ మాధ్యమాలలో, అంటే వార్తాపత్రికలలో, టీవీ చానళ్ళలో, సోషల్ మీడియాలో, వారికి ప్రతికూలంగా వార్తలూ, వ్యాఖ్యలూ అదిరిపోయేట్టు వచ్చే విధంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. నేర నిరూపణ జరుగుతుందో లేదో, శిక్ష పడుతుందో లేదో తెలియదు కానీ నేర విచారణ సందర్భంలోనే, నేర నిర్థారణ విధానం అమలు క్రమంలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న సంస్థలు అధికారపక్షం చెప్పినట్టు వ్యవహరించడం కొత్త కాదు. మోదీ హయాంలో శ్రుతి మించింది. దీనికి తోడు మీడియా వాస్తవాలు రాయకపోవడం, న్యాయస్థానాలు త్వరగా స్పందించకపోవడంతో అన్యాయం జరిగిపోతోంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఏమన్నారో చూడండి. ‘‘మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో విచారణ విధానమే శిక్ష. అస్పష్టమైన, విచక్షణారహితమైన ఆరోపణలపైన అరెస్టు చేసినవారికి బెయిల్ దొరకడం కష్టంగా పరిణమిస్తున్నది. అండర్ ట్రయల్స్ గా సుదీర్ఘంగా కారాగారవాసం చేస్తున్న వారి గురించి తక్షణం పట్టించుకోవాలి. దేశవ్యాప్తంగా జైళ్ళలో ఉన్న ఆరు లక్షల పది వేలమంది ఖైదీలలో ఎనభై శాతం మంది అండర్ ట్రయల్సే. కనుక న్యాయనిర్ణయానికి అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమయింది. ఈ విధానం వల్లనే అండర్ ట్రయల్స్ గా నిర్దోషులు చాలాకాలం జైళ్ళలో మగ్గవలసి వస్తోంది.’’ ఈ మాటలు అన్నది దేశంలోనే సర్వోన్నత న్యాయమూర్తి. 17 ఏళ్ళు న్యాయవాదిగా, 22 ఏళ్ళు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ రమణ నోటి నుంచి వచ్చిన ఈ మాటలు అక్షర సత్యాలు.
భీమా కోరేగాం కేసులో నిందితుడిగా ఉన్న 82 ఏళ్ళ వృద్ధుడైన విప్లవకవి వరవరరావు కేసు విచారణ లేకుండా ముంబయ్ జైలులో మగ్గుతూనే ఉన్నారు. అంగవైకల్యంతో తీసుకుంటున్న ప్రొఫెసర్ సాయిబాబా అండాసెల్ లో కృశించడం చూస్తూనే ఉన్నాం. సర్జీల్ ఇమామ్ అనే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి విచారణ లేకుండానే 2019 నుంచి జైల్లో ఉన్నాడు. మరో జెఎన్ యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ 2020 జనవరి నుంచి ఊచలు లెక్కపెడుతూనే ఉన్నాడు. కేరళకు చెందిన దిల్లీ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ 5 నవంబర్ 2020 నుంచి జైల్లోనే నిష్కారణంగా మగ్గుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా మన ప్రజాస్వామ్యంలో అయిదు లక్షల మంది కంటే ఎక్కువగానే ఉన్నారు. ఇదీ మన ప్రజాస్వామ్యం బండారం.
నేషనల్ హెరాల్డ్ కేసులో పసలేదని ఒక సారి సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాన్నిపట్టుకొని మళ్ళీ పైకి లాగి మనీలాండరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేసి రాహుల్ గాంధీనీ, సోనియాగాంధీని బదనాం చేస్తున్నారు. దాని లావాదేవీలు చూసుకున్నఏఐసీసీ మాజీ కోశాధికారి వోరా కొన్ని మాసాల కిందట మరణించారు.
ఈ కేసు ఇప్పట్లో తేలదు. తేలనివ్వరు. ఇది కొనసాగుతూనే ఉండాలి. కేసు గురించి బీజేపీ నాయకులూ, ప్రతినిధులూ కాంగ్రెస్ ను బదనాం చేస్తూ మాట్లాడుతూనే ఉండాలి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి పరువు నష్టం జరుగుతూనే ఉండాలి. కాంగ్రెస్ కుంగిపోతూనే ఉండాలి. ఇదీ వ్యూహం. దీనికి బదులు లేదు. ప్రతివ్యూహం రచించే శక్తియుక్తులు కాంగ్రెస్ నాయకత్వానికి ప్రస్తుతానికి లేవు. అదీ పరిస్థితి. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కోరినట్టు నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పుని సుప్రీంకోర్టు వెంటనే ఇస్తే ఈడీని ఆయుధంగా వినియోగించి కాంగ్రెస్ నేతలను వేధించే అవకాశం మోదీ, షా ద్వయానికి ఉండదు.