Wednesday, January 8, 2025

వానపాముల కదలికలు, వారి ఉక్కపోతకు కారణం!

జాన్ సన్ చోరగుడి

తేది: 28  మార్చి 2023 . విశాఖపట్టణంలో రెండవ ‘జి-20’ వర్కింగ్ గ్రూప్ సదస్సు జరుగుతుంటే, ‘వరల్డ్ బ్యాంక్’ కంట్రీ డైరెక్టర్ అగస్టె టానో కుమే తన బృందంతో గుంటూరు వద్ద పెదకాకాని మండలంలోని జిల్లాపరిషత్ పాఠశాలలు సందర్శిస్తున్నారు. అయితే అదే సమయానికి ఎంత మంది ‘ఎమ్మెల్యేలు’ ఎవరితో ‘టచ్’లో ఉన్నారో చెబుతూ, మన ‘సోషల్ మీడియా’ మంచిని చూడనీయకుండా, మన దృష్టిని మరల్చడానికి తన పని తాను చేసుకుపోతున్నది!

Also read: రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక!

ఇక్కడ ఒక మాట అయితే నిజం. ఇప్పుడు జరుగుతున్న వాటి కంటే భారీ ‘ఈవెంట్స్’ ఉమ్మడి రాష్ట్రంలో చెంద్రబాబు హయాములో హైదరాబాద్ లో జరిగాయి. అప్పట్లో- బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్, వరల్డ్ బ్యాంక్ ప్రసిడెంట్ జేమ్స్ ఉల్ఫెన్సన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ఇక్కడికి వచ్చేవారు. అయితే, అప్పట్లో క్షేత్రస్థాయిలో ఇక్కడున్న- ‘ఎకో సిస్టం’ ఎటువంటిదిఅనేది వేరే చర్చ.

ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యా రాయ్ కూడా…

హైదరాబాద్ లో 13 డిసెంబర్ 2002న రూ. 150 కోట్లతో నిర్వహించిన ’32వ నేషనల్ గేమ్స్’ అప్పటి సి.ఎం.బాబు ప్రారంభించారు. వాటి ముగింపు సభకు వచ్చిన ప్రధాని ఏ.బి. వాజపాయ్ మాట్లాడుతూ- ‘ఖేల్ ఖతం – పైసా హజం’ అనేసారు.

Also read: ‘క్రిస్మస్’ తోనే సరళీకరణ మొదలయింది…

ఆటలు ముగిసిన నాలుగు రోజులకు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 1125 మండలాల్లో 870 కరువు మండలాలుగా ప్రకటించగా, కొత్తగా మరికొన్నిటిని కరువు మండలాలుగా ప్రకటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఈ క్రీడోత్సవానికి ప్రభుత్వం ఖర్చులతో మొదటి రోజు అమితాబ్ బచ్చన్, చివరి రోజు ఐశ్వర్యా రాయ్లను ఎందుకు అతిథులుగా పిలిచినట్టు అంటే, పరిపాలనా శైలి ఒక్కొక్కరిది ఒక్కో తీరు.

పాఠశాల తరగతి గదిలో ‘వరల్డ్ బ్యాంక్’ కంట్రీ డైరెక్టర్ అగస్టె టానో కుమే

తాళం చెవి

ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అసెంబ్లీ ‘మీడియా పాయింట్’ వద్ద అదే పార్టీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యను గమనించి ఉండకపోతే, ఈ వ్యాసం రాయడం మరికొంత ఆలస్యం అయ్యుండేది. అదే రోజు దాన్నిచూడ్డంతో, కొంత కాలంగా అనుకుంటున్న జగన్ పాలనలోని కొత్త కోణం ఏమిటో చెప్పడానికి ఇక ఒక ‘తాళం చెవి’ దొరికినట్టుఅయింది.

మనవద్ద అనూచానంగా జరుగుతున్నది ఏమిటి? రాజ్యాంగ పరిధిలో శాసనసభపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక, ప్రభుత్వ పాలనకు ఆ పార్టీ ఆ శాసన సభ్యులు అందరిదీ సమిష్టి బాధ్యత. ఆ మేరకు ప్రభుత్వపాలనా వ్యవస్థ ఒక-‘పిరమిడ్’ వలె పైన ముఖ్యమంత్రి ఉంటే, దిగువన మంత్రి మండలి దాని క్రింద శాసన సభ్యులు ఆ తర్వాత జిల్లాల్లోని స్థానిక సంస్థలప్రతినిధులు ఉంటారు.

Also read: ఐదేళ్ల ఆలస్యంగా మనమూ ఆరు రాష్ట్రాల సరసన!

గ్రీన్ ఫీల్డ్ పాలిటిక్స్

దీనికి సమాంతరంగాఇలా క్రిందివరకు’ఎగ్జిక్యూటివ్’ అనబడే అధికారులు ఉద్యోగుల వ్యవస్థ ఉంటుంది. అయితేమునుపటికి  భిన్నంగా,దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఏ.పి.లో ‘పిరమిడ్’ స్థానాన్ని ‘చతురస్రం’ నమూనా పాలనతో భర్తీ చేయడం మొదలయింది. ఇది కొత్త ప్రయోగం కావడంతో దీన్ని-‘గ్రీన్ ఫీల్డ్ పాలిటిక్స్’ప్రభుత్వం అనొచ్చు. 

విశాఖలో జరిగిన జ-20 సమావేశం సందర్భంగా…

ఇది ఎలా పనిచేస్తున్నది అంటే, తన ‘పబ్లిక్ పాలసీ’లో భాగంగా తొలుత కొన్ని ప్రాధాన్యతా రంగాలను ఎంచుకుని, క్షేత్రస్థాయిలో దాని అమలుకు అవసరమైన ‘వర్క్ ఫోర్స్’తో ఒక యంత్రాంగాన్ని సమకూర్చుకుంటుంది. పైనుండి ఆదేశాలు దిగువకు వెళుతుంటే, దిగువ నుంచి సాధించిన లక్ష్యాల ‘డేటా’ పైకి పంపే-‘టు వే’ సమాచార వ్యవస్థ ఉంటుంది. జాప్యం లేకుండా వేగంగా సమాచారం అందేలా ‘నెట్ వర్క్’ కోసం ‘టెక్నాలజీ,’ ఆఫీసులు, సిబ్బంది ముందే ఏర్పాటు అవుతుంది.

ఇవన్నీ సరే, మరి ప్రాధాన్యతా రంగం ఎంచుకోవడం ఎలా? యు.ఎన్.ఓ ఉపాంగం అయిన-‘యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్’ తన 177  సభ్యదేశాలు2030 నాటికి చేరుకోవాలని నిర్దేశించిన – 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ నుంచి స్థానిక అవసరాలు ప్రాతిపదికగా వీటిని ఎంచుకుంటారు. ఏ.పి. లో ఈ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా విద్య, వైద్యం, వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకుంది.

Also read: ‘సీన్’ ఇండియా మ్యాప్ క్రిందికి కనుక ‘షిఫ్ట్’ అయితే?

ఢిల్లీ నుంచి ‘నీతి ఆయోగ్’ ఆయా రాష్ట్రాలు సాధించిన లక్ష్యాలు ప్రాతిపదికగా ‘ర్యాంకులు’ వెల్లడిస్తున్నది. వీటి అమలుకు- ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ అనుసరిస్తారు. సరిగ్గా ఇక్కడే- ‘మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మాకు ఓటు వేసారా లేదా? కూడా చూడకుండా అర్హులైన అందరికీ…’  అంటూ సి.ఎం. జగన్ చెప్పే జనరంజకమైన వాగ్దానం’ కనెక్ట్’ అవుతుంది. మరి ఇంతకుముందు ఇలా ఎందుకు జరగలేదు అంటే,అది ఎన్నికయిన ప్రభుత్వ నేతకు ఉండే విచక్షణ. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఇలా పని చేస్తున్నాయి అన్నప్పుడు, బయట రాష్ట్రాల అధికారుల బృందాలు తరుచు ఇక్కడికి క్షేత్ర పర్యటనలకు రావడమే అందుకు జవాబు.

నీ పేరు లేదు…’

ఇలా ఈ ప్రభుత్వంలో ‘పిరమిడ్’ స్థానంలోకి కొత్తగా ‘చతురస్రం’ నమూనా పాలన వచ్చాక, పై నుంచి క్రిందివరకు ఏకరీతిగా ఒక’సాలిడ్ సిస్టం’ ఏర్పడి పనిచేస్తున్నది. అర్హతలు పరిశీలించి ఒకసారి లబ్దిదారుడి పేరు ఖరారు అయ్యాక- ‘డి.బి.టి.’(‘డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్’) ద్వారా ప్రభుత్వం అందించే ప్రయోజనం నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నది. దాంతో ప్రజాప్రతినిధులుగా తమకు మునుపున్న విచక్షణాధికారాలు ఇప్పుడులేనట్లుగా కొందరు నొచ్చుకుంటున్నారు.

గతంలో మాదిరిగా హౌసింగ్ అధికారులు లబ్దిదారుడితో- ‘మీ ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసిన లిస్టులోనీ పేరు లేదు…’ అనడానికి ఇప్పుడు ఆస్కారం లేదు. ఊళ్ళో రాజకీయాలతో ఒకవేళ తొలుత ఆపినా, ఆపడానికి కారణాలు ఏమిటో అదే ఊళ్ళో వున్న ‘సచివాలయం’ సిబ్బంది పిర్యాదుదారుడికి చెప్పాల్సివస్తున్నది. ఇటువంటి ఎమ్మెల్యేల ‘ప్రివిలేజ్’ కొత్తగా- ‘గ్రీన్ ఫీల్డ్ పాలిటిక్స్’ అమల్లోకి తెచ్చిన ఈ ప్రభుత్వంలో సాగక, తొలి ఉక్కపోతలు నెల్లూరు నుంచి ‘రికార్డు’ అయ్యాయి.

వెలగపల్లి ప్రసాదరావు

అదే విషయంపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ్యుడు వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడారు. “పార్టీ ఎమ్మెల్యేగా కంటే, ఒక పౌరుడిగా జగన్ ను ఇష్టపడుతున్నాను” అన్నారాయన. ఈయన మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి కావడంతో వీరి పరిశీలనను ప్రత్యేకంగా చూడాల్సి వుంటుంది. ఇప్పుడీ మాజీ ‘బ్యూరోక్రాట్’ అయిన ఎస్సీ ఎమ్మెల్యే ఒక పౌరుడిగా తన పరిశీలనను దాచుకోలేక, ఉన్నది ఉన్నట్టుగా ‘మీడియా పాయింట్’ వద్ద పైకి అనేసారు.

గోకులంలో ముసలం

ఒక ఎమ్మెల్యేకి తమ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి పట్ల ఉండేది విశ్వాసం,కానీ ఒక పౌరుడికి కాలక్రమంలో కలిగేది- ప్రేమ, దాన్ని ఐదేళ్లకు పరిమితం చేయలేము. కొంత కాలంగా ఇక్కడ రాస్తున్న- ‘పవర్ పాలిటిక్స్’ స్థానంలో ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ అంటున్నది, ‘పిరమిడ్’ స్థానంలో వచ్చిన ఈ ‘చతురస్ర’ నమూనాను దృష్టిలో ఉంచుకునే. అది తెచ్చిన- ‘సోషల్ కెమిస్ట్రీ’ కారణంగా నాలుగేళ్లకే పాతతరం నేతల్లో ‘ఉక్కపోత’ మొదలయింది. జగన్ మోహన్ రెడ్డి కూడా దాన్ని దాచుకోకుండా- ‘ఇది పెత్తందార్ల మీద పేదలు చేస్తున్న యుద్ధం’ అని బహిరంగ సభల్లో పైకే అనేస్తున్నాడు!

Also read: ఏ. పి.లో మొదలైన ‘గ్రీన్ పాలిటిక్స్’

ఈ ధోరణి మూలాలు చరిత్రలో ఎక్కడో ఒకచోట ‘రికార్డ్’ కావడం అవసరం. నిజానికి ఇవి, ఆర్ధిక సంస్కరణలు మొదలైన తొలి దశాబ్ది తర్వాత, కాంగ్రెస్ పొలిటికల్ ఫిలాసఫీకి ఏ. పి.లోతనదైన ‘సోషల్ ఇంజనీరింగ్’తో డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి- ‘జెనిటికల్లీ మోడీఫైడ్’ (జి.ఎం) వెర్షన్ ఒకటి కొత్తగా తెచ్చారు. దాంతో 2004 మంత్రిమండలి ఏర్పాటులో కృష్ణా వంటి మోతుబరి జిల్లా నుంచి తొలి వరసలో ఉండాల్సిన పిన్నమనేని వెంకటేశ్వరరావు (ఉన్నత విద్య శాఖ) వంటిపేరు, అతి కష్టం మీద ఆఖరి నిముషంలో ఖరారు అయింది. అయితే అది 2009లో కూడా కొనసాగింది. కృష్ణా (పెనమలూరు) నుంచి ఐదేళ్ల పాటు కె. పార్ధసారధి యాదవ్ ఏకైక కేబినెట్ మంత్రిగా కొనసాగారు. విభజన తర్వాత ఇదే నమూనా 2019లో నెల్లూరులో అనిల్ యాదవ్ (ఇరిగేషన్) పేరుతో కొనసాగింది.  

ఇక ముగింపులో ఉక్కపోత -వానపాములు సంగతి చెప్పాలి. మార్చి రెండవ వారంలో ఒక ‘యూట్యూబ్’ ఛానల్ ‘రైతు భరోసా కేంద్రాలు’పై వీక్షకులతో చేసిన’ఫోన్-ఇన్- ప్రోగ్రామ్’ లో జరిగిందిది. విజయనగరం జిల్లా నుంచి పాల్గొన్న ఆ రైతు ‘ఆర్బీకే’ల సేవలు గురించి వివరంగా మాట్లాడాక, చివరిలో- “ఈ గవర్నమెంట్ లో విజయవాడలో మా నాగవంశం వాళ్ళకి ఆఫీసు కూడా పెట్టారు సార్” అన్నాడు. అతని ఆంతర్యాన్ని-మారుతున్న సామాజిక పర్యావరణంలో ఇన్నాళ్లూ గిడసబారిన భూమిని గుల్లబారుస్తున్న వానపాముల కదలికలుగా చూడాల్సివుంటుంది.

Also read: ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యతతోనైనా ఏపీ పట్ల ఢిల్లీ వైఖరి మారేనా?

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles