(అడుసుమిల్లి జయప్రకాశ్, 9848128844)
2015 ఆ ప్రాంతంలో మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి, లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు అయిన జయప్రకాశ్ నారాయణ గారి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓటర్లను ఆయన అందులో గాడిదలు అని సంబోధించారు. కులం చూసి ఓటేస్తారా గాడిదల్లారా అనడం అప్పట్లో సంచలమే అయ్యింది. కారణం అప్పట్లో ఎవరూ నేరుగా కులం పేరు ఎత్తేవారు కారు. ఆ సమయంలో జె.పి. ఇలా అనడంతో ఆయన ధైర్యానికి అందరూ జేజేలు చెప్పారు. సిసలైన ప్రజాస్వామ్యవాది అని కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆపై ఏమైందో ఏమో తన జాతీయ పార్టీకి విశ్రాంతి ఇచ్చారు. అడపా దడపా ఇంటర్వ్యూలు ఇవ్వడం సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆయన పరిమితమయ్యారు.
తదుపరి ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఏకంగా కె.టి.ఆర్. కు ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ వార్తల్లో నిలిచారు. అచ్చెరువొందిన ప్రజలు, కె.టి.ఆర్.కు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసి…. ఇదోరకమైన ఇంటర్వ్యూలని సరిపెట్టుకున్నారు. కానీ ఇటీవల జె.పి. ఎన్.డి.ఏ.కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు విభ్రమ కలిగించాయి. టి.డి.పి. ఎన్.డి.ఏ.లో భాగస్వామి కావడాన్ని ఆయన స్వాగతించడం అన్ని వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
2014 – 2019 నడుమ టి.డి.పి. హయాములో ఎపి చవిచూసిన దుర్మార్గాలు ఆయన మనసులో మెదలలేదా లేక ఆయన కూడా కులం ఆధారంగా తన వైఖరిని బయట పెట్టుకున్నారా అనే అనుమానాలు అందరిలోనూ పొడసూపాయి. పోసాని కృష్ణ మురళి ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. కులం చూసే జె.పి. టి.డి.పి.కి అనుకూలంగా వ్యాఖ్య చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మేధావి ముసుగులో ఆయన కుల కుటిలత్వాన్ని ప్రదర్శించారన్నారు. చంద్రబాబు కోసమే జె.పి. అసత్య ప్రచారాన్ని నెత్తికి ఎత్తుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ళలో బాబు రాష్ట్రాన్ని నాశం చేసినప్పటికీ, దేనిని అంగీకరించేందుకు జె.పి.కి కులం అడ్డొస్తోందని పోసాని వ్యాఖ్యానించడం అసలు వాస్తవాన్ని వెల్లడిస్తోంది.
మహా దోపిడీ పేరిట అధికార భాష సంఘం అధ్యక్షుడు విజయ బాబు టిడిపి పాలనను తూర్పారపడుతూ రాసిన గ్రంధం ఇటీవల ఆవిష్కృతమైంది. ఈ పుస్తకంలో 11 లక్షల కోట్ల రూపాయలపైనే ఐదేళ్ల వ్యవధిలో దోపిడీ జరిగిందని, ఆయన గణాంకాలతో సహా వివరించారు. జి.డి.పి. కంటే ఇది ఎంతో ఎక్కువని కూడా అందులో రాశారు. ఏ విభాగంలో ఎలా అవినీతికి పాల్పడిందీ అందులో సవివరంగా చర్చించారు. అభ్రివృద్ధి లేకపోగా, పేదలు కడగండ్ల పాలయ్యారని ఆ పుస్తకంలో తెలియజేశారు. ఇలాంటి పాలకుడితో ఎన్.డి.ఏ. పొత్తు పెట్టుకోవడం ఏమిటీ? ఈ పొత్తును జె.పి. సమర్ధించడం ఏమిటీ? అనేది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. జె.పి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఎవరికీ సమాధానం చిక్కలేదు.
కొన్ని నెలల క్రితం విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ స్వర్ణోత్సవాలలో జె.పి. పాల్గొని, జగన్ పాలనను ప్రశంసించడం ప్రజల మదినుంచి ఇంకా చెరిగిపోలేదు. ఆ కార్యక్రమంలో జె.పి. జగన్ పక్కన కూర్చొని, నవ్వుతూ మాట్లాడడం చూసిన ప్రజలు వాస్తవానికి సంతోషించారు. అసలు ఆ కార్యక్రమానికి జె.పి. ఎందుకు హాజరయ్యారని కూడా కొందరికి ఆశ్చర్య పోయారు. ఆప్కాబ్ మాజీ చైర్మన్ హోదాలో జె.పి.కి ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది అంతే. ఎక్కడి మాట అక్కడ మాట్లాడాలి కాబట్టి జెపి అప్పటికప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేశారు. అప్పటి నుంచి సమయం కోసం చూస్తూ, ఎన్.డి.ఏ.తో టి.డి.పి. బంధం కుదుర్చుకోగానే, తన ముసుగును తొలగించారు. ఆయన సమర్ధుడైన అధికారే కానీ, ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో ఉన్న పరువు పోగుట్టుకుంటున్నారు. నిజంగా మేధావి అయితే ఇలా బహిరంగంగా బాబు పొత్తును ఆకాశానికి ఎత్తుతారా? అని ప్రశ్నించుకుంటే సమాధానం చాలా తేలిగ్గానే దొరికేస్తుంది.
మేధావులు అంటే మేధావితనాన్ని కనబరచాలి. తమ మేధస్సును రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలి. కానీ జె.పి. చేస్తున్నదేమిటి? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, రకరకాల పనులతో కష్టాల కడలిలో ముంచిన చంద్రబాబు లాంటి వారి చేష్టలను వెనకేసుకొని రాకూడదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
జనం అమాయకులు అనే భావనలోనే ఎక్కువమంది నాయకులు ఉంటారని భావించాల్సి వస్తోంది. స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు అధికార దాహంతో అక్రమ రాజకీయ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రజలు గెలవాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని అనే పడికట్టు పదజాలంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులకు, పార్టీలకు వంతపాడే కొన్ని మీడియా సంస్థలు వాటిని సభాక్తికంగా ప్రచారం చేస్తున్నాయి. వీరి ఉద్దేశంలో జనానికి తమ చేష్టలు తెలియవని అనుకుంటున్నాయి. కానీ ప్రజలు పువ్వులు చెవిలో పెట్టుకొని తిరగడం లేదన్న విషయం వాటికి తెలియడం లేదు.
నిన్న మొన్నటి దాకా పరస్పరం దూషించుకున్న వారే అవన్నీ మరిచారు. సభ్యసమాజం గమనిస్తోందనే స్పృహ కూడా లేకుండా, సంస్కారహీనంగా వ్యక్తిదూషణలు చేసుకున్న అంశాన్ని విస్మరించారు. వాటిని ఇప్పుడు మరచినట్లు నటించి, పొత్తులు కుదుర్చుకున్నారు.
అలాగే ఫోటోలకు ఇస్తున్న పోజులు చూసి జనం భ్రమలో మునిగిపోతారనుకుంటే.. అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. కులం పేరుతో చేసే మోసాలన్నింటినీ వేయికళ్ళతో చూస్తున్నారు.
ఈ పొత్తులను చిత్తుచేస్తూ, ఓటుపోటుతో గట్టి సమాధానం ఇచ్చి తీరతారు. అల్జీమర్స్ సోకింది నాయకులకు తప్ప ప్రజలకు కాదు.