Sunday, December 22, 2024

మాయావతి రాజకీయం: యూపీ మాయాబజార్

దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నాయకురాలు మాయావతి. నాలుగు విడతల ముఖ్యమంత్రిగా పని చేసి తన పార్టీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్ పీ)లో తిరుగులేని నేతగా ఇంతకాలం చెలామణి కావడం ఆమెకే చెల్లింది. కాన్సీరామ్ 1984లో ప్రారంభించిన బహుజన సమాజ్ పార్టీ ఆ తర్వాత ఎన్నో చీలికలకు గురైంది. చీలిపోయిన నాయకులు మాయావతిని పొగరుమోతుగా, నిరంకుశురాలుగా నిందించారు. కాన్సీరామ్ ఆదర్శాలకు దూరంగా జరిగింది. మాయావతి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పార్టీ నడుస్తోంది. ఆమకు ఆగ్రహం కలిగితే ఎవరినైనా బహిష్కరించగలరు. ఎందుకు చేయవలసి వచ్చిందో ఎవ్వరికీ సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు.  తమకు 11 మంది బీఎస్ పీ ఎంఎల్ఏల మద్దతు ఉన్నదనీ, వారు శాసనసభలో ప్రత్యేక బృదంగా కూర్చోబోతున్నారని సమాజ్ వాదీ ఎంఎల్ఏ అస్లామ్ రాయినీ వ్యాఖ్యానించారు. కొంతమంది నాయకులు బీఎస్ పీని వదిలి ఎస్ పీ వైపు వెళ్ళాలని అలోచిస్తున్న మాట నిజం. ఇది 1995లోనూ, 1997లోనూ, 2003లొనూ జరిగింది. అటువంటి పరిణామం మళ్ళీ సంభవించకుండా నిరోధించే పనిలో మాయావతి ఉన్నారు. 

2019 లోక్ సభ ఎన్నికలలో కూటమి భాగస్వాములుగా అఖిలేష్ యాదవ్, మాయావతి ఉమ్మడి ప్రచారం

బీఎస్ పీ టిక్కెట్టు మీద గెలిచిన తర్వాత ఆ పార్టీలో కొనసాగకుండా వేరే పార్టీలోకి లంఘించడం మామూలే. 1997లో కొందరు బీఎస్ పీ ఎంఎల్ఏలు బీజేపీనీ, కల్యాణ్ సింగ్ నాయకత్వాన్నీ బలపరిచారు. 2003లో బీఎస్ పీ కి గుడ్ బై చెప్పిన ఎంఎల్ఏలు ములాయంసింగ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీని బలపరిచారు.

Also read: చైనా బెదరదు, బెదిరించదు: సీ జిన్ పింగ్

అప్పుడు బీజేపీలోకీ, ఇప్పుడు ఎస్ పీలోకీ వలసలు

బీఎస్ పీ నాయకుల వ్యవహారంలో ఒక పద్ధతి కనిపిస్తోంది. 2017 ఎన్నికలకు ముందు బీఎస్ పీని వీడిన నాయకులు బీజేపీలో ప్రవేశిస్తే 2019 నుంచి చాలామంది నాయకులు బీఎస్ పీ నుంచి ఎస్ పీలోకి వెళ్ళారు. 2015లో పార్టీ వ్యవస్థాపక నాయకుడు, పార్లమెంటు సభ్యుడు  దారాసింగ్ చౌధరిని మాయావతి పార్టీనుంచి బహిష్కరించారు. ఆయన బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభ సభ్యుడు జుగల్ కిశోర్ బీఎస్ పీ నుంచి నిష్క్రమించి బీజేపీలో ప్రవేశించారు. 2016లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మాయావతికి గర్వం అతిశయించిందనీ, డబ్బు యావ పెరిగిందనీ ఆరోపిస్తూ స్వామి ప్రసాద్ మౌర్యం పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళారు. బీఎస్ పీలో ప్రముఖ బ్రాహ్మణ వర్గం నాయకుడు బ్రిజేష్ పఠాన్ ను ఆమె బహిష్కరించారు. వారిద్దరూ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు. 2017 ఎన్నికల కంటే కొన్ని రోజులు ముందే పార్సీ నాయకుడు ఆర్ కె చౌధరి బీఎస్ పీని వదిలి ఎస్ పీలో చేరిపోయారు. ఎస్ పీ 2019లో బీఎస్ పీతో పొత్తు పెట్టుకోవడం సహించలేని చౌధరి ఎస్ పీ నుంచి నిష్క్రమించి కాంగ్రెస్ లో చేరిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎస్ పీకీ, బీఎస్ పీకి పడని కారణంగా తిరిగి కాంగ్రెస్ ను వీడి ఎస్ పీకి వచ్చారు.

Also read: ఉపా చట్టం రాజ్యాంగవిరుద్ధం

బీజేపీ 2017లో ఘనవిజయం సాధించిన తర్వాత మాయావతికి సన్నిహితుడైన ఇంద్రజిత్ సరోజ్ ఎస్ పీలో చేరిపోయారు. చాలాకాలంగా పార్టీలో నాయకుడిగా వెలిగిన ముస్లిం నేత నసీముద్దీన్ సిద్ధికీని మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్సీరామ్ పోయిన తర్వాత మాయావతి తనకు తోచినట్టు పార్టీని నడుపుతున్నారు. సిద్ధాంతాలు లేవు. ఒక సారి బీజేపీతో, మరో సారి ఎస్ పీతో, ఇంకోసారి ఒంటరిగా ప్రయాణం చేస్తూ వచ్చారు. 2007 ఎన్నికలలో మాయావతి ఘనవిజయం సాధించారు. ఆమె రాజకీయ జీవితంలో అది గొప్ప ఎన్నికల. బ్రాహ్మణులూ, ముస్లింలతో భుజం కలిపి దళిత ఓటర్ల మద్దతు మొత్తం 403 శాసనసభ స్థానాలలో 206 స్థానాలకు గెలుచుకున్నారు. 30 శాతం ఓట్లు సాధించారు. 2012 ఎన్నికలలో అది 80 స్థానాలకూ, 25 శాతం ఓట్లకూ పడిపోయింది. 2017లో ఎస్ పీపైన బీజేపీ ఘనవిజయం సాధించినప్పుడు బీజేపీకి కేవలం 19 స్థానాలూ, 22 శాతం ఓట్లూ లభించాయి.

మాయావతి, కాన్సీరామ్ పాతికేళ్ళ కిందట

బీఎస్ పీలో కాన్సీరామ్ వ్యవస్థీకరించినప్పటి నుంచీ కొనసాగిన నేతలు లాల్జీ వర్మనూ, రాం అచల్ రాజ్ భర్ నూ మాయావతి బహిష్కరించారు. కొడుకు చనిపోయిన పుత్రసోకంలో ఉండి కూడా మాయావతి ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటలలో లక్నో వెళ్ళి మాయావతి ముందు హాజరైన వర్మ పార్టీకి అంకితభావంతో సేవచేశారనీ, ఆయనను కూడా బహిష్కరించడం మాయావతి అహంకార ధోరణికి నిదర్శనమనీ పరిశీలకులు వ్యాఖ్యానించారు.

Also read: రాజ్యాంగం నుంచి ఉపా చట్టాన్ని తొలగించడం మేలు

పంజాబ్ లో మాత్రమే పొత్తు

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అధైర్యపడకుండా పార్టీని ముందుకు నడిపించడంలో తనదైన వ్యూహాలనూ, ఎత్తుగడలనూ, ప్రణాళికలనూ అనుసరిస్తున్నారు మాయావతి. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో జరిగే ఎన్నికలలో తాను ఒంటరి పోరాటం చేస్తానని ప్రకటించారు. పంజాబ్ లో మాత్రమే అకాళీదళ్ తో పొత్తు ఉంటుందనీ, తక్కిన చోట్ల ఒంటరి పోరాటమేననీ ఆమె తేల్చి చెప్పారు.

నిగూఢమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో మాయావతి దిట్ట. 2019 లోక్ సభ ఎన్నికలలో సమాజ్ వాదీపార్టీతో పొత్తు ఉంటేనే రెండు పార్టీలకూ కలసి 15 స్థానాలకు మించి రాలేదు. రెండు పార్టీలూ కలసి పోటీ చేసినా బీజేపీని ఓడించే శక్తి లేనప్పుడు రెండు పెద్ద ప్రతిపక్షాలూ విడివిడిగా పోటీ చేస్తే బీజేపీకి మరో అయిదేళ్ళపాటు అధికారం అప్పనంగా అప్పగించినట్టే కదా. ఎందుకు మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు ఒంటరి పోరాటం మార్గాన్ని ఎంచుకున్నారు? 2019 ఎన్నికలలో బీఎస్ పీ ఓట్లు ఎస్ పీ అభ్యర్థులకు పడినాయి కానీ ఎస్ పీ ఓట్లు బీఎస్ పీ అభ్యర్థులకు పడలేదని మాయావతి అంటున్నారు. అదే వాదన అఖిలేష్ యాదవ్ చేస్తున్నారు. మాకు బీఎస్ పీ ఓట్లు పడలేదు కనుకనే ఎస్ పీకి కేవలం అయిదు సీట్లు వచ్చాయనీ, మా ఓట్లు బీఎస్ పీకి పడినాయి కనుకనే ఆ పార్టీకి పది సీట్లు వచ్చాయనీ అఖిలేష్ వాదన. నిజానికి అఖిలేష్ వాదనలోనే న్యాయం ఉన్నది. 2019 సార్వత్రిక ఎన్నికలలో కష్టసాధ్యమైన స్థానాలలో ఎస్ పీ పోటీ చేసింది. దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో బీఎస్ పీ అభ్యర్థులు తలబడ్డారు. అటువంటి బలమైన స్థానాలలో సైతం బీఎస్ పీ అభ్యర్థులు ఓడిపోయారు. అప్పటికే దళితులలో చాలామంది బీజేపీ గూటిలోకి చేరారని అర్థం.

Also read: మేటి కథకుడైన కథానాయకుడు పీవీ

కుల సమీకరణలే ప్రధానం

ఉత్తర ప్రదేశ్ రాజకీయ చరిత్రను గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కంటే కులసమూహాలతో పొత్తు పెట్టుకోవడానికే మాయావతి ప్రాధాన్యం ఇస్తారు. దళిత్ – బహుజన ఓట్లలో అత్యధికశాతం బీఎస్ పీకే ఉన్నాయనీ, ఇతర కులాలకు బీఎస్ పీ స్నేహహస్తం చాచినప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చుననీ, బీఎస్ పీ తో భుజం కలిపిన కులాలకూ మేలు జరుగుతుందని మాయావతి విశ్వాసం. వివిధ కులాలతో పొత్తుకు ప్రయత్నించి కుదరక పోవడంతోనే 2019లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు మాయావతి అంగీకరించారు.

లోగడ 1993లో బీఎస్ పీ, ఎస్ పీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ బలంగా ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. అప్పుడు ఎస్ పీ అధినేతగా ములాయంసింగ్ యాదవ్ (అఖిలేష్ తండ్రి) ఉండేవారు. కానీ ఆ ఎన్నికలలో కూడా ఓట్లు బదలాయింపు జరగలేదు. ఎందుకు? సమాజంలో వెనుకబడిన కులాలవారికీ, దళితులకూ మధ్య ఘర్షణవాతావరణం నెలకొని ఉన్నది. ఎన్నికలలో ఈ కూటమికి విజయం లభించినప్పటికీ పరిపాలనలో వైఫల్యం తప్పలేదు. వెనుబడిన కులాలు పైకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దళితులు తమ హక్కులకోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పడుతున్న వెనుబడిన కులాలవారినీ, దళితులనూ ఒకే గాట కట్టడం, ఒకే వాహనంలో ప్రయాణం చేయించడం సాధ్యం కాదని నేతలు నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడు పొత్తులు తప్పడం లేదు.

యువతిగా దేవీ మాయావతి

దళితులలో పెరుగుతున్న హిందూత్వ భావన

దళితులలో అధిక సంఖ్యాకులు ఇప్పటికీ మాయావతి చెప్పుచేతల్లోనే లేరు. వారికి బీజేపీ గండి కొట్టింది. వివిధ రకాల అవకాశాలను ఇవ్వజూపింది. దళితులలో కూడా హిందుత్వ మనస్తత్వం పెరుగుతోంది. వారు రాజకీయ పదవులకోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దళితులలో ఆర్థికంగా ఎదిగినవారికి దళిత మూలాలతో, దళిత పార్టీతో, దళిత నాయకురాలితో పని లేదు. మాయావతి నాయకత్వంతో విసిగిపోయిన దళిత నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ దశలో ఇతర పార్టీలతో, ఇతర కులాలతో పొత్తు పెట్టుకోవడం కంటే తన కులంలో, ఉపకులాలలో సయోధ్య సాధించి, వారిని సంఘటితం చేయడం అవసరమని మాయావతి భావించి ఉంటారు. తాను గట్టి, సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన నాయకురాలిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం అసాధ్యమని మాయావతికి తెలుసు. ఒంటరిగా పోరాడినా, పొత్తు పెట్టుకున్నా ఈ సారి బీజేపీని గద్దె దింపడం సాధ్యం కాదని ఆమె తీర్మానించుకున్నట్టు కనిపిస్తున్నది. అందుకే తన ఓటు బ్యాంక్ ను సురక్షితంగా ఉంచుకోవడం కోసం, తన కులంలో చీలికలను నివారించడం కోసం ఆమె దళితులంతా ఏకం కావాలనే నినాదం ఇస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోనే ఎంఐఎం పార్టీతో బీఎస్ పీ పొత్తు పెట్టుకుంటుందనే వదంతులను సైతం మాయావతి మొగ్గలోనే తుంచివేశారు. అటువంటి అవకాశం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు.

Also read: తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్

ఉత్తర ప్రదేశ్ లోని పలు కులాలవారికి హిందూత్వ విధానాన్ని వివరించి, వారిలో ఈ విధానాన్ని చొప్పించేందకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఎస్ పీ, ఎస్ పీలు రెండు విడివిడిగా పోటీ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ను వ్యతిరేకించే ఓటర్లు చీలిపోతారు. అది బీజేపీకి లాభదాయకం. వివిధ ఉపకులాలతో పొత్తు పెట్టు పెట్టుకొని కాషాయ ఛత్రం కిందికి తీసుకురావడానికి బీజేపీ నాయకులూ, ఆ పార్టీ  అనుబంధ సంస్థల నాయకులూ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. బహుజన కులాలవారికీ, ఇప్పుడిప్పుడే రాజకీయాలలో తమ వాటా కోసం ప్రయత్నిస్తున్నవర్గాలకీ ప్రభుత్వ పదవులలో వాటా ఇవ్వడం ద్వారా, ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వజూపడం ద్వారా బీజేపీ వారిని గెలుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. బహుజన రాజకీయాలను హిందూత్వ రాజకీయాలు కబళించకుండా కాపాడుకోవడం ఎట్లా అన్నదే మాయావతి ఎదుట ఉన్న పెనుసవాలు.

దళిత-బ్రాహ్మణ కూటమి, లాల్ జీ టాండన్ కు రాఖీ కుడుతున్న మాయావతి

దళిత-బ్రాహ్మణ-ముస్లిం కూటమి

ఉత్తర ప్రదేశ్ లో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ సమాజంతో లోగడ మాయావతి పొత్తు పెట్టుకున్నారు. చాలా టిక్కెట్లు ఇచ్చారు. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దళితులూ, బ్రాహ్మణులూ, ముస్లింలూ కలిసి ఉన్నంత కాలం మాయావతి బలంగా కనిపించారు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత  బ్రాహ్మణులను వెనక్కి లాక్కున్నది. మాయావతికి చెందిన జాతవ్ దళిత ఉపకులంలో చాలామంది నాయకులు బీజేపీలో చేరిపోయారు. క్షేత్రస్థాయిలో సుహృద్భావపూరిత వాతావరణంలో జీవిస్తున్న కులాలకు చెందిన రాజకీయ పార్టీల మధ్య పొత్తు రాణిస్తుంది కానీ వీధిపోరాటాలు చేస్తున్న కులాలకు చెందిన పార్టీల మధ్య ఎన్నికల పొత్తు సత్ఫలితాలు ఇవ్వజాలదు. ఎస్ పీలకు యాదవ్ లు అండగా ఉండేవారు. వారిలో కూడా చాలామంది నాయకులు మెల్లగా బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఎస్ పీ కంటే బీఎస్ పీకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని మాయావతి నమ్ముతున్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అగ్రశ్రేణిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదివరలో చేసిన ప్రయోగాన్నే మరోసారి చేయాలని అభిలషిస్తున్నారు.

Also read: ఇది ‘రమణ ఎఫెక్ట్’, రిబీరో వ్యాఖ్య

మాయావతి చాణక్యం కారణంగా 2007 అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యమైన విజయం సాధించారు. దళిలులూ, బ్రాహ్మణులూ, ముస్లింలూ బీఎస్ పీకి అండగా నిలిచి ఎన్నికలలో గెలిపించారు. నసీముద్దీన్ సిద్దికీ బీఎస్ పీ కి ముస్లిం ప్రతినిధిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. బ్రాహ్మణ ప్రతినిధి సతీష్ చంద్ర శర్మ మాయావతికి అందుబాటులోనే ఉన్నారు. సిద్దికీకి ప్రత్యామ్నాయంగా ఎవరిని దగ్గరికి తీయాలో మాయావతి నిర్ణయించుకోవాలి. యూపీ ముస్లింలు మాయావతిని నమ్ముతారనడానికి ఆధారాలు ఉన్నాయి. 2007లో చేసినట్టే ‘భాయిచాలా కమిటీలు’ (సోదరత్వ సంఘాలు) ఏర్పాటు చేసే పని ప్రారంభించవలసిందిగా మాయావతి సతీష్ శర్మకు చెప్పారు.

సోనియాతో యామావతి

మాయావతి, అఖిలేష్ మధ్య పోటీ

రాజ్యసభ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఐదుగురు బీఎస్ పీ ఎంఎల్ ఏలు వెళ్ళి అఖిలేష్ యాదవ్ ను కలుసుకోవడం మాయావతిని ఆగ్రహానికి గురిచేసింది. మొత్తం ఏడుగురు ఎంఎల్ఏలను ఆమె సస్పెండ్ చేశారు. లాల్ జీ వర్మ, రాజ్ భర్ ల బహిష్కరణ కారణంగా తమ బలం 11కి పెరిగిందని అస్లం అంటున్నారు. 2022లో ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇటు అఖిలేష్ కానీ అటు మాయావతి కానీ రాజీపడే అవకాశం లేదు.

Also read: ఉద్యమస్ఫూర్తికి ఊరట

బీజేపీకి బలమైన వ్యవస్థ ఉంది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సత్ఫలితాలు ఓటింగ్ లో ప్రతిఫలిస్తాయి. అన్ని వర్గాలనూ దువ్వుతూ మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. యూపీ బీజేపీలో అసమ్మతిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు చర్యలు తీసుకున్నారు. యోగి ప్రభుత్వంలో ఠాకూర్ రాజ్యం నడుస్తోందంటూ బ్రాహ్మణులు ఫిర్యాదు చేశారు. అందుకే తనకు విశ్వాసపాత్రుడైన బ్రాహ్మణ అధికారిని యూపీకి పంపించారు ప్రధాని.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైన వ్యతిరేకత ఉంది. ఎంత ఉన్నదో తెలియదు. తీవ్ర వ్యతిరేకత ఉంటే యోగికి ప్రత్యామ్నాయంగా మాయావతిని ఎన్నుకుంటారో, అఖిలేష్ ని ఎన్నుకుంటారో చూడాలి. ఎన్నికలు సమీపించిన దశలో ప్రజలు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఓటు వేస్తారు. రెండు, మూడు మాసాలు గడిస్తే కానీ దృశ్యం స్పష్టంగా కనిపించదు.

Also read: జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles