Tuesday, January 21, 2025

చట్టసభల నుంచి రహదారి వరకూ- కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఎందుకు చేరుతున్నాయి?

యోగేంద్రయాదవీయం

చాలామంది గుర్తించని గుణాత్మకమైన పరిణామం భారత రాజకీయాలలో సంభవిస్తున్నది.

భారత్ కు ఒక వంతెన కావాలి. అది రాజకీయమైనదై ఉండాలి. ప్రతిపక్షాలతో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలను అనుసంధానం చేసేదై ఉండాలి. ఆ వంతెన ఎట్లా ఉండబోతోందో అనే విషయం రేఖామాత్రంగా గత వారంలో కనిపించింది. భారత ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేసే అవకాశం, భారత్ గణతంత్ర వ్యవస్థను కాపాడుకునే వెసులుబాటు ఈ వినూత్నమైన రాజకీయ ప్రయోగ సాఫల్యంపైన ఆధారపడి ఉంది.

See @INCIndia's Tweet on Twitter / Twitter
భారత్ జోడో యాత్ర గురించి పరిచయం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్. పక్కనే యోగేంద్ర యాదవ్.

పెద్ద రాజకీయ ఉద్యమంతో భుజం కలపాలని నిర్ణయం

క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు కొన్ని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తున్న భారత్ జోడో అనే ఒక పెద్ద రాజకీయ ఉద్యమంతో భుజం కలపాలని నిర్ణయించుకున్నాయి. ఈ సంస్థలన్నీ ఇంతవరకూ రాజకీయ పార్టీలకు ఆమడ దూరంలో ఉన్నాయి. మన దేశ ఉనికికే సవాలు ఏర్పడిన కారణంగా ఈ సంస్థలు ప్రధాన స్రవంతి ప్రతిపక్షాలతో భుజం కలిపి రాజకీయంగా జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నాయి. అదే సమయంలో ఈ జోక్యం అనేది నిస్పక్షపాతంగా ఉంటుంది. ఏదో ఒక రాజకీయ పార్టీని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది కాదు. ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యత, పోటీతత్త్వం దృష్ట్యా అటువంటి సంవాదాలలో తలదూర్చడానికి ఈ క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు నిరాకరిస్తాయి. దీనిని నిస్పక్షపాత రాజకీయ ప్రతిఘటనోద్యమం అని అభివర్ణించవచ్చు.

ఈ ఉద్యమంలోని నవ్యత మన మీడియా హెడ్ లైన్స్ లోకి ఎక్కకపోవడంలో ఆశ్చర్యంలేదు. ‘పౌరసమాజం’తొ రాహుల్ గాంధీ పిచ్చాపాటీ గురించి మీడియాలో వార్తలూ, వ్యాఖ్యాలూ వచ్చాయి.  2024 ఎన్నికలలో ఓటమిని రాహుల్ ఇప్పుడే అంగీకరించారంటూ తప్పుడు వార్తలు కొన్ని రోజులు షికార్లు చేశాయి. చివరికి ఈ నిరాధారమైన నిందాపూర్వకమైన వార్తను టీవీ చానళ్ళు ఉపసంహరించుకున్నాయి. కాంగ్రెస్ లో కొందరు ఆందోళనజీవులు చేరుతున్నారనే ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. ఈ క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థల వివరాలనూ, యాత్రకు అవి ఇవ్వబోతున్న మద్దతు స్వభావాన్ని తరచి పరిశిలించే ఓపిక ఎవ్వరికీ లేకపోయింది.

వంతెన నిర్మాణానికి ఇటీవలి చొరవలు

అటువంటి వంతెన ఒకదానిని నిర్మించేందుకు సంవత్సరం పొడుగునా ప్రయత్నాలు జరిగాయి (వాస్తవం వెల్లడిస్తున్నా. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్న చొరవలలో, సమావేశాలలో చాలావాటిలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను). భారత్ మెరుగైన పరిస్థితిలో ఉండవలసింది (ఇండియా డిజర్వ్ స్ బెటర్) అనే నినాదం కింద నిరుడు సెప్టెంబర్ లో దిల్లీలో ఒక సమావేశం జరిగింది. చాలామంది ప్రముఖులూ, మేధావులూ, హక్కుల కార్యకర్తలూ హాజరైనారు. ఇటువంటి సమావేశాలు దరిమిలా బెంగళూరు, కొచ్చి, జైపూర్, ప్రయాగరాజ్, గువాహతిలో కూడా జరిగాయి. ఈ సమావేశాలలో పాల్గొన్న కొందరు ‘హమ్ హిందూస్థానీ’ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. భారత రిపబ్లిక్ ను రక్షించుకోవడానికీ, ప్రజాస్వామ్య ప్రతిఘటనను బలపరిచేందుకు ప్రయత్నిస్తున్న శక్తులన్నీ విశాల ప్రాతిపదికపైన ఏకం కావాలన్నది ఈ చొరవల మౌలిక లక్ష్యం.

Also read: బీహార్ మోదీ కొంప ముంచుతుందా?

నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాళ్ళూ, ప్రమాదాలూ పెరిగినకొద్దీ ఈ చొరవల వేగం పెరిగింది. ఈ నెలలో గణనీయమైన సంప్రదింపులు జరిగాయి. ఆగస్టు 13 -14 తేదీలలో వారణాసిలో ‘రాష్ట్ర నిర్మాణ సమాగమం’ పేరుతో ఒక సమావేశం జరిగింది. గాంధేయ సంస్థలతో, జేపీ ఉద్యమంతో సంబంధాలు ఉన్నకార్యకర్తలు ఈ సభను నిర్వహించారు. వారిలో అమర్ నాథ్ భాయ్, రామచంద్రరాహి, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ కుమార్ ఉన్నారు. జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు దేశవ్యాప్తంగా బహుముఖీనమైన ఉద్యమం ప్రారంభించాలని ఈ సభ నిర్ణయించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటన

ఈ లోగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రను ప్రారంభించాలనే సంకల్పాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ యాత్రలో చేరవలసిందిగా పౌరులనూ, సంస్థలనూ, ఉద్యమాలనూ, రాజకీయ పార్టీలనూ ఆహ్వానించింది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడూ, సోషలిస్టు నాయకుడూ జిజి పరీఖ్ కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భారత్ జోడో యాత్రకు తోడ్పాటు కావాలని కోరుతూ రాసిన ఒక లేఖను దిగ్విజయ్ సింగ్ అందజేశారు. దీని తర్వాత ఆగస్టు 19న దిల్లీలో రెండు డజన్ల ప్రజాసంస్థలకు చెందిన నాయకులతో సమావేశం జరిగింది. ఈ సంస్థలలో నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్  మూవ్ మెంట్ (ఎన్ఏపీఎం) ఒకటి. ‘నఫ్రత్ ఛోడో  భారత్ జోడో అభియాన్’ను ప్రారంభించాలని ఈ సంస్థ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రకటించిన భారత్ జోడో యాత్రకు ఈ సంస్థ మద్దతు తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనపై సంతకం చేసినవారిలో మేథాపాట్కర్, జస్టిస్ కొల్సే పాటిల్ (రిటైర్డ్), అలీ అన్వర్, తుషార్ గాంధీ, డాక్టర్ సునీలామ్ ఉన్నారు.

ప్రజాఉద్యమ సంస్థల ప్రతినిధులకూ, కాంగ్రెస్ నాయకత్వానికీ ఆగస్టు 22న దిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో జరిగిన సమాలోచనలను ఈ నేపథ్యంలో అవలోకించాలి. భావజాలాలతో, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలకు చెందిన ప్రజాఉద్యమాల వరిష్ఠ ప్రతినిధులు 150 మంది ఈ సమాలోచనలో పాల్గొన్నారు. అరుణారాయ్, బెజవాడ విల్సన్, దేవనూరా మహదేవ, గణేశ్ దేవీ, పివి రాజగోపాల్, శరద్ బిహీర్, నేనూ కలసి ఉన్న బృందం ఆహ్వానం మేరకు ఈ ప్రతినిధుల దిల్లీ వచ్చారు. ప్రధాన చర్చనీయాంశం ఏమిటంటే భారత్ జోడో యాత్రతో కదం కలాపాలా వద్దా అనేది నిర్ణయించడం. విస్తృత చర్చలూ, దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రజంటేషన్, రాహుల్ గాంధీతో స్పష్టమైన, నిర్మొగమాటమైన చర్చోపచర్చ అనంతరం యాత్రకు స్వాగతం చెప్పి, ఈ యాత్రలో బేషరతుగా పాల్గొనాలని అక్కడ సభలో చేరినవారందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

విశిష్టమైన పరిణామం

 రాజకీయపార్టీలకీ, క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలకీ మధ్య అనుసంధానానికి సంబంధించి ఇది ఒక విశిష్టమైన పరిణామం. యాత్రలో చేరాలనే ప్రకటనపైన వచ్చినవారందరూ సంతకాలు చేయలేదు. ఈ చొరవలో ఎట్లా భాగస్వామ్యం  కలిగి ఉండాలనే విషయంపైన ప్రతి సంస్థా తనదైన శైలిలో సమాలోచనలు జరిపి నిర్ణయించుకుంటుంది.  విద్వేషపూరితమైన రాజకీయాలను ప్రతిఘటించడంలో రాజకీయపార్టీలు ఏమేరకు సూత్రబద్ధమైన వైఖరిని అవలంబించేందుకు సన్నద్ధం అవుతాయనే విషయంపైన సభలో పాల్గొన్నవారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలనూ, భయసందేహాలనూ వెలిబుచ్చారు. ఆ క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఏ విధంగానూ కాంగ్రెస్ తో సంబంధాలు కలిగి ఉన్నవి కావు. ప్రజాస్వామ్య సంస్థలపైనా, రాజ్యాంగ విలువలపైనా దాడులను ప్రతిఘటించడంలో వెనకడుగు వేయకుండా ఉండే మరే పార్టీ అయినా ఇటువంటి పార్టీ తీసుకున్నట్లయితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలకు అభ్యంతరం లేదు.

పార్టీ రహిత నుంచి పక్షపాత రహిత స్థితి

ఇదివరకు పార్టీరహితంగా రాజకీయ ప్రక్రియ అని పిలుచుకునే విధానానికీ ప్రస్తుత దశకూ అంతరం ఇదే. 1980లలో భారత రాజకీయ సిద్ధాంతకర్తలు రాజకీయ కీకారణ్యంలో యధేచ్ఛగా తిరుగాడే వింత జంతువులను గమనించారు. అవి రాజకీయ పార్టీలు కావు. ఎన్నికలలో పోటీ చేయడం కానీ జోక్యం చేసుకోవడం కానీ ఈ పార్టీల విధానం కాదు. అంతమాత్రాన అవి దానధర్మాలు చేసే సంస్థలు కానీ ప్రభుత్వేతర (ఎన్ జీవో) సంస్థలు కానీ కావు. కేవలం ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చే సంస్థలు కూడా కావు. ఈ సంస్థలకు రాజకీయ స్వభావం ఉన్నది. అవి రాజకీయ నిర్ణయాలు తీసుకొనేవి. రాజకీయాధికారాన్ని ప్రతిఘటించేవి.  రాజకీయ సిద్ధాంతాలను అనుసరించేవి. రజనీకొఠారీ, డిఎల్ సేథ్, హర్ష సేథీ వంటి మేధావులు అందరూ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్)లో సభ్యులుగా ఉండేవారు. ఈ క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలని నాన్ పార్టీ పొలిటికల్ ఫార్మేషన్స్ (పార్టీరహిత రాజకీయ సంస్థలు)గా వారు అభివర్ణించేవారు. భారత ప్రజాస్వామ్యం కనిపెట్టిన ఈ కొత్త ఉద్యమం పశ్చిమ ప్రజాస్వామ్య దేశాలలో కనీవినీ ఎరుగనట్టిది. ఈ సంస్థలపైన వారు పెద్ద ఆశలు పెట్టుకున్నారు.

ప్రతిపక్షాలకు ఉద్యమ సంస్థల ఊతం అవసరం

నేటి ప్రజాస్వామ్య ప్రతిఘటన ఉద్యమంలో పాక్షికమైన తిరోగమనం అవసరం. పార్టీలకూ, పార్టీ రహిత రాజకీయాలకూ మధ్య పనిగట్టుకొని సంబంధాలు తెంచివేసి ఎడమొహంపెడమొహంగా ఉండటం కంటే రెండు రకాల రాజకీయాల మధ్య సమన్వయం సాధించాలి. ప్రతిపక్షాలకు లోగడ ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఉద్యమాలు అవసరం. ఎందుకంటే వాటికి రాజకీయ  ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు లేరు. వ్యవస్థ లేదు. సిద్ధాంతాలూ లేవు. కడచిన ఎనిమిదేళ్ళుగా ప్రతిఘటన సడక్ (రోడ్డు)పైనే  ఉంది. చట్టసభలలో బొత్తిగా లేదు.

ఉద్యమ సంస్థలకు పార్టీల సహకారం కావాలి

అదే సమయంలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలకు రాజకీయ పార్టీల అవసరం మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు ఉన్నది. నిరసన, అసమ్మతి పట్ల ఏ మాత్రం సహనం లేని వాతావరణంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకే ఒక ప్రజాస్వామ్య పద్దతి రాజకీయ మార్పు తీసుకొని రావడమే. రాజకీయ ఫలితాలతో, ఎన్నికలలో గెలిచే పార్టీలతో నిమిత్తం లేకుండా రాజకీయ ప్రతిఘటన ఉండదు. ఉద్యమాలు రాజకీయాల లోతును పెంచుతాయి. రాజకీయ పార్టీలు సమస్యల పరిష్కారానికై జరిగే పోరాటాల స్థాయినీ, విస్తృతినీ పెంచుతాయి. ఉద్యమాలు సమస్యలను ముందుకు తెస్తాయి. పార్టీలు మధ్యవర్తిత్వం నెరపుతాయి. ఒక అజెండాను రూపొందిస్తాయి. ఉద్యమాలు కొత్త ఊపిరినీ, శక్తినీ సమకూర్చుతాయి. పార్టీలు ఈ శక్తిని వినియోగించుకొని ఫలితాలు రాబట్టుతాయి.

స్పెషల్ పర్పస్ వెహికిల్ అవసరం

అందుకే మనకు ఒక ప్రత్యేక లక్ష్యంతో నిర్మించిన వాహనం కావాలి. అది పూర్తిగా రాజకీయ సంస్థ కాకూడదు. పూర్తిగా ఉద్యమానికి అంకితమైన సంస్థగా ఉండకూడదు. రాజకీయాలనూ, దృక్పథాలనూ రూపకల్పన చేయాలి. కేవలం మేధావులతో  కూడిన థింక్ ట్యాంక్ కారాదు. అది ఉద్యమాలు నిర్వహించాలి. కానీ ఒక ఉద్యమ సంస్థగానే మిగిలిపోకూడదు. రాజకీయాలలో జోక్యం చేసుకోవాలి. 2024లో జరిగే పెద్ద లోక్ సభ ఎన్నికలలో సైతం జోక్యం చేసుకునే విధంగా వ్యవహరించాలి. అంతమాత్రాన అది రాజకీయపార్టీగా రూపాంతరం చెందకూడదు. ఈ రోజు మన ముందున్న అసాధారణమైన సవాలు ఎదుర్కొనేందుకు అసాధారణమైన సాధనం అవసరం. మనకు కేవలం ఒక కొత్త వాహనం మాత్రమే కాదు, సరికొత్త స్వభావం  కలిగిన వాహనం అవసరం. ప్రత్యేక లక్ష్యంతో  నిర్మించిన స్పెషల్ పర్పస్ వెహికిల్ కావాలి. చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో వినియోగించేందుకు అనువైన వాహనం అసవరం. అటువంటి వారథి దేశ భవిష్యత్తును రూపకల్పన చేయగలదు.

Also read: ‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? సుప్రీంకోర్టు నిరుపేదల తర్కానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందా?

యోగేంద్రయాదవ్,

అధ్యక్షుడు, స్వరాజ్ ఇండియా, స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సభ్యుడు.

వాట్సప్ నం. 9868888986

Facebook:YogendraYY|Twitter: @_YogendraYadav 

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles