Sunday, December 22, 2024

వరవరరావు వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించలేకపోయింది ఎందుకని?

అనేకమంది వ్యక్తిగత స్వేచ్ఛను పోలీసులకూ, ప్రభుత్వాలకూ పట్టదు. రాజ్యాంగం ఇచ్చిన హామీతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛను వచక్షణారహితంగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. హైకోర్టులు సైతం కొన్ని సందర్భాలలో ఈ ప్రాథమిక హక్కును రక్షించడానికి పూనుకోవు. కేవలం పౌరులకే కాకుండా ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు తలుపులను నేరుగా తట్టే అధికారం భారత రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రసాదిస్తున్నది.

ఈ అధికరణ కింద పిటిషన్లను ప్రోత్సహించదలచుకోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు అంటున్నారు. హక్కులను కాపాడే అధికారాలను వినియోగించుకోవలసిందిగా హైకోర్టులకు చెబుతున్నారు. అర్ణబ్ గోస్వామికి సత్వరంగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ వాదనతో ఏకీభవించడం, సమాధానపడటం కష్టం.

గంటలలోపే అర్ణబ్ పిటిషన్ బెంచిపైకి ఎందుకు వస్తుంది?

రెండేళ్ళ కిందటి కేసులో,  స్పష్టమైన ఆరోపణలు కూడా చేయకుండా, అనుమానంపైన ఒక వ్యక్తిని భౌతికంగా అరెస్టు చేయడం సమంజసమేనా? ప్రాథమిక సమాచార నివేదిక (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఎఫ్ఐఆర్)లో వారి పేర్లు లేవు. అటువంటి కేసులోనే బెయిల్ మంజూరు చేసి ఇతర కేసులలో ఎందుకు బెయిల్ ను పదేపదే తిరస్కరిస్తున్నారు? భీమా కోరేగాం కేసులో ఎఫ్ఐఆర్ లో పేర్లు లేనివారిని కూడా అరెస్టు చేశారు. కొందరిని ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నాయి కనుక అరెస్టు చేశారు. ఎటువంటి బలమైన సాక్ష్యం ఆధారంగా వారిని అరెస్టు చేసి రెండు సంవత్సరాలుగా బెయిలు రాకుండా జైలులోనే మగ్గుతున్నారో ఎవ్వరికీ తెలియదు. పిటిషన్ దాఖలు చేసిన కొన్ని గంటలలోనే అర్ణబ్ పిటిషన్ లిస్ట్ అవుతుందో, బెంచిమీదికి వస్తుందో, ఆ రోజు విచారించే కేసుల జాబితాలో చేరిపోతుందో, వాదనలకు కొన్ని గంటలు ఎందుకు కేటాయించారో, న్యాయం, చట్టం గురించి గంభీరమైన ప్రకటనలు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను ఎందుకు సమర్థిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఒక మితవాద జర్నలిస్టు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వని కారణంగా ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యకు దారితీశారనే ఆరోపణ ఎదుర్కొంటున్న కేసులో బెయిల్ పైన నిందితుడిని విడుదల చేశారు. ఆత్మహత్య కారణంగా మరణం అనేది తిరిగితోడలేని వాస్తవం. వారికి ఇవ్వవలసిన డబ్బు చెల్లించలేదనేది రికార్డు నిరూపిస్తున్న వాస్తవం. ఆత్మహత్యకు  ప్రేరింపించారన్నది ఆత్మహత్య చేసుకునేముందు వారు రాసిన నోటులో స్పష్టంగా ఉన్నది. ఆరోపణలను బలపరిచే ఆధారాలు లేకపోయినప్పటికీ ఒక జర్నలిస్టు, కవి, అధ్యాపకుడు అయిన వరవరరావూ, ఇతరులూ వారి అనారోగ్యాన్ని, వార్థక్యాన్నీ, వైద్య సహాయం అందించాల్సిన అవసరాన్నీ న్యాయస్థానాలు పట్టించుకోకుండా రెండేళ్ళుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. సన్నిహిత బంధువులకు కూడా వారిని చూసే అవకాశం ఇవ్వడం లేదు. బెయిల్ మంజూరు చేయడానికి సైతం సాక్ష్యాలు లేవంటున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్నా వరవరరావును జైలు నుంచి విడుదల చేయలేదు

వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఇతర  ఆనారోగ్య పరిస్థితుల కారణంగా విధిగా బెయిల్ పై వెంటనే విడుదలకు ఆదేశించి ఉండవలసినప్పటికీ వరవరరావును 29 అక్టోబర్ 2020న సుప్రీంకోర్టు విడుదల చేయలేదని ద హిందూ న్యాయం, చట్టాలకు సంబంధించిన విలేఖరి కృష్ణదాస్ రాజగోపాల్ నివేదించారు. అయితే, వైద్యం, స్వేచ్ఛకు సంబంధించి ఆయన  అత్యవసరంగా చేసుకున్న దరఖాస్తును బాంబే హైకోర్టు పరిశీలించకుండా నెలరోజులు జాప్యం చేయడం పట్ల సుప్రీంకోర్టు నిజమైన ఆందోళన వెలిబుచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ కు నాయకత్వం వహించిన జస్టిస్ యూ.యూ.లలిత్ ఇలా అన్నారు: ‘‘అభ్యర్థనను (హైకోర్టు) వినకపోవడం అడ్డుగా నిలిచిందనే  వాస్తవం మమ్మల్ని బాధిస్తోంది.’’ ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి అత్యవసరంగా విచారించవలసిన విషయం అయినప్పటికీ బాంబే కోర్టు సెప్టెంబర్ 17 నుంచి వినడం లేదనే వాస్తవాన్ని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. సాధ్యమైనంత త్వరలో ఈ పిటిషన్ ను పరిశీలించాలని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు అభ్యర్థించింది. అర్ణబ్ కేసులో స్పందించిన విధంగా ఈ 81 ఏళ్ళ కవి,జర్నలిస్, యాక్టివిస్టు అయిన వరవరరావు కేసులో సైతం సుప్రీంకోర్టు స్పందించవలసింది. ఒక క్రిమినల్ కేసులో నిందితుడైన మితవాదాన్ని సమర్థించే ఒక జర్నలిస్ట్ స్వేచ్ఛకు సుప్రీంకోర్టు ప్రాధాన్యం ఇచ్చిందనీ, జీవితాంతం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్న ఒక వామపక్ష భావజాలం కలిగిన మేధావి స్వేచ్ఛకు విలువ ఇవ్వలేదనీ ఎవరైనా అంటే వారిని సుప్రీంకోర్టు నిరోధించగలదా? పౌరుల స్వేచ్ఛ ఎంత ముఖ్యమో సాధారణ ప్రజల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను పరిరక్షించే సంస్థగా సుప్రీంకోర్టు విశ్వసనీయత సైతం అంతే ముఖ్యమైనది.

ప్రజల హక్కు

న్యాయానికీ, అన్యాయానికీ సంబంధించిన రెండు ఉదాహరణలను పోల్చుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ముఖ్యంగా ఒక మితవాద జర్నలిస్టుకు న్యాయం అంది తక్కినవారు జైళ్ళలో మగ్గుతున్నప్పుడు ఇందులోని వైరుధ్యంపైన చర్చ జరుగుతుంది. నేరం చేశారని నిరూపించే ఆధారం లవలేశం కూడా లేకుండా మంగళవారం (17 నవంబర్ 2020)తో 81 ఏళ్ళ కవి,జర్నలిస్టు, వామపక్ష కార్యశీలి వరవరరావు జైలు జీవితం రెండేళ్ళు పూర్తయింది. ఇందుకు భిన్నంగా బకాయీలు చెల్లించకుండా ఆత్మహత్యకు ప్రోత్సహించాడనే సాక్ష్యాధారాలు కలిగిన అర్ణబ్ వంటి మితవాద జర్నలిస్టులు కస్టడీ నుంచి విడుదలై స్వేచ్ఛగా తిరుగుతారు.

‘సృజన’ అనే మాసపత్రిక సంపాదకుడు వరవరరావుపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశాడనే ఆరోపణ ఉండేది. విచారణ జరగకముందూ, విచారణ జరుగుతున్న సమయంలోనే ఏళ్ళతరబడి ఆయన జైలు జీవితం గడిపారు. ఇంతవరకూ ఆయనపైన చేసిన ఒక్క ఆరోపణను కూడా ప్రభుత్వం నిరూపించలేకపోయింది. పోలీసులను హత్య చేయడానికి కుట్ర చేశాడనే ఆరోపణ చేసి 17 ఏళ్ళు జైలులో ఉంచి ఆధారాలు లేని కారణంగా విడుదల చేశారు. రాజకీయ సిద్ధాంతాల కారణంగా ఆయనను జైలులో ఉంచారు కానీ నిరూపితమైన నేరం కారణంగా కాదు. వరవరరావు బాధ్యతాయుతమైన రచయిత. ‘సహచరులు’ పేరుతో 1990లో జైలు డెయిరీ రాశారు. దాన్ని 2010లో ‘కేప్టివ్ ఇమాజినేషన్’ పేరుతో ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రచురించారు. కీన్యాలో శిఖర సదృశమైన కవి, తనలాగే జైలు జీవితం గడిపిన గూగీ వాథియోంగో రాసిన జైలు డెయిరీ డిటెయిన్డ్ (1981)నీ, ఆయనే రాసిన నవల ‘డెవిల్ ఆన్ ద క్రాస్’ (1980)నీ వరవరరావు తెలుగులోకి తర్జుమా చేశారు.  

భీమా కోరేగాం యుద్ధం జరిగి రెండు వందల సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఎల్గార్ పరిషత్తు 31 డిసెంబర్ 2017న నిర్వహించిన సభలో అజ్ఞాత నక్సలైట్ గ్రూపులకు చెందినవారూ, వామపక్ష మేధావులూ పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనీ, మరుసటి రోజు 01 జనవరి 2018న జరిగిన హింసాకాండకు ఆ ప్రసంగాలే  కారణమనీ పుణె పోలీసులు అభియోగం మోపారు. భీమా కోరేగాం ఘటనలలో వరవరరావు ప్రమేయం ఉన్నదనే అనుమానంతో ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. దాన్ని హోంఅరెస్టు అంటారు.

వరవరరావు పిటిషన్లు

తన అరెస్టును సుగమం చేసేందుకు హైదరాబాద్ చీఫ్ మెట్రొపాలిటన్ మెజిస్ట్రేట్ ట్రాన్సిట్ రిమాడ్ వారంట్ జారీ చేశారు. ఈ వారంటు అక్రమమైనదనీ, తగిన విధివిధానాలను పాటించలేదనీ వాదిస్తూ ఒక పిటిషన్ దాఖలైంది. జస్టిస్ బి. శివశంకరరావు 6 నవంబర్ 2018న పిటిషన్ ను విచారణకు స్వీకరించారు. నవంబర్ 17 ట్రాన్సిట్ రిమాండ్ వారంట్ ను సస్పెండ్ చేశారు. వారంట్ ను రద్దు చేయడం గురించి నవంబర్ 26న విచారిస్తామని మౌఖికంగా, లిఖితపూర్వకంగా న్యాయమూర్తి చెప్పారు. న్యాయమూర్తి అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకున్నారనీ, వారంట్ ను రద్దు చేయాలనీ పిటిషన్ ను వాదనలు వినకుండా తిరస్కరించారనీ వరవరరావు బావమరిది, జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ రాశారు. న్యాయమూర్తి మెడికల్ రిపోర్ట్ ను పరిశీలించి ప్రయాణం చేయడానికి వరవరరావు ఆరోగ్యం సహకరిస్తుందని అన్నారు. నిజానికి ఆ విషయం ఆయన పరిశీలనలో లేదు. విచారించి తీర్పు చెప్పవలసిన (ఎడ్జుడికేట్ చేయవలసిన) అంశం పిటిషన్ లో ఏదీ లేదని చెబుతూ దాన్ని తిరస్కరించారు.  ఈ ఉత్తర్వు వరవరరావును ఇంట్లో అరెస్టు చేసి పుణె జైలుకు తీసుకొని వెళ్ళడానికి వీలు కల్పించింది.

కోవిద్ – 19 దాడి

మహారాష్ట్రలోని తలోజా జైలులో వరవరరావు ఆరోగ్యం క్షీణించింది. ముంబయ్ జే.జే. ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపైన నివేదిక కావాలని ఒక ప్రత్యేక న్యాయస్థానం కోరింది కానీ బెయిల్ మంజూరు చేయలేదు. కోవిద్ సోకే ప్రమాదం ఉన్నది కనుక ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ 2020 జూన్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోవిద్ మహమ్మారి విజృంభించిన కారణంగా జైలులో ఉన్న వృద్దులనూ, వారితో కలసి ఉన్నవారినీ విడుదల చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా విడుదల చేయాలనీ పిటిషన్ అభ్యర్థించింది. కానీ విడుదల చేయడానికి న్యాయస్థానం తిరిగి నిరాకరించింది. బెయిలు అడుగుతూ వరవరరావు పెట్టుకున్న పిటిషన్ ను 14 మంది పార్లమెంటు సభ్యులు బలపరిచారు. ఆయన ఆరోగ్యం గురించి. కోవిద్ దృష్ట్యా జైలులో పరిస్థితుల గురించీ ఆందోళన వెలిబుచ్చుతూ వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాశారు. ఆ పిటిషన్ ను ఇద్దరు మాజీ కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్లు బలపరిచారు. కుట్ర ఆరోపణపైన వారు అనుమానాలు వెలిబుచ్చారు. ఈ కేసు గురించి సమాచారం యావత్తూ బొంబాయి పోలీసులకు అందజేయాలని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి విజ్ఞప్తి చేశారు.

ముంబయ్ జే.జే. ఆస్పత్రిలో 16 జులై 2020న వరవరరావుకు కోవిద్ పరీక్షలో పాజిటీవ్ ఉన్నట్టు (వైరస్ సోకినట్టు) నిర్ధారణ జరిగింది. ఆస్పత్రిలో ఉండగానే వరవరరావు కిందబడి తలకు గాయమైనదని తెలిసింది. ఆయనకు వైద్యం చేయించేందుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. అప్పుడు ఆయనను బొంబాయిలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. కోర్టులో బెయిల్ కోసం వరవరరావు వేసిన పిటిషన్ ను ఎన్ఐఏ వ్యతిరేకించింది. కోవిద్ మహమ్మారిని సాకుగా ఉపయోగించుకుంటున్నారంటూ ఎన్ఐఏ వాదించింది. అప్పటికే ఆయనకు కోవిద్ సోకిందనీ, చికిత్స జరుగుతోందనీ ఆస్పత్రి ప్రకటించింది.

కుడి, ఎడమల వ్యత్యాసం ఉండకూడదు

అర్ణబ్ గోస్వామి లాగా వరవరరావు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కాదు. అర్ణబ్ గోస్వామి లాగా అధికార పార్టీ రాజకీయ క్రీడలను సమర్థించే వ్యక్తి కాదు. అర్ణబ్ అరెస్టు కేంద్రంలో అధికారంలో  ఉన్న పార్టీకి చట్టాలను ఉల్లంఘించినట్టూ, అన్యాయం జరిగినట్టూ, ఆయన వాక్ స్వాతంత్ర్యాన్నీ, స్వేచ్ఛనూ హరించినట్టు కనిపించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారాన్నీ ఆత్యయిక పరిస్థితో  (ఎమర్జెన్సీ) పోల్చినా అర్థం చేసుకోవచ్చు. కానీ వరవరరావు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా పరిగణిస్తున్నది?

వరవరరావు బెయిల్ పిటిషన్ ను విచారిస్తున్న సమయంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకొని, ప్రతి ఖైదీ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం స్పందిస్తుందనీ, కానీ వరవరరావుకు అనారోగ్య కారణంగా బెయిల్ మంజూరు చేస్తే ఆయనలాగే డిటెన్షన్ లో ఉన్న ఇతరులు కూడా వైద్య, ఆరోగ్య కారణాలపైన బెయిల్ అడుగుతారనీ అన్నారు. అప్పుడు బెంచ్ పైన ఉన్న జస్టిస్ రవీంద్రభట్ ఈ విధంగా స్పందించారు: ‘‘అది మమ్మల్ని నిరోధించలేదు….ప్రతి ఖైదీ ఆరోగ్య పరిస్థితి చికిత్సకు అర్హమైదనీ, అతడిని కానీ ఆమెను కానీ చికిత్సకు పంపించాలనుకుంటే అదే జరగనివ్వండి (చికిత్సకోసం ఆస్పత్రికి పంపండి). ఆరోగ్యం ఆరోగ్యమే. జైలులో చనిపోవాలని ఎవరు కోరుకుంటారు?’’

తన భర్తకు ఉన్నత స్థాయి వైద్యం అవసరమని హేమలత అభ్యర్థించారు. కస్టడీలో ఉన్న కాలంలో ఆయన నోటి వెంట మాట రావడం లేదని చెప్పారు. నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారనీ, కోవిద్ వైరస్ సోకిన తర్వాత జరిగే దుష్పరిణామాలతో సతమతం అవుతున్నారనీ ఆమె వివరించారు. సెయింట్ జార్జి ఆస్పత్రిలో కిందబడి తలకు గాయమైనట్టు కూడా తెలిపారు. హైకోర్టు ఆదేశం మేరకు నానావతి ఆస్పత్రి వరవరరావు ఆరోగ్యంపైన ఒక నివేదికను 30జులై 2020న సమర్పించింది. కోవిద్ కారణంగానూ, కిందబడి గాయం కావడం మూలంగా ఆయనకు నరాలకు సంబంధించిన సమస్యలు ముమ్మరమైనాయని ఆస్పత్రి తెలిపింది. ‘వయస్యు దృష్ట్యా కలిగే సమస్యలూ, కోవిద్ వల్ల వచ్చిన హైపోనాట్రిమియా (శరీరంలో సోడియం పాలు తక్కువ కావడం) వంటి పరిణామాలు సంభవించాయనీ, రోగిని జాగ్రత్తగా గమనించవలసిన ఆవశ్యకత ఉన్నదనీ హైకోర్టు  అభిప్రాయం వెలిబుచ్చింది. వైద్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయకుండా హైకోర్టును నిరోధించే ఉద్దేశంలో వరవరరావును హడావిడిగా నానావతి  ఆస్పత్రి నుంచి విడుదల చేయించిన విషయం ఇందిరా జైసింగ్ వివరించారు. తన భర్తను కస్టడీలో కొనసాగించడం శిక్షించడమేననీ, నేరం నిరూపణ కాకుండా శిక్షించడం చట్టప్రకారం ఆమోదయోగ్యం కాదనీ హేమలత అన్నారు. ఖైదీ ప్రాథమిక హక్కుల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ హైకోర్టు ఎదుట ఉన్న పిటిషన్ ను సవరించవలసిందిగా వరవరరావు కుటుంబానికి సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది.

బాంబే హైకోర్టు విచారణ

సర్వోన్నత న్యాయస్థానం సలహా మేరకు బాంబే హైకోర్టు నవంబర్ 12న వరవరరావు తరఫు పిటిషన్ విచారణ చేపట్టింది. 17 నవంబర్ 2020న (మంగళవారం) విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైద్య నివేదికను సమర్పించలేదనీ, హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించిందనీ ఇందిరాజైసింగ్ అన్నారు. ‘‘ఇప్పుడు మీకు సమర్పించిన రిపోర్టు కంటితుడుపు నివేదిక. ఆయనకు సరైన వైద్యం అందే విధంగా నానావతి ఆస్పత్రికి తరలించాలని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. అప్పుడే మీకు సరైన వైద్య నివేదిక అందుతుంది. మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారనీ మేము మీకు చెబుతూనే ఉన్నాం. మతిపరుపు గురించి నివేదికలు ఎక్కడున్నది? ఇందిరా జైసింగ్ వాదనను వెబ్ కాన్ఫరెన్స్ లో న్యాయమూర్తి సరిగా వినలేకపోయారు. విచారణను మర్నాటికి భౌతిక  విచారణ నిమిత్తం వాయిదా వేశారు.

వరవరరావు భార్య పెండ్యాల హేమలత తన పిటిషన్ లో తన భర్తను తలోజా జైలులో అమానవీయమైన పరిస్థితులలో బందీగా ఉంచారనీ, ఆయనకు కనీస వైద్య సదుపాయం కూడా అందడం లేదనీ తెలిపారు. రాజ్యాంగంలోని 21వ అధికారణ కింద దక్కవలసిన హక్కులు కూడా ఉల్లంఘిస్తున్నారని ఆమె ఆరోపించారు. వరవరరావును పరీక్ష చేసిన విధానాన్ని ఆక్షేపిస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించేందుకు ఈ పరీక్ష సరిపోదని కూడా చెప్పారు. సరైన వైద్య పరీక్ష నిర్వహించేందుకు జైలులో వసతుల లేవనీ, అందువల్ల తన భర్తని వెంటనే నానావతి ఆస్పత్రికి తరలించాలనీ ఆమె గట్టిగా కోరారు.

సుప్రీంకోర్టు, 32వ అధికరణ

సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త ఆలోచన మెదులుతోంది. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద పిటిషన్లను తగ్గించాలన్న ధోరణి ప్రబలుతోంది. ఉత్తరప్రదేశ్ హాథ్ రస్ తో ఒక బాలికపైన సామూహిక అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసిన ఉదంతంపైన వార్తాసేకరణ కోసం కప్పన్ అనే 41 సంవత్సరాల జర్నలిస్టు మరి ముగ్గురు వ్యక్తులూ వెడుతుంటే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ‘క్యాంపస్ ఫ్రంట్ ఇండియా’ కు చెందిన కప్పన్, మరి ఇద్దరు హాథ్ రస్ అత్యాచారం ఘటనపైన మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర చేస్తున్నారని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆరోపిస్తూ యూఏపీఏ చట్టంతో సహా వివిధ సెక్షన్లపైన కేసు బనాయించారు. జర్నలిస్టు అరెస్టును సవాలు చేస్తూ కేరళ జర్నలిస్టుల సంఘం32వ అధికరణ కింద పిటిషన్ దాఖలు చేసింది. ప్రాథమిక హక్కులను అమలు చేయాలని కోరుతూ నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కల్పిస్తున్న 32వ అధికరణ కింద పిటిషన్లను ప్రోత్సహించరాదనీ, తగ్గించాలనీ తాను భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బాబ్డే స్వయంగా అన్నారు. 32వ అధికరణ భారత రాజ్యాంగంలో విశేషమైనది, విశిష్టమైనది. ఇది రాజ్యాంగంలో భాగం కావడానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కారకుడని ప్రతీతి.

సమీత్ ఠాక్కర్ కేసు విచారించలేదు

ఇదే బెంచ్ సమీత్ ఠాక్కర్ కు సంబంధించిన పిటిషన్ ను హైకోర్టుకు పంపించింది.  సమీత్ ఠాక్కర్ నాగపూర్ వాసి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపైనా, ఆయన మంత్రులపైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ట్వీట్లుగా పెట్టారనే ఆరోపణపై సమీత్ పైన పలు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. వాటిని సవాలు చేస్తూ అతడు పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘ప్రాథమిక హక్కులను హైకోర్టులు సైతం పరిరక్షించగలవు,’’ అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకోవాలంటే అర్ణబ్ గోస్వామిది అరుదైన కేసులలో కెల్లా అరుదైనదని. అందుకే సుప్రీంకోర్టు పట్టించుకున్నది. రిపబ్లిక్ టీవీ ప్రధాన సంపాదకుడు అర్ణబ్ గోస్వామికి 11 నవంబర్ 2020న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంగా దేశంలోని అన్ని హైకోర్టులకూ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలో, ‘‘స్వేచ్ఛను పరిరక్షించండి. రాజ్యాంగ న్యాయవ్యవస్థలుగా మన మనుగడకు అదే ప్రధానమైన హేతువు’’ అంటూ వ్యాఖ్యానించింది. కానీ అర్ణబ్ కు బెయిల్ మంజూరు చేయకుండా ఆయన దరఖాస్తులను నిరాకరించడంలో బాంబే హైకోర్టు తప్పు చేసిందని ఇదే  సుప్రీంకోర్టు నిర్ణయించింది మరి.

ప్రాథమిక హక్కులను పరిరక్షించే అధికారాలు హైకోర్టులకు ఉంటే కొన్ని ముఖ్యమైన కేసులను హైకోర్టుల పరిధి నుంచి సుప్రీంకోర్టు తన పరిధిలోకి ఎందుకు తీసుకుంటున్నది? జాతీయ రాజధాని ప్రాంతంలోని భూమి వినియోగానికి సంబంధించిన సెంట్రల్ విస్తా ప్రాజెక్టు కేసును దిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఇటీవలనే బదిలీ చేసుకున్నది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించాలని పిటిషనర్ అడగలేదు. 2018లో న్యాయమూర్తి బీహెచ్ లోయా మరణంపైన విచారించాలని కోరిన పిటిషన్ ను బాంబే హైకోర్టు పరిధి నుంచి తప్పించి సుప్రీంకోర్టు తన పరిధిలోకి తెచ్చుకున్నది. హైకోర్టులో కేసు విచారించి ఉంటే పిటిషనర్ కు సుప్రీంకోర్టు కంటే కింది స్థాయి దశలో తన పిటిషన్ పై విచారణ జరిగి, నిర్ణయం వచ్చిందనే సంతృప్తి ఉండేది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు హైకోర్టులకు సైతం సమానమైన అధికారాలు ఉన్నాయంటూ సుప్రీంకోర్టు చెబుతున్న మాటకూ, దాని వ్యవహారశైలికీ విరుద్ధంగా నిర్ణయాలు ఉంటున్నాయి.  

మాకు దిగ్భ్రాంతి కలగదు : సీజేఐ

సుప్రీంకోర్టు ఎదుట ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసు విచారణలో తనకు ఆసక్తి లేదని సర్వోన్నత న్యాయస్థానం అంటుంది. 06 నవంబర్ 2020న తన క్లయంట్ ఠాక్కర్ పైన ఎఫ్ఐఆర్ లో చేసిన ఆరోపణలన్నీ బెయిలు ఇవ్వడానికి అనువైనవే అయినప్పటికీ ఆయనను అరెస్టు చేశారని న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదించారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయింది కనుక పిటిషనర్ కు బెయిలు మంజూరు చేసినా మహారాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పినప్పటికీ ఈ కేసు వినడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘ఈ పరిణామం మీకు దిగ్భ్రాంతి కలిగించకపోతే మిమ్ములను ఏదీ దిగ్భ్రాంతికి గురి చేయదు,’’అని మహేశ్ జెఠ్మలానీ వ్యాఖ్యానించినప్పుడు, ‘‘ఇటువంటి విషయాలు మేము ప్రతిరోజూ చూస్తూ ఉంటాము. అటువంటి షాకులకు మేము అతీతులం. మాకు ఇప్పుడు ఏదీ దిగ్భ్రాంతి కలిగించదు,’’ అంటూ సీజేఐ బదులిచ్చారు. న్యాయస్థానాల నుంచి అటువంటి వార్తలు చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందవలసిందే. చాలా దురదృష్టం.

ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తున్నదంటే రాజ్యాంగం నిర్దేశించినట్టు ఇటువంటి కేసులను సుప్పీంకోర్టు విచారించడం లేదు హైకోర్టులనూ ఆ పని చేయనివ్వడం లేదు. అర్ణబ్ వంటి కొన్ని కేసులలో అప్పుడప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛపైన కాస్త ఎక్కువ శ్రద్ధ కనబర్చుతారు. వరవరరావు వంటి అనేకమంది ఇతర జర్నలిస్టుల విషయంలో, సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ ను వ్యతిరేకించినవారి విషయంలో వారి క(ఖ)ర్మకూ, హైకోర్టు ఇచ్చే సమయానికీ వారిని వదిలేస్తారు.

రాజ్యాంగం 32వ అధికరణ ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ప్రసాదించిన చికిత్సను నీరుగార్చడానికి ప్రయత్నించడం రాజ్యాంగానికి అంబేడ్కర్ సమకూర్చిన సైద్ధాంతిక పునాదికి విరుద్ధమైనది. తమ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడే ప్రజల శక్తిని ఇది క్షీణింపజేస్తుంది. అంబేడ్కర్ ఆత్మ ఘోషిస్తుంది.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles