రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులకు వక్రభాష్యం చెబుతూ కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు కాలికీ బోడిగుండుకూ ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దేశంలో సరికొత్త విద్యావిప్లవానికి నాంది పలికాడని, తన రాష్ట్రంలోని పాఠశాలల స్వరూప స్వభావాలను మార్చిపారేశాడని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముస్తాబు చేశాడని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను ఆకాశానికి ఎత్తేస్తారు. కాని, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించి కూడా దానిగురించి మాట్లాడరు. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో ఒక పద్ధతి ప్రకారం మన రాష్ట్రంలో పాఠశాలల స్వరూప స్వభావాలను మార్చడానికి ఒక గొప్ప ప్రయత్నం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రైవేట్ పాఠశాలలనుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ అవుతుండడమే దీనికి నిదర్శనం. అన్ని వసతులున్న పాఠశాలల్లో ఇంకా నిధులు కుమ్మరించడం దేనికంటూ, బిల్లుల్లో ఆమ్యామ్యాలు నొల్లుతూ పార్టీ కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారంటూ చెదురుమదురుగా జరిగే సంఘటనలను భూతద్దంలో చూపించడం ఒక వర్గం మీడియా చేస్తోంది. అవినీతిని అరకట్టడానికి ఇలాంటి ఎత్తిపొడుపులు అవసరమైనా, పాఠకులలో ఒక నెగటివ్ మైండ్ సెట్ పెంపొందించడానికి ఈ వార్తలు సహకరిస్తాయి. సంపాదకుల, యజమానుల లక్ష్యం అలా నెరవేరుతుంది.
మొన్న జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఎం. కె. స్టాలిన్ కరోనాను ఎదుర్కొనే సన్నాహక కమిటీలలో ప్రతిపక్ష నేతలను నియమించడమే కాకుండా, జయలలిత ఏర్పాటుచేసిన ఐదు రూపాయలకే సాంబారన్నం అందించే ‘అమ్మ కాంటీన్ల’ను కొనసాగించే నిర్ణయం తీసుకున్నాడని, ఈ దేశానికి ఆదర్శనేత ఆయనేనని ఆకాశానికెత్తేశాయి మన కొన్ని తెలుగు పత్రికలు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పూర్వ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసాడని, ప్రతిపక్ష నేతకు ఆయనిచ్చిన గౌరవం అపూర్వమని చెప్తూ, అక్కడితో ఊరుకోకుండా ప్రతీకార రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేస్తున్నాడని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అలాంటివి అసలు తెలియవన్నట్టు కూడా పత్రికలు కాస్త అతి చేశాయి. జగన్ ఈ విషయంలో చాలా నేర్చుకోవాలని సుద్దులు కూడా పలికాయి.
ప్రతీకార పోరాటాలే తమిళ రాజకీయాలు
పెరియార్ రామస్వామి స్థాపించిన ద్రవిడ కజగమ్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉండిన అన్నాదురై, పెరియార్ బతికున్నపుడే బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. దానికి ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డిఎంకె) అని పేరు పెట్టుకున్నారు. 1967లో డిఎంకె పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అధికారం సాధించిన – భారతదేశంలోనే తొలి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించింది. అన్నాదురై మరణానంతరం కరుణానిధి డిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టి జయాపజయాలతో తమిళనాడు రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. కరుణానిధికి, పార్టీ కోశాధికారి ఎంజి రామచంద్రన్ కు మధ్య పొడసూపిన విభేదాలు ఎక్కువకాలం కొనసాగక, 1972లో ఎంజిఆర్ ఎఐఎడిఎంకె (ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) పేరుతో పార్టీ ఏర్పాటుచేశారు. ఎంజిఆర్ 1977లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, మరణించేవరకూ కొద్దిపాటి ఒడిదుడుకులతో అధికారంలో కొనసాగారు. తరువాత ఏఐఎడిఎంకె పగ్గాలను ఎంజిఆర్ సతీమణి జానకి రామచంద్రన్ తో పోరాడి మరీ జయలలిత దక్కించుకున్నారు. కరుణానిధి – ఎంజిఆర్, కరుణానిధి – జయలలిత వెరసి డిఎంకె – ఎఐఎడిఎంకె పార్టీల మధ్య జరిగే నిరంతర పోరాటంలో ప్రభుత్వాలు బర్తరఫ్ కావడం, రాష్ట్రపతి పాలన, పదేపదే ఎన్నికలు జరగడం సర్వ సాధారణమైపోయింది. కరుణానిధిని లుంగీతో ఊడ్పించి జైలుపాలు చేయడం, జయలలితను నిండుసభలో చీరపట్టుకుని ఈడ్పించడం లాంటి ప్రతీకార పదనిసలను తమిళనాడుతో పాటు ఈ దేశ ప్రజలందరూ విస్తుపోయి చూశారు.
Also read: హ్యాష్ టాగ్ మోదీ
కరుణానిధి తన కుటుంబ సభ్యులందరినీ రాజకీయాలలోకి తీసుకొచ్చారు. దాంతోపాటు సినిమాలు, మీడియా వ్యాపారం, ఇతర బిజినెస్సులు కూడా వారికి ఉండాలన్న ముందుజాగ్రత్తలను వారికి ఉగ్గుపాలతో నేర్పించారు. ముగ్గురు భార్యల కరుణానిధికి మొత్తంగా ఆరుగురు బిడ్డలు. ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు నలుగురు కొడుకులు కాగా, సెల్వి, కనిమొళి ఇద్దరు కూతుళ్లు. కరుణానిధి చివరి రోజులవరకూ తన రాజకీయ వారసుడిని ప్రకటించక పిల్లలంతా తమలో తాము విపరీతమైన సంఘర్షణ పడ్డారు. అళగిరి ఒకదశలో రాజకీయాలలో కొంత ప్రకాశించినా, తరువాత ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో తెరమరుగయ్యారు. కనిమొళి కేంద్ర రాజకీయాలలో ఇప్పటికీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కరుణానిధి చనిపోవడానికి కొద్దికాలం ముందరే స్టాలిన్ కు లైన్ క్లియర్ చేశారు. స్టాలిన్ ఎన్నికలకు సన్నద్ధమయ్యే వేళకు తమిళనాట పరిస్థితులన్నీ ఏదో మంత్రం వేసినట్టు మారిపోయాయి. తనను రెండవసారి మద్రాసు మేయర్‌గా జయలలిత ప్రమాణస్వీకారం చేయనివ్వలేదు. తండ్రి పై పగను కొడుకుపై కూడా మళ్లించిన డిఎంకె చిరకాల ప్రత్యర్థి, ఎఐఎడిఎంకె నేత జయలలిత మరణించడం, ఆ పార్టీలో ప్రజాకర్షక నేత లేకపోవడం స్టాలిన్ కు ఈ సారి ఎన్నికలు నల్లేరుమీద బండి నడకగా మారాయి. స్టాలిన్ ఒకదశలో ప్రశాంత్ కిశోర్ సారధ్యం వహిస్తున్న ఐప్యాక్ తో ప్రచార ఒప్పందానికి ప్రయత్నించి, తరువాత విరమించుకున్నారు. సరిగ్గా ఎన్నికల ముందరే జైలునుంచి బయటకు వచ్చిన జయలలిత వారసురాలు శశికళ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నానని ప్రకటించడంతో ఆయనకు మరోరూపంలో కలిసివచ్చిందనే చెప్పాలి. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ నిలబడడం కొంచెం కష్టమైన పనే. అందులో తమిళనాడులో ద్రావిడ ఉద్యమంతో వేళ్లూనుకున్న రాజకీయ పార్టీలతో భాజపా తలపడడం మరీ కష్టం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు
ఒక చర్యకు ప్రతి చర్యగానే జగన్ సొంత కుంపటి పెట్టుకున్నారని తెలుగువారికి తెలిసిందే. తరువాత జగన్ కు రాజకీయ మనుగడ లేకుండా చేయడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు కొందరు అక్రమ ఆస్తుల ఆరోపణలు చేయడం, అప్పటికి కేంద్రంలో చక్రం తిప్పుతున్న సోనియా ఆగమేఘాల మీద కేసులు బనాయించారు. అక్కడితో ఆగకుండా, ఆయనకు ఊపిరాడకుండా చేయడానికి ఇడి మొదలుకుని భారతదేశంలో ఉన్న అన్ని ఆర్థిక పర్యవేక్షణ సంస్థలతో దాడులు చేయించి రూపాయి రాకపోకలను అష్టదిగ్బంధనం చేశారు. సరిగ్గా తొమ్మిదేళ్లు తాను నడవడానికి వీలున్న దారులన్నీ మూసేయించి నానాయాగీ చేశారు. దాదాపు రెండేళ్లు కారాగారవాసమే కాదు, ఇప్పటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేట్టు చేసింది ఆయన వైరి పక్షం. అన్నిటికంటే ముఖ్యంగా మీడియాను అడ్డుపెట్టుకుని ‘లక్షకోట్ల అవినీతి బురద’ను పద్ధతి ప్రకారం పులిమారు. ఇంతటి దుష్ప్రచారాన్ని పక్కనపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి అధికారం అప్పజెప్పడం విశేషం.
అందలం ఎక్కిన వెంటనే జగన్ గత దశాబ్దకాలంగా గడిపిన నిద్రలేని రాత్రుల్ని ఒక్కసారిగా మరిచిపోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. జరిగిన దురాగతాల్ని, వాటి కారకులను ప్రజల ముందు ఎండగట్టడం ద్వారా, ఇవి పునరావృతం కాకుండా గుణపాఠం నేర్పించాలని ఆయన అభిమానులు కోరుకుంటారు. అయినా అవన్నీ మొదటి ఏడాదితోనే ముగిసిపోవాలి. రెండో ఏడాదినుంచీ అసలు సిసలు రాజకీయ నాయకులు ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా అధికారం సుస్థిరం చేసుకునే ఆలోచనలు చేసుకోవాలి. దానికి భిన్నంగా దేశంలోనే సీనియర్ రాజకీయనాయకుడినని పదేపదే పునరుద్ఘాటించే చంద్రబాబు మాత్రం ‘గడియారం ముల్లు తిరిగివస్తుంది’. ‘మూడేళ్ల తరువాత మీ వెనక ఎవరుంటారో చూస్తా’, ‘అన్నీ రాసుపెట్టుకుంటున్నాం.. వడ్డీతో బదులు తీరుస్తాం’ అంటూ కవ్వించడం పాతాళానికి అట్టడుగున ఉన్న మన రాజకీయాలను చూపిస్తున్నాయి. తాను అనుభవించిన కష్టనష్టాలన్నింటినీ ఎదుటివారు అనుభవించాలని కోరుకున్న నేతలు రాజకీయ పరమపద సోపానపటంలో ఎక్కువ సార్లు పాము నోటికి చిక్కి అధోపాతాళానికి జారిపోతారు. నిచ్చెన మెట్లు ఎక్కించేది నిరంతరం ప్రజా అభిమానమే. కక్షలూ కార్పణ్యాలూ కావు.
Also read: మేలుకో జగన్!